మన దర్శక, నిర్మాతలు, రచయితలు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించే ప్రయత్నం చేస్తే, రకరకాల కథలను వెండితెరకు ఎక్కించవచ్చు. రెగ్యులర్ లవ్ స్టోరీలు, రివెంజ్ డ్రామాల రొంపి నుంచి తెలుగు సినిమాను బయటపడేయవచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ అలాంటి ప్రయత్నాలు ఇటీవల బాగా తగ్గిపోయాయి. ఈ కరవు కాలంలో కొంతలో కొంత కొత్తగా అనిపించే వెండితెర ప్రయత్నం - 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'. సవాలక్ష లోపాలు సినిమాలో ఉన్నా, రొటీన్‌కు భిన్నమైన ప్రయత్నంగా ఈ సినిమా గుర్తుంటుంది.
పాఠశాలలోనే కాదు, కుటుంబంలోనూ క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, అతి స్ట్రిక్ట్‌గా ఉండే ఓ రిటైర్డ్ హెడ్మాస్టర్ రామ్మూర్తి (నాగినీడు). నూరు తప్పుల దాకా క్షమించినా, తప్పుల్లో సెంచరీ కొట్టారంటే, ఎవరినైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపేసి, వారితో బంధుత్వాన్ని తెగ తెంపులు చేసుకొనే నిరంకుశుడు. అలా సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం (పృథ్వీరాజ్)ను సైతం దూరం చేసుకున్న మొండివాడు. చండ శాసన రామ్మూర్తికి భార్య, ఇద్దరు కొడుకులు (బ్రహ్మాజీ, హీరో సందీప్ కిషన్). ఓ కూతురు, అల్లుడు.
పాఠశాలలోనే కాదు, కుటుంబంలోనూ క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని, అతి స్ట్రిక్ట్‌గా ఉండే ఓ రిటైర్డ్ హెడ్మాస్టర్ రామ్మూర్తి (నాగినీడు). నూరు తప్పుల దాకా క్షమించినా, తప్పుల్లో సెంచరీ కొట్టారంటే, ఎవరినైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపేసి, వారితో బంధుత్వాన్ని తెగ తెంపులు చేసుకొనే నిరంకుశుడు. అలా సొంత తమ్ముడు సుబ్రహ్మణ్యం (పృథ్వీరాజ్)ను సైతం దూరం చేసుకున్న మొండివాడు. చండ శాసన రామ్మూర్తికి భార్య, ఇద్దరు కొడుకులు (బ్రహ్మాజీ, హీరో సందీప్ కిషన్). ఓ కూతురు, అల్లుడు.
పెద్ద కొడుకు పెళ్ళి కోసమని ఇంటిల్లపాదీ కాచిగూడా నుంచి తిరుపతికి వెళ్ళే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతారు. తీరా తల్లి తాళిబొట్టు మర్చిపోవడంతో, తండ్రికి తెలియకుండా వెంటనే తెచ్చేస్తానంటూ హీరో ఇంటికి పరిగెడతాడు. తీరా తాళిబొట్టు తీసుకొచ్చే సరికి బండి బయలుదేరి పోతుంది. పైగా, అదే రైలు ఎక్కాల్సిన హీరోయిన్ ప్రార్థన (రకుల్ ప్రీత్ సింగ్) కూడా ట్రైన్ మిస్సయిపోవడానికి హీరో కారణమవుతాడు. ఇక అప్పటి నుంచి తండ్రికి తెలియకుండా ఎలాగోలా ఆ ట్రెయిన్ మార్గమధ్యంలోనే అందుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, అతని వెంట హీరోయిన్ చేసే అల్లరి ఈ సినిమా. చివరకు వాళ్ళు ఆ ట్రెయిన్‌ను ఎలా అందుకున్నారు, ఆ పెళ్ళి ఏమైంది, అప్పటికే 99 తప్పులు చేసి, తండ్రికి టార్గెట్ అయిన హీరో ఈ వందో తప్పు తరువాత ఏమయ్యాడన్నది మిగతా సినిమా.
సినిమా నిదానంగా మొదలైనా, కాసేపయ్యాక పట్టాల మీదకు ఎక్కుతుంది. ట్రెయిన్ ఎపిసోడ్ మొదలయ్యాక ప్రేక్షకులకు కూడా కొంత వినోదం, ఆసక్తి పెరుగుతాయి. అలా ప్రథమార్ధం ముగిసేసరికి ఫరవాలేదు బాగానే ఉందని అనిపిస్తుంది. కానీ, ద్వితీయార్ధానికి వచ్చే సరికి కథ, కథనం సాగదీతకు గురయ్యాయి. ట్రెయిన్ ఎపిసోడ్ ముగిసేసరికి సినిమాలోని ముఖ్యమైన భాగమంతా అయిపోతుంది. ఇక, ఆ తరువాత జరిగే పెళ్ళి వ్యవహారం లాంటివి నిడివిని పెంచాయే తప్ప, ప్రేక్షకులలో ఆసక్తిని కొనసాగించ లేకపోయాయి.
గతంలో 'ప్రస్థానం', 'గుండెల్లో గోదారి' లాంటి విభిన్న తరహా చిత్రాల్లో అభినయించి, 'రొటీన్ లవ్ స్టోరీ'లో సోలో హీరోగా కనిపించిన చెన్నై కుర్రాడు సందీప్ కిషన్ ఈ చిత్ర హీరో. కెమేరామన్ ఛోటా కె. నాయుడుకు మేనల్లుడైన ఈ యువకుడు తన శక్తి మేరకు బాగానే నటించాడు. క్రమంగా నటనను మెరుగుపరుచుకుంటున్న ఈ తెలుగబ్బాయి వివిధ రకాల భావోద్వేగాలను పండించడంలో మరింత మెరుగుపడాల్సి ఉంది. ఇక, 'మిస్ ఇండియా' ఫేమ్ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా కెమేరా ముందు బాగున్నారు. పాత్ర పరిధి మేరకు నటనలో ఫరవాలేదనిపించారు. నాగినీడు, జయప్రకాశ్ రెడ్డి లాంటి కొందరు అలవాటైన ఫక్కీలో పాత్రలను నడిపించేశారు.
అయితే, చిత్ర ఇతివృత్తం, అందులోని పాత్రల చిత్రణ విషయానికి వస్తే - అసలు ఇలాంటి తండ్రులు, ఇలాంటి కుటుంబాలు ఉంటాయా, ఇలాంటి కథలు జరుగుతాయా అన్నది పెద్ద ప్రశ్నే. కాకపోతే, సినిమా కాబట్టి ఏదైనా జరుగుతుంది లెమ్మని సరిపెట్టుకోవాల్సిందే! అందుకే, ఎక్కడికక్కడ ఏదో ఒక పాత్ర రావడం, హీరో - హీరోయిన్ల ప్రయాణానికి వాహనాలు సమకూర్చేయడం లాంటి అతకని సన్నివేశాలను సైతం చూసీ చూడనట్లు పోవాల్సి ఉంటుంది. ఎంత సర్దుకుపోదామనుకున్నా ఈ సినిమాలో హీరో తండ్రి పాత్ర అంత కఠినంగా వ్యవహరించడానికి కారణమేమిటన్నది ప్రేక్షకులకు అర్థం కాదు. పైగా, వంద తప్పులు చేశాడని సొంత తమ్ముణ్ణి సైతం ఆఖరులో పెళ్ళి పందిట్లో కూడా ఆగర్భ శత్రువులా చూడాల్సిన అవసరమేమిటో తెలియదు.
సినిమా చివరలో తండ్రిని ఎదిరించి మాట్లాడుతూ, హీరో ఓ చిన్న సైజు ఉపన్యాసం దంచుతాడు. (ప్రేక్షకులకు 'బొమ్మరిల్లు' చిత్రంలో ప్రకాశ్‌రాజ్, సిద్ధార్థ్‌ల మధ్య సీన్ ఛాయలు గుర్తొస్తే, అది వాళ్ళ తప్పు కాదు). ఇక, అంత క్లయిమాక్స్ తరువాత కూడా ఆ తండ్రి పాత్ర మారదు సరికదా, వంద తప్పుల పరిమితిని వెయ్యి తప్పులకు మార్చి, ''కుటుంబ రాజ్యాంగాన్ని సవరించా''నని పేర్కొనడం పెద్ద ఫార్సు!
అలాగే, సాక్షాత్తూ కాబోయే వదిన ఎవరన్నది హీరోకు తెలియదన్నట్లు సినిమాలో చూపడం, సొంత ఇంట్లో జరిగిన నిశ్చితార్థానికి హీరో లేకపోయినా అసలు ఆ అమ్మాయి ఫోటో అయినా అతను చూడలేదనడం కూడా నమ్మశక్యంగా లేని విషయాలు. అయితే, సినిమా నడవాలి కాబట్టి, కథలో రాసేసుకున్న ప్రధాన ట్విస్టుగా దాన్ని క్షమించి, సహించాలేమో!
రౌడీల నుంచి కాపాడి హీరో పెళ్ళి చేసేసిన జంట 'ఎక్కడ సేఫ్‌గా ఉంటారో నాకు తెలుసు. దింపేసి వస్తా'నంటాడు థ్రిల్లింగ్‌గా కారు తోలే భద్ర పాత్రధారి ఎమ్మెస్ నారాయణ. మరి, తీరా ఆ జంటను సాక్షాత్తూ ఆ పెళ్ళికి ససేమిరా ఒప్పుకోని తండ్రి (జయప్రకాశ్ రెడ్డి) దగ్గరకే తెస్తాడు. అలా ఎందుకు చేశాడంటే జవాబు లేదు. ఇష్టం లేని పెళ్ళిని కాదనుకొని, కోరుకున్నవాడితో పారిపోయి, హీరో అండతో పెళ్ళి చేసుకువచ్చిన ఆ అమ్మాయి కూడా ఆ మరుక్షణమే తండ్రి ఎదుటకే ఎందుకు వచ్చినట్లు?
సినిమాలో హీరో ఆటో దగ్గర నుంచి లారీ దాకా నడపని వాహనమంటూ ఉండదు. ఇక, స్పీడుగా వెళ్ళే రైలును ఆటో, బస్సు, లారీల ద్వారా ఛేజ్ చేసి మరీ అందుకోవడం లాంటి ఘట్టాలే సినిమాకు ప్రధానమైన కథనం. ఇలా సినిమాను నడపడం కోసం కథనూ, పాత్రలనూ ఆ యా సన్నివేశాలకు ఎలా కావాలంటే అలా మార్చేసుకోవడం ఈ చిత్ర దర్శక, రచయిత చేసిన పెద్ద లోపం. తొలి చిత్ర దర్శకుడైన మేర్లపాక గాంధీ (సీరియల్ నవలల రచయితగా ప్రసిద్ధుడైన మేర్లపాక మురళి కుమారుడు) ఇలాంటి లోపాలను కథలో, కథనంలో సరిదిద్దుకొని ఉండాల్సింది. గతంలో లఘు చిత్రాలు తీసిన అనుభవమున్న ఈ యువకుడు హడావిడి పడకుండా తన తదుపరి చిత్రాల కథ, కథనం, డైలాగుల్లో మరింత శ్రద్ధ పెట్టాలి. అప్పుడు కానీ, కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని అందుకోదు.
ఉన్నంతలో ఈ సినిమాకు ప్రధానమైన పాజిటివ్ పాయింట్ వినోదమనే చెప్పాలి. 'తాగుబోతు' రమేశ్, ''అయామ్ దస్తగిరి... ఫ్రమ్ వెంకటగిరి'' అంటూ పిహెచ్.డి. పట్టా పొందిన నిరుద్యోగిగా సప్తగిరి చేసిన కామెడీ హాలులో ప్రేక్షకులను పదే పదే నవ్విస్తుంది. అలాగే సాహిత్యమంటే చెవి కోసుకొనే రైౖల్వే టికెట్ కలెక్టర్‌గా శివన్నారాయణ కూడా సినిమాలో హాస్యం పండించడానికి తోడ్పడ్డారు.
చాలా రోజుల తరువాత రమణ గోగుల సంగీతం అందించిన ఈ చిత్రంలో ఆడియోలో 3 పాటలున్నా, సినిమాలో రెండే మిగిలాయి. ద్వితీయార్ధంలో వచ్చే హీరో - హీరోయిన స్వప్న గీతం చిత్రీకరణ, కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ బాగున్నాయి. కెమేరామన్ ఛోటా కె. నాయుడు తన మేనల్లుడైన హీరో కోసం తన అనుభవాన్ని బాగానే వినియోగించారు. హీరో ప్రవేశ ఘట్టంలో రంగుల మధ్య ఛేజ్ లాంటివి అందుకు ఉదాహరణ. గౌతంరాజు తన కత్తెరకు మరికొన్ని సన్నివేశాల్లో పదునుపెట్టినా బాగానే ఉండేది.
ఇది 'జెమినీ' టి.వి, జెమినీ సినిమా సంస్థల వారికి చెందిన సినిమా కాబట్టి, చిత్ర నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. అలాగే, ఇకపై టీవీలో ప్రచార ఆర్భాటానికీ లోటు ఉండదు. అందుకే, సరైన సినిమా చూడడానికి లేక మొహం వాచిన ప్రేక్షకులు ఈ మాత్రమైనా రొటీన్‌కు భిన్నమైన సినిమా ఈ మధ్య రాలేదని దీన్ని అక్కున చేర్చుకోవచ్చు. పాత్రల రూపకల్పనతో సహా ఎన్నో లోటుపాట్లున్నా, అశ్లీలత మాత్రం లేని 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' కాసేపు (రెండు గంటల పది నిమిషాలు) వినోద కాలక్షేపంగా పాసై పోవచ్చు.
- రెంటాల జయదేవ
.........................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment