ఒక కథతో ఓ సినిమా వచ్చి సూపర్ హిట్టయ్యాక, దాదాపు అలాంటి కథతోనే కొద్దిగా నేపథ్యం మార్చి మరో సినిమా వస్తే? ఇలాంటి సంఘటనలు తెలుగు సినిమాకు కొత్త కాదు. వినూత్నమైన ప్రచారంతో, కొత్త హీరో హీరోయిన్లతో అందరినీ ఆకర్షిస్తూ, తాజాగా వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' పరిస్థితి కూడా అచ్చంగా అదే!
ఇది ఓ ప్రేమ కథ. గ్రామీణ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ. వివరంగా చెప్పాలంటే... గోదావరి జిల్లాల్లోని పచ్చని పంట పొలాలు, చెరువుల నేపథ్యంలోని కూనవరం గ్రామం. ఆ గ్రామంలో సూరి (తొలి పరిచయం రాజ్ తరుణ్) తండ్రి లేని బిడ్డ. పెద్ద చదువులు చదువుకోని సూరి కోడి పెంటతో చేపల చెరువుకు మేత అందించే వ్యాపారం చేస్తుంటాడు. తల్లిని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ ఇంటి పక్కనే మరో ఇల్లు అతని అమ్మమ్మ, తాతయ్య, మేనమామలది. ఆ మేనమామకు ఓ కూతురు. ఆ మరదలు పేరు ఉమాదేవి (తెలుగులో 'చిన్నారి పెళ్ళికూతురు'గా అనువాదమైన హిందీ సీరియల్ 'బాలికా వధు' ఫేమ్ అయిన అవికా గోరే). బావామరదళ్ళు ఎప్పుడూ ఏవో గిల్లి కజ్జాలు, కొట్లాటలతో కాలం గడిపేస్తూ ఉంటారు.
ఉమాదేవిని ఉడికించడం కోసం మరో అమ్మాయితో ప్రేమ నాటకం ఆడతాడు సూరి. ఆ ఉక్రోషంలో మరో అబ్బాయి పరిచయం కాగానే, అతనికి దగ్గరవుతుంది ఉమాదేవి. ఇంటి నుంచి అతనితో పారిపోవడానికి కూడా సిద్ధపడుతుంది. తీరా అతగాడు ఓ మోసగాడు. ఆఖరు నిమిషంలో బావ సూరి వచ్చి కాపాడతాడు. అక్కడికి ఫస్టాఫ్ అయిపోతుంది.
సెకండాఫ్‌కు వచ్చేసరికి, అలాంటి బావను సిన్సియర్‌గా, సీరియస్‌గా ప్రేమించడం మొదలుపెడుతుంది మరదలు ఉమ. మేనమామతో సవాలు చేసి మరీ, ఆమెకు ఓ గొప్పింటి సంబంధం కుదురుస్తాడు హీరో. తీరా పెళ్ళి కుదిరాక మరదలు పడే ఆవేదన ఏమిటి, అది బావకు ఎలా తెలిసింది, ఆఖరుకు బావామరదళ్ళు కలిశారా, లేదా అన్నది మిగతా కథ.
పరిమితమైన బడ్జెట్‌లో పరిమిత తారాగణంతో తీసిన ఫీల్ గుడ్ సినిమా ఇది. బావమరదళ్ళ గిల్లికజ్జాలు, పల్లెటూళ్ళలో కూడా పెరిగిపోయిన ఆధునిక ప్రేమలు, అనుబంధాలు, స్నేహాల లాంటివి ఈ సినిమాకు ఎస్సెట్. అయితే, ఎప్పటికప్పుడు పాత చిత్రాలు గుర్తుకు వస్తుంటాయి. పైగా, గోదావరి జిల్లా యాసలోని ఆ పాత్రకూ, దాని డబ్బింగ్‌కూ కొత్త నటుడు రాజ్ తరుణ్ (ఈ సినిమాకు కథ, దర్శకత్వ శాఖల్లోనూ ఆయన పనిచేశారు) చక్కగా అతికినట్లు సరిపోయారు. ఇక, తెలుగు వెండితెరకు తొలిపరిచయమైనప్పటికీ, హీరోయిన్‌గా గుజరాతీ అమ్మాయి అవిక సాంప్రదాయిక దుస్తుల్లో చూడముచ్చటగా కనిపించింది. అల్లరి నటనతో ఆకట్టుకుంది. మేనమామ పాత్రధారి కూడా బాగున్నాడు. హీరోయిన్‌తో పెళ్ళికి సిద్ధమయ్యే పాత్రలో మొన్నటి 'సెకండ్ హ్యాండ్' చిత్రంలోని సుబ్బారావు పాత్రధారి దామరాజు కిరీటి కనిపించాడు.
పదమూడేళ్ళ క్రితం వచ్చిన 'నువ్వే కావాలి' సినిమా గుర్తుందిగా! ఆ సినిమా చూస్తే, ఇక ఈ సినిమా కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దాదాపు ఆ ఛాయల్లోనే ఈ సినిమా కూడా నడుస్తుంది. కాకపోతే, అక్కడ హీరో హీరోయిన్లు స్నేహితుల పిల్లలు... పైపెచ్చు తాము కూడా స్వయంగా స్నేహితులు! ఇక్కడ 'ఉయ్యాలా జంపాలా'లో మాత్రం వారిద్దరూ బావా మరదళ్ళు. ఆ సినిమా పట్టణ నేపథ్యంలో నడిస్తే, ఇది గ్రామీణ కథగా నడుస్తుంది. ఇక, ఈ సినిమా క్లయిమాక్స్‌కు వచ్చేసరికి, 'నువ్వే కావాలి'తో పాటు 'నువ్వు నాకు నచ్చావు' లాంటి చాలా కథలు గుర్తుకొస్తాయి. అది ఈ సినిమాకున్న బలం కాకపోగా, పోల్చి చూడడం ఎక్కువయ్యే సరికి బలహీనతగా పరిణమించింది.
ఈ సినిమాకు ఒకరికి నలుగురు డైలాగులు రాశారు. ఇటీవలి సినిమాలన్నిటి లాగానే ఇందులోనూ కాస్త వెటకారపు మాటలతో వినోదం పుట్టించే ప్రయత్నం చేశారు. కొన్నిచోట్ల అందులో సక్సెస్ కూడా అయ్యారు. పరిమిత బడ్జెట్ సినిమా అన్న విషయం తెర మీద కనపడకుండా ఉండేలా కెమేరాను గోదావరి అందాల వైపు బాగానే తిప్పారు. ఇన్ని చేసినా, సినిమాలో సంగీతం కానీ, పాటలు కానీ వినాలనిపించేలా కానీ, విన్నవి గుర్తుండేలా కానీ లేకపోవడం పెద్ద మైనస్. మాట్లాడుతున్నట్లుగా పాట ఉండాలనే ప్రయోగం ఆకట్టుకోదు. టైటిల్ సాంగ్ పిక్చరైజేషనేషన్ కొంత ఫరవాలేదనిపిస్తుంది. పైగా, స్ట్రయిట్ నేరేషన్‌తో కూడిన ఈ కథ కాసేపయ్యేసరికల్లా తరువాత జరిగేదేమిటో ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది.
ఓ దశలో వెండితెరపై ఓ చిన్న డ్రామా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అప్పటి దాకా హీరోయిన్ పట్ల ఏ భావమూ లేనట్లు ఉండే హీరో, తీరా తన తల్లి అన్న ఒక్క మాటతో అంత దిగులుపడిపోయి, తన ప్రేమను తెలుసుకున్నట్లు చూపడం నప్పలేదు. హీరోయిన్ తన మనసులో మాట హీరోతో చెప్పి, తన పెళ్ళికి రావద్దని చెప్పిన ఘట్టం నుంచే కొద్దిగా ప్రేక్షకులకు అనుభూతి కలుగుతుంది. క్లయిమాక్స్‌లో మజ్జిగ గ్లాసుతో నాయిక ప్రవర్తన వెరైటీగా అనిపిస్తుంది.
వెరసి, ఈ గ్రామీణ నేపథ్యపు సినిమా ప్రేమకథతో కన్నా నేపథ్యంతో, ఆకర్షణీయంగా ఉన్న కొత్త ముఖాలతో ఫరవా లేదనిపిస్తుంది. భారీ యాక్షన్‌లు, ఛేజ్‌లకు దూరంగా జరిగే రెండు గంటల నాలుగు నిమిషాల సినిమాయే కాబట్టి, పాస్ మార్కులు వేయాలేమో అనిపిస్తుంది. అతి తక్కువ బడ్జెట్‌లో తీసి, నాగార్జున, డి. సురేశ్‌బాబు లాంటి వారికి అప్పగించిన సినిమా కాబట్టి, వాణిజ్యపరంగా విజయం గురించి పెద్దగా ఆందోళన పడక్కరలేదు. కానీ, సినిమా ట్రైలర్లు, ఆకర్షణీయమైన పోస్టర్లు చూసి, అతిగా ఊహించుకొని వెళితే మాత్రం ఇది ఊపు లేని 'ఉయ్యాలా జంపాలా' అనిపిస్తుంది.
కొసమెరుపు: ఇంతకీ, ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారంటారూ! బహుశా, కుర్ర వయస్సులో ప్రేమకు సంబంధించి, నాయికా నాయకుల్లో ఉన్న ఊగిసలాటకు ప్రతీక అనుకోవాలా? కొత్తగా దర్శకుడైన కుర్రాడు విరించి వర్మను అడగాల్సిందే!
- రెంటాల జయదేవ
(Published in 'Praja Sakti' daily, 26th December 2013, Thursday, Page No.8)
...........................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment