జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, October 6, 2013

విడుదలకు ముందే పైరసీ - 'అత్తారింటికి దారేది' వివాదం


సినిమా విడుదల చేసేయమన్నా -    
‘అత్తారింటి...’ ఉదంతంపై  ప్రముఖ నిర్మాత, పంపిణీదారు డి. సురేశ్ బాబు






సినిమా రిలీజుకు ముందే ‘అత్తారింటికి దారేది?’ చిత్రంలోని భాగాలను కొందరు ఇంటర్నెట్‌లో పెట్టేసిన ఉదంతం తెలుగు చిత్రసీమను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ అంశంపై ప్రశ్నించినప్పుడు ప్రముఖ చిత్ర నిర్మాత, పంపిణీదారు డి. సురేశ్‌బాబు మాట్లాడుతూ, ‘‘ఇవాళ అణ్వాయుధాలే దొంగతనం అయిపోతున్నాయి? ఏం చేయగలుగుతున్నాం. మారిన టెక్నాలజీతో ఇలాంటివి జరిగిపోతున్నాయి’’ అని విచారం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం నూరు వసంతాల భారతీయ సినిమా ఉత్సవాల్లో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన సురేశ్‌బాబు ఈ పైరసీ వ్యవహారంపై తదుపరి చర్యలను ‘అత్తారింటికి...’ దర్శక, నిర్మాతలు చేపడుతున్నారని అన్నారు. అయితే, ‘‘ఒకపక్కన చట్టపరంగా చర్యలు చేపడుతూనే, ఈ వ్యవహారం గురించి అతిగా ఆలోచించవద్దని దర్శక,  నిర్మాతలకు చెప్పాను. సినిమాను విడుదల చేసేయండి. సినిమా బాగుంటే చాలు, ఈ పైరసీ ఉదంతంతో సంబంధం లేకుండా బాగా ఆడుతుంది అని సలహా ఇచ్చాను’’ అని ఆయన ‘ప్రజాశక్తి’తో మాట్లాడుతూ చెప్పారు. 

సినిమా విడుదలలో జాప్యం వల్లే ఇలాంటి ఆన్‌లైన్‌ పైరసీ వ్యవహారాలు జరుగుతున్నాయా అని అడిగినప్పుడు, ‘‘తీసిన సినిమా ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం రావాలని నిర్మాతలు ఎవరైనా అనుకుంటారు. అందులో తప్పు లేదు. అందుకే, రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతూ, థియేటర్లు పదే పదే మూసివేతకు గురవుతున్నప్పుడు సినిమాలు విడుదల చేయకుండా ఆపుకొంటున్నారు. అందులో తప్పేముంది. అది వారి వారి వ్యక్తిగత నిర్ణయం. ఏమైనా, ఇలాంటి ఆన్‌లైన్‌ పైరసీ ఘటనలు దురదృష్టకరం’’ అని సురేశ్‌బాబు వ్యాఖ్యానించారు. 

- చెన్నై నుంచి రెంటాల జయదేవ

(Published in 'Praja Sakti' daily, 24 Sep 2013, Tuesday, Page 10) 
....................




0 వ్యాఖ్యలు: