జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, October 6, 2013

''నన్నెవరూ బయటకు పంపలేరు'' - తెలుగు సినీ వేడుకల ఘటనపై ఆర్‌.నారాయణమూర్తి


నూరేళ్ళ భారతీయ సినిమా ఉత్సవాల్లో భాగంగా చెన్నైలో జరిగిన తెలుగు సినిమా వేడుకల్లో అత్యంత చర్చనీయాంశమైన వ్యక్తి - దర్శక, నిర్మాత, నటుడు ఆర్‌. నారాయణమూర్తి. ఉత్సవాలు జరుగుతున్న తీరుపై ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, ఆగ్రహం, వేదికపై ఆయనకు జరిగిన అవమానం ఇవాళ తెలుగు సినీ రంగంలో హాట్‌ టాపిక్స్‌. ''ఏ.సిలోకి వచ్చిన దోమల్ని, చీడపురుగుల్ని చేతితో నలిపేస్తాం'' అంటూ ఆ సంఘటనకు సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు సి. కల్యాణ్‌ స్పందించిన తీరు మరో పెద్ద వివాదం. తలా ఓ రకంగా చెప్పుకుంటున్న ఈ అంశాలన్నిటిపై నేరుగా ఆర్‌. నారాయణమూర్తితో 'ప్రజాశక్తి' జరిపిన ప్రత్యేక ముఖాముఖి..

తెలుగు సినిమా వేడుకలపై మీకున్న అభ్యంతరం ఏమిటి?
చూడండి! ఈ కార్యక్రమం మొదటి నుంచి అన్నీ అపశ్రుతులే! 'మా సినిమా కళామతల్లికి మల్లె పూదండ...' అంటూ భక్తిప్రపత్తులతో ప్రారంభించి చేయాల్సిన కార్యక్రమం ఇది. అలాకాకుండా, శివమణి డ్రమ్స్‌తో ఆరంభించడమే ఇబ్బందికరం. పోనీ, ఆ తరువాతైనా వ్యవహారం చక్కబడిందా అంటే, వ్యాఖ్యాతల మాటలు కూడా ఏవో జోక్‌ లాగా ఉన్నాయే తప్ప, ఈ ఉన్నత కార్యక్రమానికి కావాల్సినంత సీరియస్‌గా లేవు. ఇక, సత్కారాలు చేస్తున్నారంటే వాళ్ళ గురించి నాలుగు ముక్కల వివరం చెప్పడం, చూపించడం లాంటివేమీ లేవు. వందేళ్ల భారతీయ సినిమా ప్రస్థానంలో మూకీ యుగం నుంచి టాకీ యుగం మీదుగా ఇవాళ్టి డిజిటల్‌ శకం దాకా ఎన్నో అంశాలున్నాయి. ఆ చరిత్రను తెరపై చూపెట్టే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం జరగలేదు. ఈ ప్రస్థానంలోని మహామహులు ఎందరో తమ భావాలు, అనుభవాలు, ఆ సంగతులు చెబుతుంటే వినాలని తాపత్రయంతో ఉన్న నా లాంటి ఎంతోమందికి ఈ వేడుకలు ఎంతో నిరాశపరిచాయి. పరమ పవిత్రంగా, ఉన్నతంగా సాగాల్సిన ఈ కార్యక్రమాన్ని రోజు వారీ సినిమా ఫంక్షన్లు, ఆడియో వేడుకల లాగా మార్చేశారు. అదే నా అభ్యంతరం.
వేడుకలు జరుగుతుంటే, అసలు మీరెందుకు ఆవేశంగా దూసుకువెళ్ళారు?
చెప్పాను కదా! ఆ బాధనూ, ఆవేశాన్నీ తట్టుకోలేక వేదిక పైకి వెళ్ళాను. అదే పనిగా అప్పటికి గంట సేపటిగా సాగుతున్న పాటల కార్యక్రమం నాలో ఆ బాధను పెంచింది. అందుకే, వేదికపైకి వెళ్ళాను. అసలు ఈ తెలుగు సినీ వేడుకలు సరైన రీతిలో జరగడం లేదని మాట్లాడబోయాను. ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు లూమియే బ్రదర్స్‌ రెండు కళ్ళయితే, భారతీయ సినిమాలో ఉత్తరాదికి చెందిన దాదాసాహెబ్‌ ఫాల్కే, దక్షిణాదికి చెందిన రఘుపతి వెంకయ్యలు రెండు కళ్ళు.
తెలుగు వేడుకలు జరుగుతున్న ప్రాంగణానికి మన తెలుగు సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు పేరు పెట్టి ఉండాల్సిందని చెప్పబోయాను. కానీ, నా చేతిలో నుంచి మైకు లాగేసుకున్నారు. ఆ మైకుకు ఆడియో కట్‌ చేశారు. దాంతో, నేను మాట్లాడిన మాటలు ఎవరికీ వినపడలేదు. నిర్మాత 'దిల్‌' రాజు, హీరో రాజశేఖర్‌, నా కళ్ళ ముందు చిన్నప్పటి నుంచి పెరిగిన మంచు మనోజ్‌, ఆది పినిశెట్టి, రాణా - వీళ్ళందరూ వచ్చి, నాకు సర్దిచెప్పబోయారు. నన్ను కిందకు తీసుకువచ్చారు. దిల్‌ రాజు నన్ను పక్కకు తీసుకువెళ్ళి, కూర్చోబెట్టారు.


మరి, కాసేపయ్యాక మళ్ళీ రెండోసారి వేదికపైకి గబగబా వచ్చి, జనాన్ని ఉద్దేశించి గట్టిగా అరిచారేంటి?
పాటల కార్యక్రమం చివరకు వచ్చాక, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ, 'ఇలాంటి పెద్ద ఫంక్ష్‌న్‌లో ఏవో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. ఆవేశపడకూడదు' అన్నారు. అలా అన్నప్పుడు నేను బాధపడి మళ్ళీ వచ్చాను. ఎస్పీబీ చేతిలో నుంచి మైకు తీసుకోబోతే, ఆయన చెయ్యి వెనక్కి పెట్టేసుకున్నారు. దాంతో, ఇక నేను వేదిక మీద నుంచి బిగ్గరగా మాట్లాడుతూ, 'ఇది వందేళ్ళ సినిమా పండుగ లాగా లేదు. ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లా ఉంది. దీనికి నిరసన తెలియజేస్తున్నా' అని వచ్చేశాను.
మీ దృష్టిలో ఎలా చేసి ఉండాల్సినదంటారు?
మన సినిమా పరిణామక్రమం గురించి ఓ ఎగ్జిబిషన్‌ పెట్టి ఉండవచ్చు. అలాగే, ప్రముఖులతో ప్రసంగాలు చేయించి ఉండవచ్చు. మన మహనీయులపై వివరాలతో డాక్యుమెంటరీలు చూపించి ఉండవచ్చు. అలా ఏదో ఉంటుందనే ఈ పండుగకు వచ్చాం. కానీ, రోజూ చూసే సినిమా ఆడియో ఫంక్షన్‌లా దీన్ని మార్చేశారు. వందేళ్ళకు ఒకసారి వచ్చే ఈ పవిత్రమైన పండుగను మన భాష, సంస్కృతిని కాపాడేలా చూసుకోవాలి. అలా కాకుండా టీవీ షో కోసం చేసే వినోదాత్మక పండుగ లాగా చేసేశారు.
సి. కల్యాణ్‌ మనుషులు వేదిక మీద నుంచి, మెట్ల మీదుగా మిమ్మల్ని తోసుకుంటూ తెచ్చి, దాదాపు గెంటినంత పనిచేసినట్లు అనిపించింది?
ఏ కల్యాణ్‌ మనుషులూ నన్ను టచ్‌ చేయలేదు. గెంటలేదు. గెంటితే నేను ఊరుకోను. నా శ్రేయోభిలాషులైన దిల్‌ రాజు తదితరులు నాకు సర్దిచెబుతూ, వేదికపై నుంచి కిందకు తెచ్చి సర్దారు. చివరకు ఓ రికార్డింగ్‌ డ్యాన్స్‌ లాగా సాగుతున్న ఆ వేడుకలపై నేనే నిరసన తెలిపి, హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళే టికెట్‌ సంగతి కూడా చూసుకోకుండా బారుకాట్‌ చేసి, బయటకు వచ్చేశాను.
మీరు బయటకు వెళ్ళిపోయాక, సి. కల్యాణ్‌ ప్రసంగిస్తూ, 'ఏ.సి.లోకి దోమలు, చీడపురుగులు వస్తుంటాయి... చేతితో నలిపేస్తాం...' అని అన్యాపదేశంగా అన్నారు...
(కాస్త ఆవేశంగా...) ఆ మాటలు నేను వినలేదు. అయితే, అతను అలా మాట్లాడినట్లు పత్రికల్లో చదివాను. అతను ఏ.సి.లో పడుకుంటాడేమో కానీ, తెలుగు చలనచిత్ర ప్రాంగణం ఏ.సి. కాదు. అది అతని ఇల్లూ కాదు. అబ్బ సొత్తు అంతకన్నా కాదు. అది పరిశ్రమ సొత్తు, ప్రజల సొత్తు. మేము ఈగలం, దోమలం కాము. అతని కన్నా పెద్ద చరిత్ర ఉన్నవాళ్ళం. ఏసీలోకి వచ్చిన దోమల్నీ, ఈగల్నీ, చీమల్నీ నలిపేస్తామంటున్నారు.... కానీ, అతను ఎవరిని ఉద్దేశించి ఈగలు, దోమలు అన్నాడో, అవే గనక అన్నీ కలసి కుడితే, వాటి కాట్లకు గగ్గోలెత్తిపోయి, నలిగిపోతారని గుర్తుంచుకోవడం మంచిది. ఎవరూ మదమెక్కి ఉండకూడదు, మాట్లాడకూడదు. కాలం చాలా గొప్పది. ఇలాంటి ఎంతో మందిని చూసింది. వాళ్ళే వెళ్ళిపోయారు. అది సి. కల్యాణ్‌కూ తెలుసు.
మరి, 'వందేళ్ళ సినిమా చరిత్ర నుంచి వదిలేయండి... పంపేయండి' లాంటి మాటలు కూడా ఆయన అన్నట్లు వార్తలొచ్చాయి.
(స్వరం పెంచి...) వందేళ్ళ సినిమా చరిత్ర నుంచి నన్నెవరూ బయటకు పంపలేరు. ఎవరికీ ఆ హక్కు లేదు. నా సినిమాల ద్వారా తెలుగు జాతి గుండెల్లో నేనున్నాను. వారి హృదయాల్లో నుంచి నన్నెవరూ తీయలేరు.
మీరు దర్శకులు దాసరి నారాయణరావు వర్గమనీ, ఆయన డైరెక్షన్‌లోనే ఈ గందరగోళం చేశారనీ ఓ ప్రచారం జరుగుతోందే!
(కోపంగా...) అదంతా వట్టి నాన్సెన్స్‌! దీనిలోకి దాసరి నారాయణరావు గారిని ఎందుకు లాగుతారు! అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి అప్పటికప్పుడు నేను స్పందించిన తీరుకూ, మా గురువుకూ ఎలాంటి సంబంధమూ లేదు. ఆయనను ఎందుకు ఆడిపోసుకుంటారు! అయినా, నేనేమన్నా చిన్న పిల్లాడినా... ఒకళ్ళు చెప్పింది చేయడానికి? నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉంది. నేను ఎవరి చేతిలో చెమ్చాను కాదు. ఏది సత్యమని నమ్ముతానో, అటు వైపే ఉంటాను. అదే చెబుతాను. దటీజ్‌ నారాయణమూర్తి! 
- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 25 సెప్టెంబర్ 2013, బుధవారం, పేజీ నం.8లో ప్రచురితం)
.............................................................................

1 వ్యాఖ్యలు:

K V V S MURTHY said...

Telugu people know only two cultures....Agriculture...and cinema culture!It's not my words...Malati chandur's..!