తమిళ చిత్రాలు ఇటీవల నైసు దేలాయి. చిత్రీకరణ విధానంలో కొత్త పోకడలు పోతూ, స్టయిలిష్‌గా జనం ముందుకు వస్తున్నాయి. గతంలో తమిళ 'బిల్లా'లో,
ఆ తరువాత తెలుగులో పవన్ కల్యాణ్‌తో 'పంజా'లోనూ ఆ రకమైన స్టయిలిష్ మేకింగ్‌ను చూపిన దర్శకుడు విష్ణువర్ధన్. ఆయన దర్శకత్వంలో మొన్న దీపావళికి తమిళంలో వచ్చిన చిత్రం - 'ఆరంభం'. అది కాస్త ఆలస్యంగా ఇప్పుడు తెలుగులో 'ఆట ఆరంభం'గా జనం ముందుకు వచ్చింది.
ఆ తరువాత తెలుగులో పవన్ కల్యాణ్‌తో 'పంజా'లోనూ ఆ రకమైన స్టయిలిష్ మేకింగ్‌ను చూపిన దర్శకుడు విష్ణువర్ధన్. ఆయన దర్శకత్వంలో మొన్న దీపావళికి తమిళంలో వచ్చిన చిత్రం - 'ఆరంభం'. అది కాస్త ఆలస్యంగా ఇప్పుడు తెలుగులో 'ఆట ఆరంభం'గా జనం ముందుకు వచ్చింది.
తమిళ 'బిల్లా'లో లాగానే మళ్ళీ అజిత్, నయనతారల కాంబినేషన్‌తో దర్శకుడు చేసిన రూపొందించిన ఈ చిత్రం కథతో కన్నా, కథనం, హీరోల ఇమేజ్, చిత్రీకరణ విధానంతో మన ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకొనేలా ఉంది.
.................................................
తారాగణం: అజిత్, నయనతార, ఆర్య, రానా దగ్గుబాటి, మహేశ్ మంజ్రేకర్, అతుల్ కులకర్ణి, మాటలు: ఘంటసాల రత్నకుమార్, సంగీతం: యువన్ శంకర్ రాజా, పాటలు: ఏ.ఎం. రత్నం, శివగణేశ్, కెమేరా: ఓం ప్రకాశ్, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, సమర్పణ: ఏ.ఎం. రత్నం, దర్శకత్వం: విష్ణువర్ధన్
..................................................
నిజానికి, ఈ చిత్ర ఇతివృత్తం - మామూలు పగ, ప్రతీకారాల ఫార్ములా. కాకపోతే, దానికి పోలీసు నేపథ్యం. సినిమా ఆరంభమే షాపింగ్ మాల్స్ లాంటి కొన్ని భారీ భవంతుల్లో హీరో పాత్ర అశోక్ (అజిత్) బాంబులుపెట్టి పేలుళ్ళు జరపడం! హీరో పాత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తోందన్న ఓ ఆసక్తి ప్రేక్షకుడికి కలుగుతుంది. అంతలో కంప్యూటర్ హ్యాకింగ్‌లో సిద్ధహస్తుడైన అర్జున్ (ఆర్య) పాత్ర ప్రవేశిస్తుంది. అతణ్ణి అశోక్, అతని భార్య మాయ (నయనతార) బృందం కిడ్నాప్ చేస్తుంది. అర్జున్ ప్రియురాలైన టీవీ జర్నలిస్టు అనిత (తాప్సీ)ని కూడా బుట్టలో వేసుకుంటుంది. ఆమెకు హాని తలపెడతామని భయపెడుతూ, అర్జున్‌తో రకరకాల హ్యాకింగ్‌లు చేయిస్తూ, అడ్డొచ్చిన కొందరిని హతమారుస్తూ ఉంటాడు హీరో. ఇదంతా చూసి, అర్జున్ తెలివిగా పోలీసులకు క్లూ ఇచ్చి, హీరోను వాళ్ళు పట్టుకొనేలా చేస్తాడు. అక్కడికి ప్రథమార్ధం ముగుస్తుంది.
హీరోను అపార్థం చేసుకున్న అర్జున్‌కు గతంలో జరిగిన సంఘటనల్ని మాయ వివరించడంతో సెకండాఫ్‌లో ఫ్లాష్‌బ్యాక్ వస్తుంది. మహారాష్ట్ర పోలీసు విభాగంలో యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ (ఏ.టి.ఎస్)లో పని చేస్తుంటారు - హీరో, అతని స్నేహితుడు సంజరు (రానా దగ్గుబాటి). విదేశీయుల్ని బంధించిన తీవ్రవాదులను ఎదుర్కొనే ఘటనలో సంజరు ప్రాణాలు కోల్పోతాడు. పోలీసు ఉన్నతాధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కుమ్మక్కై నాసిరకం బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కొనడంతో, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి కూడా శత్రువుల తూటాలకు బలయ్యాడని హీరో గ్రహిస్తాడు. ఉన్నతాధికారులతో తలపడతాడు. కానీ, ఆ క్రమంలో తన కుటుంబాన్నీ, సంజరు కుటుంబాన్నీ విలన్ల వల్ల పోగొట్టుకుంటాడు. వారి నుంచి ప్రాణాలతో బయటపడ్డ హీరో, అతని నెచ్చెలి మాయ ఇప్పుడిలా ప్రతీకార బాట పట్టారన్నది ఫ్లాష్‌బ్యాక్. ఇదంతా తెలిశాక అర్జున్ కూడా హీరో పక్షాన నిలుస్తాడు. వారంతా కలసి, ముంబయి, దుబాయి, హిమాలయాల్లో భారత సరిహద్దుల మీదుగా విలన్లను ఎలా మట్టుబెట్టారన్నది మిగతా సినిమా.
ప్రథమార్ధం ఓ చిన్న సస్పెన్స్‌తో ఆసక్తికరంగా నడుస్తుంది. ఆర్య, తాప్సీల కాలేజీ ఘట్టాల లాంటివి కూడా చకచకా నడిచిపోతాయి. హీరో ఫ్లాష్‌బ్యాక్, ప్రతీకారం తీర్చుకున్న విధానం - అంతా చిత్ర ద్వితీయార్ధంలోనే వస్తాయి. ఫ్లాష్‌బ్యాక్ అయిపోయిన తరువాత నుంచి కథ కొద్దిగా పట్టు సడలింది. కొంత సాగదీతకు గురైనట్లు అనిపిస్తుంది. అయితే, మొత్తం మీద మాత్రం సినిమా బోర్ అనిపించదు. ప్రత్యేకమైన కామెడీ ట్రాక్, హీరో - హీరోయిన్ల ప్రేమ ట్రాక్, రొటీన్ డ్యూయెట్ల లాంటివి లేకుండానే సినిమాను నడిపించే సాహసం దర్శకుడు చేసినా, ప్రేక్షకుడు పాస్ మార్కులు వేసేస్తాడు.
కీర్తిశేషులు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో మొదలై, అతని ఆకస్మిక మరణంతో తండ్రి గొల్లపూడి మారుతీరావు దర్శకత్వంలో పూర్తయిన 'ప్రేమ పుస్తకం' సినిమాలో శ్రీకర్ అనే పేరుతో చాలా ఏళ్ళ క్రితం తెలుగులోనే హీరో అజిత్ ప్రస్థానం మొదలైన సంగతి చాలా మందికి తెలియదు. తెలిసినా గుర్తుండదు. ఆ తరువాత అజిత్ అన్న పేరుతో అతను స్టయిలిష్ స్టార్‌గా తమిళంలో అభిమానుల్నీ, కుటుంబ ప్రేక్షకుల్నీ ఆకట్టుకున్నాడు. తనదైన మార్కెట్‌ను పెంచుకున్నాడు. కనీసం జుట్టుకు రంగు కూడా వేయకుండా, విగ్ లాంటివి ఏమీ లేకుండా అజిత్ సహజమైన 'లుక్'తో, చక్కగా నటించారీ చిత్రంలో! అందం, ఆకర్షణలకు అవకాశం లేని పాత్రను కూడా నయనతార బాగానే చేశారు. హ్యాకింగ్ దిట్టగా పాత్రలో ఆర్య ఇమిడిపోయాడు.
అలాగే, చాలా చిన్న పాత్ర అయినా, కథకు కీలకమైన, గుర్తింపున్న ఓ పాత్రను ధరించారు - రానా దగ్గుబాటి. ఛోటా మోటా నటులు వేసినా సరిపోయే ఆ పాత్రకు రానా అంగీకరించడం విశేషం. అలా 'ఆరంభం' చిత్రం ద్వారా తమిళంలో తెరంగేట్రం చేసిన రానా దగ్గుబాటి అక్కడ గొంతివ్వకపోయినా, ఇక్కడ ఈ తెలుగు అనువాదానికి తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. విలన్లుగా ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్ మంజ్రేకర్, పోలీసు ఉన్నతాధికారి పాత్రలో అతుల్ కులకర్ణి తమదైన తరహా నటన చూపెట్టారు.
సినిమాలో కెమేరా పనితనం, యాక్షన్ పార్ట్ ఆకట్టుకుంటాయి. ఘంటసాల రత్నకుమార్ డైలాగులు డబ్బింగ్ వాసనలు లేకుండా బాగున్నాయి. కానీ, తెలుగులోకి వచ్చేసరికి మిక్సింగ్‌లో లోపమో, మరేమో కానీ పాటల్లో సాహిత్యం కన్నా సంగీతమే చెవులు హౌరెత్తించింది. కొన్ని ఆడియో ట్రాక్‌లు మూసుకుపోవడం వల్లనో ఏమో సినిమాలో చాలా భాగం డైలాగులు నూతిలో గొంతుల లాగా ఎక్కడ నుంచో వినపడినట్లు అనిపిస్తాయి. అలాగే, కనీసం ఒకచోట తెర పై కనిపించే టైటిల్ కార్డుల్లో 'ముంబయి' అని చూపడానికి తెలుగు బదులు తమిళ లిపిలోనే కనిపించేస్తుంది. ఏ.ఎం. రత్నం లాంటి పెద్ద చిత్రాల అనువాద నిర్మాత సారథ్యంలో ఇలా జరగడం విచిత్రమే.
నిజానికి, కొన్నేళ్ళ క్రితం ముంబయిలో 'తాజ్' హౌటల్‌పై పాకిస్తానీ తీవ్రవాదులు దాడి జరిపిన '26/ 11' ఘటన అందరికీ తెలిసిందే. అప్పట్లో పోలీసు శాఖలో నాసిరకం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కొనుగోళ్ళ కుంభకోణం గురించి, దానివల్లే ముష్కరుల దాడిలో కొందరు సిన్సియర్ అధికారులు బలై పోయారనీ వార్తలు వెలుగులోకి వచ్చాయి. మనదేశంలో జరిగిన ఆ యథార్థ కథ స్ఫూర్తితో ఈ చిత్ర కథను అల్లుకున్నట్లు కనిపిస్తుంది.
అయితే, దానికి ఓ హాలీవుడ్ సినిమా ఘట్టాలను కలిపారు. ఈ సినిమాలోని కంప్యూటర్ హ్యాకింగ్ ఘట్టాలు వగైరా అన్నీ 'స్వోర్డ్ ఫిష్' అనే హాలీవుడ్ చిత్రం నుంచి అరువు తెచ్చుకున్నవే. అలా తెలివిగా దర్శకుడు ఓ మామూలు పగ, ప్రతీకారాల ఫార్ములాకు దేశంలో జరిగిన కథనూ, హాలీవుడ్ సీన్లు, కథనం కలిపేసి, హీరోల ఇమేజ్ ఆసరాగా పాస్ చేయించేశాడు. ఈ చిత్ర తమిళ మాతృక ఇప్పటికే తమిళనాట రూ. 100 కోట్ల పైగా వసూలు చేసింది. రొటీన్ చిత్రాలతో విసిగిన తెలుగు ప్రేక్షకులకు రిలీఫ్‌గా ఈ తెలుగు డబ్బింగ్ కూడా వాణిజ్య విజయం అందుకొనే సూచనలున్నాయి.
- రెంటాల జయదేవ
(Published in Praja Sakti daily, 7th Dec 2013, Saturday, Page No.8)
.................................
0 వ్యాఖ్యలు:
Post a Comment