సినీ ప్రియులైన అభిమానులకూ, ప్రేక్షకులకూ అక్కినేని నాగేశ్వరరావు అనగానే ఒక 'దేవదాసు', ఒక 'ప్రేమ్‌నగర్', ఒక 'ప్రేమాభిషేకం' - లాంటి ఎన్నెన్నో చిత్రాల్లో విలాసాన్నీ, విషాదాన్నీ ఏకకాలంలో పలికించిన ఓ అభినయ విశారదుడు గుర్తుకొస్తారు. ఓ ముఖ్యమైన విషయం చెప్పాల్సి ఉందంటూ శనివారం నాడు ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌లో అక్కినేని నాగేశ్వరరావు ప్రత్యేకంగా జర్నలిస్టులందరినీ పిలిపించి మరీ మీడియా సమావేశం నిర్వహించి నప్పుడు అప్రయత్నంగా విలేఖ రులందరికీ అలాంటి చిత్రాల తాలూకు సన్నివేశాలు, అభినయం గుర్తొచ్చాయి. ఇటీవల జరిపిన వైద్య పరీక్షల్లో తనకు క్యాన్సర్ వచ్చినట్లు వెల్లడైందంటూ బాంబు లాంటి వార్తను శనివారం ఉదయం అందరి ఎదుటా ఏయన్నార్ స్వయంగా బయటపెట్టారు. ఏయన్నార్ చేయబోయే ముఖ్యమైన ప్రకటన ఏమై ఉంటుందన్న దానిపై అప్పటి దాకా రకరకాలుగా ఊహాగానాలు చేస్తూ వచ్చిన పత్రికా ప్రతినిధులకు ఇది ఊహించని వార్త అయింది.
''అక్టోబర్ 8న కడుపులో నొప్పిగా అనిపించింది. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకున్నా. కేర్ ఆసుపత్రిలో, 'నిమ్స్'లో ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి అనేక రకాల పరీక్షలు వారం రోజుల పాటు చేశారు. ఎక్కడో నా శరీరంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు'' అని అక్కినేని వివరించారు. అయితే, క్యాన్సర్ వచ్చిందని ఖంగారు పడాల్సిన పనేమీ లేదనీ, క్యాన్సర్ వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని జీవించినవాళ్ళు ఎందరో ఉన్నారనీ, దేశదేశాల్లోని అభిమానుల ఆశీస్సులుంటే, తన మనోబలంతో సంతోషంగా మరింత కాలం బతుకుతాననీ అన్నారు.
- రెంటాల జయదేవ
..........................................
1 వ్యాఖ్యలు:
అక్కినేని నాగేశ్వరరావు గారికి మనోబలం ఎక్కువ!వారు క్యాన్సర్ ను ధైర్యంగా ఎదుర్కొని మరో పదేళ్ళు పూర్తిచేసుకొని నూరేళ్ళూ బతుకుతారు!
Post a Comment