సినీ ప్రేక్షకులు ఈ ఏడాది ఎన్నో అంచనాలతో ఎదురుచూసిన సినిమాల్లో ఒకటి - 'ధూమ్ 3'. ఇప్పటికే బాగా పాపులర్ అయిన 'ధూమ్' సిరీస్‌లో ముచ్చటగా మూడోదైన ఈ సినిమా శుక్రవారం నాడు దేశ, విదేశాల్లో కలిపి వేల థియేటర్లలో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. 'ధూమ్' సిరీస్‌లో కీలకమైన దొంగ పాత్రను ఈ సారి అమీర్ ఖాన్ పోషించడం ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. మరి, ఈ తాజా చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందా?
ఎప్పటిలానే 'ధూమ్'లోని ఈ మూడో భాగం కూడా దొంగ, పోలీసు ఆట కథే! కాకపోతే, ఈసారి కథ అంతా అమెరికాలోని చికాగోలో జరుగుతుంది. చికాగోలో 'గ్రేట్ ఇండియన్ సర్కస్' పేరిట ఓ సర్కస్ కంపెనీని నడుపుతుంటాడు ఇక్బాల్ (జాకీ ష్రాఫ్). అయితే, తీసుకున్న భారీ అప్పు తిరిగి చెల్లించలేకపోతున్నాడంటూ, అప్పిచ్చిన 'వెస్ట్రన్ బ్యాంక్ ఆఫ్ చికాగో' ఆ సంస్థను మూసివేయిస్తుంది. దాంతో, సర్కస్ ఇంద్రజాలం చేసే తన సంతానాన్ని అనాథగా మార్చి, ఆత్మహత్య చేసుకుంటాడు తండ్రి. అది కళ్ళారా చూసిన కొడుకు పెద్దవాడవుతాడు (అమీర్‌ఖాన్). అతనికి సర్కస్‌లో సహ కళాకారిణి ఆలియా (కత్రినా కైఫ్). అతను ఓ పక్కన తమ సర్కస్ కంపెనీని ఓ పక్క నడుపుతూనే, మరోపక్క తానెవరన్నదీ ఎవరికీ తెలియకుండా ఆ బ్యాంక్‌ను పదే పదే దోచుకుంటూ, దెబ్బ తీస్తుంటాడు. అది మూతబడేలా చూడాలన్నది అతని ఆశయం. చోరీ చేసిన ప్రతిసారీ అక్కడ హిందీలో ఓ సందేశం వదిలి వెళుతుండడంతో, భారత్ నుంచి జై దీక్షిత్ (అభిషేక్ బచ్చన్), అతని సహచరుడు అలీ (ఉదరు చోప్రా)లను అమెరికాకు రప్పిస్తారు.
ఇక, దొంగ - పోలీసు ఆట మొదలు. ఆ క్రమంలో సర్కస్ నిర్వాహకుడి గురించి ఓ పెద్ద సీక్రెట్ బయటకు వస్తుంది. అక్కడ నుంచి ఇక ద్వితీయార్ధం. ఆ రహస్యం ఏమిటి, దాని ద్వారా దొంగను పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు, దానికి దొంగ చేసిందేమిటి, ఈ మధ్యలో సహ సర్కస్ కళాకారిణితో ప్రేమానుబంధం, చివరకు దొంగను పట్టుకున్నారా లాంటివన్నీ వెండితెరపై చూడాలి.
గత రెండు 'ధూమ్' భాగాలకూ దర్శకుడు సంజరు గఢ్వ. కానీ, ఈసారి దర్శకుడు మారాడు. ఇప్పటి దాకా ఈ 'ధూమ్' సిరీస్‌కు విడవకుండా రచయితగా వ్యవహరిస్తున్న విజరు కృష్ణ ఆచార్యే ఈసారి దర్శకత్వమూ వహించాడు. రచయితే దర్శకుడు కావడంతో సినిమాను బాగానే నడిపించాడు. అయితే, సినిమాలో లాజిక్‌లు ఉండవు. బోలెడన్ని హాలీవుడ్ చిత్రాల ఛాయలు ఈ కథలో, స్క్రీన్‌ప్లేలో కనిపిస్తాయి. అన్నిసార్లు అమీర్ ఖాన్ దొంగతనాలు చేస్తూ ఉంటాడు, మళ్ళీ హాయిగా వచ్చి సర్కస్ కంపెనీ నడిపేస్తుంటాడు. అమెరికా లాంటి చోట కూడా ఇలాంటి మామూలు దొంగను పట్టుకోలేకపోతుంటారు. ఇవన్నీ, సినిమా కథల్లో తీసుకున్న స్వేచ్ఛలనుకొని సర్దుకుపోవాల్సిందే.
కథంతా ప్రధానంగా అమీర్‌ఖాన్ పోషించిన సర్కస్ దొంగ పాత్ర, సోదరుడితో అతని అనుబంధమనే పాయింట్ మీద ఆధారపడింది. అందుకే, ఇతర పాత్రల కన్నా కథలో ఒక రకంగా యాంటీ హీరో అయిన అమీరే హైలైట్ అయ్యాడు. సాహిర్, సమర్ అనే రెండు పాత్రల్లో అమీర్ ఖాన్ ఆకట్టుకుంటాడు. ఒక రకంగా ఈ సినిమా అంతా అతని ఖాతాలోకి వెళ్లిపోతుంది. పైగా, అభిషేక్‌కు జోడీ ఎవరూ లేకపోవడంతో అతని పాత్రకు పాటలూ లేవు.
ఇక, అతని స్నేహితుడైన సహ పోలీసు అలీ అక్బర్ పాత్రలో ఉదరు చోప్రా తన డైలాగులతో నవ్వించడానికి ప్రయత్నించినా, సఫలం కాలేదు. కత్రినా విషయానికి వస్తే, ఆమె నటనకు అవకాశమున్న సన్నివేశాలు లేవు కాబట్టి, పాటల్లో, సర్కస్ ఫీట్లలో ఆమెను చూసి సంతృప్తి పడాల్సిందే! ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాల అమీర్‌ఖాన్లుగా నటించిన పిల్లాడు బాగా అభినయించాడు. తండ్రిగా జాకీష్రాఫ్ పాత్రకు తగ్గట్లు ఉన్నారు.
బోలెడంత ఖర్చు, శ్రమతో రూపొందిన సినిమా ఇది. అదంతా తెర మీద తెలుస్తూ ఉంటుంది. అన్నదమ్ములుగా ఇద్దరు అమీర్ ఖాన్‌లూ ఒకే దృశ్యంలో తెరపై కనిపించే తీరు, ఆ సన్నివేశాలు 'వావ్' అనిపిస్తాయి. ఈ సినిమా కోసం డిజైన్ చేసిన మోటార్ బైక్ ఛేజ్‌లతో సహా అనేక యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి. కెమేరా పనితనంతో సహా, పోస్ట్ ప్రొడక్షన్‌లో తీసుకున్న జాగ్రత్తలు తెరపై కనువిందైన దృశ్యాలను పరిచాయి. అలాగే, సర్కస్ విన్యాసాలు, అందుకోసం అమీర్ ఖాన్, కత్రినాలు పొందిన శిక్షణ, చేసిన శ్రమ తెర మీద మంచి ఫలితాన్నిచ్చాయి. ఈ యాక్షన్, సర్కస్ సన్నివేశాల్లో వాళ్ళకు డూప్‌లుగా కనిపించిన వారి కృషినీ మర్చిపోలేం.
కొన్ని చోట్ల చాలా మంచి డైలాగులు హిందీలో ఉన్నాయి. 'నేను ఎవరితో స్నేహం చేయలేదు' అని బయటి ప్రపంచం తెలియకుండా గడిపే సర్కస్ కళాకారుడు ఆమిర్ ఖాన్ అంటే, 'నాతో ఎవరూ స్నేహం చేయలేదు' అని పోలీసు పాత్రధారి అభిషేక్ బచ్చన్‌తో అనిపించడం లాంటివి గుర్తుంటాయి. సినిమా పతాక సన్నివేశం, దానికి దారి తీసే ఘట్టాలు బాగున్నాయి. అన్నదమ్ముల అనుబంధాన్ని మనసుకు హత్తుకొనేలా చేసి, హాలు విడిచి ఇంటికి వెళుతున్న ప్రేక్షకుల గుండెను తాకుతాయి.
అయితే, ఈ సినిమాకున్న మైనస్ ఏమిటంటే, కొద్ది క్షణాలు తక్కువగా దాదాపు మూడు గంటల వ్యవధితో కూడిన సినిమా ఇది. నిజానికి, అంత సేపు చెప్పదగ్గ కథ లేదు. దాంతో, ఇవాళ, రేపు అన్నీ రెండుంబావు, రెండున్నర గంటల లోపు సినిమాలకు అలవాటైపోయిన ప్రేక్షకులు కొంత అసహనానికి గురవుతారు. అసలు ఈ సినిమా ఫస్టాఫ్‌లో దాదాపు 45 నిమిషాలు పాత్రల పరిచయాలు, వగైరాలకే పోయింది. అమీర్‌ఖాన్ ఇంట్రడక్షన్ కదా అని అతనికి ఛేజ్... అతని కన్నా తగ్గకూడదు కాబట్టి, అభిషేక్‌ని తెర మీద తొలిసారి చూపిస్తూ మరో ఛేజ్... పాపం కత్రినాకు మాత్రం తక్కువెందుకు చెయ్యాలని, ఆమెకు ఓ ఇంట్రడక్షన్ డ్యాన్స్ పాట... ఇలా సాగుతుంది.
వేటికవిగా ఇవన్నీ బాగానే ఉన్నట్లు అనిపించినా, హాలులో అప్పటికే పెద్దగా కథ లేకుండా, చాలాసేపు సినిమా చూసేసిన అనుభూతి కలుగుతుంది. సంగీతం, పాటలను చెప్పుకోవాలి. మునుపటి 'ధూమ్' పార్ట్‌లతో పోల్చినా, పోల్చకపోయినా ఇందులో పాటలు గుర్తుంచు కోదగ్గవిగా లేవు. కత్రినా కైఫ్ తదితరులు నర్తించే 'మలంగ్...' పాట మాత్రం భారీగా, చూడముచ్చటేస్తుంది.
మొత్తం మీద ఐ-మ్యాక్స్ ఫార్మట్‌లో రిలీజవుతున్న తొలి భారతీయ భాషా చిత్రం ఇది. అమీర్ ఖాన్ అభినయ ప్రతిభకు, 'డాల్బీ ఎట్మాస్' శబ్ద సాంకేతిక పరిజ్ఞానం కూడా జత కలసిన ఈ భారీ చిత్రాన్ని ఆ రకమైన ఫార్మట్‌లో చూస్తే మరింత కనువిందవుతుంది. అదీ 'ధూమ్ 2'తో పోల్చి చూడకుండా ఉంటే! వెంటనే మరో పోటీ చిత్రమేదీ హిందీలో లేకపోవడంతో క్రిస్మస్ సెలవులు కలిసొచ్చే ఈ చిత్రం వసూళ్ళలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తే ఆశ్చర్యం లేదు.
- రెంటాల జయదేవ
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 21st Dec 2013, Saturday, Page No. 8)
...............................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment