సామాన్య ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీసి, మినిమమ్ గ్యారెంటీగా డబ్బులు సంపాదించడం సినీ రంగంలో విజయానికి దగ్గర దోవ. అలా కాకుండా, కొత్తదనంతో కూడిన కథనో, కథనాన్నో అనుసరించి వెళ్ళి, తద్వారా జనాన్నీ, జాగ్రత్తగా సొమ్మునూ రాబట్టుకోవాలనుకోవడం మరో మార్గం. మొదటి దాని కన్నా రెండోది కొద్దిగా కష్టంతో కూడిన పని కాబట్టి, ఆ దోవ తొక్కడానికి కొద్దిగా సాహసం, మరికొద్దిగా కొత్తదనం కోసం తపన ఉండాలి. అవి లేనప్పుడు సినిమాను కేవలం వ్యాపార మార్గంగా భావించి, దగ్గర దోవలో వెళ్ళడానికే నిర్మాతలైనా, దర్శకులైనా ప్రయత్నిస్తారు. అందుకే తెలుగులో మనవాళ్ళు తీసిన కథలే తీస్తుంటారు. పైపెచ్చు, తీసిన పద్ధతిలోనే తీస్తుంటారు. జనం కూడా విధి లేక అలాంటి వాటికే అలవాటు పడి, కానీ లెమ్మని చూసేస్తుంటారు. అందరూ అనుసరించే ఆ దగ్గరి దోవలోనే ప్రేక్షకులకు దగ్గర కావాలని హీరో రవితేజతో దర్శకుడు గోపీచంద్ మలినేని చేసిన ప్రయత్నం - 'బలుపు'. .......................................................................................................... చిత్రం:బలుపు, తారాగణం: రవితేజ, శ్రుతీహాసన్, అంజలి, ప్రకాశ్‌రాజ్, ఆశుతోష్ రాణా, అడివి శేషు, కథ: కోన వెంకట్, కె.ఎస్. రవీంద్ర, మాటలు: కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాశ్, కూర్పు: గౌతంరాజు, కెమేరా: జయనన్ విన్సెంట్, సంగీతం: థమన్ ఎస్.ఎస్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని ........................................................................................................... కథ ఏమిటంటే.. హీరో రవి (రవితేజ) బృందం ఓ బ్యాంకు తరఫున ఋణాల బాకీలు వసూలు చేస్తుంటుంది. ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోమంటూ తండ్రి మోహనరావు (ప్రకాశ్‌రాజ్) రవిని పోరుపెడుతుంటాడు. మరోపక్క క్రేజీ మోహన్ (బ్రహ్మానందం), అతని మేనకోడలు శ్రుతి (శ్రుతీహాసన్) కలసి కనపడిన అబ్బాయినల్లా బకరాలను చేస్తుంటారు. ప్రేమిస్తున్నానంటూ శ్రుతి వాళ్ళను బుట్టలే పడేసి, తమ హౌటల్ బిల్లులు కట్టిస్తుంటుంది. అలా మోసపోయిన తన మిత్రుడి తరఫున శ్రుతికి బుద్ధి చెప్పేందుకు హీరో రంగంలోకి దిగుతాడు. పెళ్ళి మరో పది రోజులు ఉందనగా ఇలా క్రేజీ పనులతో థ్రిల్ పొందాలని చూసిన శ్రుతి కాస్తా చివరకు అనుకోని పరిస్థితుల్లో హీరో ప్రేమలో పడుతుంది. కుదిరిన పెళ్ళిని కూడా కాదనుకొని, హీరోను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఆమెతో పెళ్ళి ఆగిపోయిన పొగరుబోతు ధనికుల కుర్రాడు రోహిత్ (అడివి శేషు) తరఫున అతని మేనమామ వైజాగ్ పూర్ణ (ఆశుతోష్ రాణా) రంగంలోకి దిగుతాడు. అక్కడ తీరా రవి, మోహనరావులను చూసి, వారిద్దరూ తానెంతో కాలంగా వెతుకుతున్న రౌడీ షీటర్లు శంకర్ (రవితేజ), నానాజీ (ప్రకాశ్‌రాజ్) అని చెబుతాడు. అక్కడి పోరాటంలో కత్తిపోట్లకు గురై, నానాజీ చావుబతుకుల్లో పడతాడు. ''అరేరు! శంకర్! నువ్వు మగాడివైతే, వైజాగ్‌కు వచ్చి శ్రుతిని తెచ్చుకోరా!'' అంటూ విలన్ సవాలు విసరడంతో సినిమా ప్రథమార్ధం అయిపోతుంది. ఇక, హీరోకూ, అతనికి తండ్రిగా చెబుతున్న ప్రకాశ్‌రాజ్‌కూ ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి, గతంలో వారి బద్ధశత్రుత్వానికి కారణమేమిటి, వారెలా కలసిపోయారు లాంటి ప్రశ్నలన్నిటికీ ద్వితీయార్ధంలోని కథ జవాబు. ఆ పైన విలన్ బారి నుంచి శ్రుతిని హీరో ఎలా కాపాడాడన్నది కై ్లమాక్స్. కథనం ఎలా ఉందంటే.. కొద్ది క్షణాలు తక్కువగా సరిగ్గా రెండున్నర గంటల నిడివి ఉన్న 'బలుపు' నటి లక్ష్మీరారు (నిజ జీవితపాత్రనే ఆమె ధరించారు)పై దుండగుల అత్యాచార యత్నం, వారిని అడ్డుకొని, ఆటాడుకొనే హీరో రంగప్రవేశంతో చాలా రొటీన్‌గా మొదలవుతుంది. హీరో ఇంట్రడక్షన్ ఫైట్‌తో అయింది కాబట్టి, ఆ వెంటనే ఇంట్రడక్షన్ సాంగ్! తనను కాపాడిన హీరో బృందానికి పార్టీ ఇస్తానంటూ, ఆమె పబ్‌లో చిందులు వేస్తుంది. దుండగుల వాంఛ నుంచి తప్పించుకోవడానికి తెగ శ్రమపడ్డ ఆమె, తీరా హీరోతో అలాంటి వాంఛలే వ్యక్తం చేస్తూ పాట పాడడం ఏమిటో అర్థం కాదు. అది పాత్ర, సంఘటనల పరంగా నప్పదని గీత రచయితకు కాకపోయినా, దర్శకుడికైనా తెలియాలి. రవితేజ, ప్రకాశ్‌రాజ్‌లు బద్ధశత్రువులంటూ విలన్ నోట పలికించడంలో అర్థం లేదు. ఎందుకంటే, ఒకప్పుడు పరస్పర విరోధులైనా, అంజలి మరణంతో వారిద్దరూ దగ్గరైపోయారన్నది విలన్‌కు కూడా తెలిసిన విషయమే! అలాగే, ఫ్లాష్‌బ్యాక్ చూపిస్తున్నప్పుడు అందులో ప్రకాశ్‌రాజ్, హీరోను ఫ్లాష్‌బ్యాక్ తరువాతి జీవితంలోని పేరుతో ప్రస్తావించడం లాంటి తప్పులు సినిమాలో ఉన్నాయి. ఇద్దరు కథా రచయితలు, ఇద్దరు మాటల రచయితలు, స్క్రీన్‌ప్లేకు దర్శకుడితో పాటు మరొకరు ఉన్న ఈ సినిమా కథ, సన్నివేశాలన్నీ మునుపెప్పుడో వచ్చిన తెలుగు సినిమాల్లోని వాటికి నకళ్ళే! కథనం కూడా హాయిగా, సాఫీగా, వడివడిగా సాగకపోవడం మరో లోపం. సినిమా మొదలై ముప్పావు గంట దాటినా అసలు కథలోకి రాకపోవడం ప్రేక్షకుల సహనానికి పరీక్షే. నటీనటుల అభినయం కూడా కొన్ని చోట్ల అతి అనిపిస్తుంది. అసలు పాత్రలకు పక్కబలంగా తెరపై నేపథ్యంలో కనిపించే నటులు కూడా తమకు డైలాగ్ లేకపోయినా, తెగ నటించేస్తుంటారు. గతంలో 'డాన్ శీను', 'బాడీగార్డ్' చిత్రాలు రూపొందించిన దర్శకుడు గోపీచంద్ తన దర్శకత్వ ప్రతిభకు మరింత మెరుగు పెట్టుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో థమన్ బాణీల్లో పాటలు బీట్ ప్రధానంగా వినిపించాయి. 'కాజల్ చెల్లివా...' అనే పాటలో తమన్‌తో, రవితేజ తన గొంతు కలపడం విశేషం. రవితేజ, అంజలి మీద వచ్చే 'నిను చూసిన క్షణంలో...' పాట ఎస్పీబీ, గీతామాధురి గళాల్లో భావప్రధానంగా సాగింది. సినిమా చివరలో రవితేజ, శ్రుతీ హాసన్‌లపై వచ్చే 'పాతికేళ్ళ చిన్నది చేపకళ్ళ సుందరి...' కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ, తాళం వేయిస్తుంది. జయనన్ విన్సెంట్ కెమేరా అతి హడావిడులు లేకుండా కథనంలో భాగమై, నడిచింది. డ్యాన్సులు, ఫైట్లు రొటీనే! అభినయం మాటేమంటే.. నటీనటుల్లో రవితేజ, ప్రకాశ్‌రాజ్‌లకు ఈ మార్కు కథలు, పాత్రలు కొట్టినపిండి. ఈసారీ వారు అదే చేశారు. శ్రుతీ హాసన్, అంజలి - ఇద్దరూ పాత్రల పరిధి మేరకు నటించారు. కానీ, అందం, ఆకర్షణల్లో దొందూ దొందే! పైపెచ్చు, అతి మేకప్‌తో అంజలి అనాకర్షణీయంగా తయారైంది. విలన్‌గా ఆశుతోష్ రాణా బాగానే ఉన్నా, ఉత్తరాది పాత్రలాగానే అనిపించాడు. అతని కుమారుల పాత్రల్లో అజరు, షఫీ కనిపిస్తారు. షఫీ చేసిన 'జింగిల్ బారు కాశీ' పాత్ర కూడా పాత చింతకాయ పచ్చడే! సినిమాలో వినోదం కోసం బ్రహ్మానందంతో పాటు, సైకియాట్రిస్ట్ డాక్టర్ సావిత్రిగా అలీ, ఇంకా 'తాగుబోతు' రమేశ్ తదితరులు ఉన్నారు. హీరో, లేదా విలన్ చేతిలో వట్టి బడుద్ధాయిగా మారి, దెబ్బలు తింటూ, తనవైన హావభావాలు పలికించడం ఇటీవల బ్రహ్మానందానికి ప్రామాణికమైన పాత్రచిత్రణ. ఇందులోనూ అంతే! చిత్రం మొదట్లో వచ్చిన కామెడీ ట్రాక్ లాంటివి నవ్వించడానికి తెగ ప్రయాసపడ్డాయి. కాగా, శ్రుతితో కలసి బ్రహ్మానందం గంగ్‌నమ్ శైలి డ్యాన్స్, కై ్లమాక్స్‌లో ఆయన ఆవేశంగా చెప్పే డైలాగ్ లాంటివి నవ్విస్తాయి. మాటల గారడీతో సాగే మాస్ డైలాగులు కొన్ని మాస్‌కు నచ్చుతాయి. కానీ, ''మొక్కను పెంచుకో నీడనిస్తుంది. కుక్కను పెంచుకో తోడుగా నిలుస్తుంది. పగను పెంచుకోకు. ప్రాణం తీస్తుంది'' (ప్రత్యర్థులతో హీరో) లాంటి డైలాగులు ఎఫెక్ట్ చూపకపోగా, నవ్వు తెప్పిస్తాయి. అయితే, 'బలుపు'లాంటి ప్రయత్నాల్లో ఉన్న చిక్కేమిటంటే - పాత్రలు, అవి చెప్పే డైలాగులు, చేసే పనులను ప్రేక్షకులు ముందే అంచనా వేసేయగలుగుతారు. ఈ సినిమాకూ అదే జరిగింది. దాంతో, కొత్త సినిమాకు వచ్చినా సన్నివేశాలు, సంఘటనలతో సహా పాత సినిమాలే గుర్తుకొచ్చేస్తుంటాయి. అలాంటి బలహీనతలన్నీ ఉన్న మాస్ మసాలా చిత్రంగా 'బలుపు' నిలుస్తుంది. కానీ, ఇటీవల విజయాల కోసం అర్రులు చాస్తున్న రవితేజకు ఆ భరోసా ఇస్తుందా? బాక్సాఫీస్‌ను గెలుస్తుందా? - రెంటాల జయదేవ (Published in Praja Sakti daily 29th June 2013, PageNo.8) ..................................................................