- వెలవెలబోయిన వేడుకలు
- అగ్ర హీరోలు, రాజకీయ నేతలు గైర్హాజరు
- అంతా పాటలు, రికార్డింగ్ డ్యాన్సులే!
- అదేమని అడగబోయిన ఆర్. నారాయణమూర్తికి అవమానం
నూరేళ్ళ భారతీయ సినిమా పండుగ సందర్భంగా ఆదివారం నాడు చెన్నైలో జరిగిన తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు అవగాహన లేమి, అశ్రద్ధ, అంతర్గత విభేదాలతో వెలతెల పోయాయి. ఈ సినిమా వేడుకలకు అగ్రశ్రేణి హీరోలు, దర్శకులు చాలా మంది గైర్హాజరు కావడం అందుకు ఓ కారణం కాగా, నిర్వాహకుల మితిమీరిన స్వాతిశయం మరో కారణమైంది.
దాదాసాహెబ్ ఫాల్కే ఫోటో బదులు వేరొకరి ఫోటో చూపడం, తొలి పూర్తి తెలుగు టాకీ విడుదలైన సంవత్సరం సైతం తప్పుగా ప్రస్తావించడంతో (విడుదల తేదీ 1932 ఫిబ్రవరి 6 కాగా, 1931 అని తప్పుగా పేర్కొన్నారు) తెలుగు సినిమా ఉత్సవాలు ఎలా జరగనున్నది ఆదివారం సాయంత్రం 6 గంటలకే అర్థమైపోయింది. అప్పటి నుంచి రాత్రి 11.45 నిమిషాల దాకా సుదీర్ఘంగా సాగిన ఈ వేడుకలు పస తక్కువ, నస ఎక్కువ అనిపించాయి. కార్యక్రమం మొత్తాన్నీ సూపర్ సింగర్ పోటీల తరహా పాటల కదంబం, రికార్డింగ్ డ్యాన్సుల తరహా సినీ నాట్యాలతో నింపేశారు. బాలకృష్ణ మినహా సినీ పెద్దలతో ఎవరితోనూ వేదికపై మాట్లాడించనైనా మాట్లాడించలేదు.
వందేళ్ళ పండుగా? ఆడియో రిలీజ్ ఫంక్షనా?
ఈ వ్యవహారం నచ్చని నటుడు, దర్శక, నిర్మాత ఆర్. నారాయణమూర్తి లేచి వెళ్ళి, వేదికపై మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు మైక్ ఆడియో కట్ చేశారు. దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సి. కల్యాణ్, ఆయన బృందం కలసి వెళ్ళి, నారాయణమూర్తిని బలవంతాన వేదిక మీద నుంచి మెట్ల మీదుగా కిందకు తోసి, సభాంగణం నుంచి గెంటినంత పని చేశారు. ఆ తరువాత పాటల కార్యక్రమం ముగిశాక, నారాయణ మూర్తి మళ్ళీ వేదికపైకి వచ్చి, మాట్లాడబోతే, మైక్ ఇవ్వనేలేదు.
చివరకు, 'ఇది వందేళ్ళ భారతీయ సినిమా పండుగా? లేక ఆడియో రిలీజ్ ఫంక్షనా? ఇలాగా చేసేది? ఇలాగా మనవాళ్ళను సత్కరించేది' అని నారాయణమూర్తి వేదికపై నుంచి ప్రేక్షకులతో గట్టిగా మొరపెట్టుకోవడం వినిపించింది. 'తెలుగు దిగ్దర్శకులైన దాసరి, బాపు లాంటి మహామహులను వదిలేసి, తమిళ సినీ సీమకు చెందిన కె. బాలచందర్‌ను సన్మానించారు. ఇదా తెలుగు పండుగలో తెలుగువాళ్ళకు ఇచ్చే గౌరవం!'' అని ఆ తరువాత నారాయణ మూర్తి 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
సి. కల్యాణ్ మాత్రం నారాయణమూర్తిని లోపలకు మళ్ళీ రావద్దన్నట్లుగా తన అనుచర గణానికి ఆదేశాలిస్తూ కనిపించారు. ఆ తరువాత కాసేపటికి కల్యాణ్ మాట్లాడుతూ, 'ఏ.సి. వేసుకున్నా, కొన్ని చీడపురుగులు, దోమలు వస్తాయనీ, వాటిని నలిపి చంపేయాలి. అయినా, ఏ.సి. ఎక్కువగా ఉంటే, అవి జారుకుంటాయి' అని వ్యాఖ్యానించారు. 'మీరందరూ వచ్చినందుకు పాదాభివందనం' అంటూ ఆఖరు క్షణంలో హడావిడిగా తాము రప్పించిన సినీ కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.
హాజరు అంతంత మాత్రం!
తెలుగు చిత్రసీమతో సుదీర్ఘ భాగస్వామ్యమున్న అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు దాసరి నారాయణరావు వంటి సీనియర్లు, నాగార్జున లాంటి హీరోలు, యువతరం కథానాయకులైన మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీయార్, రామ్‌చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఇతర కామెడీ యాక్టర్లు, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారెవరూ ఈ వేడుకలకు హాజరు కాలేదు. ప్రసిద్ధ సినిమా తారలు రాకపోవడం మాట అటుంచితే, అసలు ఈ కార్యక్రమానికి రావాల్సిన రాజకీయ నేతలు కూడా డుమ్మా కొట్టారు. ముఖ్యఅతిథిగా రావాల్సిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ పత్తా లేరు. ఇక, మరో ముఖ్య అతిథి, సినిమా ద్వారా జీవితంలో పైకి వచ్చి, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదిగిన అగ్రతార చిరంజీవి కూడా రాలేదు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డి.కె. అరుణ, ఆఖరు క్షణంలో వచ్చిన మరో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావులే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ఈ వేడుకకు ప్రతినిధులయ్యారు.
పాత తరం నాయికలైన సి. కృష్ణవేణి, రావు బాలసరస్వతి, కృష్ణకుమారి, కాంచన, రాజశ్రీ, వాణిశ్రీ, జయప్రద, జయసుధ లాంటి ఒకప్పుడెప్పుడో వెలిగి, వెలసిన తారలే వేదిక ముందు మిగిలారు. డి.రామానాయుడు, కె. రాఘవేంద్రరావు, హీరో బాలకృష్ణ, వెంకటేశ్, రాజేంద్రప్రసాద్, రాణా, శ్రీకాంత్, రాజశేఖర్, జీవితా రాజశేఖర్, నాని, ఛార్మి లాంటి కొందరితోనే ప్రేక్షకులు సంతృప్తిపడాల్సి వచ్చింది.
ఇక ప్రేక్షకుల సంగతీ అంతే! ఆఖరు నిమిషం దాకా పాసులు ఎవరికీ అందకపోవడంతో సభాంగణంలో దాదాపు 40 శాతం మేర ఖాళీగా కనిపించింది. గమ్మత్తేమిటంటే, రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమాలకు నటీనటులు వెళ్ళి, ప్రదర్శనలివ్వరాదంటూ ప్రకటన చేసి, వివాదాస్పదమైన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీమోహన్ మాత్రం ఈ కార్యక్రమాలకు హాజరై, సన్మానం అందుకున్నారు.
అలాగే, ఈ వేడుకలు వాయిదా వేసుకోవాలని కోరిన హీరో మోహన్‌బాబు కుటుంబం నుంచి ఆయన కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు మనోజ్‌కుమార్‌లు ఇద్దరూ రావడం మరో విచిత్రం. మోహన్‌బాబు పక్షాన లక్ష్మీ ప్రసన్న సత్కారం కూడా స్వీకరించారు.
వస్తే చాలు... సన్మానమే!
చివరకు ఈ వేడుకలను ఏ దశకు తీసుకువెళ్ళారంటే, 'మీరు ఈ కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇవ్వద్దు. వస్తే చాలు సన్మానిస్తాం బాబూ! కార్యక్రమానికి రండహౌ!!' అని ఆఖరు నిమిషంలో అందరినీ అభ్యర్థించి, పిలిచినట్లుగా ఉంది. రావడం పాపం... ఆహ్వానితులందరికీ సన్మానం చేసేశారు.
తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలు ఒక్కొక్కటీ వివిధ రంగాల్లో ఎన్నో దశాబ్దాలుగా సేవ చేస్తున్న యాభయ్యేసి మంది సీనియర్ సినీ పెద్దలను మాత్రమే సన్మానిస్తే, తెలుగు సన్మానాల జాబితాకు అంతం లేకుండా పోయింది. నిన్న గాక మొన్న సినీ రంగంలో కళ్ళు తెరిచినవారికీ, ఆహ్వానం మన్నించి వచ్చినందుకు తాయిలంగా బయొస్కోప్ జ్ఞాపిక, నూరేళ్ళ సినిమా లోగోతో ఉన్న శాలువా దక్కాయి. చివరకు దాదాపు ఆరు గంటల నిడివితో సుదీర్ఘంగా సాగిన ఈ తెలుగు సినీ పరిశ్రమ వేడుకలు ఓ ప్రహసనంగా ముగిశాయి. సగం సమయమయ్యేసరికే జనం లేచి వెళ్ళిపోయారు.
- చెన్నై నుంచి రెంటాల జయదేవ
- చెన్నై నుంచి రెంటాల జయదేవ
.........................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment