పండగ పూట... పొద్దెక్కుతున్న కొద్దీ రాజధాని హైదరాబాద్‌లోని ప్రతి వీధి కూడలిలో వినాయక పూజలతో ఉత్సాహం పెరుగుతోంది.సన్నగా మొదలైన చినుకులు పెద్దవి అవడంలో ప్రకృతి ఉత్సాహం కూడా ప్రతిఫలిస్తోంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర సువిశాలమైన ఆ ఇంట్లోకి అడుగుపెట్టేసరికి, ఆవరణలోనే పెద్ద వినాయక విగ్రహం. అప్పుడే పూజ ముగించుకొని, నుదుట బొట్టు, చేతికి వ్రతదీక్షా తోరం, మెడలో పట్టు ఉత్తరీయంతో ప్రశాంతంగా ఆఫీసు గదిలోకి వచ్చారు - నందమూరి బాలకృష్ణ. తెలుగు సినిమాలో సిసలైన ‘లెజెండ్’ తండ్రి నందమూరి తారక రామారావు నుంచి వచ్చిన ఘన వారసత్వం, దానికి తాను స్వీయ క్రమశిక్షణతో వేసుకున్న బాట కలిసి, ఇవాళ బాలకృష్ణ శతచిత్ర కథానాయకుడయ్యేందుకు మరో మూడే మూడు చిత్రాల దూరంలో ఉన్నారు. తొలిచిత్రం ‘తాతమ్మ కల’ (1974) విడుదలై, నటుడిగా ఈ ఆగస్టు 30తో సరిగ్గా నాలుగు దశాబ్దాలైనా, ఇప్పటికీ తాను నిత్యవిద్యార్థినే అంటున్న ఈ నందమూరి అందగాడి సినీ, రాజకీయ ప్రస్థానం గురించి ‘సాక్షి’ జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ...
నలభై ఏళ్ళ క్రితం మీరు నటుడిగా మారడం వెనుక మీ నాన్నగారి ప్రోత్సాహం...
బాలకృష్ణ: చిన్నప్పుడు నాన్న గారి జానపద చిత్రాలు తెగ చూసేవాణ్ణి. ఆ స్ఫూర్తితో, నాన్న గారు ఇంట్లో లేనప్పుడు, నేను, పిల్లలం, ఇంట్లో నౌకర్లతో కలసి, చీపురుపుల్లలు తీసుకొని, వాటినే కత్తుల్లా తిప్పుతూ, ఆడుకొనేవాళ్ళం. అలా చిన్నప్పటి నుంచి నాకు సినిమాల్లో నటించాలని ఉండేది. అది ఆయనకూ తెలుసు. ఏదో ఒక రోజుకు నేను ఆయనకు సినీ వారసుణ్ణి అవుతానని అనుకున్నారు. అంతే తప్ప, ‘నువ్వు నటుడివి అవుతావా? ఫలానా శిక్షణ తీసుకో!’ లాంటివేమీ లేదు. ‘తాతమ్మ కల’లో మనుమడి పాత్రకు నేరుగా తీసుకొచ్చి, కెమేరా ముందు నిలబెట్టేశారు. సెట్స్‌లో, కెమేరా ముందు నాన్న గారు నన్నెప్పుడూ తన కొడుకు లాగా గారాబంగా చూడలేదు. ఒక నటుడిగానే చూశారు. తప్పు చేస్తే తిట్టేవారు.
నటుడిగా మీ తొలినాటి అనుభవం గుర్తుందా?
ఓ... ఎందుకు గుర్తులేదూ! తొలిషాట్‌లో భర్త పేరే తన మనుమడికీ పెట్టుకున్న నాయనమ్మ పాత్రధారిణి భానుమతి గారు ‘వారేరీ? ఆయనెక్కడా? ఇంకా రాలేదా?’ అంటారు. నేను చేతిలో పుస్తకాలు, కళ్ళజోడుతో నడుచుకుంటూ రావాలి. రిహార్సల్ ఎందుకు? టేక్ చేసేద్దాం అని దర్శకులైన నాన్న గారు అన్నారు. నాకేమో కొత్త. అద్దాలు లేకుండా ఫ్రేమ్ మాత్రమే ఉండే సినిమా కళ్ళజోడు పెట్టుకోవడం కూడా నాకు వింత అనిపించింది. నాన్నగారి పాత చిత్రాలు జ్ఞాపకం చేసుకుంటూ, ‘నిండు మనసులు’లోని నాన్న గారి నడకను అనుకరించా. తీరా చూస్తే, ఆ సినిమాలో ఆయన వేసింది రౌడీ తరహా పాత్ర. ఇక్కడేమో నేను స్టూడెంట్‌ను. ‘ఆ నడకేమిట్రా? గాడిద, వెధవ’ అని తిట్టారు. అప్పుడు నాకు పాత్రను బట్టి, నడక, మాట తీరు మారిపోతాయన్న తొలి పాఠం తెలిసింది. గమనిస్తే... దుర్యోధనుడు, భీముడు, కృష్ణుడు, రాముడు, సాంఘికాల్లో అమాయకుడు, అధికారి - ఇలా పాత్రలకు తగ్గట్లు భిన్న రకాలైన నడక, నటన, డైలాగ్ డెలివరీని నాన్న గారు ప్రదర్శించారు. అదే ఒక ఎడ్యుకేషన్!
నాన్న గారు చెప్పిన మాటలు, పాఠాలు ఇంకేమైనా గుర్తున్నాయా?
‘రైతుబిడ్డ అయిన నేను కష్టపడి, పైకొచ్చాను. ఎన్టీఆర్ పిల్లలుగా మీకు ఆ అవసరం లేదు’ అంటూనే జీవితంలో ఎప్పుడూ కష్టపడి స్వయంకృషితో పైకి రావాలనేవారు. అప్పనంగా వచ్చి పడేదాని మీద ఆయనకు నమ్మకం లేదు. ఎవరి మీదా ఆధారపడకూడదనీ, ఎవరో మనల్ని వెనక నుంచి ప్రోత్సహించి, ముందుకు నెడతారని అనుకోకూడదనీ భావించేవారు. అదే నాకు జీవన మంత్రం! అలాగే, ఇంట్లో ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీ చదువుకోవాలనేవారు. అలానే అందరినీ చదివించారు. డిగ్రీ పూర్తయ్యాకే, నన్ను హీరోగా బయటి దర్శక, నిర్మాతల చిత్రాల్లో చేయనిచ్చారు. 1983లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, హైదరాబాద్ రావడం, నేను సినిమాల్లోకి మద్రాసు వెళ్ళడం జరిగాయి. సోలో హీరోగా 84లో ‘సాహసమే జీవితం’తో మొదలయ్యా!
సోలో హీరో కాక ముందు చేసిన పాత్రలు, చిత్రాల్లో మీకు బాగా నచ్చినవి?
‘అన్నదమ్ముల అనుబంధం’లోని సోషల్ పాత్ర గుర్తింపు తెచ్చింది. చారిత్రక చిత్రం ‘వేములవాడ భీమకవి’లో నేను పోషించిన టైటిల్ రోల్, ఆ గెటప్ కొత్త అనుభూతినిచ్చాయి. అది నాకు ఇష్టమైన పాత్ర. అలాగే, ‘దాన వీర శూర కర్ణ’లో శృంగారం, వీరత్వమున్న అభిమన్యుడు పాత్ర నాకు సరైన సమయంలో దక్కిన పౌరాణికం. హీరో కావడాని కన్నా ముందే విభిన్న పాత్రపోషణకు అవకాశం లభించింది. ఆ తర్వాత 1986లో ఒకే ఏడాది ఆరు విభిన్న చిత్రాలు చేయడం, ఆరూ వరుసగా హిట్టవడం... అదంతా ఓ చరిత్ర.
అప్పట్లో మీరు నాన్న గారి నంబర్ వన్ స్థానం కోసం ప్రయత్నించలేదా?
నాకెప్పుడూ ఆ ఆలోచన లేదు. మంచి పాత్రలు చేయాలి, సినిమాలు చేయాలనే తప్ప, మరొకరితో పోటీ, నంబర్ గేమ్‌ల మీద నాన్న గారికి నమ్మకం లేదు. నాకూ అంతే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ నంబర్స్!
ఎన్టీఆర్ లాంటి వటవృక్షం నీడన మీకంటూ గుర్తింపు ఎంత కష్టమైంది?
ఆయనను చూసిన కళ్ళతో నన్ను చూస్తారు గనక, అదే రకం పాత్రలు పోషించినప్పుడు పోల్చిచూడడం మొదలవుతుంది. పైగా, అంచనాలు పెరుగుతాయి. నాన్న గారు మహానటుడు. కానీ, నేను హీరో అయ్యేనాటికే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. నాన్న గారి పోలికలు, ఆయన హావభావాలు నరనరానా జీర్ణించుకున్న నేను ఈ కొత్త తరం ప్రేక్షకులు ఆకర్షితులయ్యేలా ఆ పాత్రలను చేస్తూ వచ్చా. ఆయన నటవారసుడిగా మన భాష, సంస్కృతిని నిలబెట్టే పాత్రలు చేస్తూ వచ్చా. నా పురోగతిలో నా దర్శక, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులు, తోటి నటుల పాత్ర ఉంది. నాన్న గారిలానే నేనూ సమష్టి కృషిని నమ్మాను. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ - దర్శకుడే సినిమా నావకు కెప్టెన్.
ఎన్టీఆర్ వారసుడిగా మీ మీద ఉన్న ప్రత్యేక బాధ్యత?
శ్రీకృష్ణదేవరాయలు పాత్ర ముందుగా ఆయన చేశారు. తరువాత ఆ పాత్ర పోషించే అదృష్టం నాకు దక్కింది. కాబట్టి, ఆయన ప్రతినిధిగా నేను నిన్న అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగిన రాయల పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమానికి వెళ్ళా. ఆ తరంతో పాటు ఈ తరం వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. భాష, సాహిత్యం, సంస్కృతి లాంటి వాటికి సినిమాల ద్వారా నాన్న గారు పెద్దపీట వేశారు. అందుకే, ‘ది లెజెండ్’ అనే పదానికి ఆయనే తగినవాళ్ళు. ఆయన సంతానంగా ఆ ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన ప్రత్యేక బాధ్యత నా మీద ఉంది.
ఈ తరం హీరోల్లో మీరొక్కరే అన్ని తరహాల (జానర్ల) చిత్రాల్లో నటించారు..
నిజమే. ఈ తరం హీరోల్లో సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణిక తరహాలు నాలుగింటిలో నటించే అదృష్టం నాకు దక్కింది. అలాగే, హీరోగా వంద చిత్రాలు పూర్తి చేసే అవకాశమూ నాకు దక్కుతోంది. కొత్తగా వస్తున్న హీరోలందరూ చాలా తక్కువ సినిమాలే చేస్తున్నారు కాబట్టి, వారు హీరోలుగా 100 సినిమాలు పూర్తి చేయడం కష్టమే. దేశంలో వంద చిత్రాలు చేసిన తొలి హీరో నాన్న గారు అయితే, బహుశా నేను ఆఖరవుతానేమో తెలీదు. ఏమైనా, కథా నేపథ్యం, పాత్రలు మారినప్పుడల్లా నాకు ఇప్పటికీ కొత్త ఉత్సాహం, కొత్త స్ఫూర్తి కలుగుతుంటాయి. అలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతాను. ఒక్క మాటలో... నేను అలుపెరుగని బాటసారిని!
కానీ, కాలం మారుతోంది. వేగం పెరిగిపోయింది. కొత్త హీరోలు వస్తున్నారు..!
అవును. కాలం వేగంగా మారుతోంది. తరాలు మారుతున్నాయి. అదే సమయంలో ఈ తరానికి నచ్చేలా చేస్తూనే, మనదైన దోవలో వెళ్ళాలి. నాన్న గారు అదే చేశారు. మన భాషా సంస్కృతుల మీద అవగాహన కలిగిస్తూనే, తరానికి తగ్గట్లుగా కమర్షియల్ సినిమాలు చేశారు. నా దృష్టిలో నటుడనేవాడు - ప్రజలకు అవసరమైన ఒక నిత్యావసర వస్తువు లాంటి వాడు. ప్రజలకు కావాల్సింది ఇస్తూనే, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘లెజెండ్’ లాంటి భిన్నమైన పాత్రలు చేసింది అందుకే.
మీ విజయంలో మీ శ్రీమతి వసుంధర పాత్ర?
షూటింగ్‌లు, సినిమాలతో రాత్రీ పగలూ నేను బిజీగా ఉంటే, పిల్లల బాగోగులు, వాళ్ళ చదువులు అన్నీ జాగ్రత్తగా చూసుకున్నది ఆమె. అటువంటి భార్య దొరకడం నా అదృష్టం. నేననే కాదు... మగవాళ్ళు ఎవరైనా బయట వృత్తి, ఉద్యోగాల్లో పైకి రావడం వెనుక, ఇంట్లో ఆడవాళ్ళు చేసే త్యాగాలు ఎన్నో ఉంటాయి. స్త్రీ శక్తి లేనిదే ఈ సృష్టే లేదు!
ఇన్నేళ్ళ కెరీర్‌లో మీ మనసుకు నచ్చిన ఓ అయిదారు చిత్రాలు...
‘మంగమ్మ గారి మనవడు’, ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’, ‘బొబ్బిలి సింహం’, ‘పెద్దన్నయ్య’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘శ్రీరామరాజ్యం’, తాజా ‘లెజెండ్’ - ఇలా చాలా ఉన్నాయి.
మీ వందో చిత్రం గురించి రకరకాల ఊహాగానాలున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో నటించాలని అడిగారనీ, శంకర్ అనీ, స్వీయ దర్శకత్వమనీ...
(పెద్దగా నవ్వేస్తూ...) నా అంతట నేనుగా ఎప్పుడూ ఎవరినీ అలా అడగలేదు, అడగను. దర్శక, నిర్మాతలు నా దగ్గరకు వస్తే, అన్నీ కుదిరితే చేయడమే. వందో సినిమా పౌరాణికం చేయాలనీ, ‘ఆదిత్య 369’కు సీక్వెల్ చేయాలనీ... ఇలా రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. ఇంకా ఏమీ అనుకోలేదు. నేను ఎప్పుడూ ఏదీ అంత ముందుగా ప్లాన్ చేయను. ఇప్పుడింకా 98వ సినిమా చేస్తున్నా. 99 కూడా అయ్యాక కదా వందోది. ఏదైనా వేడి వేడిగా వండి, వడ్డించుకొని తింటేనే ఆ రుచి.
మీరు కావాలని కోరిన దర్శకులు లేరు. కానీ, మీరు ఇప్పటికీ చేయాలని కోరుకుంటున్న పాత్రల మాటేమిటి?
చాలాకాలంగా నాకు గోన గన్నారెడ్డి, చెంఘిజ్ ఖాన్ పాత్రలు చేయాలని ఉంది. ఇప్పటి దాకా ఆ కోరిక తీరలేదు.
మీరు ఎన్నాళ్ళ నుంచో దర్శకత్వం వహించాలనుకున్నారు. మీ చిత్రాల్లో ఒకటి రెండు సందర్భాల్లో కీలక ఘట్టాలు మీరే తీశారు. మీ దర్శకత్వంలో ‘నర్తనశాల’ మొదలై ఆగింది. మరి, సమీప భవిష్యత్తులోనైనా మీ దర్శకత్వం ఉంటుందా?
సరైన నిర్మాత, ద్రౌపదిగా తగిన నటి, ఇతర పాత్రధారులు ఉంటే ఆగిన ‘నర్తనశాల’ను మళ్లీ మొదలెట్టాలని ఉంది. ‘నర్తనశాల’ సంగతే తీసుకుంటే బోలెడంత రిసెర్చ్ చేశాం. అర్జునుడికి వీపు మీద రెండు మచ్చలున్నాయనీ, సుధేష్ణ - కీచకుడు ఒక తల్లి బిడ్డలు కాదనీ, అందుకే మాలినిని తన వద్దకు పంపమన్నప్పుడు కాదన్న సుధేష్ణతో ‘నీ సొంత తమ్ముడైతే ఈ మాట అనేదానివా’ అని అన్నాడనీ - ఇలా చాలా సంగతులు. అందులో అర్జునుడు, బృహన్నల, కృష్ణుడు, కీచకుడు - ఇలా నాలుగు పాత్రలు వేయడానికీ, ఏ పాత్రకు తగ్గట్లుగా ఆ పాత్రకు డైలాగులు, మాడ్యులేషన్ - అన్నీ సిద్ధం చేశా. డైలాగులు కూడా మేమే రాసుకున్నాం. (పక్కనే ఉన్న టేబుల్ మీద వెతుకుతూ...) స్క్రిప్టు కూడా ఇక్కడే ఉండాలి. అయితే, మామూలు సినిమాలు చేయాలని నాకు లేదు. ఇలాంటి పౌరాణికాలు, ఫ్యాంటసీల లాంటి వాటిల్లో దర్శకుడిగా, రచయితగా ఒక క్రియేషన్ ఉంటుంది. అది ఈ తరం ప్రేక్షకులకు కూడా నచ్చేలా, వారు మెచ్చేలా చెప్పడంలో మన ప్రతిభ ఉంటుంది.
చాలామంది మీరంటే భయపడుతుంటారు, మిమ్మల్ని కోపధారి అంటారు, జనానికి దూరంగా ఉంటారంటారు...
అదేమీ లేదండీ. కొన్ని సందర్భాల్లో కత్తులు, గొడ్డళ్ళు పుచ్చుకొని నేను వేసే రౌద్రరస ప్రధానమైన పాత్రల ఇమేజ్ వల్ల భయపడుతుంటారేమే కానీ, నేను అందరితోనూ సరదాగా, స్నేహపూర్వకంగానే ఉంటాను. అయితే, మనమిచ్చే చనువును ఆసరాగా తీసుకొని, పిచ్చి వేషాలు వేయబోతే ఒప్పుకోను. అప్పుడు నాలో రెండో కోణం చూస్తారు. సింహ స్వప్నమవుతాను. వాళ్ళ తోక కోస్తాను. గమనిస్తే, ఈ తరం నటుల్లో సెక్యూరిటీ కూడా లేకుండా జనం మధ్యలోకి వెళ్ళిపోయి, సింహాచలం, విశాఖపట్నం లాంటి చోట్ల వాళ్ళ మధ్యే ఎక్కువ షూటింగ్ చేసేది నేనే. అలా చేయడానికి గట్స్ ఉండాలి!
ఇప్పటిదాకా మీరు ఆఫ్-బీట్ సినిమాలు చేయకపోవడానికి కారణం..?
పూర్తి ఆఫ్-బీట్ చిత్రాలు చేయడానికి ఒక ఆర్టిస్టుగా నేను సిద్ధమే కానీ, అలాంటి చిత్రాలు తీసే దర్శక, నిర్మాతలేరి చెప్పండి! అయినా, నన్ను జనం అలా చూడరండీ! నాన్నగారు కూడా మొదట్లో ‘పిచ్చి పుల్లయ్య’, ‘తోడుదొంగలు’ లాంటివి చేస్తే, పేరు వచ్చింది కానీ, వసూళ్ళు రాలేదు. అందుకే, ఆయన పంథా మార్చుకొని, ‘జయసింహ’ లాంటి జనరంజక చిత్రాలు మొదలుపెట్టి, విజయాలు సాధించారు. ఒక ఆర్టిస్టుగా ఆఫ్ బీట్ సినిమాలు చేయాలని నాకూ ఉన్నా, చేయలేకపోతున్నది అందుకే!
కమర్షియల్‌గా చూసినా యాభైపడిలో పడ్డాక 50 కోట్ల రెవెన్యూ స్థాయి హిట్లందుకోవడం ఏ హీరోకైనా అరుదైన ఫీట్. ఒక్క హిట్‌తోనే నటులు, దర్శకులు కొండెక్కి కూర్చొనే ఈ రంగంలో మీరు పారితోషికం పెంచకపోవడం... ఇప్పటికీ నిర్మాతను బట్టి నడుచుకోవడం విడ్డూరం!
నేనెప్పుడూ రెమ్యూనరేషన్ గురించి ఆలోచించలేదు. ఇది కళాత్మక వ్యాపారం. ఇక్కడకు వచ్చే ఏ నిర్మాత అయినా మనతో ఓ మంచి సినిమా తీస్తూనే, నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలని వస్తాడు. కాబట్టి, అతని శ్రేయస్సు ప్రధానం. అతను బాగుంటేనే, నాలుగు సినిమాలు తీస్తాడు. నలుగురూ బాగుంటారు.
పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ సాయంతో సత్యజిత్ రే చిత్రాలను భద్రపరిచినట్లుగా, తెలుగు జనజీవితంలో భాగమైన ఎన్టీఆర్ ఘన సినీ చరిత్రను తరువాతి తరాలకు అందించడానికి ఏదైనా...
(మధ్యలోనే అందుకుంటూ...) నాన్న గారు పౌరాణిక పాత్ర పోషణకు వాడిన కిరీటాలు, గదలు, ఇతర వస్తు సామగ్రి, వాటి డిజైన్లతో సహా మొత్తం మా దగ్గరే ఉన్నాయి. టీవీలో ‘రామాయణ్’, ‘మహాభారత్’ తీసిన రామానంద్ సాగర్, బి.ఆర్. చోప్రాలు సైతం ఇక్కడకు వచ్చి చూసి, వాటిని తమ పాత్రల గెటప్‌లకు రిఫరెన్స్‌లుగా వాడుకున్నారు. ఈ అపురూప వస్తువులన్నిటినీ విజయవాడ సమీపంలో ఒక శాశ్వత మ్యూజియమ్‌గా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. వాటితో పాటు ఆయన సినిమాలన్నిటినీ అక్కడ భద్రపరుస్తాం. వాటిని ఎవరైనా అక్కడ చూడవచ్చు. ఇవన్నీ కాకుండా, భవిష్యత్ తరాలకు నాన్న గారి గురించి తెలిపేలా ఒక విభిన్నమైన శైలిలో ఒక అరగంట నిడివిలో ప్రత్యేక షో ఒకటి శాశ్వతంగా అక్కడ ప్రదర్శించేలా చేయాలనీ, ఇంకా చాలా ఆలోచనలున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్నది ఇంకా చర్చిస్తున్నాం.
బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రచార పటాటోపానికి దూరంగా చాలా సేవలే చేస్తున్నట్లున్నారు!
అవును. దాన్ని ఒక ఛారిటీగా నిర్వహిస్తున్నాం. 20 శాతం మంది రోగులకు పూర్తిగా ఉచిత సేవలు అందిస్తున్నాం. ప్రధానంగా ఊరూరా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, క్యాన్సర్ పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నాం. క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నాం. అలాగే, ఆరోగ్యశ్రీ, తెల్ల రేషన్ కార్డుదారు లబ్ధిదారులకు కవర్ కాని వ్యాధులకు కూడా ఇక్కడ చికిత్స ఇస్తున్నాం. అత్యుత్తమ సిబ్బంది, ఆధునిక పరిజ్ఞానంతో ఇప్పుడు తెలుగు నేలపై ఉన్న అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అది. అందుకే, త్వరలోనే ఈ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు మరో శాఖను సీమాంధ్రలో కూడా ఏర్పాటు చేయనున్నాం. ఎక్కడ, ఎప్పుడు అన్నది ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
1983 నుంచి ముప్ఫై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీకి ప్రచార బాధ్యతల్లో కీలకపాత్ర ధరించారు. కానీ, ఎన్నడూ పదవులు కోరలేదు. ఈ ఏడాది ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. కారణం?
సినీ రంగం తరువాత చూస్తే, సేవా రంగం. ఒకపక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా, మా ఛారిటబుల్ ట్రస్ట్‌లో రోగులకు సేవ చేస్తున్నాం. ఇక, రాజకీయాలకు కొత్త అర్థం చెప్పి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వాటిని కొత్త మలుపు తిప్పిన వ్యక్తి నాన్న గారే. ఆయనను ఒక మామూలు పొలిటీషియన్‌గా ఎప్పుడూ చూడలేం. ఆయన నాకిచ్చిన అనేకానేక స్ఫూర్తుల్లో అదీ ఒకటి. నాన్న గారు పెట్టిన పార్టీనీ, ఆయన ఆశయాలనూ నిలబెట్టడం నా కర్తవ్యం. అందుకే, పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నా. ఆ ప్రయత్నంలో మా కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యమున్న హిందూపురం సీటిచ్చారు. ఒకప్పుడు నాన్న ప్రాతినిధ్యం వహించిన అక్కడ పోటీ చేసి, గెలిచాను.
మీ ఇంట్లో మీరొక పార్టీ. మీ అక్కయ్య (పురందేశ్వరి) ఇంకో పార్టీ. మీ బావ గారు, మీ అన్నయ్యల మొగ్గు మరో వైపు. మీ మధ్య సామరస్యం ఎలా?
మా వ్యక్తిగత కుటుంబ బంధానికీ, రాజకీయాలకూ సంబంధం లేదు. మా మధ్య దూరం ఎప్పుడూ లేదు. పండుగలు, పబ్బాలు, ఇంట్లో శుభకార్యాలకూ అందరం కలుస్తాం. హాయిగా ఉంటాం. రాజకీయాలన్నీ గడప అవతలే తప్ప, గడప ఇవతల కాదు.
అన్నట్లు, మీ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు కొత్త సభ్యులు - మీ అల్లుళ్ళు లోకేశ్, భరత్. ఆ మధ్య ఒక సినిమా ఫంక్షన్‌లో ఎంతో ఉత్సాహంగా అందరూ కనిపించారు. వాళ్ళతో మీ అనుబంధం?
(నవ్వేస్తూ...) మేమంతా సరదాగా ఉంటాం. నవ్వుతూ, తుళ్ళుతూ ఎంజాయ్ చేస్తాం. లోకేశ్ - నాకు మేనల్లుడే. కాబట్టి మా ఇంట్లో మనిషి కిందే లెక్క. ఇక, భరత్ - అంటారా? వాళ్ళ అమ్మ గారు, మా ఆవిడ - ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. క్లాస్‌మేట్స్ కూడా. అతణ్ణి కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. వాళ్ళూ, నేనూ మామా అల్లుళ్ళలా కాదు... మంచి ఫ్రెండ్స్‌లా ఉంటాం. (నవ్వులు...) ఇదుగోండి... ఇవాళ వినాయక చవితి పండగ కదా! భోజనానికి రావాలి. ఇంకా రాలేదు. వాళ్ళ కోసమే చూస్తున్నా. (ఎదురుగా టేబుల్ మీద ఉన్న ల్యాండ్‌లైన్ ఇంటర్‌కమ్‌లో మేడ పైకి ఫోన్ చేస్తూ... వాళ్ళింకా రాలేదా అని వివరం కనుక్కున్నారు).
ఇంతకీ, నిజజీవితంలో మీ తాత పాత్ర ఎప్పుడు?
(మళ్ళీ చిరునవ్వుతోనే...) అది పిల్లల చేతుల్లో ఉంది. వాళ్ళ ప్లానింగ్‌ను బట్టి ఉంటుంది. మనుమలు, మనుమరాళ్ళతో ఆడుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే, నిజజీవిత తాత పాత్ర కోసం ఎదురుచూస్తున్నా. అది నాకు ఇంకో ప్రమోషన్.
రాగల అయిదారేళ్ళ తరువాత బాలకృష్ణను ఎలా చూడబోతున్నాం? హీరోగా? దర్శకుడిగా? మంత్రిగా? ముఖ్యమంత్రిగా?
(చిరునవ్వు చిందిస్తూ...) నేనెప్పుడూ ఏదీ ముందు ప్లాన్ చేయను. సమయాన్ని బట్టి నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడానికి వెనుకాడను. ఏం జరుగుతుందో వేచి చూద్దాం.
ఆఖరుగా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే... 54 ఏళ్లు. కెరీర్‌కు నాలుగు దశాబ్దాలు. సినిమాలు సెంచరీకి దగ్గర. ఈ క్షణం మీలోని భావాలు?
(నవ్వుతూ...) నాది ఎప్పుడూ ముందు చూపే. జరిగిపోయినదాని మీద కన్నా జరగబోయే దాని మీదే నా దృష్టి! నా 14వ ఏట తొలిసారిగా కెమేరా ముందుకు వచ్చా. నలభై ఏళ్ళుగా ఈ రంగంలో ఉండడం, ఇన్ని సినిమాలు, ఇన్ని రకాల పాత్రలు చేయడం పూర్వజన్మ సుకృతం. పుణ్యదంపతులైన నా తల్లితండ్రులు, అభిమానుల ఆశీర్వాద ఫలం. నా పాత్రలు, సినిమాల గురించే తప్ప, ఏళ్ళు, సినిమాల లెక్కపైన ధ్యాస లేదు. అప్పుడూ, ఇప్పుడూ అదే హుషారు. ఇవాళ్టికీ సినీరంగంలో నేను ఓ విద్యార్థినే! అప్పుడే నలభై ఏళ్ళు గడిచిపోయాయా అనే ఆలోచన కన్నా మరో నలభై ఏళ్ళు ముందు ఉందన్న ఉత్సాహం ఇవాళ్టికీ ఉంది.
- ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ
వాడి మీద నాకు చాలా ఆశలున్నాయి!
మీ అమ్మ గారి పేరు కలిసొచ్చేలా అబ్బాయికి పేరు పెట్టినట్లున్నారు?
అవును. ‘మోక్షజ్ఞ’ అనేది నాన్నగారు పెట్టిన పేరు. నేను అమ్మ గారి, నాన్న గారి పేరు కలిసొచ్చేలా ‘తారకరామ’ అనీ, ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి పేరు కూడా వచ్చేలా ‘తేజ’ అనీ చేర్చి, ‘తారకరామ తేజ మోక్షజ్ఞ’ అని పెట్టా.
ఇంతకీ మోక్షజ్ఞ తెరపైకి ఎప్పుడొస్తున్నాడు?
(నవ్వేస్తూ...) వచ్చేస్తాడు. వాడికి సినిమాలంటే చాలా ఆసక్తి. ప్రస్తుతం అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (బి.బి.ఎం) చదువుతున్నాడు. హీరోగా రావడానికి మరో రెండు, రెండున్నరేళ్ళు పడుతుంది. వాడి మీద నాకు చాలా ఆశలున్నాయి!
అమ్మతోనే ఎక్కువ సమయం గడిపా!
నవ మాసాలూ మోసి, పేగు తెంచుకొని పుట్టిన మనకు ప్రాణమిచ్చేది తల్లి. మన సంప్రదాయం ప్రకారం అమ్మ ప్రత్యక్షదైవం. ‘మాతృదేవోభవ’ అని అందరి కన్నా ముందు తల్లిని కొలిచాక, ఇతరులకు మొక్కాలి. మా చిన్నప్పటి నుంచి నాన్న గారు బిజీ కాబట్టి, అమ్మతోనే ఎక్కువ సమయం గడిపాను. నా ఆరో ఏటే హైదరాబాద్ వచ్చేశా. అప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. నా చదువంతా ఇక్కడే. షూటింగ్‌ల వల్ల మాతో గడిపేందుకు నాన్నగారికి టైమ్ దొరికేదే కాదు. మా ఆలనాపాలనా, చదువులు అన్నీ అమ్మే చూసింది. ఇప్పటికీ, ఉదయాన్నే మా అమ్మానాన్నల పటానికి నమస్కరించి కానీ బయటకు వెళ్ళను.
- ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 31st August 2014, Sunday)
...................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment