- సానుభూతి వద్దు ! వచ్చి ఇబ్బంది పెట్టద్దు!
- క్యాన్సర్ విజేతలెందరో ఉన్నారు!
- ఆఖరి క్షణం వరకు నటిస్తా!
- క్యాన్సర్ విజేతలెందరో ఉన్నారు!
- ఆఖరి క్షణం వరకు నటిస్తా!
అక్కినేని అంతరంగ ఆవిష్కరణ
ట్రాజెడీ చిత్రాల రొమాంటిక్ కథానాయకుడిగా అశేష అభిమానుల్ని సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు తనకు క్యాన్సర్ వచ్చిందన్న విషయాన్ని ప్రకటించడంలో మొక్కవోని ధైర్యం చూపి, హీరోగా నిలవడం విశేషం. ''సుస్తీ చేసిందని చాలామంది బయటకు చెప్పుకోరు. కానీ, అపోహలకూ, తావివ్వకుండా, నేను ఈ విషయాన్ని నలుగురికీ చెప్పాలనుకున్నా. నా మీద ప్రేమ, అక్కరతోనైనా ఎవరెవరో ఫోన్లు చేసి డొంకతిరుగుడుగా విషయం అడగడం, దానికి తప్పించుకు తిరుగుతూ నేనేదో జవాబివ్వడం నాకిష్టం లేకపోయింది. అందుకే, నేనే ఈ విషయాన్ని ధైర్యంగా ప్రకటిస్తున్నాను'' అని ఆయన చెప్పుకొచ్చారు.
''జీవితంలో మనందరం నటిస్తాం. కానీ, కెమేరా ముందే తప్ప, జీవితంలో నాటకమాడే ప్రవృత్తి నాకు లేదు. అందుకే, ఈ విషయం ఇప్పటికే కొందరు డాక్టర్ల ద్వారా, ఇతరుల ద్వారా తెలిసినవాళ్ళు నా మీద ప్రేమతో నన్ను నేరుగా అడగడానికీ, నేను వాళ్ళకు చెప్పడానికీ ఇబ్బంది పడుతున్నాం. ఏవేవో అబద్ధాలు చెప్పే ఇబ్బంది వాళ్ళకూ, నాకూ లేకుండా ఉండాలనే ఇప్పుడీ విషయం బయటపెడుతున్నా'' అన్నారు. ''అబద్ధం మాట్లాడడానికి తెలివితేటలు కావాలి. కానీ, నిజం మాట్లాడడానికి ధైర్యం కావాలి. నాకూ, నా పిల్లలకూ ధైర్యం ఉంది. ...అందుకే, మా కుటుంబమంతా కలసి కూర్చొని, నిర్ణయించుకొని మరీ ఈ సంగతి అందరితో చెప్పాలనుకున్నాం. ఎవరూ చెప్పుకోని అనారోగ్యం గురించి కూడా నేను చెప్పేస్తున్నాను'' అని అక్కినేని వ్యాఖ్యానించారు.
ప్రపంచ ప్రసిద్ధ క్యాన్సర్ వ్యాధి నిపుణుడూ, న్యూయార్క్ వాసీ అయిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడుతో తన అనారోగ్యం విషయమై మాట్లాడినట్లు అక్కినేని వెల్లడించారు. ''దత్తాత్రేయుడుతో మాట్లాడాను. ఆయనకు ఈ వివరాలన్నీ చెప్పాం. 'వాటి గురించి బాధపడకండి. అవేమీ చేయవు' అని ఆయన అన్నారు'' అని ఈ సీనియర్ నటుడు వివరించారు. సినిమా కెరీర్ తొలి రోజుల్లో, పెళ్ళి కాని వయసులో 1948లో తనపై వచ్చిన అపవాదులతో బాధపడి తాను రెండుసార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సంగతులను ఆయన చెప్పారు. ''అయితే, చనిపోయి అందరి అపవాదులనూ నిజం చేసే కన్నా, బతికి సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను'' అని అక్కినేని తెలిపారు. ''...బ్రతికి జీవితాన్ని సాధించు... చనిపోయి కలకాలం జీవించు..'' అంటూ అప్పట్లో తాను తొలిసారిగా రాసిన 'అ ఆలు' (అక్కినేని ఆలోచనలు)లోని మొదటి ఖండికను గుర్తు చేశారు.
నన్నెవరూ కలవద్దు! అడగద్దు!
ఈ అనారోగ్యం విషయంలో మీడియా ఉన్న విషయం చెప్పి, బాధపడే మిత్రులకూ, అభిమానులకూ సాంత్వన కలిగించాలని ఆయన అభ్యర్థించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు ఒక్క రోజు బాధపడినా, వాళ్ళు సతమతపడకుండా, తనను సతమత పెట్టకుండా ఉంటారని అక్కినేని అభిప్రాయపడ్డారు. ''నా అభిమానులెవరూ బాధపడద్దు. నన్ను బాధపెట్టవద్దు. నన్ను కలవద్దు. నాకు పదే పదే ఈ అనారోగ్యం గురించి గుర్తు చేసి, రోజూ ఇబ్బందులు పెట్టద్దు'' అని చెప్పారు. ''ఇది చంపే జబ్బు కాదు. ఈ జబ్బుతో బతుకుతున్నవాళ్ళు చాలామందే ఉన్నారు. నాకు ఏమీ బాధలు లేవు. ఏ నొప్పీ లేదు. రెండు సార్లు గుండె జబ్బు వచ్చి, ఇంత కాలం నేను బతకడమే అదృష్టం. కాబట్టి, ఎక్కడున్నా మీ ఆశీస్సులిస్తే, అవే నాకు ఆరోగ్యం అందిస్తాయి. దూరంగా ఉండే మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా'' అని మీడియా ద్వారా అభిమానులను ఆయన అభ్యర్థించారు.
అంతా సినిమాతల్లి దయ!
పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన 'ధర్మపత్ని' (1941) చిత్రం షూటింగ్ నిమిత్తం కొల్హాపూర్‌లోని శాలినీ సినీ స్టూడియోకు వెళ్ళి, తొలిసారిగా కెమేరా ముందు నటించిన 1940 నాటి నుంచి ఇప్పటికి 74 ఏళ్ళుగా సాగుతున్న తన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని ఏయన్నార్ తన ప్రసంగంలో నెమరువేసుకున్నారు. అలాగే, నాటకాలు వేసి తెనాలి నుంచి గుడివాడ వెళుతుండగా రైల్వేస్టేషన్‌లో తనను చూసి, 'శ్రీసీతారామ జననము' (1944) చిత్రంలో హీరోగా అవకాశమిచ్చిన దర్శక - నిర్మాత కీర్తిశేషులు ఘంటసాల బలరామయ్యను స్మరించుకున్నారు. 1944 మే 8న మద్రాసులోని నంబర్ 10 - ఆలివర్ రోడ్డు నివాసంలో కాలుపెట్టినప్పటి నుంచి వివిధ మనస్తత్త్వాలున్న పాత్రలు ధరించి, అభిమానుల్ని సంపాదించుకున్న తీరును తలుచుకున్నారు.
కుమారులు, కూతురు నాగ సుశీల నిర్మాతలైతే, కుమారుడితో పాటు మనుమలు నటులయ్యారనీ, మనుమలు, మనుమరాళ్ళు స్టూడియో నిర్వహణ చూసుకుంటున్నారనీ అంటూ, ''నేను, మా కుటుంబం సినిమాలకు అంకితమయ్యాం. మాకిన్ని పేరు ప్రతిష్ఠలు సినిమాతల్లి వల్లే వచ్చాయి. కేంద్రం నుంచి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులూ వచ్చాయి. ఇవన్నీ వస్తాయని నేను ఊహించలేదు. 90 ఏళ్ళ జీవితంలో 74 ఏళ్ళుగా సినీ రంగంలో పని చేయడం, ఇప్పటికీ పనిచేస్తూ ఉండడం ఓ పెద్ద రికార్డు'' అని ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో అందరి కన్నా సీనియర్ హీరో అయిన అక్కినేని ఆనందం వ్యక్తం చేశారు.
ఆరోగ్యంలో మూడో రికార్డ్‌కు సిద్ధం!
తాజా అనారోగ్యం బయట పెట్టిన అక్కినేని, తన పాత అనారోగ్యాలు, వాటిని తాను ధైర్యంగా ఎదుర్కొన్న తీరును కూడా చెప్పుకొచ్చారు. గతంలో రెండుసార్లు గుండె పోటు నుంచి గట్టెక్కి, అనుకున్న దాని కన్నా దీర్ఘకాలం ఆరోగ్యం కాపాడుకోవడం రికార్డులే అన్నారు. ''1974లో హై కొలెస్ట్రాల్ వల్ల గుండె పోటు వచ్చింది. దాంతో, 1974 అక్టోబర్ 18న నా గుండెకు ఆపరేషన్ చేశారు. అప్పటికి ఆ ఆపరేషన్ కొత్త. ఆ ప్రక్రియ వచ్చి ఏడేళ్ళే అయింది. అయినా, ఆ పరేషన్ చేశారు. ఓ పధ్నాలుగేళ్ళు ఫరవాలేదన్నారు. ఆ తరువాత 1988లో మళ్ళీ హార్ట్ ఎటాక్ వచ్చింది. కానీ, డాక్టర్లు నా గుండె ఆపరేషన్‌కు చేయదగిన స్థితిలో లేదన్నారు. 'కావాలంటే ఆపరేట్ చేస్తాం. కానీ, ఆయన బతకకపోవచ్చు' అని చెప్పారు. మా పిల్లలు అధైర్యపడినా నేను ధైర్యంగా ఉన్నాను. అప్పటి నుంచి మందులేమీ లేవు, డయలేటర్స్ వాడుతున్నా. అది జరిగి పాతికేళ్ళు అయింది. ఇదంతా నా మనోబలం, మీ లాంటి ప్రేక్షకుల అభిమానం, ఆశీర్వాదబలంతో సాధ్యమైంది'' అని ఆయన చెప్పారు.
తాజా అనారోగ్యం బయట పెట్టిన అక్కినేని, తన పాత అనారోగ్యాలు, వాటిని తాను ధైర్యంగా ఎదుర్కొన్న తీరును కూడా చెప్పుకొచ్చారు. గతంలో రెండుసార్లు గుండె పోటు నుంచి గట్టెక్కి, అనుకున్న దాని కన్నా దీర్ఘకాలం ఆరోగ్యం కాపాడుకోవడం రికార్డులే అన్నారు. ''1974లో హై కొలెస్ట్రాల్ వల్ల గుండె పోటు వచ్చింది. దాంతో, 1974 అక్టోబర్ 18న నా గుండెకు ఆపరేషన్ చేశారు. అప్పటికి ఆ ఆపరేషన్ కొత్త. ఆ ప్రక్రియ వచ్చి ఏడేళ్ళే అయింది. అయినా, ఆ పరేషన్ చేశారు. ఓ పధ్నాలుగేళ్ళు ఫరవాలేదన్నారు. ఆ తరువాత 1988లో మళ్ళీ హార్ట్ ఎటాక్ వచ్చింది. కానీ, డాక్టర్లు నా గుండె ఆపరేషన్‌కు చేయదగిన స్థితిలో లేదన్నారు. 'కావాలంటే ఆపరేట్ చేస్తాం. కానీ, ఆయన బతకకపోవచ్చు' అని చెప్పారు. మా పిల్లలు అధైర్యపడినా నేను ధైర్యంగా ఉన్నాను. అప్పటి నుంచి మందులేమీ లేవు, డయలేటర్స్ వాడుతున్నా. అది జరిగి పాతికేళ్ళు అయింది. ఇదంతా నా మనోబలం, మీ లాంటి ప్రేక్షకుల అభిమానం, ఆశీర్వాదబలంతో సాధ్యమైంది'' అని ఆయన చెప్పారు.
ఇప్పుడు తన జీవితంలో ఎదురైన ఈ మూడో అనారోగ్య విషమ పరీక్షను మనోబలంతో ఎదుర్కోవడానికి అక్కినేని సిద్ధమైనట్లు కనిపించింది. ''నా జీవితంలో ఇప్పుడిది ఓ కొత్త మలుపు... ఈ ఘట్టం ఏ రికార్డు సృష్టిస్తుందో నాకు తెలియదు. క్యాన్సర్ వస్తే చాలు, ఆ మనిషి చనిపోతాడన్నట్లు సినిమాల్లో మేము ఎంతో నాటకీయంగా మార్చి చూపిస్తుంటాం. అలాంటి చాలా సినిమాల్లో నేనూ నటించాను. ఆ అభిప్రాయం ప్రజలకు కలిగించాను. కానీ, ఇప్పుడు క్యాన్సర్ వస్తే బతకరన్న పాత మాట మారిపోయింది. ఎందరో క్యాన్సర్‌ను జయించారు'' అని మొన్న సెప్టెంబర్ 20న 90వ ఏట అడుగుపెట్టిన ఏయన్నార్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే పలువురు డాక్టర్లతో క్యాన్సర్ గురించి చర్చించినట్లు చెప్పిన ఈ సీనియర్ నటుడు, ''చిన్న వయస్సులో క్యాన్సర్ వస్తే అప్పుడు ఆ కణాలు బలంగా, వేగంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఈ 90 ఏళ్ళ వయస్సులో నా బోటివాడికి వస్తే, ఆ కణాలు కూడా నా వయస్సుకు తగ్గట్లే నిదానంగా ఉంటాయి. కాబట్టి, ఇదేదో మృత్యువు దరికి చేరిన ఆఖరు దశ అనుకోకూడదు. ప్రజలందరి ఆశీర్వాదబలం తోడైతే, దీన్ని కూడా ఎదుర్కొని, ఆరోగ్యం విషయంలో మూడో రికార్డు సృష్టించే అవకాశం నాకు వచ్చింది'' అని అన్నారు.
నా టార్గెట్ 96! మీ ఆశీస్సులుంటే 'సెంచరీ'!!
కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవాపురంలో 1924లో వెంకట రత్నం, పున్నమ్మ దంపతులకు తొమ్మిదో సంతానంగా జన్మించిన ఏయన్నార్ తన కుటుంబంలోని వాళ్ళది సామాన్యంగా దీర్ఘాయుష్షు అంటూ చెప్పుకొచ్చారు. ''మా కుటుంబంలో అందరి కన్నా ఎక్కువ కాలం 96 ఏళ్ళు బతికింది మా అమ్మ. కాబట్టి, 96 ఏళ్ళు బతుకుతానని నాకెప్పుడూ గట్టి నమ్మకం. అది నా టార్గెట్'' అన్నారు. ''ప్రజలందరూ అభిమానిస్తే, ఆశీర్వదిస్తే, సహకరిస్తే 96 ఏళ్ళు దాటి, సెంచరీ కొడతా'' అని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్యాన్సర్ వచ్చిన ఎంతోమంది ఆ తరువాత కూడా ధైర్యంగా, హాయిగా చాలాకాలం బతికారంటూ, నీలం సంజీవరెడ్డి, భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళ ఉదంతాలను అక్కినేని గుర్తు చేశారు. ''సంజీవరెడ్డి గారు స్పీకర్‌గా ఉన్నప్పుడు ఒకసారి మామూలుగా వైద్యపరీక్షలు చేయించుకుంటే, క్యాన్సర్ ఉన్నట్లు అనుకోకుండా బయటపడింది. ఆ తరువాత ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఏడేళ్ళ పాటు హాయిగా జీవించారు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు'' అంటూ ప్రస్తుతం తనకు ప్రేరణ అయిన క్యాన్సర్ విజేతల కథలను ఆయన ప్రస్తావించారు. పైగా, ''మా కుటుంబంలో మేమెవరమూ దు:ఖంతో, మనస్తాపంతో ఈ విషయం గురించి కలత చెందడం లేదు'' అని కూడా చెప్పుకొచ్చారు.
మంచి పాత్రలొస్తే చేస్తా..
మంచి పాత్రలొస్తే చేస్తా..
తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో తన ప్రత్యేకమైన, ఖరీదైన తెల్లకారులో విలేఖరుల సమావేశం జరిగే స్థలానికి వచ్చిన ఏయన్నార్‌కు ఆయన కుమారులు వెరకట్ అక్కినేని, నాగార్జున అక్కినేనితో సహా కుమార్తెలు, మనుమలు, మనుమరాళ్ళు - ఇలా కుటుంబమంతా స్వయంగా ఎదురేగి, స్వాగతం పలికారు. నాగార్జున చేయి అందించగా, నిర్ణీత స్థానానికి వచ్చిన కూర్చున్న ఏయన్నార్ దాదాపు 25 నిమిషాల పాటు తన మనసులోని మాటలను పత్రికల వారి ఎదుట పంచుకున్నారు.
విలేఖరుల ముందుకు ఆయనొక్కరే రాగా, మిగిలిన కుటుంబం, పరివారమంతా కాస్త ఎడంగా, దూరంగా నిల్చొని, అందరితో పాటు ఆయన మాటలు విన్నారు. ఏయన్నార్ తాను చెప్పదలుచుకున్నది చెప్పిన తరువాత, ఇక ప్రత్యేకించి ప్రశ్నలేమీ వద్దంటూ, మీడియా ప్రశ్నోత్తరాల ఘట్టాన్ని సున్నితంగా తోసిపుచ్చారు. ''మాట్లాడడానికి ఏముంది! క్యాన్సర్ గురించి మీ కన్నా నాకే ఎక్కువ తెలుసు'' అని వ్యాఖ్యానించారు. అయితే, ''ఆఖరు ఊపిరి ఉన్నంత వరకు నటిస్తాను. అయితే, ఏ పాత్ర పడితే ఆ పాత్ర పోషించను. చిన్న పాత్రలైనా, నా వయస్సుకు తగిన మంచి పాత్రలైతే చేస్తాను'' అని వివరణ మాత్రం ఇచ్చారు. ''ఎందుకంటే, పని చేయడంలో నాకు సంతోషం ఉంటుంది. అది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది'' అని అక్కినేని అందులోని అంతరార్థాన్ని చెబుతూ, ముగించారు.
ఉదయం నుంచే హంగామా
శనివారం ఉదయం 9 గంటలకు ఏయన్నార్ అందరినీ ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నారనీ, అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నారనీ శుక్రవారం సాయంత్రమే మీడియా అంతటికీ సమాచారమిచ్చారు. దాంతో, శనివారం ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌లో 'మనం' సినిమా చిత్రీకరణ జరుగుతున్న ఇంటి సెట్ బయట టీవీ చానళ్ళ ప్రత్యక్ష ప్రసార వాహనాలన్నీ బారులు తీరాయి. అక్కినేని ఏం చెబుతారన్నది అంచనాకు అందకపోవడంతో, దాదాపు నూట పాతిక మందికి పైగా మీడియా సిబ్బంది చర్చించుకోవడం కనిపించింది. ఏయన్నార్ తన మనసులో మాట చెప్పడం మొదలుపెట్టేసరికి, విలేఖరులు, చాలా మంది సినీ, స్టూడియో సిబ్బంది నిశ్శబ్దంగా అక్కినేని మాటలు వింటూ, రాసుకుంటూ, కెమేరాలో చిత్రీకరిస్తూ కనిపించారు. అక్కినేని ఎలాంటి తొట్రుపాటూ, భావోద్వేగాలూ లేకుండా నింపాదిగా తన అనారోగ్యం సంగతిని వెల్లడించారు.
శనివారం ఉదయం 9 గంటలకు ఏయన్నార్ అందరినీ ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నారనీ, అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నారనీ శుక్రవారం సాయంత్రమే మీడియా అంతటికీ సమాచారమిచ్చారు. దాంతో, శనివారం ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌లో 'మనం' సినిమా చిత్రీకరణ జరుగుతున్న ఇంటి సెట్ బయట టీవీ చానళ్ళ ప్రత్యక్ష ప్రసార వాహనాలన్నీ బారులు తీరాయి. అక్కినేని ఏం చెబుతారన్నది అంచనాకు అందకపోవడంతో, దాదాపు నూట పాతిక మందికి పైగా మీడియా సిబ్బంది చర్చించుకోవడం కనిపించింది. ఏయన్నార్ తన మనసులో మాట చెప్పడం మొదలుపెట్టేసరికి, విలేఖరులు, చాలా మంది సినీ, స్టూడియో సిబ్బంది నిశ్శబ్దంగా అక్కినేని మాటలు వింటూ, రాసుకుంటూ, కెమేరాలో చిత్రీకరిస్తూ కనిపించారు. అక్కినేని ఎలాంటి తొట్రుపాటూ, భావోద్వేగాలూ లేకుండా నింపాదిగా తన అనారోగ్యం సంగతిని వెల్లడించారు.
ముందుగా తన నట, ఆరోగ్య జీవిత విశేషాలను ప్రస్తావిస్తూ వచ్చిన ఆయన ఆనక అసలు విషయాన్ని నిబ్బరంగా ప్రకటించారు. మాట్లాడుతున్నంత సేపూ అక్కినేని ఏ మాత్రం భావోద్వేగాలకు లోను కాలేదు. వేసిన షామియానా, కుర్చీలు చాలకపోవడంతో, పలువురు మీడియా ప్రతినిధులే కాక, అక్కినేని కుటుంబ సభ్యులైన వెంకట్, నాగార్జున, అమల, నాగ చైతన్య, నాగసుశీల, తదితరులంతా సూర్య ప్రతాపాన్ని సైతం లెక్క చేయకుండా పక్కనే ఎండలోనే నిల్చొని మరీ, బరువెక్కిన గుండెలతో అక్కినేని ప్రసంగాన్ని విన్నారు.
బయట ఇతరుల ద్వారా చూచాయగా విషయం తెలుసుకొని, ఎవరికి వారు తోచినట్లు వ్యాఖ్యానాలు చేసుకోకుండా ఉండేందుకు తానే ఈ విషయం మీడియా ద్వారా ప్రకటిస్తున్నట్లు అక్కినేని తన మాటల్లో చెప్పారు.
నిజానికి, రెండు, మూడేళ్ళ క్రితం కూడా ఒకసారి అక్కినేని ఆరోగ్యంపై సినీ ఆంతరంగిక వర్గాల్లో వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడు మాత్రం సాక్షాత్తూ అక్కినేనే మీడియా ముందుకు వచ్చి, తన తాజా అనారోగ్యం గురించి నాటకీయంగా వెల్లడించడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ''పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజుకు పోవాల్సిందే!'' అంటూనే ''మనోబలంతో పాటు, అభిమానుల ఆశీర్వాదఫలంతో నిండు నూరేళ్ళ తరువాత ఇలాగే మీడియా ఎదుట మాట్లాడాల''న్న ఆకాంక్షను అక్కినేని వెలిబుచ్చారు. అది నెరవేరాలనే సినీ అభిమానులందరి కోరిక!
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 20 అక్టోబర్ 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.....................................................
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 20 అక్టోబర్ 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.....................................................
1 వ్యాఖ్యలు:
అక్కినేని నాగేశ్వరరావుగారు ధీరోదాత్తుడు!ఆయన నిండుగా నూరేళ్ళు బతకాలని ఆశిస్తున్నాను!క్యాన్సర్ ను ఆయన ధైర్యంగా ఎదుర్కోగలరు!
Post a Comment