- అవార్డు ప్రకటించిన సరిగ్గా ఆరు నెలలకు, అవార్డందుకున్న వారం రోజులకే మరణం
ప్రముఖ రచయిత, ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ కన్నుమూశారు. కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అక్టోబర్ 18 శుక్రవారం నాడు రాత్రి 8.35 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.
మనదేశంలో సాహిత్యానికి ఇచ్చే అత్యున్నత పురస్కారంగా పేరందుకున్న జ్ఞాన్‌పీఠ్ ఆయనను వరించినట్లు ఇవాళ్టికి సరిగ్గా ఆరు నెలల క్రితం ఏప్రిల్ 17న ప్రకటన వెలువడింది. మొన్న అక్టోబర్ 11న శుక్రవారం నాడు ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో పలువురు ప్రముఖుల సమక్షంలో ఆయన ఆ పురస్కారాన్ని అందుకున్నారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భరద్వాజ మూత్రపిండాల వైఫల్యం, గుండె జబ్బుతో సహా వివిధ అనారోగ్యాలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో 48వ జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్న సరిగ్గా వారం రోజులకే తన 87వ ఏట శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారు.
కన్నుమూయడానికి సరిగ్గా వారం రోజుల క్రితం జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకుంటూ... |
తెలుగు సాహిత్యంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, ఆధునిక కవి సి. నారాయణరెడ్డి తరువాత ఈ ప్రసిద్ధ అవార్డును అందుకున్న మూడో వ్యక్తి - భరద్వాజ. అదే సమయంలో తెలుగునాట కథ, నవలా సాహిత్యం ద్వారా ఈ అవార్డును సాధించిన తొలి రచయిత మాత్రం ఆయనే!
కేవలం ఏడో తరగతి వరకే చదువుకొని, సాహిత్యంలో ఇంత ఉన్నత స్థాయికి ఎదగడం, తన రచనల మీద ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగే దశకు చేరడం భరద్వాజ విశిష్టత. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి, ఒకప్పుడు పిడికెడు అన్నం, జానెడు వస్త్రం కోసం నానా అగచాట్లూ పడిన ఓ సామాన్య వ్యక్తి ఆయన. అక్కడ నుంచి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ, స్వయంకృషితో పైకి వచ్చారు. అందుకే, ఆయన రచనల్లో ప్రధానంగా అట్టడుగు వర్గాల జీవితాన్నీ, వారి జీవన సమరాన్నీ ప్రతిఫలించారు.
అప్పటి హైదరాబాద్ సంస్థానానికి చెందిన పరిటాల జాగీర్‌లోని మోగులూరు గ్రామంలో (ఇప్పుడు కృష్ణాజిల్లాలో ఉంది) 1927 జూలై 5న ఆయన జన్మించారు. తండ్రి పేరు కోటయ్య. తల్లి పేరు మల్లికాంబ. గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామంలో పెరిగారు. పొట్టకూటి కోసం వ్యవసాయ కూలీగా పనిచేశారు. పశువులను కాశారు. పనివాడిగా రంపం లాగారు. తుత్తులు ఊదే కూలీగా, ఇంటింటికీ పత్రికలు వేసే పేపర్ బాయ్‌గానూ కష్టపడ్డారు.
పదిహేడో ఏట నుంచి చనిపోయే ముందు కొన్నేళ్ళ వరకు ఆయన అవిశ్రాంతంగా రచనలు చేశారు. 1946 ఆగస్టు ఆఖరువారం 'ప్రజామిత్ర' పత్రికలో అచ్చయిన 'విమల' ప్రచురితమైన ఆయన తొలి కథ. ఇక, అచ్చయిన ఆయన తొలి పుస్తకం - 'రాగిణి' (1950). అప్పటి నుంచి ఆయన ఎన్నో కథలు, నవలలు రాశారు. ధనికొండ హనుమంతరావు లాంటి రచయితల ప్రోత్సాహం, ప్రోద్బలంతో పైకి వచ్చిన ఆయన సినిమా జర్నలిస్టుగా కూడా పనిచేశారు. 1956 నుంచి దినచర్యను డైరీలో రాసే అలవాటున్న ఆయన జర్నలిస్టుగా తాను చూసిన పలువురు సినిమా వ్యక్తుల జీవితంలోని చీకటి వెలుగులను ఆధారంగా చేసుకొని, 'పాకుడు రాళ్ళు' నవల రాశారు. ఆ నవలతో పాటు 'కాదంబరి' లాంటి ఆయన రచనలు సుప్రసిద్ధం.
అలాగే, సమాజంలోని వివిధ వృత్తులకు చెందిన సామాన్యుల జీవిత చిత్రాలను కలం చిత్రాలుగా మలిచి, ఆయన రాసిన ఫీచర్ 'జీవన సమరం' ఓ పెద్ద సంచలనం. అప్పటికీ, ఇప్పటికీ బడుగు జీవుల బతుకు చిత్రానికి ఓ సాహితీ రికార్డు. విద్యార్హతలతో సంబంధం లేని ఆయన ప్రతిభ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదించి పెట్టింది. చాలాకాలం ఆకాశవాణి - హైదరాబాద్ కేంద్రంలో పనిచేసిన ఆయన తెలుగు ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా ఉద్యోగ విరమణ చేశారు.
ఆయనకు 1968లోనూ, 1983లోనూ మొత్తం రెండు సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలాగే, 1987లో 'సోవియట్ ల్యాండ్ - నెహ్రూ' అవార్డు, అదే ఏడాది భారతీయ భాషా పరిషత్ వారి అవార్డు వరించాయి. ఇంకా ఎన్నో అవార్డులందుకున్న రావూరిని మూడు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్‌లు ఇచ్చి, గౌరవించాయి. ఆయన రచనలపై నాలుగు యూనివర్సిటీల్లో పిహెచ్.డి. స్థాయి పరిశోధనలు, అయిదు యూనివర్సిటీల్లో ఎం.ఫిల్ స్థాయి పరిశోధనలు జరిగాయి.
ఇక, ఆయన రచనలు అనేకం ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ భాషల్లోకి అనువాదమయ్యాయి. బాలసాహిత్యంలోనూ విశేష కృషి చేసి, ఇటీవలే జ్ఞానపీఠంతో తెలుగు సాహితీకారులను గర్వించేలా చేసిన రావూరి మృతితో తెలుగు సాహితీ లోకం చిన్నబోయింది. పలువురు రాజకీయ, సాహితీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.
..................................
1 వ్యాఖ్యలు:
జ్ఞానపీఠ అవార్డుగ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ గారి కన్నుమూత నా గుండెల్లో పెను విషాదాన్ని రేపింది!మా కుటుంబ మిత్రుడు,నేను ౧౯౮౪ లో AIR జాతీయ తెలుగు కవిగా ఎంపిక అయినప్పుడు మొట్టమొదట నన్ను అభినందించినది వారే!ఆర్మూర్ వచ్చి నా కవితాగ్రంధాన్ని అంకితం తీసుకున్నారు!మా ఆవిడ వీణను మా అమ్మాయి అని మన్నించేవారు!అయిదు నెలలముందు నేను కుటుంబసమేతంగా వారి౦టికి వెళ్లి వారికి జ్ణానపీఠ0 వచ్చినందుకు అభినందించి వారిని దుశ్శాలువాలతో సన్మానించి సికిందరాబాద్ లోని మా ఇంటికి రావలసిందిగా ఆహ్వానించగా,మీరు అమెరికా వెళ్ళి వచ్చాక తప్పక మీ ఇంటికి వచ్చి నాలుగురోజులు గడుపుతామన్నారు!కానీ ఇప్పుడు ఏరీ!
Post a Comment