జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 28, 2013

ప్రేక్షకుల టైము, డబ్బు దోపిడీయే... (డి ఫర్ దోపిడి - సినిమా సమీక్ష)

(ఇది 10 టి.వి.లో ప్రసారం చేసిన సమీక్ష)

టాలీవుడ్ లో ఈ మధ్య హీరోలు కూడా నిర్మాతలుగా మరుతున్నారు. అలా హీరో నాని తొలిసారి నిర్మాతగా మారిన సినిమా 'డి ఫర్ దోపిడి'. వరుస ఫ్లాప్ లతో ఇబ్బంది పడుతున్న వరుణ్ సందేశ్, సోలోగా నటించిన తొలి సినిమా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో హిట్ కొట్టిన సందీప్ కిషన్ ఈ చిత్రంతో మరో సారి తమ లక్ ను పరీక్షించుకోబోతున్నారు. కథ నచ్చి దిల్ రాజు కూడా నిర్మాణంలో భాగస్వామ్యమైన 'డి ఫర్ దోపిడి' ఈ బుధవారం 'క్రిస్ మస్' సందర్భంగా మన ముందుకు వచ్చింది. మరి కమర్షియల్ లుక్ సంతరించుకొని వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మనస్సును దోపిడి చేయగలిగిందా..? లేదా..? అనేది చూద్దాం.

     కథ విషయానికి వస్తే:.. కష్టపడే తత్వం లేకుండా దురలవాట్లకు బానిస అయిన నలుగురు అబ్బాయిల కథ ఈసినిమా. విక్కీ (సందీప్ కిషన్), రాజు (వరుణ్ సందేశ్), (హరీష్ నవీన్), బన్నీ (రాకేష్) అనే నలుగురు స్నేహితులు అమ్మాయిలపై వ్యామోహం, మద్యానికి బానిసవుతారు. లక్ష్యం లేని జీవితాలతో తిరగడం వల్ల వీరికి కష్టాలు కూడా త్వరగానే వస్తాయి. తమ అందరి కష్టాలు తీరాలంటే 45 లక్షల రూపాయలు దొంగతనం చేయాలని భావించిన నలుగురు హీరోలు.. 'ఏపీ నేషనల్ బ్యాంక్' దోపిడికి సిద్ధపడతారు. అలా బ్యాంక్ లోకి వెళ్లిన వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది. ఆ తర్వాత ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు జరిగాయనేది మిగతా కథ.     విశ్లేషణ:.. ఈ సినిమాతో దర్శకుడు 'సిరాజ్ కల్లా' క్రైమ్ ను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు. హీరోలను దొంగలుగా చూపి రాబరీ కథలతో ఒప్పించాలంటే దర్శకుడికి ఎంతో నేర్పు కావాలి. హీరోలు దొంగతనాలు చేసేందుకు బలమైన కారణం చూపించాలి. ఓ దొంగతనం వెనకాల మంచి కారణాలు ఉన్నప్పుడే అలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి. కానీ పనీ పాటా లేని ఆకతాయిలు చేసే దొంగతనాలను పాజిటివ్ గా చెప్పాలనుకునే కథలు మాత్రం 'డి ఫర్ దోపిడి'లా ఎందుకూ పనికి రాకుండా పోతాయి. దోపిడి ఇతివృత్తంతో చేసే సినిమాలకు స్క్రీన్ ప్లే, మాటలు చాలా ముఖ్యం. సినిమాను నిలబెట్టేవి కూడా ఇవే. కానీ డి ఫర్ దోపిడిలో పసలేని స్క్రీన్ ప్లే, డైలాగ్స్ వల్ల సినిమాను ఫ్లాప్ లిస్ట్ లోకి పంపించాయనే చెప్పాలి.


    నటీనటుల విషయానికి వస్తే.. దీనిలో ఏ ఒక్క నటుడు ఆకట్టుకోలేకపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఆ అవకాశం దర్శకుడు ఇవ్వలేదు. చాలా సులువైన కథ కాబట్టి నటించడానికి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. మొదట్లో పాత్రలను పరిచయం చేసేటప్పుడు వచ్చే నాని వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటుంది. సందీప్ కిషన్, వరుణ్ సందేష్ తో పాటు మిగిలిన ఇద్దరు కొత్త నటులు నటించే ప్రయత్నం చేశారు. సినిమా టెక్నీషియన్స్ లో ఎవ్వరి పనితనం కనిపించలేదు. అక్కడక్కడా డైలాగ్స్ నవ్వించాయి. పాటలు లేకపోవడం వల్ల సినిమా పెద్ద బోర్ గా మారింది. స్ర్కీన్ ప్లే అదుపుతప్పింది. లొకేషన్లు చాలా తక్కువగా ఉంటాయి. కనిపించినవే పదేపదే చూడాల్సి రావడంతో సినిమాపై ఆసక్తి తగ్గింది. ఈ చిత్రంలో దర్శకుడి వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది. గతంలో 'ఐతే' అనే సినిమా సేమ్ లైన్ తోనే వచ్చింది. అయితే...చంద్రశేఖర్ యేలేటి స్క్రీన్ ప్లే, మాటల విషయంలో తీసుకున్న జాగ్రత్త ఆ సినిమాను సక్సెస్ చేసింది.

ఓవరాల్ గా 'డి ఫర్ దోపిడి' యావరేజ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాకు ఒకే ఒక్క ఫ్లస్ పాయింట్ అదే సినిమా నిడివి తక్కువగా ఉండటం. దీనివల్ల త్వరగా థియేటర్లోంచే భయటపడే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.

ప్లస్ లు:.. నాని వాయిస్ ఓవర్, తక్కువ నిడివి.
మైనస్ లు:.. దర్శకుడితో సహా అన్ని మైనస్ లే.

డి ఫర్ దోపిడి ఒక్క లైన్ లో చెప్పాలంటే ప్రేక్షకుల విలువైన టైం ను దోపిడి చేసింది. 
ఇక ఈ సినిమాకు '10టివి' ఇచ్చే రేటింగ్.. 1/5. 
...................................

0 వ్యాఖ్యలు: