సందేశం
హిందూ మతం ఔన్నత్యాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడానికి స్వామి వివేకానంద తొలిసారిగా విదేశీయానానికి బయలుదేరినప్పటి సంగతి ఇది. చేపట్టిన ఆ బృహత్ కార్యానికి స్వామి వివేకానంద అన్ని విధాలా సరిపోయినవాడా, కాదా అన్నది తెలుసుకోవాలని ఆయన తల్లి భువనేశ్వరీ దేవి భావించింది. ఆ సంగతి తెలుసుకొనేందుకు ఆయనను రాత్రి విందుకు పిలిచింది.
గుండెలోని ప్రేమను రంగరించి మరీ తల్లి చేసిన వంటకాలను స్వామీజీ తృప్తిగా తిన్నారు. భోజనం పూర్తి అయిన తరువాత ఓ గిన్నె నిండా పండ్లు పెట్టి, వాటిని కోసుకొని తినేందుకు ఓ చాకు ఇచ్చిందా తల్లి. వివేకానంద ఓ పండును కోసుకొని, తినసాగారు. అప్పుడు ఆమె, ‘‘నాయనా... నాకు కొద్దిగా పని ఉంది. ఆ కత్తి ఇస్తావా?’’ అని అడిగింది. వివేకానంద వెంటనే ఆ చాకును తల్లికి ఇచ్చారు.
వెంటనే ఆమె మరోమాట లేకుండా, ‘‘నాయనా... నువ్వు నా పరీక్షలో నెగ్గావు. దిగ్విజయంగా విదేశీయాత్ర జరుపుకొని రా... ఇవే నా ఆశీస్సులు’’ అంది. దాంతో వివేకానంద ఆశ్చర్యంతో ‘‘అమ్మా.. నన్నెలా పరీక్షించావు? నాకు అర్థం కాలేదు’’ అన్నారు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది... ‘‘నాయనా... కత్తి ఇవ్వమని అడిగినప్పుడు నువ్వు ఆ కత్తి మొనను పుచ్చుకొని, చెక్క పిడి ఉన్న వైపును నాకు అందించావు. అలా కత్తిని పట్టుకొనేటప్పుడు నాకు హాని కలగకుండా, దెబ్బ తగలకుండా ఉండేలా జాగ్రత్తపడ్డావు. అలా నా సంరక్షణ బాధ్యత తీసుకున్నావు.
ఎవరైతే తమ స్వార్థం గురించి ఆలోచించుకోకుండా, ఇలా ఇతరుల సంక్షేమం గురించి తపిస్తారో వారే ప్రపంచానికి బోధలు చేయడానికి అర్హులు. ఆ హక్కు వారికే ఉంటుంది. అదే నేను నీకు పెట్టిన పరీక్ష. నువ్వు నా పరీక్షలో నెగ్గావు. నీకు నా ఆశీస్సులు. దిగ్విజయోస్తు.’’ స్వార్థం మానుకొని, పొరుగువారి సంక్షేమానికి తోడ్పడాలన్న ఈ కీలకమైన సందేశాన్ని ఆ తరువాత స్వామి వివేకానంద తన జీవితకాలంలో కలిసిన లక్షల మంది హృదయాల్లో నాటుకొనేలా చేశారు. ఓ మామూలు మనిషికీ, అసాధారణ వ్యక్తికీ లక్షణాల్లో ఉండే ప్రధానమైన తేడా ఈ సంక్షేమ భావనే. నిత్యజీవితంలో కూడా ఇతరుల ఆనందం గురించి ఆలోచించేవాడే అసలు సిసలు గొప్పవాడు.
- రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 19th Sept 2014, Friday)
....................................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment