జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Wednesday, September 24, 2014

నాన్న దర్జాగా బతికారు... హుందాగా వెళ్లిపోయారు... - వెంకట్ అక్కినేని

దర్జాగా బతికారు... హుందాగా వెళ్లిపోయారు...

నాన్న అక్కినేని లేకుండా మేము జరుపుకొంటున్న ఆయన తొలి పుట్టినరోజు ఇది. ఈ క్షణంలో నా మనసు నిండా ఏవేవో భావాలు, ఆలోచనలు. తల్లితండ్రులు పోయినప్పుడు ఎవరికైనా సరే అన్నేళ్ళుగా తమతో ఉన్న లైఫ్‌లైన్ కట్ అయిపోయినట్లు అనిపిస్తుంది. నా పరిస్థితీ అదే. పైగా నాన్న కుటుంబానికి చాలా ప్రాధాన్యమిచ్చే మనిషి. అంతా హైదరాబాద్‌లోనే ఉండడంతో మా కుటుంబ సభ్యులందరి మధ్య చాలా సాన్నిహిత్యం. అందుకే, నాన్న లేరన్న వాస్తవాన్ని ఇవాళ్టికీ జీర్ణించు కోలేకపోతున్నాం. కాలమే ఈ గాయాన్ని మాన్పుతుంది.  పుట్టిన ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజు వెళ్ళిపోయేవాళ్ళమే. ఆయన అన్ని రకాలుగా సంపూర్ణ జీవితం అనుభవించిన మనిషి. దర్జాగా బతికారు, హుందాగా వెళ్లి పోయారు. అందుకే, ఆయన జీవించిన విధానాన్ని ప్రశంసించాలి.
 
అమ్మ చాలా ఏళ్లు అనారోగ్యంతో బాధపడడం కళ్లారా చూశాం. పాపం... ఇంట్లో ఆమె వెంటే ఉంటూ, జాగ్రత్తగా చూసుకుంటూ నాన్న ఎంత వేదన అనుభవించారో మాకు తెలుసు. కానీ, క్యాన్సరొచ్చినా, పెద్దగా బాధపడకుండానే ఆయన అనాయాసంగా కన్ను మూశారు. నిజానికి, క్యాన్సర్ ఉన్నట్లు అడ్వాన్‌‌స దశలో కానీ బయటపడలేదు. గత సెప్టెంబర్‌లో నాన్న పుట్టినరోజు ఆనందంగా జరుపుకొన్నాం. ఆ తరువాత కొద్ది వారాలకే వ్యాధి సంగతి బయటపడింది.
 
క్యాన్సర్ వచ్చిన సంగతి నాన్నకు చెప్పడానికి డాక్టర్లు సంకోచిస్తుంటే, నేనే ఆయనకు ముందుగా విషయం చెప్పాను. (కన్నీళ్ళను ఆపుకొంటూ...) ఒక దుర్వార్త వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారన్న దాన్నిబట్టి ఆ మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచించవచ్చు. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు చాలామంది దాచేస్తుంటారు. విషయం బయటకు లీకై నలుగురూ లేనిపోనివి అనుకొనే బదులు, పబ్లిక్ ఫిగరైన మీరే విషయం చెప్పి, అలాంటి ఇతర క్యాన్సర్ బాధితులకు కూడా డీలా పడిపోకుండా పాజిటివ్ దృక్పథంతో ఉండమని చెప్పవచ్చు కదా అని నేను సూచించాను. అంతే. ఆయన ప్రెస్‌మీట్ పెట్టి, తన వ్యాధి సంగతి ధైర్యంగా ప్రకటించారు. ఆశీస్సులతో బతుకుతానన్నారు. అంతెందుకు! మా బంధువుల్లో ఒకరికి క్యాన్సర్ వచ్చి భయపడుతుంటే, తాను క్యాన్సర్ బాధలో ఉన్నా, వాళ్ళను పిలిచి, 2 గంటలు మాట్లాడి ధైర్యం చెప్పారు.
 
కోలన్ క్యాన్సర్‌లో కూడా చాలా క్లిష్టమైన, అరుదైన చోట నాన్నకు వ్యాధి వచ్చింది. అత్యాధునిక కెమోథెరపీ మందు కూడా పని చేయలేదు. చివరి రోజులని తెలిసినా ఆయన ధైర్యం కోల్పోలేదు. మంచి చికిత్సతో ఆయన మరో 2 -3 నెలలు బతుకుతారనుకున్నాం. మనసులోనే బాధ దిగమింగుకొని ఆయన ఎదుట జోక్స్ వేసి, నవ్విస్తూ, మాలో ఎవరో ఒకరం ఎప్పుడూ ఆయన దగ్గరే ఉండేవారం. ఒకరోజు సాయంత్రం కొద్దిగా నొప్పి మొదలై, మేము ‘ప్యాలియేటివ్ కేర్’కు ఏర్పాట్లు చేశాం. నిద్ర మత్తుతోనే ఏదో ఆయన మాట్లాడారు. కానీ, ఆ అర్ధరాత్రి దాటాక ప్రశాంతంగా శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, (గొంతు జీరపోగా...) అమ్మానాన్నలకు మనమేదైనా లోపం చేశామా, మరింత హ్యాపీగా ఉంచలేకపోయామా, కొన్నిసార్లు అనవసరంగా కోపతాపాలు చూపామా అన్న ఆలోచనలు పిల్లలకు వస్తూ ఉంటాయి. ఎవరికైనా అది సహజం.  

పిల్లలకు 14 -15 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి తాను తీసుకొనే నిర్ణయాల్లో వారినీ భాగస్వామిని చేయడం నాన్న పెంపకంలోని ప్రత్యేకత. అలా మాలో ఆలోచించే తత్త్వాన్ని పెంచేవారు. పెద్దవాళ్లతో ఆయన చర్చిస్తున్నప్పుడు చిన్నతనంలో నేను ఆసక్తిగా వింటూ ఉంటే, ఆయన ప్రోత్సహించారు. ఆయనకు ఇంట్లో అందరూ సమానమే అయినా, ఇంటికి పెద్దవాణ్ణి కావడం వల్లనేమో నేనంటే పిసరంత అభిమానం ఎక్కువే అనిపిస్తుంటుంది. అమెరికాలో చదువుకొని 1977లో తిరిగొచ్చాక, అనుకోకుండా 1978లో అన్నపూర్ణా స్టూడియో నిర్వహణ చేపట్టా. నష్టాలతో స్టూడియో పక్షాన చిత్ర నిర్మాణం కొన్నాళ్ళు ఆగింది. ఆ తరువాత అనుకోకుండా నేనే చిత్ర నిర్మాణం చేపట్టా.

జీవితంలో పిల్లల్ని ఎవరినీ, దేనికీ వద్దని చెప్పని నాన్న ‘పెదబాబూ... నువ్వు ముక్కుసూటి మనిషివి. నీకు సినీ రంగం సరిపడదేమో’ అని మాత్రం అన్నారు. ‘ఒక్కసారి ట్రై చేస్తా’ అన్నప్పుడు మారుమాట్లాడకుండా సరే అన్నారు. అప్పుడు వేరే యాక్టర్ల కోసం ప్రయత్నించి, చివరకు ఇంట్లోనే నాగార్జున ఉన్నాడు కదా అని వాడు నటిస్తాడని నాన్నకు చెప్పి, ‘విక్రవ్‌ు’ (’86)తో నిర్మాతనయ్యా. అయితే, పది - పన్నెండు సినిమాలు తీసి, పాతికేళ్ళు స్టూడియో చూసుకున్నాక 2002 ప్రాంతంలో ఆ బాధ్యత నాగార్జునకు అప్పగించా. నాన్న నన్నే చూడమన్నా, వద్దన్నా.

ఇప్పుడు రసాయన, వైద్య పరికరాల దిగుమతుల పరిశ్రమలతో బిజీగా ఉన్నా. మంచి కథ దొరికితే, మళ్ళీ సినిమా తీయాలనుంది.  మా అబ్బాయి ఆదిత్యనూ హీరోని చేయాలని నాన్నకుండేది. కానీ, వాడికి ఆసక్తి లేకపోవడంతో మేము బల వంతం చేయలేదు. ఆయన అవార్డును ఏటా ఇవ్వడం, జన్మభూమి ట్రస్ట్ కింద కార్యక్రమం చేయడం లాంటి నాన్న ఆఖరి కోరికలు నెరవేరుస్తాం. అనుక్షణం నాకండగా ఉన్న నాన్నను చిరస్మరణీయం చేసు కొనేది అలాగే!


 సంభాషణ: రెంటాల జయదేవ


(Published in 'Sakshi' Telugu daily, 20th Sept 2014, Saturday)
..........................

Tuesday, September 23, 2014

నిగ్గు తేల్చే పరీక్ష (స్వామి వివేకానందకు తల్లి భువనేశ్వరీ దేవి ఆశీస్సులు)

సందేశం

నిగ్గు తేల్చే పరీక్ష

హిందూ మతం ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడానికి స్వామి వివేకానంద తొలిసారిగా విదేశీయానానికి బయలుదేరినప్పటి సంగతి ఇది. చేపట్టిన ఆ బృహత్ కార్యానికి స్వామి వివేకానంద అన్ని విధాలా సరిపోయినవాడా, కాదా అన్నది తెలుసుకోవాలని ఆయన తల్లి భువనేశ్వరీ దేవి భావించింది. ఆ సంగతి తెలుసుకొనేందుకు ఆయనను రాత్రి విందుకు పిలిచింది.

గుండెలోని ప్రేమను రంగరించి మరీ తల్లి చేసిన వంటకాలను స్వామీజీ తృప్తిగా తిన్నారు. భోజనం పూర్తి అయిన తరువాత ఓ గిన్నె నిండా పండ్లు పెట్టి, వాటిని కోసుకొని తినేందుకు ఓ చాకు ఇచ్చిందా తల్లి. వివేకానంద ఓ పండును కోసుకొని, తినసాగారు. అప్పుడు ఆమె, ‘‘నాయనా... నాకు కొద్దిగా పని ఉంది. ఆ కత్తి ఇస్తావా?’’ అని అడిగింది. వివేకానంద వెంటనే ఆ చాకును తల్లికి ఇచ్చారు.
 
వెంటనే ఆమె మరోమాట లేకుండా, ‘‘నాయనా... నువ్వు నా పరీక్షలో నెగ్గావు. దిగ్విజయంగా విదేశీయాత్ర జరుపుకొని రా... ఇవే నా ఆశీస్సులు’’ అంది. దాంతో వివేకానంద ఆశ్చర్యంతో  ‘‘అమ్మా.. నన్నెలా పరీక్షించావు? నాకు అర్థం కాలేదు’’ అన్నారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది... ‘‘నాయనా... కత్తి ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు ఆ కత్తి మొనను పుచ్చుకొని, చెక్క పిడి ఉన్న వైపును నాకు అందించావు. అలా కత్తిని పట్టుకొనేటప్పుడు నాకు హాని కలగకుండా, దెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తపడ్డావు. అలా నా సంరక్షణ బాధ్యత తీసుకున్నావు.

ఎవరైతే తమ స్వార్థం గురించి ఆలోచించుకోకుండా, ఇలా ఇతరుల సంక్షేమం గురించి తపిస్తారో వారే ప్రపంచానికి బోధలు చేయడానికి అర్హులు. ఆ హక్కు వారికే ఉంటుంది. అదే నేను నీకు పెట్టిన పరీక్ష. నువ్వు నా పరీక్షలో నెగ్గావు. నీకు నా ఆశీస్సులు. దిగ్విజయోస్తు.’’ స్వార్థం మానుకొని, పొరుగువారి సంక్షేమానికి తోడ్పడాలన్న ఈ కీలకమైన సందేశాన్ని ఆ తరువాత స్వామి వివేకానంద తన జీవితకాలంలో కలిసిన లక్షల మంది హృదయాల్లో నాటుకొనేలా చేశారు. ఓ మామూలు మనిషికీ, అసాధారణ వ్యక్తికీ లక్షణాల్లో ఉండే ప్రధానమైన తేడా ఈ సంక్షేమ భావనే. నిత్యజీవితంలో కూడా ఇతరుల ఆనందం గురించి ఆలోచించేవాడే అసలు సిసలు గొప్పవాడు.  
 
- రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 19th Sept 2014, Friday)
....................................................

Monday, September 22, 2014

బాల్యం మర్చిపోని మనిషి... తాపీ ధర్మారావు (by ఆఖరు మనుమరాలు సుజాతా షా)

నేడు తాపీ ధర్మారావు జయంతి

బాల్యం మర్చిపోని మనిషి...

సాహిత్యం, సినిమా, పత్రికలు, అధ్యాపకత్వం - ఇన్ని రంగాల్లో ఏకకాలంలో కృషి చేసిన అభ్యుదయవాది అంటే ‘ఆంధ్ర విశారద’ తాపీ ధర్మారావు పేరే గుర్తొస్తుంది.
 127 ఏళ్ల క్రితం జన్మించిన ఈ ‘తాతాజీ’ తన కాలానికి కన్నా ముందు ఆలోచనలతో వర్ణాంతర వివాహాలు, దండల పెళ్లిళ్లకు అప్పట్లోనే పురోహితుడు.
ఈ మానవతావాదిని అతి దగ్గర నుంచి చూసిన ఆఖరు మనుమరాలు్ర శీమతి సుజాతా షా. స్వయంగా కవయిత్రి, అధ్యాపకురాలైన ఆమె మాటల్లో...
ఆ వ్యావహారిక భాషా విప్లవమూర్తి  జ్ఞాపకాల్లోకి ప్రయాణం...

 
తాపీ ధర్మారావు ‘మీ తాతయ్యట కదా’ అని ఎవరైనా అనగానే ఒక్కసారిగా యాభై ఎనిమిదేళ్ళు వెనక్కి, నా చిన్నతనానికి వెళ్ళిపోతాను. మనుమరాళ్ళలో అందరి కన్నా చిన్నదాన్ని నేను. తాతయ్యకు ముగ్గురబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు. పెద్దబ్బాయి - మా నాన్న, ప్రముఖ జర్నలిస్టు తాపీ మోహనరావు. ఆఖరబ్బాయి - దర్శకుడు చాణక్య బాబాయి.
 
నిజం చెప్పాలంటే, మా లాంటి వాళ్ళం ఆయనను తాతయ్యగానే ఎక్కువ చూశాం. కానీ, ఆయన పోయిన తరువాత రచయితగా, సినీకవిగా, పరిశోధకుడిగా ఆయన గురించి నలుగురూ చెబుతూ ఉంటే, అప్పుడు తెలిసింది - ఎంత గొప్పమనిషితో మేమింత కాలం కలసి గడిపామో అని! చిన్నప్పుడు ఆర్థికంగా చాలా కష్టపడి, ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, క్రమంగా యెదిగిన తాతయ్య బయట ప్రపంచంలో ఎంతో ప్రముఖులైనా ఇంట్లో మామూలు గృహస్థులా పిల్లల పట్ల అక్కరతో ఉండేవారు. మద్రాస్, ఆ తరువాత హైదరాబాద్‌ల నుంచి తాతయ్య విజయవాడలో నాన్న దగ్గరకెప్పుడొచ్చినా మాకు పండగే. పడక్కుర్చీలో పడుకొని కాళ్ళ మీద చిన్నదాన్నైననన్ను ఊపుతూ ఆయన చెప్పిన సంగతులు ఇంకా జ్ఞాపకం.
 
పిల్లల చదువు, పెళ్ళిళ్ళ విషయంలో తాతయ్య చాలా స్వేచ్ఛనిచ్చేవారు. నాకు లెక్కలంటే భయమని నా పరీక్షల రోజుల్లో ప్రత్యేకంగా వచ్చి, నాకు పాఠాలు చెప్పేవారు. అలాగే, మేము వారం వారం ఆయనకు ఉత్తరాలు రాయాల్సిందే. కార్డు మీద ఒకవైపు యోగక్షేమాలు, మరోవైపు చిట్టి కవితలు రాసి పంపేదాన్ని. వాటికి ఆయన ఇచ్చే జవాబులు, ప్రోత్సాహం తమాషాగా ఉండేవి. ఉత్తరాలు రాకపోతే, ఆయనే టెలిగ్రావ్‌ు ఇచ్చేసేవారు. ఒకసారి స్కూల్లో హంపీ విహార యాత్ర వెళ్ళి వచ్చాక, ఉగ్ర నరసింహమూర్తి అంటూ నేను కవిత రాశా. అందులోని ‘చరాచర జీవకోటి’ లాంటి మాటలు విని, బాగుందంటూనే, ఇంకా తేలిక మాటల్లో రాయాలనడం ఇప్పటికీ గుర్తు.
 
జన వ్యవహారంలో...: ఆ మాటకొస్తే పత్రికల్లో వ్యావహారిక భాషా వాదానికి కూడా ఆయన పెద్ద అండ. 1930 జూన్‌లో జస్టిస్ పార్టీ వారి పత్రిక ‘సమదర్శిని’లో సంపాదకులుగా, 1935-’36లో గూడవల్లి రామబ్రహ్మం సారథ్యంలోని ‘ప్రజామిత్ర’ పత్రికలో రచయితగా, 1936లో పిఠాపురం రాజా పీపుల్స్ పార్టీ పక్షాన నెలకొల్పిన ‘జనవాణి’కి ఎడిటర్‌గా పత్రికా రంగానికి తాతయ్య చేసిన సేవ, పెట్టిన ఒరవడి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. ముందు వీర గ్రాంథికవాదైనా, గిడుగు వారి ప్రభావంతో తర్వాత వ్యావహారికానికి తాతయ్య పట్టం కట్టారు. ‘కొత్త పాళీ’ పట్టారు.
 
ఆచరణలోనూ అభ్యుదయం...: నిత్యం నేర్చుకోవాలనే తపన జీవితాంతం కొనసాగిన జిజ్ఞాసువు తాతయ్య. అందుకే, మా నాన్న గారి కమ్యూనిస్టు భావాల ప్రభావాన్నీ సంతోషంగా ఇముడ్చుకొన్నారు. పార్టీలో సభ్యులుగా నాన్న,‘ప్రజానాట్యమండలి’ బుర్రకథ కళాకారిణిగా అమ్మ రాజమ్మల వర్ణాంతర వివాహాన్ని స్వాగతించారు. ఇంటా, బయటా అభ్యుదయ మార్గంలో దండల పెళ్ళిళ్ళెన్నింటికో పౌరోహిత్యం వహించారు. అభ్యుదయ రచయితల సంఘం తొలి మహాసభలకూ ఆయనే అధ్యక్షుడు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖులు చంద్రం లాంటి వారందరితో తాతయ్యకు బాగా స్నేహం. ‘విశాలాంధ్ర’కు పేరు పెట్టి, దాన్ని ప్రారంభించిందీ ఆయనే. రాంభట్ల, బిరుదురాజు రామరాజు, సెట్టి ఈశ్వరరావు, డాక్టర్ చిట్టూరి ఆయనకు బాగా దగ్గర!
 
ఇంటి పేరు... మనిషి తీరు...: మా ఇంటి పేరుకూ కథ ఉందని చెప్పేవాళ్ళు తాతయ్య. మా పూర్వీకుల ఇంటి పేరు బండి వారో, బండారు వారోనట! సైన్యంలో సిపాయిలుగా ఉంటూ, సైన్యం నుంచి విడుదలై వచ్చాక ఏదో పని చేసుకొనేవారట. మా తాతయ్యకు ముత్తాత లక్ష్మయ్య వాళ్ళ ఊళ్ళో (శ్రీకాకుళం) తాపీ పనిలో బాగా పేరు తెచ్చుకున్నారట. కొడుకూ, కూతురూ చనిపోవడంతో తన దగ్గర పెరుగుతున్న మనుమణ్ణి లక్ష్మయ్య బడిలో వేసినప్పుడు ‘తాపీ లక్ష్మయ్య మనుమడు అప్పన్న’ అని రాశారట. అలా మా ఇంటి పేరు ‘తాపీ’ అయింది. సినీ రచన విషయంలో తాతయ్య అక్షరాలా తాపీగానే పనిచేసేవారట.


ఇంటిపేరుకు తగ్గట్లే రచనల్లో తాపీతనం, జాప్యం మాటెలా ఉన్నా, తాతయ్య రచన కోసం దర్శక, నిర్మాతలు ఇంటికొచ్చిన సందర్భాలు నాకు గుర్తు. సినీ రచయితగా ఆయన తొలిచిత్రం ‘మోహినీ రుక్మాంగద’ (1937). ఆ పౌరాణిక చిత్రంలో ఆయన వ్యావహారిక భాషలో డైలాగులు రాయడం అప్పట్లో చర్చనీయాంశం. ‘మాలపిల్ల’, ‘రోజులు మారాయి’ చిత్రాల రచనల్లో ఆయన అభ్యుదయ భావాలు చూడవచ్చు. ఇక ఎన్టీఆర్ ‘భీష్మ’ (1962) ఆయన పూర్తి స్థాయిలో రచన చేసిన చివరి చిత్రం. అయితే, ‘మదర్ ఇండియా’ని నటి జమునతో ‘బంగారు తల్లి’ (1971)గా రూపొందించినప్పుడు పద్యం లాంటి చిన్న పాటను తాతయ్యతో బలవంతాన రాయించారు దర్శకుడైన మా చాణక్య బాబాయ్. తాతయ్య ఆఖరి సినీ రచన అది.
 
సంపాదకీయాలు ఇవాళ్టికీ...: తాతయ్య ప్రసిద్ధ రచనలు ‘పెళ్ళి - దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?’ లాంటివన్నీ పలు ముద్రణలు పొందాయి. అప్పటి ప్రసిద్ధ వేగుచుక్క గ్రంథమాల కోసం ఆయన రాసిన స్వభావ పరిశోధనాత్మక నవల ‘క్రొవ్వురాళ్ళు’ తాతయ్య బతికున్నప్పుడే వేరొక పబ్లిషర్ చేతుల్లో పడి కనిపించకుండా పోయింది. కానీ, అప్పట్లో తాతయ్య స్వయంగా దిద్దుకున్న ప్రూఫు కాపీ నా దగ్గర సగం దొరికింది. అలాగే, తాతయ్య జీవితం - రచనల మీద పరిశోధన చేసిన సాహితీవేత్త ఏటుకూరి ప్రసాద్ మిగతాది కష్టపడి సంపాదించారు. అలా అది ఈ మధ్య మళ్ళీ తాతయ్య పేరు మీద పాఠకలోకం ముందుకొచ్చింది. ఇక, తాతయ్య ఎడిటోరియల్స్, వ్యాసాలు, పాటలను పుస్తకంగా తేవాలని ప్రయత్నం.
 
మరపురాని జ్ఞాపకం...: ఆఖరు వరకు బాల్యం మర్చిపోని మనిషి ఆయన. చెప్పిందే చేస్తూ, చేసేదే చెబుతూ బతికిన ఆయన మాట్లాడు తుంటే, మెరిసే ఆ కళ్ళు ఇవాళ్టికీ నాకు గుర్తే. బొమ్మలు గీయడం, కవితలు రాయడం, ఉపాధ్యాయ వృత్తి లాంటి నా లక్షణాలకు తాతయ్య జీన్సే కారణమనిపిస్తుంటుంది. రెండేళ్ళ క్రితం తాతయ్య 125వ జయంతి సంవత్సరం సందర్భంగా విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో వేదికకు ఆయన పేరు పెట్టారు. తాతయ్య గురించి నేను మాట్లాడితే, దూరం నుంచి మైకులో నా మాటలు విన్న ఒక ఎన్నారై కుర్రాడు దగ్గరకొచ్చి సమాజం, భాష, పెళ్ళి లాంటి వాటి గురించి కొన్ని దశాబ్దాల క్రితమే తాతయ్య వెలిబుచ్చిన అభిప్రాయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ, అప్పటికప్పుడు ఆయన రచనలన్నీ కొనుక్కొని వెళ్ళడం తాతయ్య భావాలు నవ తరానికి కూడా ప్రేరణనిస్తున్నాయనడానికి ఋజువు!
 
సంభాషణ: రెంటాల జయదేవ


(Published in 'Sakshi' Telugu daily, 19th Sept 2014, Friday)
.................................. 

Saturday, September 20, 2014

ఆ అవార్డులన్నీ నేనే వచ్చేలా చేశా... తప్పేముంది?! - ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు టీ. సుబ్బరామిరెడ్డి

అందరినీ బాగా పొగుడుతాను...నన్నెవరు పొగిడినా సంతోషిస్తాను!
 
రోడ్ నంబర్ 1.. బంజారా హిల్స్‌లోని ఆ ఇంట్లో ఉదయాన్నే హడావిడిగా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నాల మధ్య ప్రయాణాలతో... రోజుకో చోట ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఆ రోజు హైదరాబాద్‌లో ఉన్నారు. విశాఖపట్నంలో సెప్టెంబర్ 17న జరిగే పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లలో ఆఫీసు సిబ్బంది బిజీగా ఉన్నారు.

పూజ ముగించుకొని, ఆధ్యాత్మికవాది నుంచి ఆచరణవాదిగా మారి, ట్రేడ్ మార్క్ కుర్తా, కోటుతో నవ్వుతూ వచ్చారు - సుబ్బరామిరెడ్డి. ఏడు పదుల పైగా జీవితం చూసి, వేల కోట్లు సంపాదించిన ఈ రైతుబిడ్డ చేతిలోని బేసిక్ మోడల్ నల్ల రంగు నోకియా ఫోన్‌ను టేబుల్ మీద పెట్టి, సంభాషణకు ఉపక్రమించారు. సినిమా, వ్యాపారం, రాజకీయం, ఆధ్యాత్మికత, సేవ - ఇలా ఎన్నో కోణాలున్న ఒకే నాణెం టీయస్సార్‌తో ముఖాముఖి..

 
ఇంత సంపాదించి, ఈ స్మార్ట్‌ఫోన్ల యుగంలో ఇంకా బేసిక్ ఫోనా?  


సుబ్బరామిరెడ్డి: ఫోన్ అనేది మాట్లాడుకోవడానికి, సమాచారం చేరవేయడానికి. దానికి ఇంతకన్నా ఎందుకు? ఐ ఫోన్ ఇంట్లో తెచ్చారు. కానీ, అది వాడను. జీవితమైనా, ఫోనైనా సంక్లిష్టత లేకుంటేనే సుఖం.
 
ఇంత వేదాంతిలా మాట్లాడతారు. మళ్ళీ విందులంటూ భౌతికవాదిలా ఉంటారే!
వైరాగ్యమంటే ఒంటికి బూడిద రాసుకొని, జీవితంలో ఏదీ వద్దనుకోవడం కాదు! జీవితంలో ఏదో సాధించాలనే అభిలాష ఉండాలి. అదే సమయంలో ‘సాధించినది, సంపాదించినది ఏదీ నాది కాదు, నా వెంట రాద’నే వైరాగ్యమూ ఉండాలి. అప్పుడు అనుకున్నది కాకపోయినా బాధపడరు.
 
డెబ్భై రెండో ఏటా చేపట్టిన అన్ని రంగాల్లో క్రియాశీలంగా ఉన్నారు. మీ నిత్యనూతనోత్సాహం వెనుక రహస్యం?
ఇదంతా ఈశ్వర తపస్సు వల్ల లభించిన ఉత్సాహం.  రోజూ గంటన్నర పూజతో మానసిక వ్యాయామం, రెండు గంటల శారీరక  వ్యాయామం - పదేళ్ళుగా నా జీవితంలో భాగమైంది. అదే నాలో నిత్యనూతనోత్సాహం నింపుతోంది. మరో కారణం - నా లోని పాజిటివ్ మైండ్. దాంతో శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేసుకోవచ్చు.
 
కానీ, మీరు కోరి, ఆశపడ్డ పదవి అంటూ ఇంతవరకూ లేదా?
ఉంది. చిన్నప్పటి నుంచి భక్తెక్కువ. టి.టి.డి. బోర్డు చైర్మన్ కావాలనుకున్నా. కోరి మరీ ఆ పదవిని రెండుసార్లు చేపట్టా.
 
మీకు కళలు, సినిమాల పట్ల ఆసక్తి ఎలా మొదలైంది?
చిన్నప్పటి నుంచి నాకు ఆ ఆసక్తి ఉండేది. పైగా, అప్పటి మేటి సినీ కమెడియన్ రమణారెడ్డి మా సొంత బాబాయే! సహజంగానే ఆ ప్రభావం నా మీదా ఉంది. నెల్లూరులో హైస్కూల్‌లో చదివే రోజుల నుంచే ఏకపాత్రాభినయాలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో పాల్గొనేవాణ్ణి. స్కూలు చదువు కాగానే, హైదరాబాద్‌కు వచ్చి నిజామ్ కాలేజ్‌లో డిగ్రీ చదివా. పద్ధెనిమిదేళ్ళ వయసులోనే వ్యాపార రంగంలోకి వచ్చా. కానీ, కళాభిరుచి కారణంగా 1973లో పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ‘కాస్మొపాలిటన్ కల్చరల్ సెంటర్’ నెలకొల్పి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపా. తరువాత సినీ ఎగ్జిబిటర్‌నయ్యా, నిర్మాతనయ్యా. సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా.
 
వ్యాపారానికీ, కళకూ లంకె కుదరడం కష్టం కదా!
కళ అనేది ఒక మహాశక్తి. అది మనిషికి తెలియని ఎనర్జీనిస్తుంది. ముందుకు తీసుకెళుతుంది. కానీ, కోట్లు సంపాదించిన వ్యాపారవేత్తలకూ, బడా రాజకీయ నాయకులకూ ఆ సంగతి తెలియదు. ఎంతసేపటికీ తమ పనుల్లోనే మునిగిపోతుంటారు. ఈ రహస్యం తెలుసు కాబట్టి, కళా రంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగా. గడచిన 52 ఏళ్ళుగా వ్యాపారంలో విజయాలు సాధిస్తున్నా. ఇటు ‘కళాబంధు’గానూ పేరు తెచ్చుకున్నా.
 
కానీ, వ్యాపార విస్తరణలో భాగంగానే సినీ రంగంలోకొచ్చినట్లున్నారు!
సినిమాను వ్యాపారంగా చూస్తే తప్పు. అది పవర్‌ఫుల్ మాస్ మీడియా. అనేక కళల అద్భుత సమాహారం. మీకో రహస్యం తెలుసా? నా భక్తికి ప్రధాన కారణమూ సినిమానే. ‘భూకైలాస్’లో రావణ బ్రహ్మ పాత్రలో ఎన్టీఆర్ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి పొట్ట చీల్చుకొని, పేగులతో వీణలా వాయిస్తాడు. ఆ పరమభక్తుడి జీవితం చూశాక, నాకెందుకు ప్రత్యక్షం కాడని కఠోర శివపూజ చేయడం మొదలుపెట్టా. ఆ తరువాత నాకు శివలింగ దర్శనం అనేకసార్లు జరిగింది.
 
ఆధ్యాత్మికత పక్కన పెడితే, సినీరంగ తొలినాళ్ళు గుర్తున్నాయా?
రిస్కు లేని వ్యవహారం కదా అని సినీ ప్రదర్శన రంగంతో మొదలయ్యా. 1981లో హైదరాబాద్‌లో ‘మహేశ్వరి - పరమేశ్వరి’ సినిమా కాంప్లెక్స్ నిర్మించా. రోమన్, స్పానిష్ ఆర్కిటెక్చర్‌తో అందంగా కట్టించిన హాలులో అప్పట్లోనే ఎస్కలేటర్ పెట్టించా. ఆ హాళ్ళ మీద వచ్చిన డబ్బుతో నిర్మాతగా మారా. హిందీలో మల్టీస్టారర్ ‘విజయ్’ తీశాను. ఆ తరువాత తెలుగులో శోభన్‌బాబు (‘జీవన పోరాటం’), వెంకటేశ్ (‘త్రిమూర్తులు’, ‘సూర్య ఐ.పి.ఎస్’), చిరంజీవి (‘స్టేట్ రౌడీ’), రాజశేఖర్ (‘గ్యాంగ్ మాస్టర్’), బాలకృష్ణ (‘వంశోద్ధారకుడు’) - ఇలా పెద్ద హీరోలతో సినిమాలు చేశా. హిందీలో ‘లమ్హే’, ‘చాందినీ’, డి.రామానాయుడుతో కలసి ‘దిల్‌వాలా’ చేశా. జి.వి. అయ్యర్ దర్శకత్వంలో ‘భగవద్గీత’ (సంస్కృతం, తెలుగు), ‘స్వామి వివేకానంద’ (హిందీ, ఇంగ్లీషు) లాంటి కళాఖండాలూ నిర్మించా.
 
జి.వి. అయ్యర్‌తో గొప్ప చిత్రాలు తీసే అవకాశమెలా వచ్చింది?
అప్పట్లో జాతీయ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా పనిచేశా. జ్యూరీలో అయ్యర్ ఓ సభ్యుడు. సంస్కృతంలో ‘ఆది శంకరాచార్య’ తీసి పేరు తెచ్చుకున్న ఆయన మాటల సందర్భంలో ‘భగవద్గీత’ స్క్రిప్టు గురించి చెప్పారు. ఆ గొప్ప సబెక్ట్‌ను నేనే తెరకెక్కిస్తానన్నా. అలా ‘భగవద్గీత’ చేశాం. ఆ సంస్కృత చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ‘స్వర్ణకమలం’ దక్కింది. అంతకు ముందూ, ఆ తరువాతా ఏ తెలుగు సినిమాకూ ఉత్తమ చిత్ర పురస్కారం రాలేదు. ఆ అవార్డందుకున్న ఏకైక తెలుగు నిర్మాతను నేనే!
 
మరి, మన ‘శంకరాభరణం’ మాటేమిటి?
అది గొప్ప సినిమా. కానీ, దానికి వచ్చింది - కళాత్మక విలువలతో, అత్యధిక ప్రజాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రం అవార్డు మాత్రమే. ఉత్తమ చిత్రం అవార్డు కాదు. కాకపోతే, ఆ ఏడాదికి ఉత్తమ చిత్రంగా ఎంపికైన హిందీ చిత్రంతో పాటు మన ‘శంకరాభరణం’కీ స్వర్ణకమలమిచ్చారు.
 
మీ జాతీయ అవార్డుల్లో మీ పాత్ర ఏమిటంటారు?
ఏమీ లేదు. నేను నిర్మాతను. అంతే! ‘భగవద్గీత’కు అవార్డు వస్తుందని నాకు తెలియదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. గొప్ప చిత్రాన్ని గుర్తించి, ఇచ్చారు. అలాగైతే, అయ్యర్‌తో నేను తీసిన తరువాతి చిత్రం ‘స్వామి వివేకానంద’కు ఇతర అవార్డులు వచ్చాయి కానీ, ఉత్తమ చిత్రం అవార్డు రాలేదు కదా! ఆ రెండు చిత్రాల ద్వారా అప్పట్లోనే రూ. 3 కోట్లు నష్టం వచ్చింది. అయినా, బాధ లేదు. మంచి చిత్రాలు తీశాననే తృప్తి మిగిలింది. అయ్యర్ తీసిన కళాఖండాలైన ‘ఆది శంకరాచార్య’, ‘భగవద్గీత’, ‘స్వామి వివేకానంద’ చిత్రాల డీవీడీలను సిద్ధం చేసి, అందుబాటులోకి తేవాలనుకుంటున్నా.
 
అప్పట్లో ‘స్వామి వివేకానంద’ వివాదాస్పదం అయినట్లుంది!
అదేమీ లేదు. నేను ఆ చిత్రానికి నిర్మాతనే తప్ప, కథ వ్యవహారం నాకు తెలియదు. అయ్యర్ తను రాసుకున్న స్క్రిప్టును తాను అనుకున్న పద్ధతిలో తీశారు. అయితే, అందులో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని రామకృష్ణ మఠం వారన్నారు. దాంతో, ఆ సన్నివేశాలు తొలగించాం. అంతే!
 
అప్పట్లో హిందీ ‘రోటీ కపడా ఔర్ మకాన్’లో అమితాబ్ చేసిన అతిథి పాత్రకు తెలుగు ‘జీవన పోరాటం’లో రజనీకాంత్‌నెలా ఒప్పించారు?
అమితాబ్, రజనీకాంత్ నటించిన ‘అంధా కానూన్’ శతదినోత్సవం మా ‘మహేశ్వరి’లో జరిగింది. అప్పుడొచ్చిన రజనీకాంత్ ఆ హాలు, మా ఇల్లు, నాకున్న కళాభిరుచి చూసి, నిజంగా నాకు అభిమాని అయ్యాడు. అందుకే, అడగగానే ‘జీవనపోరాటం’లో అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు.
 
ఇలా పరిచయాలున్నా చిత్ర నిర్మాణంలో మమేకం కాలేదేం?
ఒక హాబీ కింద సినిమాలు తీశానే తప్ప, అది నా వృత్తి కాదు. కథ, ఆర్టిస్టుల ఎంపిక, పై పై పర్యవేక్షణే తప్ప షూటింగ్‌లకు కూడా తరచూ వెళ్ళేవాణ్ణి కాదు. ప్రతి సినిమాకూ ఒకరిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టేవాణ్ణి. వాళ్ళే అంతా చూసేవారు. అలా నాకున్న సరదా తీర్చుకున్నా.
 
మరి, ఎంతో నచ్చి సినిమాల్లోకి వచ్చిన మీరు 2000వ సంవత్సరం తర్వాత సినిమాలు తీయడం లేదేం? సరదా తీరిందనా? రిస్కు పెరిగిందనా?
సినిమా అంటే చాలా టైవ్‌ు వెచ్చించాలి. అంత సమయం వెచ్చిస్తూ, సినీ రంగానికే పరిమితం కావడం నాకిష్టం లేదు. అందుకే, సినిమాలు చూడడం, ఆస్వాదించడం, కళాకారులను అభినందించడమే తప్ప, తీయడం మానేశా. పైగా, సినీ రంగాన్ని ఒక్కదాన్నే నమ్ముకొంటే, వేరే రంగాల్లో కాన్సన్‌ట్రేట్ చెయ్యలేనుగా!

సినిమాలు... ఆధ్యాత్మికత..., రాజకీయాలు... వ్యాపారం, ఇవి కాక సభలు, డిన్నర్ పార్టీలు... మీదో విలక్షణ జీవితమేనే?!

అవును. నేను ఆల్‌రౌండ్ మ్యాన్‌ను. సినిమా స్టార్లనూ, ప్రముఖులనూ పిలిచి, ఓ స్థాయిలో విందు వినోదాలు ఏర్పాటు చేసి ఆతిథ్యం అందించడం నాకిష్టం.  
 
మీ వస్త్రధారణ కూడా విభిన్నంగా ఉంటుందేం?
(నవ్వేస్తూ...) నాకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకొనే లక్షణమే డ్రెస్సింగ్‌లోనూ పాటించా. ఈ స్టైల్ కూడా చాలా ఏళ్ళ క్రితం నేను డిజైన్ చేసుకున్నదే. ఈ చొక్కా మూడేళ్ళ క్రితం కుట్టించుకున్నది, ఈ కోటు అంతకన్నా పాతది. ఇక, కోటు పై జేబులోని ఈ రంగు కర్చీఫ్ అంటారా? అదో ప్రత్యేకత. అన్నట్లు ప్రధాని మోడీదీ, నాదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17నే. ఆయన పి.ఎం (ప్రైమ్ మినిస్టర్) అయితే, నేను ఎం.పి (మెంబర్ ఆఫ్ పార్లమెంట్). అంతే తేడా. (నవ్వులు...).
 
రాజకీయాల్లోకి వచ్చాక - ఇన్నేళ్ళలో మీరూ పెరిగారు. మీ వ్యాపారాలూ పెరిగాయి. మరి, ఇక్కడ మీరు సంపాదించింది ఎంత?
వ్యాపారవేత్తగా గౌరవ ప్రతిష్ఠలు కొంత వరకే! రాజకీయాల్లో ఉంటే, అధికార హోదా కూడా తోడై, ఒక్క ఫోన్ చేసి, ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేయించవచ్చు. ఇక్కడ నేను సంపాదించినది - డబ్బుకు అతీతమైన ఈ గౌరవాన్నే!
 
పోనీ, మీరు పోగొట్టుకున్నది ఎంత?
పోగొట్టుకున్నది... కంటి నిండా నిద్ర! రోజూ పద్ధెనిమిది గంటల పని వల్ల అయిదారు గంటలు మించి నిద్ర పోలేకపోతున్నా.
 
కానీ, మీరు గోరంత చేసి కొండంత ప్రచారం పొందుతారని మీపై విమర్శ!
జీవితంలో ఏమీ సాధించకుండా, ఏమీ చేయకుండానే ప్రచారం చేసుకునేవారు ఒక రకం. చేసినదాని గురించి నలుగురిలో ప్రచారం చేసుకొనేవారు రెండో రకం. నేను రెండో వర్గానికి చెందినవాణ్ణి. అవును, నేను ప్రచారం చేసుకుంటా. చేసిన మంచి పని నలుగురికీ చెబితే తప్పా? ఉదాహరణకు, విశాఖపట్నంలో ప్రసిద్ధ కె.జి. హాస్పిటల్‌కు వచ్చే రోగులు, వారి బంధువులు చెట్ల నీడనే ఇబ్బందులు పడడం చూసి, దాదాపు రూ. 4 కోట్లతో 200 పడకలు ఉండేలా సత్రం కట్టించా.
 
అది జనానికి తెలియాలంటే, వారు ఉపయోగించుకోవాలంటే ప్రచారం చేయాలి కదా! ప్రచారం చేయడం వల్ల నలుగురూ మెచ్చుకోవడంతో మన మనసుకు తృప్తి కలుగుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే కోరిక పుడుతుంది. మనకొస్తున్న మంచి పేరు చూసి, మరికొందరు స్ఫూర్తి పొంది, వాళ్ళూ అలా చేయడానికి ముందుకొస్తారు. ఇవేవీ పట్టించుకోకుండా, కేవలం ప్రచారమంటూ విమర్శించేవాళ్ళు నా దృష్టిలో అసూయాపరులు!
 

జాతీయ, ఫాల్కే అవార్డుల మొదలు ‘పద్మ’ పురస్కారాల దాకా చాలామందికి అవార్డులు రావడం వెనుక మీ కృషి ఉందని జనశ్రుతి.

అవును. అది నిజం. అన్ని రకాల అర్హతలూ ఉన్నప్పటికీ, ప్రతిభావంతులైన మన తెలుగువాళ్ళకు ఇలాంటి అవార్డుల విషయంలో ఢిల్లీలో న్యాయం జరగడం లేదు. అలాంటప్పుడు పలుకుబడిని ఉపయోగించి, ఫలానా తెలుగువాళ్ళు అర్హులని చెప్పాను. తప్పేముంది! అన్ని భాషల్లో సినిమాలు తీసిన గొప్ప నిర్మాత రామానాయుడుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా చేశా. అట్లానే, స్వయంకృషితో పైకొచ్చిన చిరంజీవికి పద్మభూషణ్ వచ్చేలా చేశా. హీరో కృష్ణ, గాయని పి. సుశీల, నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందాలకు పద్మ పురస్కారాలు వచ్చేలా చేశా. అక్కినేనికి పద్మవిభూషణ్ వచ్చేలా చేశా. అర్హతలు లేనివాళ్ళకు మనం అడగం. ఒకవేళ మనం అడిగినా సరే, వాళ్ళూ ఇవ్వరు. అర్హత ఉన్నప్పుడు చెబితే నేరమా? తెలుగువారికి గుర్తింపు విషయంలో ఢిల్లీ వాళ్ళు కళ్ళు మూసుకుంటే, వారిని నిద్ర లేపా!
 
మీకు ‘పద్మ’ రాలేదు. అడగలేదా, ఆశించలేదా?
(వెంటనే అందుకుంటూ...) అవి నాకెందుకండీ! సిసలైన కళాకారులకు అవి ఇవ్వాలి. ప్రజల ప్రశంసలే నాకు అవార్డు!


రిలేషన్‌షిప్‌లు పెంచుకోవడానికే విందులిస్తుంటారనీ మీపై మరో విమర్శ!
మనుషుల మధ్య అనుబంధం లేకపోతే ఎలా? ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఎంతో సేవ చేసి, రిటైరయ్యాడనుకోండి. ఆయన సేవకు గుర్తుగా ఒక విందు ఇచ్చి, అందరినీ పిలిచామనుకోండి. అతను ఎంత సంతోషపడతాడు! అందరి మధ్య ఎంత మంచి వాతావరణం వస్తుంది! అక్కడ ఎవరూ మనం పెట్టే భోజనం చేయడానికి రారు. కబుర్లు చెప్పుకొని, ఒక చక్కటి సోషల్ మైండ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారు. దాని వల్ల ఉత్సాహం వస్తుంది.
 
పార్టీ పెద్దల్ని ఇట్టే బుట్టలో వేసుకుంటారని టాక్!
(పెద్దగా నవ్వి...) నా దగ్గర బుట్టలేమీ లేవు. (గంభీరంగా) స్వయంకృషితో నేను పెకైదిగా కాబట్టే, ఎవరొచ్చినా నాతో స్నేహంగా ఉంటారు.
 
బర్‌‌తడే భారీగా చేయడం, లక్షల ఖర్చు అవసరమా?
పుట్టినరోజనేది ఒక పని మీద భగవంతుడు మనల్ని ఈ లోకానికి పంపించిన రోజు. ఆ రోజున దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని, అప్పటి వరకు మనం సాధించినది ఏమిటి, సాధించాల్సినది ఏమిటన్నది సింహావలోకనం చేసుకోవాలి. పైగా, పుట్టినరోజు నాడు నేనేమీ కేక్‌లు కట్ చేయను. అన్ని మతాల ఆధ్యాత్మికవేత్తలనూ పిలిచి, సత్కరించి, ఆశీస్సులు తీసుకుంటా. రెండో రోజున సీనియర్ కళాకారుల కృషికి గుర్తింపుగా, వారిని ఘనంగా సత్కరించి, కళారాధన చేస్తా. గొప్పవాళ్ళను సత్కరించడం వల్ల ప్రజలు సంతోషిస్తారు. వాళ్ళ మంచి మనసు, దీవెనల వల్ల నాకు శక్తి వస్తుంది.
 
మీ విజయం వెనక మీ శ్రీమతి ఇందిర పాత్ర...
ఇదంతా నా బాస్ (శ్రీమతి ఇందిర) చలవే! నేను ఏ పని చేసినా ఆమె అడ్డుచెప్పదు. ఇంత ఎందుకు ఖర్చు చేస్తున్నారని కానీ, ఎందుకు, ఏమిటని కానీ అడగదు. ఆమె నాకు దేవుడిచ్చిన వరం.

మీ మీద మీ అమ్మ గారి ప్రభావం ఎక్కువని విన్నాం...
అవును. నాకు ఇద్దరన్నయ్యలు, ఒక అక్క. మా అన్నయ్య చంద్రశేఖరరెడ్డి దగ్గరే నేను తొలి రోజుల్లో నిర్మాణ కాంట్రాక్టుల్లో ఓనమాలు నేర్చుకున్నా. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి మా అమ్మ రుక్మిణమ్మ కారణం. ‘జీవితంలో ఏదైనా సాధించాలన్న లక్ష్యం ఉండాలి... నలుగురిలోనూ పేరు నిలిచిపోయేలా కృషి చేయాలి’ అని ఆమె నూరిపోసేది. నా పురోగతికి నా మనసులో ముద్ర వేసిన ఆమె మాటలే కారణం.
 
రాజకీయాల్లో ఇప్పుడు మీకున్న ఆశలు, అంచనాలు...
రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పటికి 18 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా. ప్రస్తుత రాజ్యసభ సభ్యత్వ కాలం (ఆరేళ్ళు) ముగిసేసరికి 24 ఏళ్ళవుతుంది. ఆ తరువాత కూడా పార్లమెంట్ సభ్యుడినై, పాతికేళ్ళ పైగా ఎం.పి.గా ప్రజలకు సేవ చేశాననే తృప్తి పొందాలని ఉంది.
 
ఇంతకీ, మీకున్న అతి పెద్ద బలం ఏమిటి?
నా మనోబలం, ఈశ్వరశక్తి.

మరి, బలహీనత మాటేమిటో?
(నవ్వుతూ...) అందరినీ బాగా పొగుడుతాను. నన్ను ఎవరు పొగిడినా బాగా సంతోషిస్తాను. భోళా శంకరుడిలా అడిగిన వరాలు ఇచ్చేస్తా. అది నాకున్న పెద్ద బలహీనత. ఇన్నేళ్ళుగా దాని నుంచి బయటపడలేకపోయా (నవ్వులు...).
 
ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 17th Sept 2014, Wednesday)
...........................................

Friday, September 19, 2014

తొలి కన్నడ టాకీ... మలి తెలుగు టాకీల... మెట్లు కట్టిన సంగీత మేస్త్రీ - హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి



తొలి కన్నడ టాకీ... మలి తెలుగు టాకీల...మెట్లు కట్టిన సంగీత మేస్త్రీ
సందర్భం:సినీ సంగీత దర్శకుడు హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి శతజయంతి

 సినీ సంగీతదర్శకుడు హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రిని  చాలామంది కన్నడిగుడని పొరబడుతుంటారు. నిజానికి, ఆయన అచ్చ తెలుగువారు. వాళ్ల తాత, ముత్తాతలు కొన్ని తరాల ముందే బెంగళూరు శివార్లలోని హొసకోటె తరలివెళ్ళారు. పద్మనాభశాస్త్రిగారి తండ్రి రామశేషశాస్త్రి బెంగళూరులోని ప్యాలెస్‌లో అధికారి, ఆస్థాన జ్యోతిషులు. ఆయనకున్న తొమ్మిది మంది సంతానంలో నాలుగో బిడ్డ పద్మనాభశాస్త్రి. ఇప్పటికి సరిగ్గా నూరేళ్ళ క్రితం 1914 సెప్టెంబర్‌లో ఆయన జన్మించారు. భాద్రపద మాసంలో అనంత పద్మనాభ వ్రతం చేసుకొనే రోజునే పుట్టడంతో ఆయనకు పద్మనాభశాస్త్రి అని నామకరణం చేశారు. ఊరి పేరే ఇంటిపేరు కాగా, తండ్రి పేరును ముందు చేర్చుకొనే అలవాటుతో హొసకొటె రామశేష పద్మనాభశాస్త్రి అన్నది పూర్తి పేరైంది.  
 
 18 ఏళ్లకే సంగీతదర్శకత్వం: 


పదేళ్ళ వయసులోనే 1924లో బెంగుళూరు సుజన విలాస సభలో నటుడిగా వేదికనెక్కిన శాస్త్రి దాదాపు పదేళ్ళు ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’ (హెచ్.ఎం.వి) గ్రామఫోన్ కంపెనీలో సంగీత పరిచాలకుడిగా పనిచేశారు. తర్వాత బొంబాయికి చెందిన ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘సాగర్ మూవీటోన్’లో సంగీత దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ప్రవేశించారు.  ఆ సంస్థ తీసిన హిందుస్తానీ చిత్రాలు ‘బుల్‌బుల్-ఏ-బాగ్దాద్’, ‘జరీనా’, ‘మాయాబజార్’ (1932) టాకీలకు పనిచేశారు. తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6న రిలీజ్) స్ఫూర్తితో ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకము’(1932 డిసెంబర్ 24న రిలీజ్) తీశారు సాగర్ అధినేతలు. 18 ఏళ్ల వయసులోనే ఆ మలి తెలుగు టాకీతో సంగీత దర్శకుడయ్యారు శాస్త్రి. సాగర్ వారు తీసిన మరో టాకీ ‘శకుంతల’ (1933 మార్చి 25)కీ సంగీతం ఆయనదే. కన్నడంలో తొలి టాకీ ‘సతీ సులోచన’కు పాటలు స్వరపరిచింది కూడా ఆయనే.
 
 నౌషాద్ ముద్దాడిన ఆ చేయి: 


తొలి రోజుల్లో బొంబాయి, కలకత్తా, పుణే, కొల్హాపూర్‌లలో పనిచేసినప్పటికీ, ఉత్తరాదిన స్థిరపడేందుకు శాస్త్రి మొగ్గుచూపలేదు. సోదరుడి వరుసయ్యే  శాస్త్రవేత్త శ్రీనివాసమూర్తి ద్వారా సంగీతజ్ఞుడైన నౌషాద్‌ను కలిశారు. ఆ సందర్భంలో హార్మోనియమ్ మీద శాస్త్రి స్వరాలతో చేసిన సర్కస్ ఫీట్లు చూసి, నౌషాద్ స్వయంగా లేచివచ్చి, ఆయన చేతిని ముద్దాడి, ‘నా దగ్గరకు వచ్చేయ్. బొంబాయిలో స్థిరపడితే, మంచి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారట. కానీ, శాస్త్రి తల్లితండ్రుల్ని వదిలి, అక్కడ స్థిరపడడానికి ఇష్టపడలేదు.
 
 దర్శక - నటుడు వై.వి. రావు, నటి కన్నాంబల కోరిక మేరకు వారి చిత్రాలకు స్వరసారథ్యంతో మద్రాసులోనే శాస్త్రి స్థిరపడ్డారు. తరచూ బెంగళూరు వెళ్ళి వస్తూ, ఎక్కువ కన్నడ చిత్రాలకూ పనిచేశారు. 1930ల ప్రథమార్ధం నుంచి 1950ల ప్రథమార్ధం దాకా పద్మనాభశాస్త్రి సంగీత దర్శకుడిగా తెలుగు, కన్నడ, తమిళ సీమల్లో మెరిశారు. తెలుగులో ‘చిత్రనళీయం’ (1938), ‘రాధాకృష్ణ’ మొదలు, ‘తాసిల్దార్’, ‘సుమతి’, ‘పేదరైతు’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘నాగపంచమి’ తదితర చిత్రాలకు సంగీతం శాస్త్రిదే.
 
 తెలుగు ‘తాసిల్దార్’ (’44)తో ఏడేళ్ళ జమునారాణినీ, తమిళ ‘కంకణం’ (’46)తో పదమూడేళ్ళ పి.లీలనూ గాయనులుగా వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.మహదేవన్ దగ్గర: కొంతకాలం గడిచాక, అవకాశాలు తగ్గి, నిర్మాతలు కొందరు పారితోషికం విషయంలో మోసం చేయడంతో శాస్త్రి కొంత ఒడుదొడుకులకు లోనయ్యారు. నాగయ్య, ఓగిరాల, అశ్వత్థామలతో కలసి సంగీతం అందించిన ‘భక్త రామదాసు’ (1964) ఆయన ఆఖరి చిత్రం. ఓడలు బళ్ళయినప్పటికీ, నైతిక ధైర్యంతో, చేతిలో ఉన్న విద్యనే నమ్ముకొని, సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ పిలుపుతో, ఆయన దగ్గర వాద్యబృందంలో ఒకరుగా పనిచేశారు. అలా చివరి రోజుల వరకు మహదేవన్ వద్దే సంగీత విభాగంలో పని చేస్తూ వచ్చారు శాస్త్రి.
 
 ఫొటోగ్రఫీ హాబీ: 


యువ సంగీత దర్శకుడిగా తొలినాళ్ళలో ఫుల్ బ్లేజర్ సూట్లతో, అప్పటి కాలానికి ఆధునికంగా, రెండు కార్లతో దర్జాగా తొలి రోజులు గడిపిన శాస్త్రి అద్భుతంగా కారు నడిపేవారట. అలాగే, ఫొటోగ్రఫీ ఆయనకు పెద్ద హాబీ. హార్మోనియమ్ మీద శాస్త్రికి ఎంత పట్టు అంటే, పెండ్యాల మాస్టారు లాంటి మహా మహా సంగీత దర్శకులకు సైతం అందులోని సూక్ష్మమైన మెలకువలు చెప్పేవారట. శాస్త్రి మధుమేహం కారణంగా వీపు మీద వచ్చిన రాచకురుపుతో అవస్థపడుతూ, సరిగ్గా తాను పుట్టిన అనంత పద్మనాభ స్వామి వ్రతదినానే 1970 సెప్టెంబర్ 14 సాయంత్రం 7 గంటల వేళ మద్రాసులో కన్నుమూశారు.
 
 శాస్త్రి సంతానం అందరికీ సంగీతంలో ప్రవేశం ఉంది. ముఖ్యంగా మగపిల్లలు అయిదుగురూ సినిమా సంగీత రంగంలో ఉండటం విశేషం. శాస్త్రి కుటుంబసభ్యులు ఏటా ‘హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి అవార్డ్ ఫర్ ఆర్ట్స్’ పేరిట ప్రముఖ కర్ణాటక, సీనియర్ సినీ సంగీత కళాకారులకు అవార్డులిస్తూ, సన్మానిస్తున్నారు. వెరసి, ఇప్పటికి నూరేళ్ళ క్రితం అంకురించిన ఓ సంగీత బీజం వటవృక్షమై, శాఖోపశాఖలుగా విస్తరించి, శతవసంతాల తరువాత కూడా వసివాడని స్వరరాగాలను పుష్పించడం, ఫలించడం ఆనందదాయకం.
 
 ‘‘అప్పట్లో మా కుటుంబాల్లో మడి, ఆచారం ఎక్కువే. అయితే, మా తాతగారు రాజ దర్బారులో ఉండడంతో, మా నాన్నగారిని బెంగళూరులో ఇంగ్లీషు స్కూల్‌లో చదివించారట. నాన్నగారు అద్భుతమైన ఇంగ్లీషు రాసేవారు, మాట్లాడేవారు. చక్కటి వ్యాకరణబద్ధంగా ఇంగ్లీషులో ఉత్తరాలు రాసేవారు’’ - హెచ్.పి.రామమూర్తి (పద్మనాభశాస్త్రి పెద్ద కుమారుడు, సినీ సంగీత రంగంలో సీనియర్ తబలా వాద్యకళాకారుడు )
 
 - రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 14th Sept 2014, Sunday)
............................................

చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడం నా దురదృష్టం! - శ్రీమతి పద్మావతీ ఆత్రేయ


ఆచార్య ఆత్రేయ 25వ వర్ధంతి
చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడంనా దురదృష్టం!   - శ్రీమతి పద్మావతీ ఆత్రేయ

నేడు ఆచార్య ఆత్రేయ 25వ వర్ధంతి

మన‘సు’ కవి ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ప్రపంచవ్యాప్తంగా ఏ కవీ రాయలేదు. ఆయన రాసిన 1400 సినిమా పాటలలో సుమారు నూరు మనసు పాటలున్నాయి!
కానీ నిజ జీవితంలో ఆయన ‘మనసు’లేని వాడని కొందరి అభియోగం!
నిజం చెపితే - ఆత్రేయ మనసు మూగది; మాటలు రానిది!
ఆత్రేయ అర్ధాంగి శ్రీమతి పద్మావతి మనసు గొప్పది; మమత మాత్రమే తెలిసినది!
దంపతులిద్దరూ మనస్కులే అయినా - ‘వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశ్రుతి?
అది ఎలాగైనది విషాద గీతి?’ అని ఆత్రేయ రాసినట్టు వారి ‘సంసార వీణ’లో అపశ్రుతులు దొర్లడం విధివిలాసమంటారు ఇద్దరూ! ఈ అనుబంధంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని... ఆత్రేయకు చరమాంకంలో ఆయనకు సన్నిహితునిగానే కాక,
తన అభిమాన పుత్రునిగా భావించే పైడిపాల ముందు మనసు విప్పి వెల్లడించిన శ్రీమతి పద్మావతి అంతరంగ ఆవిష్కరణం ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

 
నమస్కారం అమ్మా! మీ ఆరోగ్యం ఎలా ఉంది?

పద్మావతి: ఆరోగ్యం ఏమాత్రం బావుండలేదు. నాకిప్పుడు 86 ఏళ్లు. సరిగ్గా కనిపించడం లేదు, వినిపించడం లేదు.  ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరు పాడులో మా మరిదిగారైన వింజమూరి వెంకటేశ్వర్లు గారింట్లో ఉంటున్నా.

మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. గుర్తుపడతారా లేదా అనుకున్నాను.

మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం, మర్చిపోవడం ఉండదు. మీతో పాటు మురారి, జగ్గయ్యగార్లను కూడా మర్చిపోలేను. ఆత్రేయ అసలు భార్య పేరు పద్మావతి అని, ఆమె బతికే ఉందని లోకానికి తొలిసారిగా చాటిచెప్పిన మీ ‘మనస్వినీ ట్రస్టు’ను ఎలా మర్చిపోగలను? 1990లో ఆత్రేయగారి పుట్టినరోజున (మే 7వ తేదీ) మద్రాసులో జరిగిన ‘ఆత్రేయ సాహితి’ ఆవిష్కరణ సభలో నన్ను స్టేజీ మీదకు పిలిచి సన్మానించి, ‘ఆత్రేయ సాహితి’ మొదటి ప్రతిని నాకు అందించారు కదా.

ఆత్రేయ గారి అసలు పేరు....????

ఆత్రేయగారి అసలు పేరు కూడా ఉచ్చూరి కిళాంబి వేంకట నరసింహాచార్యులే! ఆయన తర్వాత ఉచ్చూరు అనే ఊరి పేరును తీసేశారు. అసలు పేరు ఆచార్యను మాత్రం ముందు తెచ్చుకుని, గోత్ర నామాన్ని కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అనే కలం పేరు పెట్టుకున్నారు.

ఆయన మీకు పెళ్లికి ముందే తెలుసా? మీకు బంధుత్వముందా?

వాళ్ల అయ్య శ్రీకృష్ణమాచార్యులు నాకు వరుసకు మేనమామ. మాది ముందు నుంచీ అనుకొన్న సంబంధమే. మా ఇద్దరికీ వయసులో ఆరేళ్ల తేడా. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో నా పుస్తకాలకు అట్టలు వేసిపెట్టడం, తెల్ల కాగితాల మీద రూళ్లు గీసిపెట్టడం ఆయనే చేసేవారు.

మీది మొదటినుంచీ అనుకున్న మేనరికమే అయితే, ఆయన పద్యాల్లో రాసుకొన్న ఆత్మకథలోని ‘తొలిగాయం’లో ‘బాణ’మనే ప్రియురాల్ని సగోత్రం కారణంగా పెళ్లిచేసుకోలేకపోయానని బాధపడుతూ రాశారే?

అది నిజమే. ఆయన స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో ‘బాణ’మనే అమ్మాయిని ప్రేమించారు. బాణమనేది ఆమె ముద్దు పేరు. ఆమె పేరు కూడా పద్మావతే. ఆయన జీవితంలో ముగ్గురు పద్మలున్నారు. ప్రేమించిన పద్మ సగోత్రం కారణంగా మా మావగారు అభ్యంతరం చెప్పడం వల్ల దూరమయ్యింది. పెళ్లాడిన పద్మను నేను. నేను కూడా కారణాంతరాల వల్ల ఎక్కువ కాలం ఆయనకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. మూడో పద్మ నెల్లూరులో టైఫాయిడ్ జ్వరం వల్ల హాస్పిటల్‌లో చేరినప్పుడు ఆయనకు సేవ చేసిన నర్సు. వృత్తి ధర్మమైన విధి నిర్వహణగా కాక, వ్యక్తిగతంగా తనను అభిమానించి, సేవ చేసి బతికించిందని ఆత్రేయ ఆమెను చాలా మెచ్చుకొనేవారు. ఆ తర్వాత ఆమెకు కంచి బదిలీ అయితే కూడా, అప్పుడప్పుడూ వెళ్లి చూసి వస్తుండేవారు. ఆ పద్మ అకాల మరణానికి ఆయన ఎంతో బాధపడ్డారు.

నర్స్ పద్మ గురించి మీరు చెప్పడం తప్ప, ఎవరికీ తెలియదు. కాని బాణం మాత్రం తన మనసుకు తొలిగాయం చేసి దూరమైందని అందరితో చెప్పుకునేవారట! వీణ వాయించడంలో నేర్పరి అయిన బాణానికి వేరొకరితో వివాహమైన తర్వాత ‘వీణ’ ప్రసక్తి వస్తే చాలు, బోరుమని ఏడ్చేవారని, ఆయన సినిమాల్లో అన్ని వీణ పాటలు రాయడానికి బాణం జ్ఞాపకాలే కారణమని చెపుతారు. మరి బాణాన్ని అంతగా ప్రేమించారని తెలిసి కూడా ఆత్రేయతో పెళ్లికి మీరెందుకు తలూపారు?

ప్రేమ వేరు, పెళ్లి వేరు. టీనేజ్‌లో సర్వసాధారణమైన ప్రేమను తర్వాత మర్చిపోవడం సహజమనే అభిప్రాయంతో పెద్దలు మా పెళ్లి కుదిర్చారు. ఏమాటకామాట... నేను కూడా ఆత్రేయ గారిని చూసి ఇష్టపడ్డాను. అయినా మా అయ్యను పెళ్లికొడుకు అభిప్రాయం కూడా తెలుసుకోమన్నాను. మా అయ్య ఆ విషయం అడగటానికి ఆత్రేయ ఉంటున్న వాళ్ల మేనమామ జగన్నాథాచార్యుల గారింటికి వెళ్తే, ఆత్రేయ కనపడి ‘మీరొచ్చిన విషయం నాకు తెలుసు. పద్మతో పెళ్లి నాకిష్టమే’ అని చెప్పారట. అలా ఉభయుల అంగీకారంతో నా 13వ యేట 1940లో మా పెళ్లి జరిగింది. చెప్పడం మర్చిపోయాను. ‘శారదా యాక్టు’ వల్ల మా పెళ్లి కొంత కాలం వాయిదా పడింది కూడా.

మీ పెళ్లికి ఆత్రేయగారి తరఫున పెద్దగా వ్యవహరించింది ఆయన తండ్రి కాకుండా మేనమామగారన్నమాట. తండ్రితో ఆత్రేయకు అంత సత్సంబంధాలు లేవా?

లేకేం? ఆయన మీద గౌరవంతోనే బాణాన్ని పెళ్లి చేసుకోవడం మానుకొన్నారు. ఎటొచ్చీ తల్లి సీతమ్మ అనారోగ్యంగా ఉండగా, ఆయన అంతగా పట్టించుకోలేదని కోపం. తన చిన్నతనంలో తల్లికి దాయాదులు విషప్రయోగం చేసి చంపేశారని ఆత్రేయ అపోహ. ఆయనకు తల్లంటే అపరిమితమైన ఇష్టం. తల్లి దూరమైన ఊరు అనే ద్వేషంతోనే ఆయన ఉచ్చూరును విడిచిపెట్టి మేనమామ జగన్నాథాచార్యులగారి నీడన చేరారు.

తల్లి మీద ప్రేమతో ఆత్రేయ అద్భుతమైన అమ్మ పాటల్ని రాశారు. ‘కలసిన మనసులు’, ‘పాపం పసివాడు’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’ మొదలైన చిత్రాల్లో ఆయన ‘అమ్మ’ మీద ఆణిముత్యాల్లాంటి పాటల్ని రాశారు.ఈ తరహా పాటలన్నింటికీ జ్ఞాపకాలే కారణమా? 

ఆయన స్వభావమే అంత! ఒక్క అమ్మనే కాదు - ఎవర్ని అభిమానించినా మర్చిపోలేననేవారు. పెళ్లయిన తర్వాత కూడా బాణాన్ని గుర్తుచేసుకోవడం వల్లనే మామధ్య పెళ్లయిన కొత్తలో స్పర్థలు కూడా వచ్చాయి.

పెళ్లప్పటికి ఆయన ఏం చేస్తుండేవారు?

ఆయన చినమామ జగన్నాథాచార్యులుగారు చిత్తూరులో మేజిస్ట్రేట్‌గా పని చేసేవారు. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తిరుత్తణి సెటిల్‌మెంట్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం వేయించారు. నెలకు 40 రూ జీతం. పెళ్లయిన కొన్నాళ్లకు ఉద్యోగం వదిలేసి, నాటకాల వ్యాపకంతో తిరిగేవారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తే, మామ భార్య రహస్యంగా అన్నంపెట్టేది. ఇలా నాటకాల వాళ్లతో తిరిగి చెడిపోతారని వాళ్ల మామ బలవంతంగా చిత్తూరు టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చేర్పించారు. ట్రైనింగ్‌లో ఉంటూ కూడా నాటకాల పిచ్చితో ఓసారి గోడ దూకి పారిపోయారట! ఆ తర్వాత నెల్లూరు మున్సిఫ్ కోర్టులో కొంతకాలం, ‘జమీన్ రైతు’ పత్రికలో కొంతకాలం పనిచేశారు. ‘స్వర్గ సీమ’ చిత్రం గురించి అన్ని పత్రికల్లోనూ పొగుడుతూ సమీక్షలు రాస్తే, ఈయన మాత్రం ఆ చిత్రం బాగాలేదని రాశారట! దాంతో పత్రికల వాళ్లు కోప్పడితే, ఆ ఉద్యోగం కూడా వదిలేశారు. అలా ఏ ఉద్యోగంలోనూ ఇమడలేకపోవడం ఆత్రేయగారి తత్త్వం!

జగన్నాథాచార్యులుగారి కుమార్తె వివాహం మద్రాసులో మీ ఇంట్లో ఆత్రేయగారే ఘనంగా జరిపించారని, ఆ సందర్భంగా రాసిన కొన్ని పాటలు ఆ తర్వాత సినిమాల్లో పాటలుగా రూపుదిద్దుకున్నాయని గతంలో మీ ఉత్తరంలో నాకు తెలియజేశారు. మళ్లీ ఓసారి చెబుతారా?

ఆ అమ్మాయి పెళ్లి సందర్భంగా రాసిన, ఓ పాటనే ‘సుమంగళి’ సినిమా కోసం తమిళ బాణీ ఆధారంగా మార్చి ‘కొత్త పెళ్లికూతురా రారా, నీ కుడికాలు ముందు మోపి రారా’ అని రాశారు. అలాగే, ‘పెళ్లంటే పందిళ్లు సందళ్లు...’ అనే ‘త్రిశూలం’ చిత్రంలోని పాట కూడా అప్పుడు రాసిందే!

‘కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడి చాన..’ అనే ‘తోడికోడళ్లు’ చిత్రంలోని పాట గురించి కూడా ఎవరూ నమ్మలేని ఓ నేపథ్యాన్ని చెప్పారు. అది మీ మాటల్లో మళ్లీ వినాలనుంది...

ఆత్రేయ నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ పొట్ట పోషించుకోవడం కోసం చిరుద్యోగాలు చేసే కాలంలో, నెల్లూరులోని ‘కస్తూరిబా’ బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు నాటకాలు నేర్పేవారు. ఆ సందర్భంగా శ్రీమంతులైన రెడ్ల పిల్లలు జట్కాల మీద, కార్ల మీద స్కూలుకి రావడం చూసి వాళ్ల దర్జాను, తన అవస్థను తల్చుకుని ఈ పాట రాశారట! దీనిని మొదట ‘సంసారం’ చిత్రంలో పెడదామనుకొని, తర్వాత ‘తోడి కోడళ్లు’లో ఉపయోగించారు.

ఆత్రేయగారికి మీరెలా దూరమయ్యారు? అన్ని సినిమాలకు రాసి సంపాదించిందంతా ఆత్రేయ ఏం చేశారు? మీకు మద్రాసులో సొంత ఇల్లు ఉండేది కదా!

నిజానికి మీరడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి నా దగ్గర కాని, ఆయన దగ్గర కాని సరైన జవాబులు ఉండవు. ఆయన సినిమా ఫీల్డ్‌కి వెళ్లిన తర్వాత, కొన్ని సమస్యల్లో ఇరుక్కొని కాపురం పెట్టలేదు. కొంతకాలం పుల్లయ్యగారి ఆఫీసులో ఒక్కరే ఉన్నారు. 1954లో నన్ను మద్రాసు తీసుకెళ్లారు. ఆళ్వారుపేటలో చిన్న ఇంట్లో కాపురం. చుట్టూ పల్లెవాళ్లతో వాతావరణం ఇబ్బందికరంగా ఉండేది. అయినా ఎలాగో భరించి సహించేదాన్ని. ఆయన రోజూ ఇంటికొచ్చేవారు కాదు. అప్పుడప్పుడూ మాత్రమే వచ్చేవారు. ఇంటి యజమానులకు సకాలంలో బాడుగ కూడా చెల్లించేవారు కాదు. మీరన్నట్టు యాభైలలో అంత సంపాదన ఉండి మాకా దరిద్రం ఎందుకో నాకర్థమయ్యేది కాదు. ఇదిలా ఉండగా, 1956లో మా అమ్మకు కాళ్లు చచ్చుపడిన కారణంగా, నేను మంగళంపాడు వెళ్లి వచ్చేసరికి పరిస్థితులు మారి, ఆయన నాకు కాకుండా పోయారు.

సారీ, మీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ మిమ్మల్ని నొప్పిస్తున్నాను. ఆ తర్వాత ఆయన ‘నల్ల కమల’ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారని, ఆమె ఇద్దరు కూతుళ్లనూ చివరి వరకూ తన పిల్లలుగా భావించి, పెళ్లిళ్ల బాధ్యతను కూడా ఆయనే తీసుకొన్నారని మద్రాసులో ఆత్రేయ కుటుంబం గురించి చెప్పుకునేవారు. అవన్నీ నిజాలా?

ఆయన నల్ల కమలను చేరదీసిన మాట నిజం. అయితే, ఆమెను పెళ్లి మాత్రం చేసుకోలేదు. సహజీవనం చేశారు... అంతే! ఆత్రేయ కూతుళ్లుగా చెలామణీ అయినవాళ్లు, కమల అక్కగారి సంతానం. ఆవిడ 1978లో చనిపోయింది. అప్పుడు ఆత్రేయ భార్య చనిపోయిందని, అసలు భార్య ఎప్పుడో తెరమరుగైపోయిందని అందరూ అనుకొన్నారట! ఆ కుటుంబ భారం మీద పడేసరికి ఆయన సంపాదన, సొంత ఇల్లు... అన్నీ హరించుకుపోయాయి.

జరిగిన అన్యాయానికి ఆత్రేయగారి పట్ల కోపం లేదా?

లేవు. ఆయన దుర్మార్గుడు కాదు. నన్ను ఆయనెప్పుడూ ద్వేషించలేదు, దూషించలేదు. నా గురించి చాలా బాధపడేవారు. నా జీవితాన్ని పాడుచేశాను అని పశ్చాత్తాపపడేవారు. ఊబిలో దిగాను, పైకి రాలేకపోతున్నాననేవారు. విధి మమ్మల్ని దూరం చేసింది. అంతే!

ఆత్రేయగారితో ముడిపడి, ఇలా దగా పడినందుకు సహధర్మచారిణిగా మీరేమనుకుంటున్నారు?

(కళ్లొత్తుకొంటూ) ఆత్రేయ అంతటి కవికి భార్యనైనందుకు గర్విస్తాను. ఆత్రేయుడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడం నా దురదృష్టంగా భావిస్తాను.

చివరిగా ఈ వృద్ధాప్యంలో మీ జీవితాన్ని గురించి మీకేమనిపిస్తోంది?

ఆ మహానుభావుడే చెప్పినట్టు -
పోయినోళ్లందరూ మంచోళ్లు ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు! అని!
- డా॥పైడిపాల
paidipala_p@yahoo.com


నీ పరిశోధన పూర్తయ్యేనాటికి చచ్చిపోతాను..!

ఆత్రేయ సంపూర్ణ రచనలపై పీహెచ్‌డీ పట్టా కోసం పైడిపాల మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేద్దామని వెళ్లారు. కాని అప్పుడు ఆ విశ్వవిద్యాలయంలో ‘సజీవులైన వ్యక్తుల మీద పరిశోధన చేయకూడద’నే ఆంక్ష ఉండటం వల్ల, పైడిపాల పరిశోధనాంశాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆ సందర్భంగా ఆత్రేయ ‘నేను సగం చచ్చే ఉన్నాను. నీ పరిశోధన పూర్తయ్యేనాటికి చచ్చిపోతాను. ఈ విషయం మీ యూనివర్సిటీవారికి చెప్పి, నా రచనల మీద నీ పరిశోధన కొనసాగించు’ అన్నారు. ‘పరిశోధన మీవంటి కవులను బతికించడానికి తప్ప, చంపడానికి కాదు’ అని జవాబిచ్చారు. కానీ ఆ ఏడే (89) సెప్టెంబర్ 13న ఆత్రేయ కన్నుమూశారు.
................................................
.....................................