- తెలుగు సినిమా
వాసిపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు
- నూరేళ్ళ భారతీయ
సినీ వేడుకల వేదికపై కుండబద్దలు కొట్టిన డి.కె. అరుణ
చెన్నైలో జరుగుతున్న నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాల్లో
భాగంగా రెండో రోజైన సెప్టెంబర్ 22వ తేదీ, ఆదివారం సాయంత్రం తెలుగు సినీ పరిశ్రమ వేడుకలను
నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ
మంత్రి డి.కె. అరుణ, ఆమె వెంట తొలి తరం సినీ నటి - నేపథ్య గాయని రావు బాలసరస్వతి, పాత తరం హీరోయిన్లు కృష్ణకుమారి,
వాణిశ్రీ, జయసుధ, జయప్రదలు జ్యోతిని వెలిగించగా, కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
ఎడాపెడా సాగిన సుదీర్ఘ సత్కారాల
మధ్యలో మంత్రి డి.కె. అరుణ ప్రసంగిస్తూ, భారతీయ సినిమా నూరు వసంతాలు పూర్తి చేసుకున్న
సందర్భంగా, తెలుగు సినిమా మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లిన ఈ చెన్నై నగరంలో ఈ
సభ ద్వారా మన తెలుగు సినీ పెద్దల కృషిని స్మరించుకోవాల్సి ఉందన్నారు. అలాగే, 1956లో
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తరువాత నుంచి ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానంద
రెడ్డి, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి మీదుగా ఇవాళ్టి కిరణ్
కుమార్ రెడ్డి దాకా తమ ప్రభుత్వాలు చేస్తూ వస్తున్న కృషిని అరుణ గుర్తు చేశారు. ఆ పైన
ఆమె సినీ రంగంపై గట్టిగానే చురకలు వేశారు.
గౌరవం శూన్యం
పోటీ తత్త్వం పెంచి, ఉత్తమ చిత్రాలను
తీయడానికి ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను ప్రవేశపెట్టినట్లు మంత్రి
అరుణ గుర్తు చేశారు. కానీ, ‘‘ఇతర భాషల కన్నా ఎక్కువ సినిమాలు తీస్తున్న తెలుగు సినీ రంగంలో వాసి తగ్గుతుండడం
ఆందోళన కలిగిస్తోంది. గతంలో వచ్చిన ఆణిముత్యాల లాంటి చిత్రాలు ఇప్పుడు కరవయ్యాయి. జాతీయ,
అంతర్జాతీయ అవార్డులు మనకు గగన కుసమమయ్యాయి అని వాపోయారు. ‘‘ఇవాళ్టి తెలుగు సినిమాల్లో
హింస, అశ్లీలం, అకృత్యాలు, కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బ తీసే అంశాలు పెరిగాయి. తెలుగు
భాష, సంస్కృతుల పట్ల గౌరవం ఏ కోశానా లేదు. కొన్ని సినిమా పేర్లు కూడా ఇతర భాషల్లోనే
ఉన్నాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే చాలా కష్టం’’ అని మంత్రి విమర్శలు సంధించారు.
ఇలాంటి
పెడధోరణులను అడ్డుకొని, తెలుగు భాష, సంస్కృతిని కాపాడాలని తెలుగు సినీ పెద్దలను ఆమె
సభాముఖంగా అభ్యర్థించారు. ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహాయ సహకారాలూ అందిస్తామంటూ,
ఉత్తమ విలువలున్న సినిమాలు తీయాల్సిందిగా అభ్యర్థించారు. ‘‘నేను చిన్నప్పుడు హీరోయిన్
వాణిశ్రీ అభిమానిని. అప్పట్లో కుటుంబమంతా కలసి చూసే చిత్రాలు వచ్చేవి. మురళీమోహన్ లాంటి
నటులు అప్పట్లో అలాంటి చిత్రాలు చేసేవారు. ఇప్పుడు అవి లేవు. అలాంటి కుటుంబ కథా చిత్రాలు
మళ్ళీ తీయాలని కోరుతున్నాను’’ అని మంత్రి అరుణ అన్నారు.
- చెన్నై నుంచి రెంటాల జయదేవ.
.....................................................................................
1 వ్యాఖ్యలు:
మన సినిమాలలో మన సంస్కృతి ప్రతిబింబించడం లేదు!వెకిలిగా,చవకతనంతో,నేలబారుగా సంస్కార రహితులు,సభ్యత తెలియని దర్శకులు,నిర్మాతలు వెర్రిమొర్రిగా వెధవ సినిమాలు తీస్తున్నారు!ఇలాంటి సినిమాలకు ఇంకా అవార్డులు కూడానా!
Post a Comment