జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, September 19, 2014

తొలి కన్నడ టాకీ... మలి తెలుగు టాకీల... మెట్లు కట్టిన సంగీత మేస్త్రీ - హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి



తొలి కన్నడ టాకీ... మలి తెలుగు టాకీల...మెట్లు కట్టిన సంగీత మేస్త్రీ
సందర్భం:సినీ సంగీత దర్శకుడు హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి శతజయంతి

 సినీ సంగీతదర్శకుడు హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రిని  చాలామంది కన్నడిగుడని పొరబడుతుంటారు. నిజానికి, ఆయన అచ్చ తెలుగువారు. వాళ్ల తాత, ముత్తాతలు కొన్ని తరాల ముందే బెంగళూరు శివార్లలోని హొసకోటె తరలివెళ్ళారు. పద్మనాభశాస్త్రిగారి తండ్రి రామశేషశాస్త్రి బెంగళూరులోని ప్యాలెస్‌లో అధికారి, ఆస్థాన జ్యోతిషులు. ఆయనకున్న తొమ్మిది మంది సంతానంలో నాలుగో బిడ్డ పద్మనాభశాస్త్రి. ఇప్పటికి సరిగ్గా నూరేళ్ళ క్రితం 1914 సెప్టెంబర్‌లో ఆయన జన్మించారు. భాద్రపద మాసంలో అనంత పద్మనాభ వ్రతం చేసుకొనే రోజునే పుట్టడంతో ఆయనకు పద్మనాభశాస్త్రి అని నామకరణం చేశారు. ఊరి పేరే ఇంటిపేరు కాగా, తండ్రి పేరును ముందు చేర్చుకొనే అలవాటుతో హొసకొటె రామశేష పద్మనాభశాస్త్రి అన్నది పూర్తి పేరైంది.  
 
 18 ఏళ్లకే సంగీతదర్శకత్వం: 


పదేళ్ళ వయసులోనే 1924లో బెంగుళూరు సుజన విలాస సభలో నటుడిగా వేదికనెక్కిన శాస్త్రి దాదాపు పదేళ్ళు ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’ (హెచ్.ఎం.వి) గ్రామఫోన్ కంపెనీలో సంగీత పరిచాలకుడిగా పనిచేశారు. తర్వాత బొంబాయికి చెందిన ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ ‘సాగర్ మూవీటోన్’లో సంగీత దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ప్రవేశించారు.  ఆ సంస్థ తీసిన హిందుస్తానీ చిత్రాలు ‘బుల్‌బుల్-ఏ-బాగ్దాద్’, ‘జరీనా’, ‘మాయాబజార్’ (1932) టాకీలకు పనిచేశారు. తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ (1932 ఫిబ్రవరి 6న రిలీజ్) స్ఫూర్తితో ‘శ్రీరామ పాదుకా పట్టాభిషేకము’(1932 డిసెంబర్ 24న రిలీజ్) తీశారు సాగర్ అధినేతలు. 18 ఏళ్ల వయసులోనే ఆ మలి తెలుగు టాకీతో సంగీత దర్శకుడయ్యారు శాస్త్రి. సాగర్ వారు తీసిన మరో టాకీ ‘శకుంతల’ (1933 మార్చి 25)కీ సంగీతం ఆయనదే. కన్నడంలో తొలి టాకీ ‘సతీ సులోచన’కు పాటలు స్వరపరిచింది కూడా ఆయనే.
 
 నౌషాద్ ముద్దాడిన ఆ చేయి: 


తొలి రోజుల్లో బొంబాయి, కలకత్తా, పుణే, కొల్హాపూర్‌లలో పనిచేసినప్పటికీ, ఉత్తరాదిన స్థిరపడేందుకు శాస్త్రి మొగ్గుచూపలేదు. సోదరుడి వరుసయ్యే  శాస్త్రవేత్త శ్రీనివాసమూర్తి ద్వారా సంగీతజ్ఞుడైన నౌషాద్‌ను కలిశారు. ఆ సందర్భంలో హార్మోనియమ్ మీద శాస్త్రి స్వరాలతో చేసిన సర్కస్ ఫీట్లు చూసి, నౌషాద్ స్వయంగా లేచివచ్చి, ఆయన చేతిని ముద్దాడి, ‘నా దగ్గరకు వచ్చేయ్. బొంబాయిలో స్థిరపడితే, మంచి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారట. కానీ, శాస్త్రి తల్లితండ్రుల్ని వదిలి, అక్కడ స్థిరపడడానికి ఇష్టపడలేదు.
 
 దర్శక - నటుడు వై.వి. రావు, నటి కన్నాంబల కోరిక మేరకు వారి చిత్రాలకు స్వరసారథ్యంతో మద్రాసులోనే శాస్త్రి స్థిరపడ్డారు. తరచూ బెంగళూరు వెళ్ళి వస్తూ, ఎక్కువ కన్నడ చిత్రాలకూ పనిచేశారు. 1930ల ప్రథమార్ధం నుంచి 1950ల ప్రథమార్ధం దాకా పద్మనాభశాస్త్రి సంగీత దర్శకుడిగా తెలుగు, కన్నడ, తమిళ సీమల్లో మెరిశారు. తెలుగులో ‘చిత్రనళీయం’ (1938), ‘రాధాకృష్ణ’ మొదలు, ‘తాసిల్దార్’, ‘సుమతి’, ‘పేదరైతు’, ‘శ్రీకృష్ణ తులాభారం’, ‘నాగపంచమి’ తదితర చిత్రాలకు సంగీతం శాస్త్రిదే.
 
 తెలుగు ‘తాసిల్దార్’ (’44)తో ఏడేళ్ళ జమునారాణినీ, తమిళ ‘కంకణం’ (’46)తో పదమూడేళ్ళ పి.లీలనూ గాయనులుగా వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.మహదేవన్ దగ్గర: కొంతకాలం గడిచాక, అవకాశాలు తగ్గి, నిర్మాతలు కొందరు పారితోషికం విషయంలో మోసం చేయడంతో శాస్త్రి కొంత ఒడుదొడుకులకు లోనయ్యారు. నాగయ్య, ఓగిరాల, అశ్వత్థామలతో కలసి సంగీతం అందించిన ‘భక్త రామదాసు’ (1964) ఆయన ఆఖరి చిత్రం. ఓడలు బళ్ళయినప్పటికీ, నైతిక ధైర్యంతో, చేతిలో ఉన్న విద్యనే నమ్ముకొని, సంగీత దర్శకుడు కె.వి. మహదేవన్ పిలుపుతో, ఆయన దగ్గర వాద్యబృందంలో ఒకరుగా పనిచేశారు. అలా చివరి రోజుల వరకు మహదేవన్ వద్దే సంగీత విభాగంలో పని చేస్తూ వచ్చారు శాస్త్రి.
 
 ఫొటోగ్రఫీ హాబీ: 


యువ సంగీత దర్శకుడిగా తొలినాళ్ళలో ఫుల్ బ్లేజర్ సూట్లతో, అప్పటి కాలానికి ఆధునికంగా, రెండు కార్లతో దర్జాగా తొలి రోజులు గడిపిన శాస్త్రి అద్భుతంగా కారు నడిపేవారట. అలాగే, ఫొటోగ్రఫీ ఆయనకు పెద్ద హాబీ. హార్మోనియమ్ మీద శాస్త్రికి ఎంత పట్టు అంటే, పెండ్యాల మాస్టారు లాంటి మహా మహా సంగీత దర్శకులకు సైతం అందులోని సూక్ష్మమైన మెలకువలు చెప్పేవారట. శాస్త్రి మధుమేహం కారణంగా వీపు మీద వచ్చిన రాచకురుపుతో అవస్థపడుతూ, సరిగ్గా తాను పుట్టిన అనంత పద్మనాభ స్వామి వ్రతదినానే 1970 సెప్టెంబర్ 14 సాయంత్రం 7 గంటల వేళ మద్రాసులో కన్నుమూశారు.
 
 శాస్త్రి సంతానం అందరికీ సంగీతంలో ప్రవేశం ఉంది. ముఖ్యంగా మగపిల్లలు అయిదుగురూ సినిమా సంగీత రంగంలో ఉండటం విశేషం. శాస్త్రి కుటుంబసభ్యులు ఏటా ‘హెచ్.ఆర్. పద్మనాభశాస్త్రి అవార్డ్ ఫర్ ఆర్ట్స్’ పేరిట ప్రముఖ కర్ణాటక, సీనియర్ సినీ సంగీత కళాకారులకు అవార్డులిస్తూ, సన్మానిస్తున్నారు. వెరసి, ఇప్పటికి నూరేళ్ళ క్రితం అంకురించిన ఓ సంగీత బీజం వటవృక్షమై, శాఖోపశాఖలుగా విస్తరించి, శతవసంతాల తరువాత కూడా వసివాడని స్వరరాగాలను పుష్పించడం, ఫలించడం ఆనందదాయకం.
 
 ‘‘అప్పట్లో మా కుటుంబాల్లో మడి, ఆచారం ఎక్కువే. అయితే, మా తాతగారు రాజ దర్బారులో ఉండడంతో, మా నాన్నగారిని బెంగళూరులో ఇంగ్లీషు స్కూల్‌లో చదివించారట. నాన్నగారు అద్భుతమైన ఇంగ్లీషు రాసేవారు, మాట్లాడేవారు. చక్కటి వ్యాకరణబద్ధంగా ఇంగ్లీషులో ఉత్తరాలు రాసేవారు’’ - హెచ్.పి.రామమూర్తి (పద్మనాభశాస్త్రి పెద్ద కుమారుడు, సినీ సంగీత రంగంలో సీనియర్ తబలా వాద్యకళాకారుడు )
 
 - రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 14th Sept 2014, Sunday)
............................................

0 వ్యాఖ్యలు: