జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, September 22, 2014

బాల్యం మర్చిపోని మనిషి... తాపీ ధర్మారావు (by ఆఖరు మనుమరాలు సుజాతా షా)

నేడు తాపీ ధర్మారావు జయంతి

బాల్యం మర్చిపోని మనిషి...

సాహిత్యం, సినిమా, పత్రికలు, అధ్యాపకత్వం - ఇన్ని రంగాల్లో ఏకకాలంలో కృషి చేసిన అభ్యుదయవాది అంటే ‘ఆంధ్ర విశారద’ తాపీ ధర్మారావు పేరే గుర్తొస్తుంది.
 127 ఏళ్ల క్రితం జన్మించిన ఈ ‘తాతాజీ’ తన కాలానికి కన్నా ముందు ఆలోచనలతో వర్ణాంతర వివాహాలు, దండల పెళ్లిళ్లకు అప్పట్లోనే పురోహితుడు.
ఈ మానవతావాదిని అతి దగ్గర నుంచి చూసిన ఆఖరు మనుమరాలు్ర శీమతి సుజాతా షా. స్వయంగా కవయిత్రి, అధ్యాపకురాలైన ఆమె మాటల్లో...
ఆ వ్యావహారిక భాషా విప్లవమూర్తి  జ్ఞాపకాల్లోకి ప్రయాణం...

 
తాపీ ధర్మారావు ‘మీ తాతయ్యట కదా’ అని ఎవరైనా అనగానే ఒక్కసారిగా యాభై ఎనిమిదేళ్ళు వెనక్కి, నా చిన్నతనానికి వెళ్ళిపోతాను. మనుమరాళ్ళలో అందరి కన్నా చిన్నదాన్ని నేను. తాతయ్యకు ముగ్గురబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు. పెద్దబ్బాయి - మా నాన్న, ప్రముఖ జర్నలిస్టు తాపీ మోహనరావు. ఆఖరబ్బాయి - దర్శకుడు చాణక్య బాబాయి.
 
నిజం చెప్పాలంటే, మా లాంటి వాళ్ళం ఆయనను తాతయ్యగానే ఎక్కువ చూశాం. కానీ, ఆయన పోయిన తరువాత రచయితగా, సినీకవిగా, పరిశోధకుడిగా ఆయన గురించి నలుగురూ చెబుతూ ఉంటే, అప్పుడు తెలిసింది - ఎంత గొప్పమనిషితో మేమింత కాలం కలసి గడిపామో అని! చిన్నప్పుడు ఆర్థికంగా చాలా కష్టపడి, ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, క్రమంగా యెదిగిన తాతయ్య బయట ప్రపంచంలో ఎంతో ప్రముఖులైనా ఇంట్లో మామూలు గృహస్థులా పిల్లల పట్ల అక్కరతో ఉండేవారు. మద్రాస్, ఆ తరువాత హైదరాబాద్‌ల నుంచి తాతయ్య విజయవాడలో నాన్న దగ్గరకెప్పుడొచ్చినా మాకు పండగే. పడక్కుర్చీలో పడుకొని కాళ్ళ మీద చిన్నదాన్నైననన్ను ఊపుతూ ఆయన చెప్పిన సంగతులు ఇంకా జ్ఞాపకం.
 
పిల్లల చదువు, పెళ్ళిళ్ళ విషయంలో తాతయ్య చాలా స్వేచ్ఛనిచ్చేవారు. నాకు లెక్కలంటే భయమని నా పరీక్షల రోజుల్లో ప్రత్యేకంగా వచ్చి, నాకు పాఠాలు చెప్పేవారు. అలాగే, మేము వారం వారం ఆయనకు ఉత్తరాలు రాయాల్సిందే. కార్డు మీద ఒకవైపు యోగక్షేమాలు, మరోవైపు చిట్టి కవితలు రాసి పంపేదాన్ని. వాటికి ఆయన ఇచ్చే జవాబులు, ప్రోత్సాహం తమాషాగా ఉండేవి. ఉత్తరాలు రాకపోతే, ఆయనే టెలిగ్రావ్‌ు ఇచ్చేసేవారు. ఒకసారి స్కూల్లో హంపీ విహార యాత్ర వెళ్ళి వచ్చాక, ఉగ్ర నరసింహమూర్తి అంటూ నేను కవిత రాశా. అందులోని ‘చరాచర జీవకోటి’ లాంటి మాటలు విని, బాగుందంటూనే, ఇంకా తేలిక మాటల్లో రాయాలనడం ఇప్పటికీ గుర్తు.
 
జన వ్యవహారంలో...: ఆ మాటకొస్తే పత్రికల్లో వ్యావహారిక భాషా వాదానికి కూడా ఆయన పెద్ద అండ. 1930 జూన్‌లో జస్టిస్ పార్టీ వారి పత్రిక ‘సమదర్శిని’లో సంపాదకులుగా, 1935-’36లో గూడవల్లి రామబ్రహ్మం సారథ్యంలోని ‘ప్రజామిత్ర’ పత్రికలో రచయితగా, 1936లో పిఠాపురం రాజా పీపుల్స్ పార్టీ పక్షాన నెలకొల్పిన ‘జనవాణి’కి ఎడిటర్‌గా పత్రికా రంగానికి తాతయ్య చేసిన సేవ, పెట్టిన ఒరవడి ఇవాళ్టికీ చెప్పుకుంటారు. ముందు వీర గ్రాంథికవాదైనా, గిడుగు వారి ప్రభావంతో తర్వాత వ్యావహారికానికి తాతయ్య పట్టం కట్టారు. ‘కొత్త పాళీ’ పట్టారు.
 
ఆచరణలోనూ అభ్యుదయం...: నిత్యం నేర్చుకోవాలనే తపన జీవితాంతం కొనసాగిన జిజ్ఞాసువు తాతయ్య. అందుకే, మా నాన్న గారి కమ్యూనిస్టు భావాల ప్రభావాన్నీ సంతోషంగా ఇముడ్చుకొన్నారు. పార్టీలో సభ్యులుగా నాన్న,‘ప్రజానాట్యమండలి’ బుర్రకథ కళాకారిణిగా అమ్మ రాజమ్మల వర్ణాంతర వివాహాన్ని స్వాగతించారు. ఇంటా, బయటా అభ్యుదయ మార్గంలో దండల పెళ్ళిళ్ళెన్నింటికో పౌరోహిత్యం వహించారు. అభ్యుదయ రచయితల సంఘం తొలి మహాసభలకూ ఆయనే అధ్యక్షుడు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖులు చంద్రం లాంటి వారందరితో తాతయ్యకు బాగా స్నేహం. ‘విశాలాంధ్ర’కు పేరు పెట్టి, దాన్ని ప్రారంభించిందీ ఆయనే. రాంభట్ల, బిరుదురాజు రామరాజు, సెట్టి ఈశ్వరరావు, డాక్టర్ చిట్టూరి ఆయనకు బాగా దగ్గర!
 
ఇంటి పేరు... మనిషి తీరు...: మా ఇంటి పేరుకూ కథ ఉందని చెప్పేవాళ్ళు తాతయ్య. మా పూర్వీకుల ఇంటి పేరు బండి వారో, బండారు వారోనట! సైన్యంలో సిపాయిలుగా ఉంటూ, సైన్యం నుంచి విడుదలై వచ్చాక ఏదో పని చేసుకొనేవారట. మా తాతయ్యకు ముత్తాత లక్ష్మయ్య వాళ్ళ ఊళ్ళో (శ్రీకాకుళం) తాపీ పనిలో బాగా పేరు తెచ్చుకున్నారట. కొడుకూ, కూతురూ చనిపోవడంతో తన దగ్గర పెరుగుతున్న మనుమణ్ణి లక్ష్మయ్య బడిలో వేసినప్పుడు ‘తాపీ లక్ష్మయ్య మనుమడు అప్పన్న’ అని రాశారట. అలా మా ఇంటి పేరు ‘తాపీ’ అయింది. సినీ రచన విషయంలో తాతయ్య అక్షరాలా తాపీగానే పనిచేసేవారట.


ఇంటిపేరుకు తగ్గట్లే రచనల్లో తాపీతనం, జాప్యం మాటెలా ఉన్నా, తాతయ్య రచన కోసం దర్శక, నిర్మాతలు ఇంటికొచ్చిన సందర్భాలు నాకు గుర్తు. సినీ రచయితగా ఆయన తొలిచిత్రం ‘మోహినీ రుక్మాంగద’ (1937). ఆ పౌరాణిక చిత్రంలో ఆయన వ్యావహారిక భాషలో డైలాగులు రాయడం అప్పట్లో చర్చనీయాంశం. ‘మాలపిల్ల’, ‘రోజులు మారాయి’ చిత్రాల రచనల్లో ఆయన అభ్యుదయ భావాలు చూడవచ్చు. ఇక ఎన్టీఆర్ ‘భీష్మ’ (1962) ఆయన పూర్తి స్థాయిలో రచన చేసిన చివరి చిత్రం. అయితే, ‘మదర్ ఇండియా’ని నటి జమునతో ‘బంగారు తల్లి’ (1971)గా రూపొందించినప్పుడు పద్యం లాంటి చిన్న పాటను తాతయ్యతో బలవంతాన రాయించారు దర్శకుడైన మా చాణక్య బాబాయ్. తాతయ్య ఆఖరి సినీ రచన అది.
 
సంపాదకీయాలు ఇవాళ్టికీ...: తాతయ్య ప్రసిద్ధ రచనలు ‘పెళ్ళి - దాని పుట్టుపూర్వోత్తరాలు’, ‘దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?’ లాంటివన్నీ పలు ముద్రణలు పొందాయి. అప్పటి ప్రసిద్ధ వేగుచుక్క గ్రంథమాల కోసం ఆయన రాసిన స్వభావ పరిశోధనాత్మక నవల ‘క్రొవ్వురాళ్ళు’ తాతయ్య బతికున్నప్పుడే వేరొక పబ్లిషర్ చేతుల్లో పడి కనిపించకుండా పోయింది. కానీ, అప్పట్లో తాతయ్య స్వయంగా దిద్దుకున్న ప్రూఫు కాపీ నా దగ్గర సగం దొరికింది. అలాగే, తాతయ్య జీవితం - రచనల మీద పరిశోధన చేసిన సాహితీవేత్త ఏటుకూరి ప్రసాద్ మిగతాది కష్టపడి సంపాదించారు. అలా అది ఈ మధ్య మళ్ళీ తాతయ్య పేరు మీద పాఠకలోకం ముందుకొచ్చింది. ఇక, తాతయ్య ఎడిటోరియల్స్, వ్యాసాలు, పాటలను పుస్తకంగా తేవాలని ప్రయత్నం.
 
మరపురాని జ్ఞాపకం...: ఆఖరు వరకు బాల్యం మర్చిపోని మనిషి ఆయన. చెప్పిందే చేస్తూ, చేసేదే చెబుతూ బతికిన ఆయన మాట్లాడు తుంటే, మెరిసే ఆ కళ్ళు ఇవాళ్టికీ నాకు గుర్తే. బొమ్మలు గీయడం, కవితలు రాయడం, ఉపాధ్యాయ వృత్తి లాంటి నా లక్షణాలకు తాతయ్య జీన్సే కారణమనిపిస్తుంటుంది. రెండేళ్ళ క్రితం తాతయ్య 125వ జయంతి సంవత్సరం సందర్భంగా విజయవాడ పుస్తక మహోత్సవ ప్రాంగణంలో వేదికకు ఆయన పేరు పెట్టారు. తాతయ్య గురించి నేను మాట్లాడితే, దూరం నుంచి మైకులో నా మాటలు విన్న ఒక ఎన్నారై కుర్రాడు దగ్గరకొచ్చి సమాజం, భాష, పెళ్ళి లాంటి వాటి గురించి కొన్ని దశాబ్దాల క్రితమే తాతయ్య వెలిబుచ్చిన అభిప్రాయాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటూ, అప్పటికప్పుడు ఆయన రచనలన్నీ కొనుక్కొని వెళ్ళడం తాతయ్య భావాలు నవ తరానికి కూడా ప్రేరణనిస్తున్నాయనడానికి ఋజువు!
 
సంభాషణ: రెంటాల జయదేవ


(Published in 'Sakshi' Telugu daily, 19th Sept 2014, Friday)
.................................. 

0 వ్యాఖ్యలు: