జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, September 5, 2014

మళ్లీ అదే ఫార్ములా! (సినిమా రివ్యూ - రభస)

 ...................................
 చిత్రం - రభస, తారాగణం - జూనియర్ ఎన్టీఆర్, సమంత, ప్రణీత, శాయాజీ షిండే, జయప్రకాశ్‌రెడ్డి, సంగీతం - ఎస్.ఎస్. థమన్, కెమేరా - శ్యామ్ కె. నాయుడు, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత - బెల్లంకొండ గణేశ్‌బాబు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం - సంతోష్ శ్రీన్‌వాస్
 ....................................

 ఎంచుకున్న కథ ఎలాంటిదైనా, దాన్ని చెప్పడంలో, చెప్పి ఒప్పించడంలో మెప్పించగలిగితే అది విజయం. వెండితెర మీద చూపే కథలకు అది మరీ ముఖ్యం. ఆ ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే... ఫలితం తేడాగా ఉంటుంది. ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్ శ్రీన్‌వాస్ తన రెండో ప్రయత్నంగా చిన్న ఎన్టీఆర్‌తో రూపొందించిన ‘రభస’కు అదే ఇబ్బంది వచ్చింది. 

 కథ ఏమిటంటే...

 అమెరికాలో చదువుకొని, ఊరికి తిరిగొచ్చిన కుర్రాడు కార్తీక్ (చిన్న ఎన్టీఆర్). అతని మేనత్త చనిపోతున్నప్పుడు ఆమె కూతురినే తన కోడల్ని చేసుకుంటానంటూ హీరో తల్లి (జయసుధ) మాట ఇస్తుంది. తీరా పాతికేళ్ళ తరువాత ఆ పెళ్ళికి పిల్ల తండ్రి ధనుంజయ్ (సాయాజీ షిండే) అడ్డం తిరుగుతాడు. అప్పుడు అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టడానికి ఆ మరదలు (సమంత)ను వెతుక్కుంటూ హీరో వెళతాడు. ఆ క్రమంలో అతనికి ఎదురైన సంఘటనలు, తన వల్ల ఆగిన పెళ్ళిళ్ళు - కష్టపడ్డ కుటుంబాలకు హీరో ఏం చేశాడు, అన్నీ ఎటెటు తిరిగి చివరకు ‘హ్యాపీ ఎండ్’ దిశగా సాగాయన్నది మిగతా సినిమా.  

 ఎలా నటించారంటే...

 కార్తీక్ పాత్రలోని సవాలక్ష లోపాలను చిన్న ఎన్టీఆర్ తన పాత్రపోషణతో కవర్ చేయడానికి చాలానే శ్రమించారు. హాస్యం, వీరం, సెంటిమెంట్ లాంటి విభిన్న రసాలను ఒప్పించడానికి ప్రయత్నించారు. వేటికవి ఫరవాలేదనిపించినా, ఆ సన్నివేశాలేవీ ఆ పాత్రను ఎలివేట్ చేయలేదు. కథను ఒప్పించలేదు. సమంత పోషించిన ఇందు పాత్రకు ప్రేమ విషయంలో ఉన్న అభిప్రాయాలు, అవీ ఎప్పటికప్పుడు మారిపోతుండే తీరు ఓ పట్టాన అర్థం కావు. సినిమాకు రెండో హీరోయిన్ అనిపించే ప్రణీత పాత్ర ఫస్టాఫ్‌లో కొద్దిసేపు కనిపించి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోతుంది.  అరుపులు, కేకల సొంత డబ్బింగ్‌తో సాయాజీ షిండే యాక్షన్ రొటీన్. జయప్రకాశ్‌రెడ్డి, నాగినీడు ఓ.కె. బ్రహ్మానందం కామెడీ కాసేపు నవ్విస్తుంది. అలీ కనిపించేది కాసేపే. ఇక, జయసుధకు సినిమా మొత్తం మీద రెండు, మూడు డైలాగులైనా లేవంటే ఆశ్చర్యమే. 

 ఎలా ఉందంటే...

 ఇప్పటికే అనేక సినిమాల్లో చూపించేసిన పెద్దింట్లో పెళ్ళి వాతావరణం నేపథ్యంలో సాగే ‘కామెడీ ఆఫ్ ఎర్రర్స్’ ఫార్ములానే ఈ సినిమాలోనూ యథాతథంగా అనుసరించారు. కానీ, సెకండాఫ్‌లో వచ్చే ఈ ఘట్టం బ్రహ్మానందం పుణ్యమా అని కాసేపు నవ్వించినా, ఇక ఆ తరువాత టీవీ సీరియల్ ఫక్కీలో మైండ్ వాయిస్‌లు, ఎంతకీ తెగని ఘట్టాలతో బోరెత్తించేస్తుంది. 

  ఫస్టాఫ్‌లో అమ్మకిచ్చిన మాట కోసం ప్రేమను వెతుక్కుంటూ, దాన్ని సాధించడం కోసం వెళ్ళడం హీరో లక్ష్యం. తీరా సెకండాఫ్‌లో హీరో లక్ష్యమే మారిపోతుంది. సినిమా సెకండాఫ్ అంతా... కన్నతల్లికి ఇచ్చిన మాట కన్నా, మరో ఇద్దరు తల్లుల కన్నీళ్ళు తుడవడం, తన ప్రేమను గెలిపించుకోవడం కన్నా మరొకరి ప్రేమకు సాయపడి, వారి ఆప్యాయతను పొందడమనే ప్రధాన అంశం చుట్టూ కథ, చిత్ర హీరో పాత్ర నడుస్తాయి. దాంతో, ఆ పాత్ర లక్ష్యం, లక్షణాలతో ప్రేక్షకులు లీనం కాలేకపోతారు. అది ఈ కథలో ప్రధాన లోపం. పోనీ కథనమైనా ఆసక్తిగా ఉందా అంటే, అదీ లేదు. సినిమా మొదలైన కాసేపటికే జరగబోయే కథ స్థూలంగా తెలిసిపోతుంది. దాన్ని జీడిపా...కంలా సాగదీశారు. రాసుకున్న ప్రతి సీన్ మీద ప్రేమతో దర్శకుడు కాదన్నాడో, మరే కారణమో తెలీదు కానీ, ఎడిటింగ్ కత్తెర మొద్దుబారిందన్న సంగతి తెరపై తెలుస్తుంటుంది. 

  విషాదం ఏమిటంటే, సంగీతం, యాక్షన్ లాంటి సాంకేతిక విభాగాల పని తీరు కూడా ఈ సినిమాలో అంతంత మాత్రమే. మోటారు వాహనాలు, వాటి టైర్లు, మనుషులు అంతెత్తున గాలిలోకి ఎగిరిపోయినట్లు, హీరో ఒంటి చేతితో ఎంతటి వాళ్ళనైనా ఎత్తి కుదేసినట్లు చూపించిన ఫైట్లు కలిగించే థ్రిల్ తక్కువే. పైగా, అవేవీ కాస్తంతయినా నమ్మేలా లేవు. వెంకటేశ్వరస్వామి గుడి ప్రాంగణంలో నంది విగ్రహం (!) చెవిలో హీరోయిన్ తన కోరిక చెప్పడం, హీరోకు విలన్ ఎవరో తెలుసు కానీ, అతని కూతురైన తన మరదలు ముఖమైనా తెలియదన్నట్లు ఫస్టాఫ్ నడపడం లాంటి చిత్రవిచిత్రాలు వెతికితే రీలు రీలుకూ కనిపిస్తాయి. వెరసి, ఈ చిత్ర కథను మూడు ముక్కల్లో చెప్పడం కష్టం. అనేక మలుపులుండడం స్క్రిప్టుకు బలమని దర్శకుడు అనుకున్నారేమో కానీ, అవి అర్థంపర్థం లేనివి కావడంతో, బలం కాకపోగా గుదిబండలయ్యాయి. ‘రెడీ’, ‘బృందావనం’, ‘దమ్ము’ లాంటి అనేక చిత్రాల ఈ రీమిక్స్ ‘రభస’ తెరపై భరించడం కష్టమే. 

 ..............................................................
 బలాలు - 

1. చిన్న ఎన్టీఆర్ చలాకీదనం, నృత్యాలు 2. కష్టపడి కాసేపు నవ్వించే బ్రహ్మానందం 3. గ్లామర్ దుస్తుల్లో సమంత నర్తించిన మాస్ పాట. 4. సన్నివేశాలను అందంగా, రిచ్‌గా చూపిన ఛాయాగ్రహణం
 ..............................................................

 బలహీనతలు - 

1. కథ, కథనం, వాటిలోని గందరగోళాలు 2. సెకండాఫ్‌లో సహనాన్ని పరీక్షిస్తూ పాటలు వచ్చిన సమయం, సందర్భాలు 3. ఎడిటింగ్, దర్శకత్వం 4. మితిమీరిన యాక్షన్ 5. అనుభవజ్ఞులైన నటీనటులున్నా, చాలామందిని సింగిల్ డైలాగ్ ఆర్టిస్టుల్లా వాడుకోవడం
 ...............................................................

- రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 31st Aug 2014, Sunday)
................................


0 వ్యాఖ్యలు: