జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, October 26, 2013

పరమ రొటీన్‌ కథనంతో 'భాయ్' (సినిమా సమీక్ష)



   హాంగ్‌కాంగ్‌లోనో, బ్యాంకాక్‌లోనో మాఫియా ముఠాలు, మన రాజధాని దాకా విస్తరించిన ఆ ముఠా నేతల వ్యవహారాలు, అందులో హీరో పాత్ర, కథా నేపథ్యం హైదరాబాద్‌ నుంచి అక్కడికో, లేదంటే అక్కడ నుంచి ఇక్కడికో మారడం - ఇలాంటి సినిమాలు చూసి చూసీ సగటు తెలుగు ప్రేక్షకుడి తల ఇప్పటికే బొప్పి కట్టేసింది. కానీ, మన దర్శక, నిర్మాతలు, హీరోలు మాత్రం పదే పదే ఇలాంటి కథలనే వండి, వెండితెరపై వడ్డించడం మానలేదు. కొత్త సినిమా చూద్దామని వెళ్ళిన ప్రేక్షకులకు ఈ శుక్రవారం తాజాగా కట్టిన తలబొ (నొ)ప్పి - 'భాయ్' చిత్రం. 
......................................................................................
చిత్రం-భాయ్, తారాగణం - నాగార్జున, రిచా గంగోపాధ్యాయ. ఆశిష్ విద్యార్థి, సోనూ సూద్, సంగీతం - దేవిశ్రీ ప్రసాద్, కెమేరా - సమీర్ రెడ్డి, నిర్మాత - నాగార్జున అక్కినేని, దర్శకత్వం- వీరభద్రం చౌదరి
.........................................................................................
    అప్పుడెప్పుడో ఆరేళ్ళ క్రితం 2007 డిసెంబర్‌లో విడుదలైన 'డాన'్‌ చిత్రం తరువాత హీరో నాగార్జునకు మళ్ళీ సరైన వాణిజ్య విజయం లేదు. ఆ తరువాత వచ్చిన 'కేడి', 'కింగ్‌', 'రగడ', 'రాజన్న', 'శిరిడిసాయి', 'ఢమరుకం', ఈ ఏడాది సమ్మర్‌ రిలీజ్‌ 'గ్రీకు వీరుడు' దాకా వరుసగా వైఫల్యాలే ఆయనను పలకరించాయి. ఫలితంగా ఆయన యాక్షన్‌ నేపథ్యంలో ఉండే ఓ వినోదాత్మక కథను ఈసారి ఎంచుకున్నారు. 'అల్లరి' నరేశ్‌తో 'అహ నా పెళ్ళంట!', సునీల్‌తో 'పూలరంగడు'తో వరుసగా రెండు విజయాలను అందుకున్న దర్శకుడు వీరభద్రమ్‌ తనకు విజయాన్ని అందిస్తారని నమ్ముకున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్‌ పతాకంపై, తానే నిర్మాతగా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ వారితో చేతులు కలిపి మరీ 'భాయ్'ను నిర్మించారు. కానీ, దాదాపుగా ఏడేళ్ళుగా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు దర్శకుడు వీరభద్రమ్‌ చెప్పిన ఈ కథ సరిగ్గా ఆనాటి కథాచిత్రాల దశలోనే ఆగిపోయింది. లోతుగా చూస్తే, ఇంకా వెనక్కి కూడా వెళ్ళిందేమో అనిపిస్తుంది. 

హాంకాంగ్‌లో డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి) మాఫియా డాన్‌. అతనికి ఇద్దరు కొడుకులున్నా, భాయ్ (నాగార్జున) అంటే గురి. హైదరాబాద్‌లో తమ మాఫియా ముఠా సభ్యులను ఎవరో పోలీసు అధికారి గుట్టుచప్పుడు కాకుండా తుద ముట్టిస్తుండడంతో, అతని అడ్డు తొలగించడానికి భాయ్ ును అక్కడకు పంపుతాడు డేవిడ్‌. తీరా అక్కడకు వెళ్ళిన హీరోకు ఆ పోలీసు అధికారి (ప్రసన్న) ఎవరన్నది తెలుస్తుంది. దాంతో, చంపకుండా అతణ్ణే కాపాడడం మొదలుపెడతాడు. ఇంతకీ ఆ పోలీసు అధికారికీ, హీరోకూ సంబంధం ఏమిటి, చివరకు ఏమైందన్నది మిగతా సినిమా. 

మొదట కాసేపు'స్టైలిష్' అనిపించిన ఈ సినిమా ఆ వెంటనే బిగి తగ్గిపోతుంది. కానీ, ఆసక్తికరమైన మలుపు దగ్గర ఇంటర్వెల్‌ పడుతుంది. ద్వితీయార్ధం బాగుంటుందని భావిస్తే, తీరా అది కాస్తా రొటీన్‌ పెళ్ళింటి వినోదం ఫక్కీలో సా...గుతుంది. బలమైన విలన్‌ కానీ, హీరో పాత్రకు క్లిష్టమైన లక్ష్యం కానీ, దాన్ని చేరుకొనేందుకు పెద్దగా శ్రమ కానీ లేకపోవడంతో సినిమా విసుగనిపిస్తుంది. 

పెరిగిన జుట్టుతో మాఫియా గెటప్‌, పిల్లి గడ్డంతో పాత బస్తీ 'భాయ్' గెటప్‌, చెల్లి పెళ్ళికని మామూలు గెటప్‌లతో మూడు విధాలుగా నాగార్జున తెరపై కనిపించారు. 'మాస్‌', 'డాన్‌', అతిథి పాత్రలో కనిపించిన 'స్టైలిష్' చిత్రాల శైలిని గుర్తుచేసే ఆహార్యంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించిన నాగార్జున, ఫ్యాన్స్‌ విషయంలోనే ఆ మేరకు సక్సెస్‌ అయ్యారనిపిస్తుంది. యాభయ్యో పడిలో ఉన్న నాగ్‌ సినిమాలో వీలున్నప్పుడల్లా కళ్ళను కనిపించనివ్వకుండా చలవ కళ్ళద్దాలతో మేనేజ్‌ చేశారు. ఉన్నంతలో అందంగా, హుందాగా అనిపించారు. మునుపటి మోకాలి శస్త్రచికిత్స లాంటి వాటి ఫలితాలు కెమేరా ముందు కనపడిపోతున్నా, కష్టపడి స్టెప్పులు వేశారు. ఎగరడాలు, దూకడాలు లేకుండానే సై ్టలిష్‌గా ఫైట్లు చేశారు. అయితే, వీరభద్రమ్‌ కథలో కానీ, కథనంలో కానీ దమ్ము లేకపోవడంతో ఇవేవీ పెద్దగా ఉపయోగపడలేకపోయాయి. 

సహజంగా పొడగరి, అందగత్తె అయిన రిచా గంగోపాధ్యాయ నాగ్‌ సరసన చూడడానికి బాగున్నారు. కానీ, ఆమె పాత్ర పాటలకే పరిమితమైంది. పూల తోటల పెంపకదారైన హీరోయిన్‌ను కాస్తా ఒక్కోసారి సాఫ్ట్‌ ఇంజనీర్‌ అని భ్రమింపజేసేలా చూపెట్టారు. హీరో చెల్లెలి ఆఫీసుకు వెళ్ళి, ఆమె గొడవ పడే సన్నివేశం లాంటివి అందుకు ఉదాహరణ. వరుసగా పెళ్ళి చూపులకు హాజరయ్యే హీరోయిన్‌ తీరా హీరోను ఎంపిక చేసుకున్న తీరూ పొసగలేదు.

 ఈ సినిమాలో రెండు సీన్లకు పరిమితమవుతూ కామ్నా జెఠ్మలానీ, అలానే సినిమా మొదట్లో నథాలియా, మమతా మోహన్‌దాస్‌ గొంతులో వినిపించే చివరి పాటలో హంసానందిని ('మిర్చి'లో ఐటమ్‌ సాంగ్‌ గుర్తుందిగా!) ప్రత్యేక నృత్య గీతాల్లో కనిపిస్తారు. హీరో చెల్లెలు గీత పాత్రలో నటించిన అమ్మాయి అందం, అభినయం లేకపోగా, అవసరమైన అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్‌కూ ఉపయోగపడలేదు. 

ఈ సినిమాలో ఒకరూ, ఇద్దరూ కాదు - తెర నిండుగా ఎంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఉన్నారు. హీరో తండ్రిగా నాగినీడు, హీరోయిన్‌ తండ్రిగా దర్శక - నటుడు కాశీ విశ్వనాథ్‌లు మరీ రొటీన్‌ భావప్రకటనలతో నడిపించారు. హీరోయిన్‌ బామ్మ పాత్రలో సీనియర్‌ నటి గీతాంజలి ఒక డైలాగ్‌తో కనిపిస్తే, హౌమ్‌ మంత్రి భార్య పాత్రలో హేమ కనీసం డైలాగైనా లేకుండా అర నిమిషంలో మెరిసిమాయమవుతారు. ఈ చిత్రంలో కామెడీ ఆర్టిసులకూ కొదవ లేదు. బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, రఘుబాబు, 'థర్టీ ఇయర్స్‌' పృథ్వి, ధన్‌రాజ్‌, రఘు, 'సత్యం' రాజేశ్‌ - ఇలా ఎందరెందరో కనిపిస్తారు. కానీ, ఏం లాభం! తెరపై పండిన నవ్వులు మాత్రం చాలా తక్కువ. 'రూలర్‌...' అన్న హిట్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ వినిపిస్తుండగా, ఉన్నంతలో కొద్దో గొప్పో నవ్వించిందల్లా - ఎమ్మెస్‌ నారాయణ, అరిగిపోయిన ఆయన తాగుబోతు కామెడీ మాత్రమే.

నిజానికి, మాఫియా నేపథ్యం సంగతి కాసేపు పక్కనబెడితే, అన్నకు తమ్ముడు, చెల్లెలు పట్ల ఉండే అనుబంధమనే బలమైన సెంటిమెంట్‌ దర్శకుడు తీసుకున్న ఇతివృత్తంలో ఉంది. కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అన్నాచెల్లెళ్ళ మధ్య కానీ ఆ బంధాన్ని పటిష్ఠం చేస్తూ, ప్రేక్షకులను ఆ భావోద్వేగానికి గురి చేసే ఘట్టాలు, సన్నివేశాలు అల్లుకోలేకపోయారు. దాంతో, ఎప్పుడో పాతికేళ్ళ క్రితం అన్నీ, అందరినీ వదిలేసి ఎక్కడో దూరంగా మాఫియా డాన్‌గా ఉంటున్న హీరో, మళ్ళీ తన వాళ్ళ కోసం కష్టపడడం అర్థం కాని విషయం. 



అసలు ఈ సినిమాలో హీరో గురించి విలన్‌ చెప్పే విధానం చూసినా, అతని పరిచయ సన్నివేశం చూసినా అతనే ఓ మాఫియా డాన్‌ ఏమో అనిపిస్తుంది. మళ్ళీ కాసేపైన తరువాతేమో హీరో కేవలం పెద్ద డాన్‌ డేవిడ్‌ (ఆశిష్‌ విద్యార్థి)కు నమ్మకస్థుడైన బంటు అంటారు. అలాగే, మౌత్‌ ఆర్గాన్‌ వాయించడమనే చిన్న దృశ్యం ద్వారా హీరోయే తన అన్నయ్య అని చిన్నప్పటి నుంచి అతనికి దూరంగా ఉన్న చెల్లెలు గుర్తుపట్టడం లాంటివి పూర్తిగా సినిమాటిక్‌గా ఉన్నాయి. కనీసం అన్నాచెల్లెళ్ళ అనుబంధానికీ, ఆ మౌత్‌ ఆర్గాన్‌కూ మధ్య లింకును చూపే బలమైన ఫ్లాష్‌బ్యాక్‌ సీన్‌ అయినా పెట్టలేదు. 

ప్లస్‌ పాయింట్లుగా చెప్పాలంటే, ఈ సినిమాలో హీరో నోట ఎప్పటికప్పుడు వినిపించే సరికొత్త పంచ్‌ డైలాగులు. ఇవి కొంత వరకు మాస్‌ ప్రేక్షకులనూ, అభిమానులనూ ఆకట్టుకొనేలా ఉన్నాయి. అయితే, ఒక దశకు వచ్చేసరికి ప్రతి సీన్‌లో, దాదాపు ప్రతి పాత్రా ఏదో ఒక రకమైన పంచ్‌ను పలికించాలనుకొనేసరికి, మోతాదు మించిపోయిందని అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సినిమాను ఓ స్థాయికైనా నిలబెట్టింది. 'బి హెచ్‌ ఏ ఐ - భారు.. చీకటి పడితే ప్లేబాయ్..' అనే టైటిల్‌ సాంగ్‌, 'రామ సక్కనోడు...' అనే యుగళ గీతం అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. కానీ, సినిమా తొలి గంటలోనే మూడు పాటలు వచ్చేసరికి, హాలులో నుంచి చిన్నగా ప్రేక్షకులు బయటకు వెళ్ళక తప్పలేదు.

కనువిందుగా దృశ్యాలను చూపించడంలో కెమేరా వర్క్‌ బాగానే ఉంది. లొకేషన్లు, ఖరీదైన సెట్లు, భారీ తారాగణంతో 'భాయ్'లో చిత్ర నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఎడిటింగ్‌లోని లోటుపాట్లు, అసలు కథా కథనంలోనే ఉన్న బలహీనతలు ఈ సానుకూల అంశాలను కప్పెట్టేశాయి. ఇంత భారీ చిత్రాన్ని తీర్చిదిద్దడంలో దర్శకుడి అనుభవ రాహిత్యం, కథ, కథన లోపాలు శాపమయ్యాయి. మునుపటి రెండు చిత్రాల్లో కనీసం శ్లాప్‌స్టిక్‌ కామెడీతో అయినా గట్టెక్కినా వీరభద్రం, ఈ చిత్రంలో ఆ పాటి వినోదమూ అందించలేకపోయారు! తెలుగు తెరపె ఇప్పటికే తెగ వాడేసిన ద్వితీయార్ధపు శ్రీను వైట్ల మార్కు పెళ్ళి ఇంటి వాతావరణపు సీన్లూ పండించ లేకపోయారు. వెరసి, రెండుంబావు గంటల రొటీన్‌ సినిమాగా 'భారు'ను మిగిల్చారు. 

కొసమెరుపు: సోలో హీరోగా కెరీర్‌ చివరకు వచ్చేసినట్లు ఇటీవల తానే స్వయంగా ఒప్పుకున్న నాగార్జున బహుశా ఈ 'భాయ్'తో ఆ రకం చిత్రాలకు దాదాపు బై... బై... చెప్పేసినట్లేనా?         

-  రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 26 అక్టోబర్ 2013, శనివారం నాటి సంచిక, పేజీ నం. 8లో ప్రచురితం)
....................................................

0 వ్యాఖ్యలు: