చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడంనా దురదృష్టం! - శ్రీమతి పద్మావతీ ఆత్రేయ
నేడు ఆచార్య ఆత్రేయ 25వ వర్ధంతి
మన‘సు’ కవి ఆత్రేయ రాసినన్ని మనసు పాటలు ప్రపంచవ్యాప్తంగా ఏ కవీ రాయలేదు. ఆయన రాసిన 1400 సినిమా పాటలలో సుమారు నూరు మనసు పాటలున్నాయి!
కానీ నిజ జీవితంలో ఆయన ‘మనసు’లేని వాడని కొందరి అభియోగం!
నిజం చెపితే - ఆత్రేయ మనసు మూగది; మాటలు రానిది!
ఆత్రేయ అర్ధాంగి శ్రీమతి పద్మావతి మనసు గొప్పది; మమత మాత్రమే తెలిసినది!
దంపతులిద్దరూ మనస్కులే అయినా - ‘వీణలోనా తీగలోనా ఎక్కడున్నది అపశ్రుతి?
అది ఎలాగైనది విషాద గీతి?’ అని ఆత్రేయ రాసినట్టు వారి ‘సంసార వీణ’లో అపశ్రుతులు దొర్లడం విధివిలాసమంటారు ఇద్దరూ! ఈ అనుబంధంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాల్ని... ఆత్రేయకు చరమాంకంలో ఆయనకు సన్నిహితునిగానే కాక,
తన అభిమాన పుత్రునిగా భావించే పైడిపాల ముందు మనసు విప్పి వెల్లడించిన శ్రీమతి పద్మావతి అంతరంగ ఆవిష్కరణం ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...
నమస్కారం అమ్మా! మీ ఆరోగ్యం ఎలా ఉంది?
పద్మావతి: ఆరోగ్యం ఏమాత్రం బావుండలేదు. నాకిప్పుడు 86 ఏళ్లు. సరిగ్గా కనిపించడం లేదు, వినిపించడం లేదు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరు పాడులో మా మరిదిగారైన వింజమూరి వెంకటేశ్వర్లు గారింట్లో ఉంటున్నా.
మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. గుర్తుపడతారా లేదా అనుకున్నాను.
మిమ్మల్ని గుర్తుపట్టకపోవడం, మర్చిపోవడం ఉండదు. మీతో పాటు మురారి, జగ్గయ్యగార్లను కూడా మర్చిపోలేను. ఆత్రేయ అసలు భార్య పేరు పద్మావతి అని, ఆమె బతికే ఉందని లోకానికి తొలిసారిగా చాటిచెప్పిన మీ ‘మనస్వినీ ట్రస్టు’ను ఎలా మర్చిపోగలను? 1990లో ఆత్రేయగారి పుట్టినరోజున (మే 7వ తేదీ) మద్రాసులో జరిగిన ‘ఆత్రేయ సాహితి’ ఆవిష్కరణ సభలో నన్ను స్టేజీ మీదకు పిలిచి సన్మానించి, ‘ఆత్రేయ సాహితి’ మొదటి ప్రతిని నాకు అందించారు కదా.
ఆత్రేయ గారి అసలు పేరు....????
ఆత్రేయగారి అసలు పేరు కూడా ఉచ్చూరి కిళాంబి వేంకట నరసింహాచార్యులే! ఆయన తర్వాత ఉచ్చూరు అనే ఊరి పేరును తీసేశారు. అసలు పేరు ఆచార్యను మాత్రం ముందు తెచ్చుకుని, గోత్ర నామాన్ని కలుపుకొని ‘ఆచార్య ఆత్రేయ’ అనే కలం పేరు పెట్టుకున్నారు.
ఆయన మీకు పెళ్లికి ముందే తెలుసా? మీకు బంధుత్వముందా?
వాళ్ల అయ్య శ్రీకృష్ణమాచార్యులు నాకు వరుసకు మేనమామ. మాది ముందు నుంచీ అనుకొన్న సంబంధమే. మా ఇద్దరికీ వయసులో ఆరేళ్ల తేడా. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో నా పుస్తకాలకు అట్టలు వేసిపెట్టడం, తెల్ల కాగితాల మీద రూళ్లు గీసిపెట్టడం ఆయనే చేసేవారు.
మీది మొదటినుంచీ అనుకున్న మేనరికమే అయితే, ఆయన పద్యాల్లో రాసుకొన్న ఆత్మకథలోని ‘తొలిగాయం’లో ‘బాణ’మనే ప్రియురాల్ని సగోత్రం కారణంగా పెళ్లిచేసుకోలేకపోయానని బాధపడుతూ రాశారే?
అది నిజమే. ఆయన స్కూల్ ఫైనల్ చదివే రోజుల్లో ‘బాణ’మనే అమ్మాయిని ప్రేమించారు. బాణమనేది ఆమె ముద్దు పేరు. ఆమె పేరు కూడా పద్మావతే. ఆయన జీవితంలో ముగ్గురు పద్మలున్నారు. ప్రేమించిన పద్మ సగోత్రం కారణంగా మా మావగారు అభ్యంతరం చెప్పడం వల్ల దూరమయ్యింది. పెళ్లాడిన పద్మను నేను. నేను కూడా కారణాంతరాల వల్ల ఎక్కువ కాలం ఆయనకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. మూడో పద్మ నెల్లూరులో టైఫాయిడ్ జ్వరం వల్ల హాస్పిటల్‌లో చేరినప్పుడు ఆయనకు సేవ చేసిన నర్సు. వృత్తి ధర్మమైన విధి నిర్వహణగా కాక, వ్యక్తిగతంగా తనను అభిమానించి, సేవ చేసి బతికించిందని ఆత్రేయ ఆమెను చాలా మెచ్చుకొనేవారు. ఆ తర్వాత ఆమెకు కంచి బదిలీ అయితే కూడా, అప్పుడప్పుడూ వెళ్లి చూసి వస్తుండేవారు. ఆ పద్మ అకాల మరణానికి ఆయన ఎంతో బాధపడ్డారు.
నర్స్ పద్మ గురించి మీరు చెప్పడం తప్ప, ఎవరికీ తెలియదు. కాని బాణం మాత్రం తన మనసుకు తొలిగాయం చేసి దూరమైందని అందరితో చెప్పుకునేవారట! వీణ వాయించడంలో నేర్పరి అయిన బాణానికి వేరొకరితో వివాహమైన తర్వాత ‘వీణ’ ప్రసక్తి వస్తే చాలు, బోరుమని ఏడ్చేవారని, ఆయన సినిమాల్లో అన్ని వీణ పాటలు రాయడానికి బాణం జ్ఞాపకాలే కారణమని చెపుతారు. మరి బాణాన్ని అంతగా ప్రేమించారని తెలిసి కూడా ఆత్రేయతో పెళ్లికి మీరెందుకు తలూపారు?
ప్రేమ వేరు, పెళ్లి వేరు. టీనేజ్‌లో సర్వసాధారణమైన ప్రేమను తర్వాత మర్చిపోవడం సహజమనే అభిప్రాయంతో పెద్దలు మా పెళ్లి కుదిర్చారు. ఏమాటకామాట... నేను కూడా ఆత్రేయ గారిని చూసి ఇష్టపడ్డాను. అయినా మా అయ్యను పెళ్లికొడుకు అభిప్రాయం కూడా తెలుసుకోమన్నాను. మా అయ్య ఆ విషయం అడగటానికి ఆత్రేయ ఉంటున్న వాళ్ల మేనమామ జగన్నాథాచార్యుల గారింటికి వెళ్తే, ఆత్రేయ కనపడి ‘మీరొచ్చిన విషయం నాకు తెలుసు. పద్మతో పెళ్లి నాకిష్టమే’ అని చెప్పారట. అలా ఉభయుల అంగీకారంతో నా 13వ యేట 1940లో మా పెళ్లి జరిగింది. చెప్పడం మర్చిపోయాను. ‘శారదా యాక్టు’ వల్ల మా పెళ్లి కొంత కాలం వాయిదా పడింది కూడా.
మీ పెళ్లికి ఆత్రేయగారి తరఫున పెద్దగా వ్యవహరించింది ఆయన తండ్రి కాకుండా మేనమామగారన్నమాట. తండ్రితో ఆత్రేయకు అంత సత్సంబంధాలు లేవా?
లేకేం? ఆయన మీద గౌరవంతోనే బాణాన్ని పెళ్లి చేసుకోవడం మానుకొన్నారు. ఎటొచ్చీ తల్లి సీతమ్మ అనారోగ్యంగా ఉండగా, ఆయన అంతగా పట్టించుకోలేదని కోపం. తన చిన్నతనంలో తల్లికి దాయాదులు విషప్రయోగం చేసి చంపేశారని ఆత్రేయ అపోహ. ఆయనకు తల్లంటే అపరిమితమైన ఇష్టం. తల్లి దూరమైన ఊరు అనే ద్వేషంతోనే ఆయన ఉచ్చూరును విడిచిపెట్టి మేనమామ జగన్నాథాచార్యులగారి నీడన చేరారు.
తల్లి మీద ప్రేమతో ఆత్రేయ అద్భుతమైన అమ్మ పాటల్ని రాశారు. ‘కలసిన మనసులు’, ‘పాపం పసివాడు’, ‘రామ్ రాబర్ట్ రహీమ్’ మొదలైన చిత్రాల్లో ఆయన ‘అమ్మ’ మీద ఆణిముత్యాల్లాంటి పాటల్ని రాశారు.ఈ తరహా పాటలన్నింటికీ జ్ఞాపకాలే కారణమా?
ఆయన స్వభావమే అంత! ఒక్క అమ్మనే కాదు - ఎవర్ని అభిమానించినా మర్చిపోలేననేవారు. పెళ్లయిన తర్వాత కూడా బాణాన్ని గుర్తుచేసుకోవడం వల్లనే మామధ్య పెళ్లయిన కొత్తలో స్పర్థలు కూడా వచ్చాయి.
పెళ్లప్పటికి ఆయన ఏం చేస్తుండేవారు?
ఆయన చినమామ జగన్నాథాచార్యులుగారు చిత్తూరులో మేజిస్ట్రేట్‌గా పని చేసేవారు. ఆయన తన పలుకుబడిని ఉపయోగించి తిరుత్తణి సెటిల్‌మెంట్ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం వేయించారు. నెలకు 40 రూ జీతం. పెళ్లయిన కొన్నాళ్లకు ఉద్యోగం వదిలేసి, నాటకాల వ్యాపకంతో తిరిగేవారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత వస్తే, మామ భార్య రహస్యంగా అన్నంపెట్టేది. ఇలా నాటకాల వాళ్లతో తిరిగి చెడిపోతారని వాళ్ల మామ బలవంతంగా చిత్తూరు టీచర్స్ ట్రైనింగ్ స్కూల్లో చేర్పించారు. ట్రైనింగ్‌లో ఉంటూ కూడా నాటకాల పిచ్చితో ఓసారి గోడ దూకి పారిపోయారట! ఆ తర్వాత నెల్లూరు మున్సిఫ్ కోర్టులో కొంతకాలం, ‘జమీన్ రైతు’ పత్రికలో కొంతకాలం పనిచేశారు. ‘స్వర్గ సీమ’ చిత్రం గురించి అన్ని పత్రికల్లోనూ పొగుడుతూ సమీక్షలు రాస్తే, ఈయన మాత్రం ఆ చిత్రం బాగాలేదని రాశారట! దాంతో పత్రికల వాళ్లు కోప్పడితే, ఆ ఉద్యోగం కూడా వదిలేశారు. అలా ఏ ఉద్యోగంలోనూ ఇమడలేకపోవడం ఆత్రేయగారి తత్త్వం!
జగన్నాథాచార్యులుగారి కుమార్తె వివాహం మద్రాసులో మీ ఇంట్లో ఆత్రేయగారే ఘనంగా జరిపించారని, ఆ సందర్భంగా రాసిన కొన్ని పాటలు ఆ తర్వాత సినిమాల్లో పాటలుగా రూపుదిద్దుకున్నాయని గతంలో మీ ఉత్తరంలో నాకు తెలియజేశారు. మళ్లీ ఓసారి చెబుతారా?
ఆ అమ్మాయి పెళ్లి సందర్భంగా రాసిన, ఓ పాటనే ‘సుమంగళి’ సినిమా కోసం తమిళ బాణీ ఆధారంగా మార్చి ‘కొత్త పెళ్లికూతురా రారా, నీ కుడికాలు ముందు మోపి రారా’ అని రాశారు. అలాగే, ‘పెళ్లంటే పందిళ్లు సందళ్లు...’ అనే ‘త్రిశూలం’ చిత్రంలోని పాట కూడా అప్పుడు రాసిందే!
‘కారులో షికారుకెళ్లే పాల బుగ్గల పసిడి చాన..’ అనే ‘తోడికోడళ్లు’ చిత్రంలోని పాట గురించి కూడా ఎవరూ నమ్మలేని ఓ నేపథ్యాన్ని చెప్పారు. అది మీ మాటల్లో మళ్లీ వినాలనుంది...
ఆత్రేయ నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ పొట్ట పోషించుకోవడం కోసం చిరుద్యోగాలు చేసే కాలంలో, నెల్లూరులోని ‘కస్తూరిబా’ బాలికల పాఠశాలలో ఆడపిల్లలకు నాటకాలు నేర్పేవారు. ఆ సందర్భంగా శ్రీమంతులైన రెడ్ల పిల్లలు జట్కాల మీద, కార్ల మీద స్కూలుకి రావడం చూసి వాళ్ల దర్జాను, తన అవస్థను తల్చుకుని ఈ పాట రాశారట! దీనిని మొదట ‘సంసారం’ చిత్రంలో పెడదామనుకొని, తర్వాత ‘తోడి కోడళ్లు’లో ఉపయోగించారు.
ఆత్రేయగారికి మీరెలా దూరమయ్యారు? అన్ని సినిమాలకు రాసి సంపాదించిందంతా ఆత్రేయ ఏం చేశారు? మీకు మద్రాసులో సొంత ఇల్లు ఉండేది కదా!
నిజానికి మీరడిగిన ప్రశ్నల్లో చాలా వాటికి నా దగ్గర కాని, ఆయన దగ్గర కాని సరైన జవాబులు ఉండవు. ఆయన సినిమా ఫీల్డ్‌కి వెళ్లిన తర్వాత, కొన్ని సమస్యల్లో ఇరుక్కొని కాపురం పెట్టలేదు. కొంతకాలం పుల్లయ్యగారి ఆఫీసులో ఒక్కరే ఉన్నారు. 1954లో నన్ను మద్రాసు తీసుకెళ్లారు. ఆళ్వారుపేటలో చిన్న ఇంట్లో కాపురం. చుట్టూ పల్లెవాళ్లతో వాతావరణం ఇబ్బందికరంగా ఉండేది. అయినా ఎలాగో భరించి సహించేదాన్ని. ఆయన రోజూ ఇంటికొచ్చేవారు కాదు. అప్పుడప్పుడూ మాత్రమే వచ్చేవారు. ఇంటి యజమానులకు సకాలంలో బాడుగ కూడా చెల్లించేవారు కాదు. మీరన్నట్టు యాభైలలో అంత సంపాదన ఉండి మాకా దరిద్రం ఎందుకో నాకర్థమయ్యేది కాదు. ఇదిలా ఉండగా, 1956లో మా అమ్మకు కాళ్లు చచ్చుపడిన కారణంగా, నేను మంగళంపాడు వెళ్లి వచ్చేసరికి పరిస్థితులు మారి, ఆయన నాకు కాకుండా పోయారు.
సారీ, మీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావిస్తూ మిమ్మల్ని నొప్పిస్తున్నాను. ఆ తర్వాత ఆయన ‘నల్ల కమల’ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారని, ఆమె ఇద్దరు కూతుళ్లనూ చివరి వరకూ తన పిల్లలుగా భావించి, పెళ్లిళ్ల బాధ్యతను కూడా ఆయనే తీసుకొన్నారని మద్రాసులో ఆత్రేయ కుటుంబం గురించి చెప్పుకునేవారు. అవన్నీ నిజాలా?
ఆయన నల్ల కమలను చేరదీసిన మాట నిజం. అయితే, ఆమెను పెళ్లి మాత్రం చేసుకోలేదు. సహజీవనం చేశారు... అంతే! ఆత్రేయ కూతుళ్లుగా చెలామణీ అయినవాళ్లు, కమల అక్కగారి సంతానం. ఆవిడ 1978లో చనిపోయింది. అప్పుడు ఆత్రేయ భార్య చనిపోయిందని, అసలు భార్య ఎప్పుడో తెరమరుగైపోయిందని అందరూ అనుకొన్నారట! ఆ కుటుంబ భారం మీద పడేసరికి ఆయన సంపాదన, సొంత ఇల్లు... అన్నీ హరించుకుపోయాయి.
జరిగిన అన్యాయానికి ఆత్రేయగారి పట్ల కోపం లేదా?
లేవు. ఆయన దుర్మార్గుడు కాదు. నన్ను ఆయనెప్పుడూ ద్వేషించలేదు, దూషించలేదు. నా గురించి చాలా బాధపడేవారు. నా జీవితాన్ని పాడుచేశాను అని పశ్చాత్తాపపడేవారు. ఊబిలో దిగాను, పైకి రాలేకపోతున్నాననేవారు. విధి మమ్మల్ని దూరం చేసింది. అంతే!
ఆత్రేయగారితో ముడిపడి, ఇలా దగా పడినందుకు సహధర్మచారిణిగా మీరేమనుకుంటున్నారు?
(కళ్లొత్తుకొంటూ) ఆత్రేయ అంతటి కవికి భార్యనైనందుకు గర్విస్తాను. ఆత్రేయుడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడి వెన్నెలకు దూరమై కృష్ణ పక్షం మాత్రమే దక్కడం నా దురదృష్టంగా భావిస్తాను.
చివరిగా ఈ వృద్ధాప్యంలో మీ జీవితాన్ని గురించి మీకేమనిపిస్తోంది?
ఆ మహానుభావుడే చెప్పినట్టు -
పోయినోళ్లందరూ మంచోళ్లు ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు! అని!
- డా॥పైడిపాల
paidipala_p@yahoo.com
నీ పరిశోధన పూర్తయ్యేనాటికి చచ్చిపోతాను..!
ఆత్రేయ సంపూర్ణ రచనలపై పీహెచ్‌డీ పట్టా కోసం పైడిపాల మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధన చేద్దామని వెళ్లారు. కాని అప్పుడు ఆ విశ్వవిద్యాలయంలో ‘సజీవులైన వ్యక్తుల మీద పరిశోధన చేయకూడద’నే ఆంక్ష ఉండటం వల్ల, పైడిపాల పరిశోధనాంశాన్ని మార్చుకోవలసి వచ్చింది. ఆ సందర్భంగా ఆత్రేయ ‘నేను సగం చచ్చే ఉన్నాను. నీ పరిశోధన పూర్తయ్యేనాటికి చచ్చిపోతాను. ఈ విషయం మీ యూనివర్సిటీవారికి చెప్పి, నా రచనల మీద నీ పరిశోధన కొనసాగించు’ అన్నారు. ‘పరిశోధన మీవంటి కవులను బతికించడానికి తప్ప, చంపడానికి కాదు’ అని జవాబిచ్చారు. కానీ ఆ ఏడే (89) సెప్టెంబర్ 13న ఆత్రేయ కన్నుమూశారు.

................................................
.....................................
0 వ్యాఖ్యలు:
Post a Comment