వింటే భారతం వినాలి! తింటే గారెలే తినాలి! అన్న సామెతకు కొనసాగింపు అన్నట్లు, చూస్తే నర్తనశాల చూడాలిః అన్నంతగా ఈ మహాభారత కథా చిత్రం తెలుగు వారి గుండెల్లో నిలిచింది. భారత ప్రభుత్వం ఏటా ఉత్తమ చలనచిత్రాలకు ఇచ్చే జాతీయ అవార్డుల్లో భాగంగా, 11వ జాతీయ అవార్డుల్లో 1963వ సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో ద్వితీయ ఉత్తమ చలన చిత్రంగా నిలిచిన ఘనత నర్తనశాలఃది. ఆ ఏడాది ఫీచర్ ఫిల్ములు, బాలల చిత్రాలు, విద్యా విషయక చిత్రాలు, డాక్యుమెంటరీలు కలసి మొత్తం 128 ఎంట్రీలు అవార్డుల బరిలో నిలిచాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి పోటీపడిన 70 ఫీచర్ ఫిల్ముల్లో, మన తెలుగు నర్తనశాలః ద్వితీయ స్థానంలో నిలవడం విశేషం. అలా ఆలిండియా మెరిట్ సర్టిఫికెట్‌ః, నిర్మాత, దర్శకులకు నగదు బహుమతులు దక్కాయి.
చిత్రం ఏమిటంటే, తెలుగు సినిమాకు జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం కేటగిరీలో అలా అవార్డు రావడం అదే మొదటి సారి, ఆఖరుసారి కూడా! అప్పటి నుంచి ఇప్పటి దాకా మరి ఏ ఇతర తెలుగు చిత్రం ఇలా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం విభాగంలో మాత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి అవార్డు సాధించలేదు. ప్రత్యేక జ్యూరీ అవార్డు (శంకరాభరణం-1979), జాతీయ సమగ్రతా చిత్రం అవార్డు (రుద్రవీణ-1988), బాలల చిత్రం (చిన్న ఎన్టీయార్ 'రామాయణం'-1997), ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అవార్డులకే పరిమితమయ్యాయి.
కాగా, అదే 1963కు గాను నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లోనే ప్రాంతీయ విభాగంలో తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా లవకుశ ఎంపికైంది. రాష్ట్రపతి నుంచి రజత పతకం పొందింది. 'నర్తనశాల' కన్నా కొద్ది నెలల ముందు విడుదలైన లవకుశలో కూడా హీరో ఎన్టీయార్ అయితే, ఆర్ట్ డైరెక్టర్ టి.వి.ఎస్. శర్మే! ఇంగ్లీష్ సినీ పక్షపత్రిక ఫిలిమ్ ఫేర్ ఆ ఏడాది నుంచి దక్షిణాది చిత్రాలకు కొత్తగా అవార్డులివ్వడం మొదలుపెట్టింది. అలా ఆ తొలి ఏడాదే ఃఫిలిమ్ ఫేర్‌ః వారి అవార్డు కూడా ఉత్తమ తెలుగు సినిమాగా ఃనర్తనశాలః కే వచ్చింది. ఫిలిమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారి తెలుగు చిత్రాల పోటీలోనూ ప్రథమ స్థానంలో నిలిచి, అవార్డును అందుకుంది.
ఇక, ఈ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపూ లభించింది. 1964 ఏప్రిల్‌లో ఇండొనేషియాలోని జకార్తాలో జరిగిన 3వ ఆఫ్రో- ఏషియన్ చలనచిత్రోత్సవంలో నర్తనశాలః ప్రదర్శితమైంది. ఇరవై ఏడు దేశాల చలనచిత్రాలు పాల్గొన్న ఆ చిత్రోత్సవంలో భారతదేశం నుంచి వెళ్ళిన ఏకైక చిత్రం నర్తనశాలే! ఆ ఉత్సవంలో నటనా విభాగంలో ఎస్వీ రంగారావుకూ, ఉత్తమ కళా దర్శకుడిగా టి.వి.ఎస్. శర్మకూ అవార్డులు లభించాయి. తెలుగు సినిమాకూ, తెలుగు వారికీ దక్కిన అపురూపమైన గౌరవం అది. కానీ, దురదృష్టవశాత్తూ ఆ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం, నటి, దర్శకుడు లాంటి విభాగాల్లో అవార్డులెవరికి దక్కాయన్నది తెలియరావడం లేదు.
ఏమైనా, ప్రసిద్ధ వార్తా టీవీ చానల్ సి.ఎన్.ఎన్ - ఐ.బి.ఎన్. ఆల్‌టైమ్ గ్రేట్ అయిన నూరు భారతీయ చలనచిత్రాలను ఈ మధ్య ఎంపిక చేసినప్పుడు ఆ జాబితాలోని పదే పది తెలుగు చిత్రాల్లో కూడా 'నర్తనశాల' స్థానం సంపాదించుకుంది. శతవసంతాలు పూర్తి చేసుకున్న భారతీయ ఫీచర్‌ఫిల్ముల చరిత్రలో సరిగ్గా సగం వయస్సున్న ఈ చిత్రం గొప్పదనానికి ఇవన్నీ తిరుగులేని రుజువులు.
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, ఆదివారం అనుబంధం స్నేహ, 6 అక్టోబర్ 2013, పేజీ నం. 15లో ప్రచురితం)
...............................................................................
1 వ్యాఖ్యలు:
అన్నీ సమపాళ్ళలో మేళవించిన ఒక అరుదైన రసాయనం నర్తనశాల!ఇంతవరకు తెలుగులో ద్వితీయ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు ను అందుకున్నది అదే!ఆ సంవత్సరం ప్రథమ స్థానం పొందినది సత్యజిత్ రాయ్ బెంగాలీ చిత్రమని నా జ్ఞాపకం!ఎస్వీఆర్,నందమూరి,సావిత్రి ఎవరికీ సాటి వారే!నర్తనశాల చూడటం ఒక రసమయ ప్రపంచంలోకి అడుగు పెట్టడం!ఓహ్!
Post a Comment