జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, October 2, 2013

అంతా.. మా నాన్న గారి చలవే : హీరో బాలకృష్ణ


తెలుగు సినిమా వేడుకలకు వచ్చిన వారిలో సుదీర్ఘకాలంగా సినీ పరిశ్రమతో, చిత్ర నిర్మాణంతో అనుబంధమున్న కుటుంబంగా హీరో బాలకృష్ణ, ఆయన సోదరులు నందమూరి మోహనకృష్ణ, నందమూరి రామకృష్ణలు సన్మానం అందుకున్నారు. ఈ వేడుకల్లో ఇతర పెద్దలెవరూ వేదిక మీదకు వచ్చి ప్రసంగించ లేదు. బాలకృష్ణ మాత్రం మైకు ముందుకొచ్చి, చెన్నైతో తన తండ్రి ఎన్టీయార్‌కూ, తనకూ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ''నాన్‌ పొరందనాడు తమిళ్‌నాడు! యనకు వాళ్కై తంద నాడు ఆంధ్రనాడు!! తమిళ్‌ తన్ని కుడిచ్చి, కుళిచ్చి, వళంద ఒడంబు ఇదు!'' (నేను పుట్టింది తమిళనాడులో. నాకు జీవితం ఇచ్చింది తెలుగునాడు. తమిళ దేశంలోని నీళ్ళు తాగి, స్నానం చేసి, పెంచుకున్న శరీరమిది) అంటూ బాలకృష్ణ తన ప్రసంగాన్ని తమిళంలో ప్రారంభించి, స్థానికులను ఆకట్టుకున్నారు.

''పెరియప్ప (పెదనాన్న) ఎం.జి.ఆర్‌. స్ఫూర్తిగా నాన్న గారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. సినీ రంగంలో తనను ఇంత పెద్దవాణ్ణి చేసిన చెన్నై నగరం ఋణం తీర్చుకోవడానికి, తెలుగుగంగ పథకం ద్వారా కృష్ణా నదీ జలాలు తెచ్చిన భగీరథుడు నాన్న గారు ఎన్టీయార్‌. ఆయన, ఎం.జి.ఆర్‌. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ - ఇదే నెహ్రూ స్టేడియమ్‌లో తెలుగుగంగ పథకాన్ని ప్రారంభించారు'' అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ''ఇవాళ తెలుగు వాళ్ళకు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నా, తెలుగు సినీ పరిశ్రమ ఇంత ఉన్నత స్థితికి చేరిందన్నా ఆ చలవ ఎన్టీయార్‌దే'' అని బాలయ్య బలంగా తనదైన శైలిలో మాట్లాడారు. పనిలో పనిగా ఇవాళ చాలా వేదికలపై హీరోలను పొగుడుతున్నారు కానీ, వారి కన్నా, వారిని తీర్చిదిద్దిన దర్శకులు, రచయితలే గొప్ప అని చెప్పుకొచ్చారు. సింగీతం, కోడి రామకృష్ణ లాంటి దర్శకులనూ, అలాగే సినీ రంగానికి ఎంతో సేవ చేసిన డి. రామా నాయుడు, ఏయన్నార్‌లను ఆయన గుర్తు చేసుకున్నారు. 'నాన్న గారి స్ఫూర్తితో ఎన్నో సినిమాలు చేశాను' అన్న బాలయ్య, ''ప్రజల అభిరుచికి తగ్గట్లుగా, వాళ్ళు చూస్తున్నారంటూ ఏవో సినిమాలు తీయడం కన్నా, విలక్షణమైన మంచి చిత్రాలతో వారి అభిరుచిని తీర్చిదిద్ద డానికి కృషి చేయాలి. నాన్న గారు అదే చేశారు'' అని బాలకృష్ణ చెప్పారు.
గతంలో బాలకృష్ణతో 'పరమవీర చక్ర' సినిమా తీసిన నిర్మాత సి. కల్యాణ్‌, తదితర నిర్వాహకుల కోరిక మేరకు ఆర్‌.నారాయణ మూర్తి ఉదంతం తరువాత వేదికనెక్కిన బాలకృష్ణ ''ఈ పెద్ద కార్యక్రమంలో చిన్న చిన్న లోపాలుంటాయి. కానీ, మనది అనుకొని, కలసి ఈ ఉత్సవం చేసుకుంటే తేడాలు ఉండవు'' అంటూ చివరగా హితబోధ చేయడం కొసమెరుపు. 
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 24 సెప్టెంబర్ 2013, మంగళవారం, పేజీ నం. 8)
...................................

0 వ్యాఖ్యలు: