భారతీయ సినిమా నూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియమ్‌లో జరుగుతున్న నాలుగు రోజుల ఉత్సవాల్లో మూడో రోజు సెప్టెంబర్ 23 - సోమవారం నాడు ఉదయం మలయాళ చిత్ర పరిశ్రమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలు అచ్చమైన మలయాళీ సంస్కృతినీ, భాషను ప్రతిబింబించేలా సాగడం చెప్పుకోదగ్గ విశేషం. మలయాళ సినీ అగ్ర హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్, జయరామ్, సురేశ్ గోపితో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. పాత తరం కథానాయిక షీలా, మలయాళ సీమలోనూ పేరు తెచ్చుకున్న తెలుగు నటి శారద, అంబిక, సుహాసినీ మణిరత్నం, తెలుగు నటి కాంచన, సినీ నేపథ్య గాయని చిత్ర సైతం హాజరైన వారిలో ఉన్నారు.
వేడుకల్లో భాగంగా సీనియర్ మలయాళ సినీ ప్రముఖులను సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన అగ్ర హీరోలు వేదికపైకి వచ్చి, తమ మనోభావాలను పంచుకున్నారు. ''భారతీయ సినిమా నూరేళ్ళు జరుపుకొంటూ ఉంటే, మలయాళ టాకీ సినిమా 75 ఏళ్ళ పండుగ చేసుకుంటోంది. ఇది చాలా గొప్ప విషయం'' అని మోహన్‌లాల్ వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో భాగంగా సినీ తారలు పూర్ణ, మీరానందన్, రమ్యా నంబీశన్, అపర్ణా నాయర్ మొదలైనవారు నృత్యాలు చేశారు. పలువురు హాస్య నటీనటులు హాస్యకదంబాలను ప్రదర్శించారు.
అలాగే, ఈ వేడుకల సందర్భంగా మలయాళ చిత్ర పరిశ్రమ విశిష్టత, ఆ పరిశ్రమకు సేవ చేసిన ప్రముఖుల గురించి ప్రత్యేకంగా ఆడియో - వీడియో ప్రదర్శనలు వేశారు. ముఖ్యంగా, నూరేళ్ళ భారతీయ సినిమా, అందులో మలయాళ సినిమా భాగస్వామ్యం గురించి సినీ ప్రముఖులందరి నుంచి ముందుగానే సేకరించి, చిత్రీకరించిన అభిప్రాయాలను ఈ సందర్భంగా వేసి చూపడం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి కేరళ సీమ నుంచే కాక, స్థానికంగా ఉన్న మలయాళీలు కూడా పలువురు పెద్దయెత్తున హాజరయ్యారు.
కన్నడం కన్నా మలయాళ వేడుకలకే చెన్నైలో జనం ఎక్కువగా రావడం విశేషం. తెలుగు చిత్రసీమ వేడుకల కన్నా మలయాళ కార్యక్రమం ఎంతో విభిన్నంగా, తారల భాగస్వామ్యంతో, స్థానిక సంస్కృతికి అద్దం పడుతూ సాగాయని మూడు రోజులుగా వేడుకలకు హాజరవుతున్నవారు అభిప్రాయపడ్డారు. వరుసగా మూడో రోజు కూడా సభాంగణంలో ప్రవేశానికీ, జరుగుతున్న కార్యక్రమాల వివరాలు, విశేషాలను ప్రజలకు చేరవేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా, ఎప్పటి మాదిరిగానే మన ఛాంబర్ పెద్దలు మాత్రం మీడియాకు ముఖాలు చాటువేశారు.

- రెంటాల జయదేవ
...............................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment