('హైదరాబాద్ లో 18వ బాలల చిత్రోత్సవ0'పై '10 టివి' ప్రసారం చేసినది ఇది...)
హైదరాబాద్ లో 18వ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ జరుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. ఈ ఫెస్టివల్ లో రెండు వందల బాలల చిత్రాలు ప్రదర్శనకు అనుమతి పొందాయి. వీటిలో భారతీయ చిత్రాల సంఖ్య తక్కువే ఉంది. తెలుగు భాష నుంచి 'మిణుగురులు` చిత్రం ఈ ఫెస్టివల్ లో పోటీ పడనుంది. ఈ పండుగ బాలల దినోత్సవమైన నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు భాగ్యనగరంలో జరుగనుంది. ఈ చిత్రోత్సవాన్ని రణబీర్ కపూర్ కపూర్ ప్రారంభించనున్నారు. అమీర్ ఖాన్ రూపొందించిన 'తారే జమీన్ పర్` చిత్రంలో నటించి శభాష్ అనిపించుకున్న దర్శీల్ సఫారీ, బాల హాస్యనటుడు సలోని దైనీలు ఈ చిత్రోత్సవాలకు హోస్టులుగా వ్యవహరించనున్నారు. ప్రారంభ చిత్రంగా దర్శక, నిర్మాత శిల్పా రనడే రూపొందించిన ' గోపి గవైయ్య బాఘా బజైయ్యా ' చిత్రాన్ని ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. సత్యజిత్ రే సినిమా 'గుపి గాయెన్ బాఘా బాయెన్' చిత్రం ఆధారంగా ఈ సినిమా తీశారు.
బాలల చలన చిత్రోత్సవం చరిత్ర...
ఈ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల నుంచి 894 ఎంట్రీలొచ్చాయి. అందులో 48 దేశాలకు చెందిన 200 సినిమాలను మాత్రమే ఎంపిక చేశారు. బాలల ప్రేమికుడు చాచా నెహ్రూ 1955లో చిల్డ్రన్స్ ఫిలిం సొసైటీకి రూపకల్పన చేశారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని వివిధ నగరాల్లో బాలల సినిమా పండగలు జరుగుతున్నాయి.1979లో తొలి చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ముంబైలో జరిగింది. 1981లో చెన్నై, 1983లో కోలకతా, 1985లో బెంగుళూర్, 1987లో భువనేశ్వర్, 1991లో త్రివేండ్రం, 1993లో ఉదంపూర్ లో బాలల చలన చిత్రోత్సవాలను నిర్వహించారు. 1995 నుంచి హైదరాబాద్ నగరం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు శాశ్వత వేదికైంది. అప్పట్లో చలన చిత్రోత్సవ వేదికకు హైదరాబాద్ అనువుగా లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ వేదికను కోలకతాకు మార్చాలని ప్రముఖ నటి నందితాదాస్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.
నగదు పురస్కారం..
బాలల సినిమాలకే ప్రోత్సాహం లేదంటే, బాలల చలన చిత్రోత్సవం పై కూడా సర్కారుకు పడుతుందా. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు చాలా ఉన్నాయి. మొదట్లో పోటీల్లో గెలుపొందిన విజేతలకు కేవలం జ్ఞాపికలు అందించి సంతృప్తి పరిచేవారు. ఆ తర్వాత అవార్డుతో పాటు నగదు బహుమతులను కూడా ఇవ్వటం మొదలుపెట్టారు. ఉత్తమ చిత్రానికి బంగారు నందితో పాటు లక్ష రూపాయల నగదు ఇచ్చేవారు. 2007 నుంచి నగదును రెండు లక్షలకు పెంచారు. ఈసారి 16 అవార్డులను నాలుగు కేటగిరీల కింద ఇవ్వనున్నారు. యాక్షన్, యానిమేషన్, ఫీచర్స్, షార్ట్ ఫిలిమ్స్ అని నాలుగు విభాలుగా విభజించారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడికి రెండు లక్షల నగదుతో పాటు బంగారు ఏనుగు ట్రోఫి, రన్నరప్ గా నిలిచిన విజేతలకు లక్ష రూపాయల నగదు ఇవ్వనున్నారు.
పోటీ పడలేకపోతున్న భారతీయ చిత్రాలు..
అయితే చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో ఆయా దేశాల్లో నిర్మించిన బాలల చిత్రాలు పోటీకి రావడం, ఇక్కడ ప్రదర్శించడం బహుమతులు అందుకుని వెళ్లిపోవడం సర్వసాధారణంగా మారింది. కానీ భారతీయ చిత్రాలు మాత్రం పోటీ పడలేకపోతున్నాయి. బాలలకు సంబంధించి తెలుగులో కూడా పెద్దగా సినిమాలు రాలేదు. గతంలో రాజు-పేద, లేత మనసులు, బాల మిత్రుల కథ, గమ్మత్తు గూఢచారులు, పాపం పసివాడు, రాము, లిటిల్ సోల్జర్స్ లాంటి బాలల చిత్రాలు కొన్ని వచ్చాయి. అయితే ఈ చిత్రాలన్ని కూడా కమర్షియల్ పంథాలో బాలలకు నచ్చే విధంగా నిర్మించినవే. ఇంకా 1936లోనే సతీ అనసూయ అనే చిత్రాన్ని పూర్తిగా బాల నటీనటులతో తెలుగులోనే తీశారు. ఈ మధ్య కాలంలో గుణశేఖర్ దర్శకత్వంలో 'రామాయణం' అంతకుముందు 'బాల భారతం` లాంటి సినిమాలు కూడా పూర్తిగా పిల్లతోనే తీశారు. కళ్లు లేకపోతే సినిమా తీయలేమా? ఇలాంటి కథాంశంతో వచ్చిన తెలుగు సినిమా 'మిణుగురులు'. ఇదొక్కటే తెలుగు నుంచి ఫిల్మ్ ఫెస్టివల్ లో పోటీపడుతోంది. పోర్ట్ లాండ్ నార్త్ వెస్ట్ ఫిలిం ఫెస్టివల్ లో శిక్షణ పొందిన 40మంది కళ్లు లేని బాలలతో దర్శక నిర్మాత అయోధ్య కుమార్ ఈ సినిమాని తీశారు. సుహాసిని, ఆశిష్ విద్యార్ధి ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక విద్యపై చైతన్యం రగిలించే కథాంశంతో రూపొందించిన 'చదువుకోవాలి` చిత్రం సాధారణ ప్రదర్శనకు ఎంపికైంది. ఈ సినిమాను ముద్దాలి వెంకటేశ్వరరావు రూపొందించారు.
ఇండియాలో పట్టించుకునే వారేరీ..
పిల్లల్లో నైతిక విలువలు, తమ భవిష్యత్తు, సమాజం పట్ల బాధ్యత, వారి మనస్తత్వాన్ని పెంపొందించడానికి సినిమాను మించింది మరొకటి లేదు. కానీ పిల్లల మానసిక వికాసానికి తోడ్పడే చిత్రాలను భారతీయ చలనచిత్ర పరిశ్రమ పట్టించుకోకపోవటం విచారకరం. భారతీయ చలనచిత్ర పరిశ్రమ వందేళ్ల పండగ జరుపుకుంటోంది. వందేళ్లలో పిల్లలపై తీసిన సినిమాలు ఎన్ని? ఆ సంఖ్య వేళ్లపై లెక్కించే విధంగానే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతర్జాతీయంగా బాలల కోసం ఏటా ఎన్నో చిత్రాలను రూపొందిస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద సినిమా పరిశ్రమగా పేరొందిన ఇండియాలో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగకపోవడం శోచనీయం.
ఇరాన్ ప్రత్యేక శద్ధ..
పిల్లల చిత్రాలు రూపొందించడంలో ఇరాన్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన శాఖను ఏర్పాటు చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు. పిల్లలకు నచ్చే రీతిలో ఆ దేశం సినిమాలు తీస్తోంది. గతంలో పోటీకి రాని దేశాలు ఆస్ట్రేలియా, చిలీ, క్యూబా, లెబనాన్ వంటి 20 దేశాలు ఈసారి ఫిలిం ఫెస్టివల్ కి రావటం గమనార్హం. ఒక్క దక్షిణ అమెరికా నుండే 28 ఎంట్రీలు వచ్చాయి. ఈ సంఖ్యను చూస్తే పిల్లల సినిమాలకు వాళ్లిస్తున్న ప్రాధాన్యత ఏమిటో, వాళ్లకున్న చిత్తశుద్ధి ఎంతో అర్ధమవుతుంది.
ముస్తాబైన లలితా కళాతోరణం..
18వ బాలల చలన చిత్రోత్సవానికి హైదరాబాద్ లోని లలితా కళాతోరణం ముస్తాబైంది. చెకస్లొవేకియా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ తదితర 48 దేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేడుకలకు హాజరయ్యే 400 మంది చిన్నారి అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. చలన చిత్రోత్సవంలో భాగంగా 48 దేశాలకు చెందిన 2 వందల చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఇందులో త్రీడీ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలన్ని హైదరాబాద్ లోని ఐమాక్స్ తో పాటు 9 థియేటర్లలో ప్రదర్శిస్తారు. తెలుగు లలిత కళాతోరణం, ఇందిరాప్రియదర్శిని, తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలలో కూడా చిత్రాలు ప్రదర్శిస్తారు. ఏ థియేటర్‌లోనైనా చిన్నారులు ఉచితంగా వీక్షించవచ్చు. రోజుకు 20 వేల మంది పిల్లలు పెద్దలు సినిమా చూసే అవకాశముంది. బాలల చలన చిత్రోత్సవంలో ప్రతి ఏటా ఒక దేశానికి చెందిన చిత్ర ప్రదర్శనకు ప్రాధాన్యత నిస్తారు. 17 వ చైల్డ్ ఫెస్టివల్ లో చైనాకు ప్రాధాన్యమివ్వగా, ఈసారి చెక్ దేశానికి చెందిన చిత్రాలు ఎక్కువగా ప్రదర్శిస్తారు.
అయితే ఇంత పెద్ద ఉత్సవానికి కేవలం 9 థియేటర్లు కేటాయించటంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 9 థియేటర్లలో 2 వందల చిత్రాలు ప్రదర్శించడం సాధ్యమా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఒక్కొక్క సినిమా ఒక్కో స్కూలుకి చూపించగలిగితే గొప్ప విషయమే. అంతేకాదు పిల్లలను థియేటర్లకు తీసుకెళ్లి తిరిగి ఇళ్లకు చేర్చటం కూడా శ్రమతో కూడుకున్న పనే.
ఫెస్టివల్ అంటే ఏంటో తెలియదు..
ఫిలిం ఫెస్టివల్ అంటేనే తారలు, విదేశీ ప్రతినిధులు వెలుగు జిలుగులతో తళుక్కు మంటుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే ఈ ఉత్సవంలో సాదా సీదాగా వచ్చే పేదలకు స్థానముంటుందా? సమాజంలోని ఉన్నత వర్గాల పిల్లలకే పరిమితమవుతున్నాయి ఈ ఫెస్టివల్స్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పిల్లలకు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి. గత ఫెస్టివల్ లో డెలిగెట్ పాస్ ల కోసం నానా ఇబ్బందులు పడ్డారు. అందరికీ ఉచిత ప్రవేశమని అధికారులు చెప్పినా ప్రతి థియేటర్ లో పాస్ లేకుండా అనుమతించలేదు. పిల్లల పట్ల ప్రభుత్వం ప్రేమ నటించడం కాదు, ఆచరణలో చూపాలి. ఈసారైనా పేద, ధనిక తేడా లేకుండా పిల్లలందర్ని ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేటట్టు చర్యలు చేపట్టాలి. వారికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చాలి. అప్పుడే బాలల చలన చిత్రోత్సవానికి సార్థకత సమకూరుతుంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. బాలలు మన జాతి సంపద అంటూ పాలకులు ఊదరగొడుతుంటారు. కాని పిల్లల కోసం ప్రభుత్వం చేస్తున్నదేంటి? పిల్లలకోసం సినిమాలు వచ్చేలా చేయలేరా? నిర్మాతలను నిజాయితీగా ప్రోత్సహించలేరా? దానికి కేవలం చిత్తశుద్ధి కావాలి. అంతే!
....................................
తోడుకునేవాళ్లకి తోడుకున్నంత
4 years ago
0 వ్యాఖ్యలు:
Post a Comment