జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Sunday, September 14, 2014

యే దిల్ మాంగే మోర్! ( సినిమా రివ్యూ - మేరీ కోమ్)

 .........................................................
 చిత్రం - మేరీ కోమ్, తారాగణం - ప్రియాంకా చోప్రా, దర్శన్ కుమార్, సునీల్ థాపా, పాటలు - ప్రశాంత్ ఇంగోల్, సంగీతం - శశి, శివమ్, నేపథ్య సంగీతం - రోహిత్ కులకర్ణి, నిర్మాతలు - వయా కామ్ 18 పిక్చర్స్, సంజయ్ లీలా భన్సాలీ, దర్శకత్వం - ఒముంగ్ కుమార్
 .........................................................

 రోజూ రొడ్డకొట్టుడు వాణిజ్య ఫార్ములా చిత్రాలు చూసీ చూసీ విసిగిపోతున్న వారికి అప్పుడప్పుడూ సేద తీర్చే సినీ ప్రయత్నాలు ఎదురవుతుంటాయి. హిందీలో ఇటీవల అలాంటి చిత్రాలు కాస్తంత క్రమం తప్పకుండా థియేటర్లలో పలకరిస్తూనే ఉన్నాయి. తాజాగా ‘మేరీ కోమ్’ కూడా అలాంటి సినిమానే. ఇప్పటికి అయిదుసార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచి, రెండేళ్ళ క్రితం లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మన దేశానికి కాంస్య పతకం సాధించి, ‘పద్మభూషణ్’ అందుకొని, ఇప్పటికీ పోటీ బరిలో మన కళ్ళ ముందున్న భారతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్ జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తీశారు. అలా సమకాలీనురాలైన సజీవ వ్యక్తి ‘జీవిత కథా చిత్రం’ (బయోపిక్)గా కూడా ఈ సినిమా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ‘భాగ్ మిల్ఖా భాగ్’ లాగా ఇటు క్రీడానేపథ్యం, అటు జీవితకథ - రెండూ కలవడం ఈ సినిమాకు సానుకూల అంశం.

 కథ ఏమిటంటే...

  దేశంలో తీవ్రవాద ప్రభావిత ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్‌లోని కాంగథేయ్ అనే కుగ్రామంలో కథ మొదలవుతుంది. ఆ గ్రామంలో అతి సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి - మాంగ్తే చుంగ్‌నెజాంగ్ (ప్రియాంకా చోప్రా). ఆమె తండ్రి ఒకప్పుడు మల్లయోధుడు. దిగువ మధ్యతరగతి కుటుంబమైనా, అమ్మాయిని మంచి అథ్లెట్‌ను చేయాలనుకుంటాడు ఆ తండ్రి. కానీ, ఆగ్రహంతో, జీవితంలో ఎదురైన సంఘటనల పట్ల ఆక్రోశంతో వ్యవహరించే ఆ అమ్మాయి బాక్సర్ కావాలని అనుకుంటుంది. దగ్గరలోని కోచ్ నార్జిత్ సింగ్ (సునీల్ థాపా) ప్రోత్సాహంతో మేరీ కోమ్ అనే పేరుతో ముందడుగు వేస్తుంది. ఆ క్రమంలో ఫుట్‌బాల్ ఆటగాడ ఓన్లెర్ (దర్శన్ కుమార్) అండగా నిలుస్తాడు. మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో నెగ్గిన ఆ అమ్మాయి జీవితం అతనితో పెళ్ళయ్యాక ఏమైంది? ఒకపక్క ప్రేమ, పెళ్ళి, కుటుంబ జీవితం, మరోపక్క కెరీర్ - వీటి మధ్య ఆమె అనుభవించిన మానసిక సంఘర్షణ ఏ తీరాలకు చేర్చిందన్నది మిగతా సినిమా. 

 ఎలా నటించారంటే...

 ఈ సినిమాలో ప్రధానంగా కనిపించేవి - హీరోయిన్, ఆమె ప్రియుడు, కోచ్ మాత్రమే. మూడే పాత్రలతో రెండు గంటల పైగా సినిమా పట్ల ఆసక్తిని నిలపడం తేలిక కాదు. అయినా పాత్రధారులు తమ నటనతో తెరపై దృశ్యాల పట్ల ఆసక్తి ఆద్యంతం కొనసాగేలా చూశారు. సినిమా చూస్తున్నంత సేపు ప్రియాంకా చోప్రాలో ఆమెను కాక మేరీ కోమ్ పాత్రనే చూస్తాం. దాన్నిబట్టి, ఆ పాత్రపోషణకు ఆమె ఎంతగా ప్రాణం పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే, కోచ్‌గా సునీల్ థాపా, అలాగే మేరీ కోమ్ తండ్రి పాత్రధారి రాబిన్‌దాస్ కొన్నిచోట్ల చిన్న చిన్న హావభావాలతోనే లోతైన అర్థాన్ని చూపారు. సాంకేతిక విభాగాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది - నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్. ‘దిల్ యే జిద్దీ హై’ పాట, ద్వితీయార్ధంలో మేరీ కోమ్ పాత్ర సాధన సమయంలో వచ్చే పాట ఉత్తేజకరంగా సాగుతాయి. 

 ఎలా ఉందంటే...

 హిందీ చిత్రాల్లో ఇటీవల ‘భాగ్ మిల్ఖా భాగ్’ (అథ్లెట్ మిల్ఖాసింగ్ మీద), ‘పాన్‌సింగ్ తోమర్’ (స్వాతంత్య్ర సమరయోధుడు పాన్‌సింగ్ మీద) లాంటి సినిమాలు వచ్చాయి. విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్య ఆదరణ కూడా పొందాయి. ఆ కోవలోదే - తాజా ‘మేరీ కోమ్’ కూడా! అథ్లెట్ అశ్వినీ నాచప్ప జీవిత కథను కొంత ఆధారం చేసుకొని, ఆమెనే నటింపజేస్తూ, తెలుగులో చాలా ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ‘అశ్విని’. ఆ తరం ప్రేక్షకులకు ఈ ‘మేరీ కోమ్’ చూస్తున్నప్పుడల్లా ఆ సినిమా కొంత గుర్తొస్తే ఆశ్చర్యం లేదు. ఇలాంటి ‘జీవిత కథా చిత్రాల’ను (బయో పిక్స్) రూపొందిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పనిసరి. జరిగిన కథనే యథాతథంగా తీయాలని ప్రయత్నిస్తే, తెరపై సన్నివేశం పండదు. సన్నివేశాల్లో మెలోడ్రామా కోసం చూస్తే, జీవిత కథలోని వాస్తవాలకు దూరమవుతాం. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ, సమతూకంతో వ్యవహరించడం కత్తి మీద సామే. ఆ ఇబ్బందే ‘మేరీ కోమ్’ లోనూ కనపడుతుంది. 

  ఆర్ట్ డెరైక్టర్ అయిన ఒముంగ్ కుమార్‌కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. చిత్ర నిర్మాత సంజయ్ లీలా భన్సాలీయే క్రియేటివ్ క్రియేటివ్ డెరైక్టర్‌గా, ఎడిటర్లలో ఒకరుగా వ్యవహరించిన ఈ చిత్రంలో అక్కడక్కడ ఆయన ముద్ర కనిపించినా, స్క్రీన్‌ప్లే ఒకే పంథాలో, సులభంగా ఊహించే పద్ధతిలో ఉండడం కొంత ఇబ్బందికరమే. ప్రథమార్ధం కొంత నిదానంగా నడుస్తుంది. ద్వితీయార్ధం కొంత వేగం పుంజుకుంది. అలాగే, అప్పటి దాకా హీరోయిన్‌ను వేధించిన బాక్సింగ్ ఫెడరేషన్ కీలక బాధ్యుడు శర్మాజీ ఆఖరులో ఒక్కసారిగా మనసెందుకు మార్చుకున్నాడో తెలియదు. అప్పటి దాకా నాయిక కెరీరే ప్రధానంగా భావించిన భర్త తీరా కీలకమైన మ్యాచ్ ముందు ఆమెకు ఫోన్ చేసి, కష్టనష్టాలు ఏకరవు పెట్టడం సబబుగా లేదు. ఇక, చివరలో బాక్సింగ్ మ్యాచ్ హంగామా ఉండనే ఉండగా, దానికి హాస్పిటల్ హడావిడిని అతికించాల్సిన పనీ లేదు. 

ఏమైనా, తండ్రితో వాదన, తొలిసారి ప్రపంచ ఛాంపియన్ కావడం, గర్భవతిగా ఉన్నప్పుడు మేరీ కోమ్ పాత్ర మెడలో పతకాలు వేసుకొని ఫోటో తీయించుకోవడం లాంటి కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుల కళ్ళతో పాటు మనసూ చెమరుస్తుంది. సమాజంలో ఒక స్త్రీ పడే ఆవేదన, అలాగే విజయం వెనుక ఉండే ఎన్నో కష్టాలు, అవమానాలు, త్యాగాలు, మణిపూర్ లాంటి ప్రాంతాలు - ప్రజలను ఇప్పటికీ భారత్‌లో మమేకం కానివ్వని పరిస్థితులు - ఇలా ఎన్నో అంశాలు ప్రేక్షకుల మదిలో మెదులుతాయి.మొత్తం చూసిన తరువాత బయటకు వస్తూ, మంచి ప్రయత్నమని అభినందిస్తారు. అయితే, అదే సమయంలో ఇంకా ఎంతో చెప్పాల్సిందని కూడా భావిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఈ సినిమాకే కాక, ఇలాంటి కథాంశాలతో వచ్చే చిత్రాలకూ కలిపి జనవాక్యం - ‘యే దిల్ మాంగే మోర్’! 

- రెంటాల జయదేవ

 .....................................................
 బలాలు - 

1. పాత్రలో ప్రియాంకా చోప్రా పరకాయప్రవేశం 2. ఉన్నపాత్రలు కొద్దే అయినా, అందరూ బాగా నటించడం 3. కొన్నిచోట్ల ఆలోచనలోకి నెట్టిన మాటలు 4. ‘దిల్ యే జిద్దీ హై’ లాంటి ఒకటి రెండు పాటలు 5. ఛాయాగ్రహణం, శబ్ద గ్రహణం
 .............................

 బలహీనతలు - 

1. కొన్ని వర్గాలనే ఆకర్షించే కథ 2. నిదానంగా సాగే కథనం 3. నడుస్తున్న చరిత్ర కావడంతో సినిమా అర్ధంతరంగా ముగిసిన భావన కలగడం
 ....................................

(Published in 'Sakshi' daily, 6th Sept 2014, Saturday)
............................................................

0 వ్యాఖ్యలు: