కుమారుడు నాగార్జున, మనుమలు సుమంత్, సుశాంత్, నాగచైతన్య వెంట ఉండగా, అందరూ బర్త్ డే సాంగ్ పాడుతుండగా, అక్కినేని నాగేశ్వరరావు కేక్ కట్ చేశారు. హీరో కమలహాసన్ ఈ వేడుక కోసం ప్రత్యేకంగా వచ్చారు. నిర్మాత డి. రామానాయుడు, మా భూమి దర్శకులు గౌతం ఘోష్, నటులు కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, సాయి కుమార్, హీరోలు బాలకృష్ణ, వెంకటేశ్, రానా, సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్, నిర్మాత కె.ఎస్. రామారావు తదితరులు వెంట ఉండి, ఉత్సాహపరుస్తుండగా, డ్రమ్స్ శివమణి వాద్యఘోష మధ్య అక్కినేని కేక్ కట్ చేశారు.
ఆ వాద్యలయకు రామానాయుడు సైతం నర్తించడం విశేషం. ఈ మొత్తం సన్నివేశాన్ని తమ సెల్ ఫోనుల్లో, స్టిల్ కెమేరాల్లో, టీవీ కెమేరాల్లోబంధించడానికి ఆహూతులు, మీడియా సిబ్బంది అమితోత్సాహం చూపడంతో, దాదాపు తొక్కిసలాట జరిగినంత పని అయింది.
ఇక, సీనియర్ మలయాళ నటుడు మధు కేక్ కట్ చేస్తుండగా, హీరో మోహన్ లాల్ ప్రత్యేకంగా హాజరై, పక్కనే నిల్చొని ఉత్సాహపరిచారు. ...ఒకప్పుడు మద్రాసులో అన్ని భాషల సినీ పరిశ్రమలూ ఉన్నప్పటి లాగానే, మళ్ళీ అందరం ఒకచోట కలుసుకొని, ఒకసారి ఆ పాత తీపి గుర్తులను అందరికీ గుర్తు చేయడం కోసమే ఈ ఇష్టాగోష్ఠి విందు ఏర్పాటు చేశాం. ఈ వందేళ్ళ జ్ఞాపకం మళ్ళీ మళ్ళీ రానిది... అని నిర్మాత, ఈ ఉత్సవ ఏర్పాట్లలో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి అయిన కె.ఎస్. రామారావు, ప్రజాశక్తితో మాట్లాడుతూ చెప్పారు.
పాత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు
సోమవారం సాయంత్రం ఐటిసి చోళా హోటల్లో నాలుగు భాషలకు చెందిన సినీ కళాకారులు విందులో పాల్గొన్నారు. నటీనటులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులు..మొదలైనవారంతా ఈ విందులో పాల్గొని పాత స్నేహాల్ని గుర్తుచేసుకున్నారు. ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో హీరో బాలకృష్ణ, కృష్ణంరాజు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత డి.సురేష్‌బాబు, సి.అశ్వినీదత్, సీనియర్ కళాకారులు రావుబాలసరస్వతీ, కృష్ణవేణి, గీతాంజలి, వాణిశ్రీ, కాంచన, రోజారమణి, జయంతి, సుహాసిని మణిరత్నం, రచయితలు..గొల్లపూడి, పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోకతేజ..తదితరులు పాల్గొన్నారు. వెనుకటి సంగతులను నెమరువేసుకున్నారు.
- చెన్నై నుంచి రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 24 సెప్టెంబర్ 2013, మంగళవారం, పేజీ నం. 8)
...........................................
0 వ్యాఖ్యలు:
Post a Comment