కాలపరీక్షకు నిలబడి మరీ పండిత, పామర జనుల్లో సమాన ఆదరణ పొందడమనేది ఏ కళాకృషికైనా తిరుగులేని గీటురాయి. అందులోనూ ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ వద్ద స్టార్లు మారిపోయే సినీ రంగంలో, యాభయ్యేళ్ళ క్రితం నాటి బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇవాళ్టికీ చర్చనీయాంశంగా నిలవడం విశేషమే. రాజ్యం పిక్చర్స్ పతాకంపై రూపొంది సరిగ్గా అయిదు దశాబ్దాల క్రితం 1963 అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదలైన నర్తనశాలఃచిత్రం గొప్పతనం అదే! ఈ చిరస్మరణీయ పౌరాణిక చిత్రం తెలుగు సినీ కళామతల్లి కిరీటంలో ఓ కలికితురాయి.
అది సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం నాటి సంగతి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ బలంగా వేళ్ళూనుకొని, నట, సాంకేతిక విభాగాల్లో ఉన్నత ప్రమాణాలను ప్రదర్శిస్తున్న సినీ స్వర్ణయుగపు రోజులు. సాంఘికాలతో పాటు పౌరాణికాల్లో తెలుగు వారి ప్రత్యేకతను చాటేలా చిరకాలం నిలిచే కళాఖండాలు వరుసగా వస్తున్న కాలం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రావణుడు, ఇంద్రజిత్తు లాంటి పురాణపాత్రలకు ఎన్టీయార్ లాంటి తారలు తెలుగు ఎల్లలు దాటి ప్రసిద్ధులవుతున్న సమయం. ఆ సమయంలో ఆయన వద్దకు ఓ క్లిష్టమైన పౌరాణిక పాత్ర వచ్చింది. మంచి ఒడ్డూ పొడుగూ, అందం ఉన్న ఎన్టీయార్ తెరపై పేడివాడిగా నటించాల్సి వచ్చే భారతంలోని విరాటపర్వం కథతో ఃరాజ్యం పిక్చర్స్‌ః అధినేతలు శ్రీధరరావు - లక్ష్మీరాజ్యం ఆయనను సంప్రతించారు. అర్జునుడిగా మొదలై, అజ్ఞాతవాస సమయంలో ఆడా మగా కాని బృహన్నల వేషంలో కథ నడిచి, మళ్ళీ కై ్లమాక్స్‌లో కౌరవ సేనల్ని ఓడించే కథానాయకుడైన విజయుడిగా కనిపించే విజయదశమి స్క్రిప్టు అది.
రావణాసురుడు లాంటి నెగటివ్ ఛాయలున్న పాత్రనూ, అలాగే పండు ముదుసలిగా కనిపించే భీష్ముడి పాత్రనూ సవాలుగా తీసుకొని చేసిన ఎన్టీయార్ సైతం బృహన్నల పాత్ర అనేసరికి మొదట ఆలోచనలో పడ్డారు. కానీ, ఃమీరు ఈ పాత్ర చేయకపోతే, ఈ చిత్ర నిర్మాణ ఆలోచనే విరమించుకుంటాఃమంటూ చిరకాలంగా సన్నిహితులైన నటి - నిర్మాత లక్ష్మీరాజ్యం, ఆమె భర్త శ్రీధరరావు పట్టుబట్టారు.
అంతే! మగటిమిలేని పాత్రలో, నాట్యం నేర్పుతూ కనిపించే ఆ వేషంలో ఓ స్టార్ హీరో మెప్పించడం పెద్ద సవాలు అని తెలిసీ, దాన్ని భుజానికి ఎత్తుకున్నారు ఎన్టీయార్. ఆ పాత్రకు తగ్గ ఆహార్యం దగ్గర నుంచి నాట్య విన్యాసంలో శిక్షణ దాకా అన్నిటి మీదా శ్రద్ధ పెట్టారు. అయిదు దశాబ్దాల క్రితం అలా మొదలైంది - ఃనర్తనశాలః. ఎన్టీయార్, సావిత్రి, ఎస్వీ రంగారావు, రేలంగి లాంటి ఎందరో మహామహుల అభినయం, దర్శకుడు కమలాకర కామేశ్వరరావుతో సహా ఎందరో సాంకేతిక స్రష్టల నైపుణ్యాల సమష్టి కృషిగా అపురూప కళాఖండంగా రూపొందింది. అఖండమైన ఆదరణతో, ప్రశంసలూ, పురస్కారాలూ అందుకుంది.
సుపరిచిత కథా క్రమం
మహాభారతంలో రసవత్తర ఘట్టమైన విరాటపర్వాన్ని తెరపై చూపిన ఈ చిత్ర కథ అందరికీ తెలిసిందే. కౌరవుల చేతిలో మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్ళ అరణ్యవాసం పూర్తి చేసుకొని, ఒక ఏడాది అజ్ఞాతవాసానికి సిద్ధమవుతారు. దాంతో, వారు తమ ఆయుధాలన్నిటినీ ఓ శమీ వృక్షం (జమ్మిచెట్టు)పై దాచి, తమ నిజస్వరూపాలు బయటపడకుండా మారురూపాలు ధరిస్తారు. కంకుభట్టుగా ధర్మరాజు (మిక్కిలినేని), వంటవాడైన వలలుడిగా భీముడు (దండమూడి రాజగోపాల్), ఊర్వశి ఇచ్చిన శాపమే వరమై పేడివాడైన బృహన్నలగా అర్జునుడు (ఎన్టీయార్), అలాగే అశ్వ, గోపాలకులైన దామగ్రంథి, తంత్రీపాలుడుగా నకుల, సహదేవులు వెళ్ళి మత్స్య దేశాధీశుడైన విరాట రాజు (ముక్కామల) కొలువులో చేరతారు. ద్రౌపది (సావిత్రి) సైతం విరాట రాజు భార్య సుధేష్ణా దేవి (సంధ్య)కి అలంకారాలు చేసే సైరంధ్రిగా ఆ కొలువునే ఆశ్రయిస్తుంది. ప్రగల్భాలతో పొద్దు పుచ్చడంలో దిట్ట అయిన ఉత్తర కుమారుడు (రేలంగి) విరాటరాజు కుమారుడు. ఇక, అందాలరాశి అయిన విరాట రాజపుత్రి ఉత్తర (ఎల్. విజయలక్ష్మి)కి నర్తనశాలలో నాట్యం నేర్పుతుంటాడు బృహన్నల.
విరాట రాజు బావమరిది, సింహబలుడైన కీచకుడు (ఎస్వీ రంగారావు), సైరంధ్రిని చూసి మోహిస్తాడు, వెంటపడి నిండుకొలువులో వేధిస్తాడు. అతణ్ణి తెలివిగా నర్తనశాలలో భీముడు మట్టుబెడతాడు. కీచకుణ్ణి చంపగలిగినది భీముడే అని సందేహించి, అజ్ఞాతవాస దీక్షను భగ్నం చేసి పాండవులను బయటకు రప్పించడం కోసం కౌరవులు విరాటరాజు గోసంపదను ముట్టడిస్తారు. అజ్ఞాతవాస కాలం పూర్తి కావడంతో బృహన్నల వేషంలోని అర్జునుడు జమ్మిచెట్టు మీది గాండీవం తీసుకొని నిజరూపం ధరించి, కౌరవులను ఓడించి, గోవులను రాజ్యానికి మరలించడం, పాండవుల సంగతి అందరికీ తెలియడం, ఉత్తర - అభిమన్యుల వివాహం - ఇదీ సంక్షిప్తంగా నర్తనశాల కథ.
అపూర్వ తారా తోరణం
పాత్రలకు సరిగ్గా సరిపోయేలా చిన్నాపెద్దా నటీనటుల ఎంపిక మొదలు వారితో సమతూకంలో నటింపజేయడం వరకు ఈ చిత్ర దర్శకుడు, యూనిట్ చూపిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. అలాగే, నట, సాంకేతిక నిపుణులూ ఈ చిత్రానికి తమ ప్రాణం పెట్టారు. కరుణ రసాన్ని ఒలికించినా, కంటి చూపుతో కీచకుణ్ణి మాయ చేసినా సావిత్రి అభినయానికి ఎవరూ సాటి లేరనిపిస్తుంది. ఎస్వీయార్ పోషించిన కీచక పాత్ర సినిమాలో నిడివి రీత్యా చిన్నదే. కనిపించేది కాసేపే అయినా, కనుబొమలు పైకి ఎగరేయడం, సాభిప్రాయంగా కరచరణాలను కదిలించడం, అద్భుతమైన వాచికాభినయంతో ఈ ప్రతినాయక పాత్రను సైతం ప్రేక్షకులు ప్రేమించేలా చేశారీ విశ్వనట చక్రవర్తి. కష్టమైన ఈ పాత్రను అవలీలగా పోషించడం, అదీ కేవలం నాలుగే నాలుగు పూర్తి కాల్షీట్లతో పూర్తి చేయడం ఎస్వీయార్ గొప్పదనం. రేలంగి హాస్యం, నర్తకి ఎల్. విజయలక్ష్మి లాస్యం, నిజజీవితంలో ప్రఖ్యాత మల్లయోధులైన భీముని పాత్రధారి దండమూడి రాజగోపాలరావు - జీమూతమల్లుడి పాత్రధారి నెల్లూరు కాంతారావుల పోరాట ధీరత్వం, అభిమన్యుడిగా శోభన్‌బాబు అందం - ఇలా ఈ సినిమాలో ప్రతి ఫ్రేమూ ఓ మధుర స్మృతే!
జెమినీ ఃబాలనాగమ్మః (1942) తరువాత అనివార్య కారణాలతో సినీ రంగానికి దూరమైన తెలుగు సినిమా తొలి స్టార్ హీరోయిన్ కాంచనమాల సుదీర్ఘ విరామం తరువాత ఈ చిత్రంలో ఆమె అతిథి పాత్రలో కొద్ది క్షణాలు కనిపించారు. పసిబిడ్డ నాదంటే, నాదంటూ వాదులాడుతూ విరాటరాజు కొలువుకు వచ్చే తల్లుల పాత్రల్లో అసలైన తల్లిగా కాంచనమాల, దుష్టురాలిగా సూర్యకాంతం తెరపై మెరిశారు.
సాంకేతిక నిపుణుల సమష్టి కృషి
ఈ చిత్రానికి మాటలు, పాటల్లో పాత్రోచితంగా, సందర్భానుసారంగా సముద్రాల సీనియర్ (రాఘవాచార్యులు) కలం గాంభీర్యం, హాస్యం, హుందాతనం, వ్యంగ్యం - అన్నిటినీ ఒలికించింది. ఇందులో కీచక పాత్రధారి ఎస్వీయార్‌కు ఓ స్వగతం ఉంది. ఆ డైలాగులు ఆయన శైలిలో ప్రత్యేకంగా ఉండాలని దర్శక, రచయితలు భావించారు. ఇంతలో సముద్రాల అస్వస్థులు కావడంతో, ఆ కీచక పాత్ర స్వగతాన్ని ఆయన కుమారుడూ, స్వయానా రచయిత అయిన సముద్రాల జూనియర్ చకచకకా రాసి ఇచ్చారు. సంధాన సమయమైనది...ఇంకనూ సైరంధ్రి రాలేదే!... అంటూ ఎస్వీయార్ అద్భుతంగా అభినయించిన స్వగతం అదే! ఈ చిత్రంలో డైలాగులే నటిస్తాయి. నేనేం చేయనక్కర లేదుఃః అంటూ ఎస్వీయార్ సైతం రచయిత గొప్పదనాన్ని ప్రశంసించడం విశేషం. సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి సినీ జీవితంలో పరాకాష్ఠ - ఃనర్తనశాలః.
ఇక, టాకీల తొలి రోజుల నుంచి ఛాయాగ్రాహణ దర్శకుడిగా విశేష అనుభవమున్న ఎం.ఏ. రెహమాన్ తన కెమేరా కన్నుతో ఈ చిత్రంలోని ప్రతి దృశ్యానికీ ఓ పరిపూర్ణత్వం చేకూర్చారు. ముఖ్యంగా కై ్లమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలను రెండు కెమేరాలతో అద్భుతంగా చిత్రీకరించారు. ప్రధానంగా మద్రాసులోని భరణీ, వాహినీ స్టూడియోల్లో చిత్రీకరించిన ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాలను కొంత ఔట్‌డోర్‌లో తీశారు. గూడూరు సమీపంలో యుద్ధ సన్నివేశాలను తీస్తూ, గోగ్రహణ ఘట్టం కోసం దక్షిణాది చిత్రాల్లోనే మొదటిసారిగా ఏకంగా అయిదువేల పశువులను వినియోగించారు. ఇక, ఎస్.పి.ఎస్. వీరప్ప ఎడిటింగ్ సినిమాను చకచకా నడిపించింది. క్లైమాక్స్ లో వాడిన తిక్కన ఆంధ్ర మహాభారత పద్యాలు సినిమాకు మరింత నాటకీయతను సంతరించాయి.
చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదంతో ఒక చేతిని పోగొట్టుకున్నప్పటికీ, ఒంటి చేతితోనే తన కళాకృషి సాగించిన టి.వి.ఎస్. శర్మ ఈ చిత్రకళా దర్శకత్వం, బృహన్నల తదితర గెటప్పుల రూపకల్పన, ప్రచార డిజైన్లలో అనన్య సామాన్య ప్రతిభ చూపారు. ఃలవకుశః కోసం అపూర్వమైన సూర్య భగవానుడి విగ్రహం రూపొందించిన ఆయన ఈ చిత్రం కోసం రాజరాజేశ్వరీ అమ్మవారి భారీ విగ్రహాన్ని చేశారు. ఃజననీ శివకామిని...ః పాటలో కనిపించే ఆ విగ్రహాన్ని నటి సావిత్రి ఎంతో ఇష్టపడ్డారు. షూటింగంతా అయిపోయాక, నిర్మాతల అనుమతితో ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్ళి, అక్కడే శాశ్వత పూజలో పెట్టేసుకున్నారంటే, కళాదర్శకుడి ప్రతిభకు ఇంకేం నిదర్శనం కావాలి.
ఎన్టీయార్ అంకిత భావం
మిగిలినవన్నీ ఒక ఎత్తయితే, ఒక వంక పురుషుడిలా అనిపిస్తూనే, మరో వంక స్త్రీత్వపు లాలిత్యాన్ని కూడా చూపుతూ ప్రేక్షకులకు అసంతృప్తి కలిగించని రీతిలో బృహన్నల వేషధారణకు ఎన్టీయార్ ఎంతో శ్రమించారు. శర్మ వేసిన స్కెచ్‌లు, అందుకు అనుగుణంగా ప్రసిద్ధ రూపశిల్పి హరిబాబు తీర్చిదిద్దిన గెటప్, మేకప్ వేసుకొని, తన గురువైన దర్శకుడు కె.వి. రెడ్డికి చూపించి మరీ దాన్ని ఖరారు చేసుకున్నారు.
అలాగే, నాట్యశాస్త్రంలో నిపుణుడైన బృహన్నల, ఉత్తరకు నాట్యం నేర్పే సన్నివేశాల కోసం నృత్య దర్శకులు వెంపటి (పెద) సత్యం దగ్గర శ్రద్ధగా ఎన్నో రోజులు నాట్యం అభ్యసించారు. స్వతహాగా నర్తకి అయిన ఉత్తర పాత్రధారిణి ఎల్. విజయలక్ష్మికి దీటుగా నిలిచేందుకు ఎన్టీయార్ తన పనిభారాన్ని కూడా లెక్కచేయకుండా, డ్యాన్సు శిక్షణ తరగతులకు ప్రతిరోజూ హాజరై, నేర్చుకున్నారు. అప్పటికే ఎన్నో తెలుగు చిత్రాలకు నృత్య దర్శకులైన సత్యం ఈ చిత్రంలో సంప్రదాయసిద్ధమైన కూచిపూడి నాట్యాన్ని ఆకర్షణీయంగా చూపారు. ఉత్తరకు బృహన్నల నాట్యం నేర్పే సన్నివేశంలో కూచిపూడి నృత్య రీతిలోని జతులను కూడా సమర్థంగా జొప్పించారు.
కమలాకర కెరీర్‌కు కొత్త బాట
సినీ రంగంలో హెచ్.ఎం. రెడ్డి దగ్గర మొదలై బి.ఎన్. రెడ్డి, కె.వి. రెడ్డి లాంటి వారి దగ్గర పని చేస్తూ, దర్శకుడిగా ఎదిగిన పత్రికా రచయిత కమలాకర కామేశ్వరరావును తరువాతి కాలంలో పౌరాణిక చిత్రబ్రహ్మగా నిలిపిన చిత్రం కూడా ఒక రకంగా నర్తనశాఃలే! నిజానికి, దర్శకుడిగా చంద్రహారం, పెంకిపెళ్ళాం లాంటి ఫ్లాపుల తరువాత నిరాశలో ఉన్న ఆయనకు ఃపాండురంగ మహత్యం ద్వారా కెరీర్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చారు ఎన్టీయార్.
ఆ తరువాత మహాకవి కాళిదాసుః (1960), గుండమ్మ కథ,మహామంత్రి తిమ్మరసుః (1962) లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న ఆయనకు తిరుగులేని దర్శకత్వ హౌదా తెచ్చిపెట్టింది - నర్తనశాల అది ఆయన కెరీర్‌ను ఎంత మలుపు తిప్పిందంటే, అక్కడ నుంచి పాండవ వనవాసం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణావతారం... ఇలా జీవితాంతం ఆయన తీసినవన్నీ ప్రధానంగా పౌరాణిక చిత్రాలే!
అదే ఏడాదిలో... అరుదైన అభినయ విన్యాసం
ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే, తెలుగు సినీ పౌరాణికాల్లో, ముఖ్యంగా ఎన్టీయార్ పురాణపాత్ర పోషణలో 1963కు ఓ విశిష్టత ఉంది. ఆ ఏడాది శ్రీకృష్ణార్జున యుద్ధంః వచ్చింది. అందులో కృష్ణుడిగా, నర్తనశాలఃలో అర్జునుడిగానూ, క్లిష్టమైన బృహన్నల పాత్రలోనూ, సి.ఎస్. రావు దర్శకత్వంలో వాల్మీకిఃగా, సి. పుల్లయ్య - సి.ఎస్. రావుల నిర్దేశకత్వంలోనే ఃలవకుశఃలో శ్రీరాముడిగా ఎన్టీయార్ జన నీరాజనాలు అందుకున్నారు. కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, వాల్మీకి, శ్రీరాముడు - ఇలా పరస్పర భిన్నమైన వ్యక్తిత్వ ఛాయలతో కూడిన పాత్రలను ఒకే కాలఘట్టంలో పోషించడం, పండిత పామరుల ప్రశంసలు అందుకోవడం, ఆ నాలుగు చిత్రాల్లో మూడు అపురూప కళాఖండాలుగా నిలిచిపోవడం బహుశా నటుడిగా ఎన్టీయార్ ఒక్కరికే జరిగింది.
ఎన్టీయార్ స్టార్ హవా!
నిజానికి, నర్తనశాల విడుదలయ్యే సమయానికి తెలుగునాట సినిమాహాళ్ళన్నీ ఎన్టీయార్ చిత్రాలతో నిండిపోయి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ చిత్రం రిలీజ్ నాటికి ఃలవకుశః అఖండ విజయంతో 29వ వారం నడుస్తూ ఉంది. ఃబందిపోటుః 9వ వారంలో దిగ్విజయంగా దూసుకుపోతోంది. అలాగే, తెలుగులో తొలినాళ్ళ థ్రిల్లర్ ఃలక్షాధికారిః చిత్రం 3వ వారంలో, స్థల పురాణగాథ అయిన శ్రీతిరుపతమ్మ కథః రెండోవారంలో జనాదరణతో సాగుతున్నాయి. ఇలా నాలుగు చిత్రాలూ తనవే హాళ్ళలో ఉండగా, అయిదో చిత్రంగా ఎన్టీయారే నటించిన ఃనర్తనశాలః రిలీజవడం విశేషం.
అప్పట్లో దాదాపు పది హాళ్ళున్న విజయవాడ లాంటి ప్రధాన కేంద్రంలో సగానికి పైగా హాళ్ళు, ఆరేడు హాళ్ళే ఉన్న గుంటూరు లాంటి చోట్ల 80 శాతం పైగా హాళ్ళు ఈ అయిదు ఎన్టీయార్ చిత్రాలతోనే నిండిపోయాయన్న మాట! తెలుగునాట అన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. 1963లో తన 41వ ఏట ఎన్టీయార్ అనుభవించిన అసమానమైన స్టార్ హౌదాకు ఇది తిరుగులేని ప్రతీక.
అవార్డుల్లో-ఆదరణలో... నభూతో!
1963లో వచ్చిన నర్తనశాలః ఆ మరుసటి ఏడాది 1964లో ప్రకటించిన జాతీయ అవార్డుల్లో అఖిల భారత స్థాయిలో ఏ తెలుగు చిత్రానికీ లభించని ఃభారత రాష్ట్రపతి ద్వితీయ బహుమానం దక్కించుకుంది. అంతటి అవార్డు రావడం తెలుగు సినిమాకు అదే ప్రథమం. (వివరాలకు పక్క పేజీలో బాక్స్ చూడండి). అలాగే, అదే 1964లో జకార్తాలో జరిగిన చలనచిత్రోత్సవానికి ఈ చిత్రం వెళ్ళింది.
1975లో హైదరాబాద్‌లో ప్రప్రథమంగా ప్రపంచ తెలుగు మహాసభలుః జరిగినప్పుడు, అందులో ప్రత్యేకంగా ప్రదర్శనీయమైనదిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మరో గమ్మత్తేమిటంటే, అప్పట్లో ఈ చిత్రాన్ని రాష్ట్రంలో ఃనవయుగః ఫిలిమ్స్ వారు పంపిణీ చేశారు. 1950లలో ఆ పంపిణీ సంస్థను పెట్టినప్పటి నుంచి ఈ మహాసభలు జరిగిన 1975 ఏప్రిల్ దాకా ఆ సంస్థ విడుదల చేసిన చిత్రాలన్నిటిలోకీ వసూళ్ళలో ఃనర్తనశాలఃదే అగ్రస్థానం!
తొలి రిలీజ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం 26 కేంద్రాల్లో విడుదలైతే, అన్ని చోట్లా 50 రోజులు ఆడింది. ఏకంగా 19 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. ఇక, విజయవాడ, హైదరాబాద్‌లలో 200 రోజులు ఆడింది. కన్నడ నాట కూడా బెంగుళూరు, మైసూరుల్లో దిగ్విజయంగా ప్రదర్శితమైంది. బెంగాలీ, ఒరియా భాషల్లో అనువదిస్తే, అక్కడా ఘనవిజయం సాధించింది. ఉపగ్రహ టీవీ చానళ్ళు వరదలా ముంచెత్తినా, ఆరేళ్ళ క్రితం దాకా ఈ సినిమా సరికొత్త ప్రింట్లు, పబ్లిసిటీతో ఆంధ్రదేశంలో పదే పదే విడుదలై, డిస్ట్రిబ్యూటర్లకూ, ఎగ్జిబిటర్లకూ కాసులు కురిపించింది. 2000 ఆఖరులో కూడా ఒక్క ఆంధ్రా ఏరియాలో ఏడేళ్ళ కాలానికి ఆరు లక్షలకు హక్కులు అమ్ముడైన ఈ చిత్రం ఆ కాలవ్యవధిలో డిస్ట్రిబ్యూటర్లకు 25 లక్షల రూపాయలు ఆర్జించిపెట్టడం ఓ సంచలనం.
పాత జ్ఞాపకాల తీపి గుర్తులు
నర్తనశాలఃకు పనిచేసి నట, సాంకేతిక బృందంలో అత్యధికులు ఇవాళ కీర్తిశేషులే! దుశ్శాసన పాత్రధారి కైకాల సత్యనారాయణ, ఉత్తర పాత్రధారిణి ఎల్.విజయలక్ష్మి లాంటి చాలా కొద్దిమంది మాత్రం మన మధ్య ఉన్నారు. ఊర్వశి పాత్ర పోషించి, ఃనరవరా ఓ కురవరా...ః పాటతో ఎంతోమంది మనసు దోచిన అప్పటి యువ భరతనాట్య కళాకారిణి పద్మినీ ప్రియదర్శిని (ఇప్పుడు శ్రీమతి పద్మినీ రామచంద్రన్) ప్రస్తుతం బెంగుళూరులో ఃనాట్యప్రియః పేరిట ఓ శాస్త్రీయ నృత్య శిక్షణాలయాన్ని నెలకొల్పి, భరతనాట్యంలో పలువురికి శిక్షణనిస్తున్నారు. చాలా ఏళ్ళ తరువాత ఈ మధ్యే ప్రసిద్ధ హాలీవుడ్ చిత్రం ఃలైఫ్ ఆఫ్ పైఃలో నాట్యాచారిణిగా తన నిజజీవిత పాత్రనే పోషించారు.
ఊరిస్తున్న రంగుల కల
పదమూడేళ్ళ క్రితం నుంచి ఈ అపురూప కళాఖండం శాటిలైట్ హక్కులు, 2007 నుంచి 35 ఎం.ఎం. ప్రింట్ హక్కులు సినీ, పత్రికా ప్రముఖుడు రామోజీరావు వద్ద ఉన్నాయి. ఃనర్తనశాలః చిత్రం ఃవరల్డ్ నెగటివ్ రైట్స్‌ః కోసం ఆయన అప్పట్లోనే 25 - 30 లక్షల దాకా చెల్లించాల్సి రావడం గమనార్హం. ఇక, ఈ సినిమాను కలర్‌లోకి మార్చి, మళ్ళీ విడుదల చేయాలని రామోజీ, బృందం కల.
ఆ మధ్య ఃమాయాబజార్‌ః చిత్రం కలర్‌లో రీ-రిలీజై, జనాదరణ పొందినప్పటి నుంచి ఈ రంగుల కల వారిని ఊరిస్తూనే ఉంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని తమ సొంత సాంకేతిక విభాగమైన ఃమంత్రః విభాగంలో ఃనర్తనశాలఃను కలర్‌లోకి మార్చాలని కూడా యోచించారు. అయితే, అనుకున్నదాని కన్నా వ్యయం ఎక్కువవుతుందన్న అంచనాతో ప్రస్తుతానికి ఆ ఆలోచనను పక్కనబెట్టారు.
ఆ వ్యయం అందుబాటులోకి వచ్చిన రోజున రామోజీ, బృందం ఃనర్తనశాలఃను తెలుగు ప్రేక్షకులకు రంగుల్లో చూపించే అవకాశాలున్నాయి. అదే జరిగితే, అయిదు పదులు నిండిన ఈ ఆణిముత్యానికి అంత కన్నా గౌరవం, సినీ ప్రియులకు అంతకన్నా ఆనందం ఏముంటుంది!
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, ఆదివారం అనుబంధం స్నేహ, 6 అక్టోబర్ 2013, పేజీ నం. 12 నుంచి 15 దాకా ప్రచురితం)
..............................................................................
3 వ్యాఖ్యలు:
Nice article
పరమాన్నంలో పంటి కింద ఒకే ఒక రాయి... ఆరవ పేరాలో అది భగ్నమో లేక భంగమో కానీ చిన్న దోషం పెద్ద ప్రమాదానికి దారి తీసింది. సవరించగలరు.
నర్తనశాల సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక అపురూప కళాఖండం!మాయాబజార్ లా నర్తనశాలకు కూడా రంగులు అడ్డగలిగితే తెలుగు ఎదలకు గాడంగా హత్తుకుంటుంది!
Post a Comment