తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో పూసపాటి బుల్లెబ్బాయి (సుమంత్). పదో తరగతి పధ్నాలుగు సార్లు ఫెయిలైన అతగాడికి పెళ్ళి, అమెరికాకు వెళ్ళడం అనేవి అందని చందమామలుగా అనిపిస్తుంటాయి. ఇంతలో అతని బంధువైన హీరోయిన్ నీలవేణి (పింకీ సావిక) అమెరికా నుంచి వస్తుంది. ఆమెకు తమ సామాజిక వర్గంలోనే పెళ్ళి చేయాలని ఆమె తండ్రి భావిస్తాడు. వచ్చిన సంబంధాన్నల్లా తిరగ్గొట్టే హీరోయిన్, అప్పటి దాకా తాను పదే పదే గొడవ పడిన హీరోతో పెళ్ళికి సిద్ధమవుతుంది.
ఈ పెళ్ళి చేసుకొని,అమెరికా వెళ్ళాక రెండు నెలల్లో విడాకులు ఇచ్చేస్తాను, వేరొకరిని పెళ్ళి చేసుకుంటానంటూ హీరోకు ముందే చెప్పేస్తుంది. అయినా సరే హీరో సరేనని ఒప్పుకుంటాడు. అక్కడికి ఫస్టాఫ్ అయిపోతుంది. పెళ్ళయిన వాళ్ళిద్దరూ అమెరికాకు వెళతారు. అక్కడ ఏమైంది, నిజంగానే హీరోయిన్ మరొకరిని ప్రేమించిందా? మరి హీరో ఏం చేశాడు? లాంటివన్నీ మిగతా కథ.
రెండున్నర గంటలకు ఓ అయిదారు నిమిషాలు తక్కువ నిడివి ఉన్న ఈ 'యు/ఏ' చిత్రంలో కథలో, పాత్రల ప్రవర్తనలో లోపాలు కొల్లలు. పక్కా పల్లెటూరిలో పుట్టి పెరిగిన హీరోయిన్ అమెరికా నుంచి వచ్చేటప్పటికి మాత్రం తానేదో విదేశాల్లో పుట్టి పెరిగిన దానిలా ఆలోచిస్తుంటుంది, ప్రవర్తిస్తుంటుంది. అది అలా ఉంటే, హీరోతో ఎప్పుడూ తగాదా పడే ఆ అమ్మాయి ఉన్నట్టుండి అతనికి ముద్దుపెట్టి, పెళ్ళికి సిద్ధపడడానికి కారణం ఏమిటో అర్థం కాదు. మరోపక్క అమెరికా వెళ్ళగానే విడాకులు ఇచ్చేస్తానని చెప్పాక కూడా ఆమెతో పెళ్ళికీ, అమెరికా వెళ్ళడానికీ ఎందుకు ముందుకు వచ్చినట్లు? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలెన్నో ప్రేక్షకులను గందరగోళపెడతాయి.
ఫస్టాఫ్‌లో వచ్చే గోదావరి జిల్లా వేళాకోళాలు, వెక్కిరింతలు కొద్ది క్షణాలు ఫరవాలేదనిపించినా, ఆ తరువాత మరీ అతి అనిపించేస్తాయి. సీరియల్ తరహాలో కాంచి, తన మిత్ర బృందంతో చేసిన కామెడీ కూడా అంతే! ఫస్టాఫ్ అంతా పల్లెటూరి వాతావరణంలో నడిస్తే, సెకండాఫ్ అమెరికా నేపథ్యంలో సాగుతుంది. కథ అమెరికాకు మారాక సీన్ల వెంట సీన్లు వచ్చి వెళుతుంటాయే తప్ప, వాటిలో చెప్పిన విషయం కానీ, నడిచిన కథ కానీ చాలా తక్కువ. దాంతో, ఇంటర్వెల్ తరువాత పది, పదిహేను నిమిషాలకే ప్రేక్షకులకు సినిమా చివరి సీను తెలిసిపోతుంది. ఆద్యంతం సినిమా చూశాక దానితో తమకు కలిగే తలనొప్పి రిజల్టూ అర్థమైపోతుంటుంది.
అసలు ఈ కథను ఎంచుకోవడంలోనే లోపం ఉంది. సంగీత దర్శకుడు కీరవాణికి సోదరుడైన కాంచి ఇతివృత్తం వరకే కాదు... చివరకు దానికి రచనలోనూ కొత్తదనం చూపలేకపోయారు. త్వరలోనే దర్శకుడి అవతారం కూడా ఎత్తాలని అనుకుంటున్న ఆయన ఇలాంటి ప్రాథమికమైన తప్పులు చేయడం ఆలోచనలో పడేస్తుంది. ఇక, దర్శకుడి కథనమూ అంతే! ఫస్టాఫే అంతంత మాత్రంగా ఉందని అనుకుంటే, సెకండాఫ్‌కు వచ్చేసరికి గుర్రం పూర్తిగా పడుకుండిపోయింది. కీరవాణి మార్కు సెంటిమెంట్ గీతాలాపనలు, వయొలిన్ వాదన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లు కూడా గుర్రాన్ని నిలబెట్టలేకపోయాయి.
ఈ కథకు, కథానాయకుడి పాత్రకు సుమంత్ ఏ మాత్రం సరిపోయినట్లు అనిపించరు. మంచివాడైన పల్లెటూరి యువకుడు పూసపాటి బుల్లెబ్బాయి పాత్రలో చురుకుగా కనిపించాలనీ, చాలా ఫ్రీగా, ఓపెన్‌గా నటించాలనీ ఆయన భావించారు. అందుకు ప్రయత్నించారు కూడా! కానీ, తీరా తెర మీద చూస్తే, ఆయన అభినయం అత్యంత కృతకంగా కనిపిస్తుంది. సుమంత్ ఆడగెటప్‌లో కూచిపూడి తరహా డ్యాన్స్ చేస్తూ కనిపించే 'సంపంగి పువ్వు లాంటి దాన్ని రా...' పాట కాసేపు ఎంటర్‌టైనింగ్‌గా అనిపించినా, కథకు పెద్దగా అవసరం లేని పాట అది. కాకపోతే, కథకు ఓ ఐటమ్ సాంగ్‌గా పనికొచ్చిందనుకోవాలి.
కథానాయికగా తెర మీదకు వచ్చిన థారు నటీమణి పింకీ సావిక (తొలి పరిచయం) అందానికీ, అభినయానికీ - రెంటికీ తక్కువే. ఇక, సినిమాలో ఫస్టాఫ్ నడపడానికి కాంచి, బృందం, సెకండాఫ్ నడపడానికి 'తాగుబోతు' రమేశ్ కనిపిస్తారు. కానీ, వాళ్ళ సినిమాల జాబితాలో మరో అంకె పెరిగిందేమో తప్ప, సినిమాకు ఉపయోగపడింది తక్కువ. ఫస్టాఫ్‌లో కాసేపు అన్నపూర్ణ, సుధ, శివన్నారాయణ లాంటివాళ్ళు కనిపిస్తారు.
సినిమా చిత్రీకరణకు ఎంచుకున్న లొకేషన్లు, కలర్ స్కీముల వరకు బాగానే అనిపిస్తాయి. అమెరికా పేరు చెప్పి, అత్యధికంగా బ్యాంకాక్ లాంటి చోట్ల తీసినట్లు అర్థమవుతుంది. అయితే, ఆసక్తి లేని మందగమనపు కథనంతో అవేవీ ఉపయోగపడలేదు. పైగా, కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీసిన దర్శకుడు కొన్ని చోట్ల అపాన వాయువు జోకులు, ''సెకండ్ హ్యాండ్ కన్నా నా హ్యాండే బెటర్'' అంటూ హీరోతో అశ్లీలార్థం ధ్వనించే డైలాగులకు దిగకుండా ఉండాల్సింది. వెరసి, ఇప్పటి దాకా 'ఫీల్ గుడ్' సినిమాలు ఎక్కువ తీసిన చంద్రసిద్ధార్థ తాజా చిత్రంలో అటు ఫీలూ లేదు. కనీసం గుడ్ సినిమా అయినా కాకుండా పోయింది. తీసుకున్న కథను కూడా ఆసక్తికరంగా, మనస్సుకు హత్తుకొనే సెంటిమెంట్ సీన్లతోనైనా చెప్పకపోవడంతో ఈ కుంటి గుర్రం ఎగరడం మాట దేవుడెరుగు... కనీసం కుంటు కుంటూ నడవను కూడా నడవలేకపోయింది! ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న హీరో సుమంత్ కానీ, దర్శకుడు చంద్రసిద్ధార్థ కానీ తమ కెరీర్‌లో పైకి ఎదగాలన్నా, ఎగరాలన్నా మరికొంత వేచి ఉండక తప్పదు!
కొసమెరుపు: ఆర్థిక ఇబ్బందులు వచ్చి, అనుకున్న దాని కన్నా ఒక రోజు ఆలస్యంగా శనివారం నాడు విడుదలైన ఈ సినిమా.... నిజానికి కథంతా చూశాక కనీసం ఓ పాతికేళ్ళ క్రితం రావాల్సినదని అనిపిస్తుంది. సినిమా చివరలో కనువిప్పు కలిగిన హీరోయిన్ 'లైఫ్ అనేది మిస్టరీగా ఉండాలి' అంటుంది. ముందే అన్నీ పక్కాగా ప్లాన్ చేసేసి, అలానే బతకడాన్ని నిరసిస్తూ, 'ఐ డోంట్ వాంట్ టు లివ్ ది సేమ్ లైఫ్ ఎగైన్' అని కుండబద్దలు కొడుతుంది. కానీ, అదే సూత్రాన్ని తాము తీసుకున్న కథకూ, తీసే సినిమాకూ అప్లరు చేయడం దర్శక, రచయితలు మర్చిపోయినట్లున్నారు! చూసేసిన చాలా సినిమాల్లో ఉన్న అదే రకం కథను ప్రేక్షకులు ఇంకోసారి చూస్తారంటారా?
- రెంటాల జయదేవ
(Published in 'PrajaSakti' daily, 26th Jan 2014, Sunday, PageNo.8)
.......................................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment