జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, February 13, 2015

పాటకి రెక్కలొచ్చిన వేళ - బాలాంత్రపు రజనీకాంతరావు

ప్రముఖ వాగ్గేయకారుడు బాలాంత్రపు రజనీకాంతరావు జన్మదినం నేడు (January 29th). ఈ సందర్భంగా ‘సాక్షి’ ‘ఫ్యామిలీ’ ప్రత్యేకంగా అందిస్తున్న ఆత్మీయ వ్యాసాలివి. 
పాటకి రెక్కలొచ్చిన వేళ

‘క్షితిజరేఖలపై వ్యాపిస్తూ...’ (ఎక్స్‌టెండింగ్ హొరైజన్స్) అనే శీర్షిక కింద నా గురించి నన్నే చెప్పమని ప్రప్రథమంగా ఇంగ్లండ్‌కు ఆహ్వానించిన మీ అందరికీ కృతజ్ఞతలు. టంగుటూరి సూర్యకుమారిగారి భర్త హెరాల్డ్ కూడా ఇక్కడే ఉన్నారు. నాకెంతో ఆనందం కలిగించే విషయం ఇది.

మా స్వగ్రామం పిఠాపురం చిన్న ఊరు. పక్కనే పెరుగుతున్న నగరంగా కాకినాడ ఉంది. అక్కడి నుండి నేను వాల్తేరు విశ్వవిద్యాలయం చదువులకు వెళ్లేసరికి క్షితిజ రేఖలు వ్యాపించినట్లు తోచింది. తరువాత జీవితంలో అనేక పెద్ద నగరాలలో పని చేశాను. పుట్టిన ఊరు, ఇంటిపట్టు పై బెంగలూ అవీ పోయి పరస్థలంలో జీవించడానికీ, కొత్త దినచర్యకీ అలవాటు పడ్డాను. జీవిక కోసం మద్రాసు వెళ్లాను. రేడియో స్టేషను పరిచయమయింది. విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే ఈ స్థాయిలో పాడగలిగే స్థాయి నాకుండేది. నా చిన్నతనంలో ఎవరో పాడుతుంటే తాళం వేయడం - పాతకాలపు ‘కండక్టింగ్’ అంటారే - అది తెలుసు.

1941లో కాంట్రాక్టు పద్ధతిపై మద్రాసులో రేడియోలో కొన్ని సంగీత కార్యక్రమాలు చేశాను. రేడియోకి నా మొదటి నాటకం శ్రీశ్రీ రాసినదీ, ఎస్. రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించినదీ దాంట్లో పాల్గొన్నాను. తర్వాత ‘చండీదాసు’ అనే సంగీత నాటకం పూర్తిగా నేనే రాసి, సంగీతం సమకూర్చి నేనూ పాల్గొన్నాను. అందులో చండీదాసు పాత్ర వేసినది నేనే. దీనికి సంగీత దర్శకుడు రాజేశ్వరరావు. అంటే పాటల్లో పాటకీ పాటకీ మధ్యలో ఉండే నేపథ్య సంగీతం ఆయన ఇచ్చాడు. బి.జి.ఎమ్ చేశాడన్నమాట. ఇది 1941 ఫిబ్రవరిలో. ఆ తరువాత కృష్ణశాస్త్రిగారి నాటకాలు ఒకటి, రెండు ఆ సంవత్సరంలోనే చేశాను. శర్మిష్ఠ అని ఒకటి. శర్మిష్ఠలో కొమ్మూరి పద్మావతి ఒక పాత్ర - దేవయాని పాత్ర - వేసింది. 1941 మార్చి 21 నాడు ఉగాది నాడు అది. అప్పట్లో బళ్ళారి రాఘవ గారితో ఆవిడ నాటకాలు వేస్తూ ఉండేవారు. ఈ నాటకంలో కృష్ణశాస్త్రిగారు యయాతిమహారాజు. దేవయాని వయోధికురాలైన రాజపత్ని. శర్మిష్ఠ -రాజు యొక్క యువపత్ని పాత్ర. టంగుటూరి సూర్యకుమారి వేశారు. గుర్తుందా, సూర్యకుమారిగారూ! (మీరు పాడితే గుర్తుకొస్తుంది అంటారు ఎదురుగా ఉన్న సూర్యకుమారి గారు. రజని ‘నవ నవ వసంత చలనముల లాస్యముల భవదమృత లావణ్యచరణ విలసమ్ము’ అంటూ పాడతారు).

స్టూడియోలో వాద్య బందాన్ని నిర్వహించడం, 1-2-3 అని నేను చెప్పడం, వారు వాయించడం - ఈ ధోరణి అంతా ఒక వ్యసనంలా మనసుకి పట్టేసింది. మళ్లీ నేను రేడియోకి పోవాలి పోవాలి అని మనసు చెప్పినపుడు తపన కొద్దీ నేను రేడియోలో ఉద్యోగంలో చేరాను.
 అక్కడ లలిత సంగీతశాఖలో కార్యక్రమాల్లో ఈవిడ (సూర్యకుమారి) చేత అప్పుడప్పుడూ, ఒకొక్కసారి ఏడెనిమిది పాటలు, లేకపోతే రాజేశ్వరరావు చేత, అలాగే బాలసరస్వతి చేత కొన్ని పాటలు పాడించేవాడిని. నా పాటల్లో ఈవిడ (సూర్యకుమారి) పాడినన్ని పాటలు ఇంకెవరూ పాడలేదు. ఈవిడ ఇక్కడికి రావడం, పాడే ‘పెర్‌ఫార్మింగ్ సొసైటీ’ అని స్థాపించి సృజనాత్మక కార్యక్రమం చేస్తూండడం ఎంతో బావుంది. ఆవిడ చెప్పినట్లు ఈ కార్యక్రమాలకి నేను తప్పక సహకరిస్తాను.

క్షితిజరేఖలు వ్యాపించటం అన్నారు కదా! ఉద్యోగ రీత్యా రేడియో స్టేషన్లు కర్సియాంగ్, డార్జిలింగ్, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరు - ఇలా దేశం అంతా తిరిగాను. ఇప్పుడు ఇక్కడ, కొన్ని వారాలలో అమెరికాలోనూ తెలుగు సోదరులను కలుస్తూ సంస్కృతీసంపర్క సమావేశాలలో పాటలు పాడుతుంటే వాళ్లకు తెలుస్తుంది. గుర్రం కళ్లేలు పట్టుకొని అల్లల్లాడి సవారీ చేస్తున్న వాడికి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది వాళ్లకు.

మీరు వింటూ ఉంటే, మీ కళ్లకేసి చూస్తూ నేను సంగతులు వేస్తూ పాడుతుంటే, ఆ కళ్లెం లాటిది నా చేతుల్లో నా హృదయానికి తగుల్తూంటుంది. నా పాటల ద్వారా నా పాడడం ద్వారా గేలప్పింగ్ చేస్తూ పోతున్నట్లుంటుంది. 

(1984లో బ్రిమింగ్ హామ్ (లండన్)లో రజని తన పాటలు పాడిన సభలో యథాలాపంగా చెప్పిన రికార్డింగ్ నుండి)

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
.............................................

0 వ్యాఖ్యలు: