జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, November 15, 2013

ఘాటు తగ్గిన 'మసాలా'! (సినిమా సమీక్ష)

(''మసాలా'' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)



సోలో యాక్షన్ కు ఫుల్ స్టాప్ పెట్టిన 'వెంకీ' ఇప్పుడు మల్టీస్టారర్ గా దూసుకుపోతున్నాడు. దానికి అనుగుణంగానే సినిమాలు చేస్తున్నాడు. వెంకీ సాధారణంగా తన సినిమాల్లో కమెడీయన్ లేకుండానే కామెడీ పండించగలడు. అలా వచ్చిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తను కొత్తగా చేయాలని ట్రై చేస్తున్నాడు. 

ఇలాంటి టైమ్ లో ఈ ఇద్దరు హీరోలు 'మసాలా' చిత్రంలో నటించారు. ఈ చిత్రం బాలీవుడ్ లో హిట్ అయిన 'బోల్ బచ్చన్ బోల్' కు రీమేక్. 'వెంకీ, 'రామ్', 'అంజలి, 'షాజన్ పదంసీ' హీరోయిన్లు. ఆలీ, ఎమ్మెస్ నారాయణ, తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా. 'సురేష్ ప్రొడక్షన్', 'స్రవంతి బ్యానర్ ' సంయుక్తంగా నిర్మించారు. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలాంటి ఫలితాన్నిచ్చిందో.. తెలుసుకునే ముందు కథను చూద్దాం..

    కథ విషయానికి వస్తే:.. భీమరాజపురం అనే ఊళ్ళో బలరాం(వెంకటేష్) అనే జమీందారుంటాడు. ఆయనకి ఇంగ్లీషు భాష అంటే ఇష్టం.. అబద్ధమంటే కోపం. బలరాంకు ఒక్కతే చెల్లెలు మీనాక్షి(షాజన్ పదాంసీ). బలరాం అంటే గిట్టని విలన్ (పోసాని). బలరాం దగ్గర మేనేజర్ గా నారాయణ(ఎమ్మెస్ నారాయణ) పనిచేస్తుంటాడు. ఇతని స్నేహితుడి కొడుకు రెహమాన్(రామ్) కూతురు సరిత(అంజలి). రామ్ ఇళ్లు, ఆస్తి కోర్టు కేసుల్లో ఉంటుంది. పనిలేక ఇబ్బంది పడుతుండడంతో నారాయణ జమీందార్ వద్ద పని ఇప్పిస్తానని అతడిని భీమరాజపురానికి తీసుకెళ్తాడు. అక్కడ రామ్ గా తన పేరు అబద్దం చెప్పి బలరాంకు పరిచయం అవుతాడు. నారాయణ రికమండేషన్ తో కోటలో ఉద్యోగం వస్తుంది. 


రెహమాన్ తన పేరులో ఆడిన ఆబద్ధం కోసం మరికొన్ని అబద్ధాలు ఆడుతుంటాడు. ఇక ఓ రోజు హైదరాబాద్ లో చదువుకుంటున్న బలరాం చెల్లెలు తన ఇంటికి వస్తుంది. ఆమెతో రామ్ లవ్ లో పడతాడు. ఆ విషయం అన్న బలరాంకు తెలుస్తుంది. మరి వారి ప్రేమను బలరాం ఒప్పుకున్నాడా..? రామ్ చెప్పిన అబద్ధాలు బలరాంకు తెలిశాయా..? తెలిస్తే ఏం చేశాడు..? అనేది మిగతా కథ.




    విశ్లేషణ:.. హిందీ మూవీ 'బోల్ బచ్చన్ బోల్' కి రీమేక్ వచ్చిన 'మసాలా'.. అచ్చు ఆ చిత్రానికి కాపీ ఫేస్ట్ గా కనిపిస్తుంది. సహజంగా ఏదైనా సినిమాను రీమేక్ గా తెరకెక్కించే ముందు వాటి బ్యాక్ డ్రాప్ ను పరిశీలిస్తారు దర్శకులు. ఆ కథను ఎంచుకోగానే మన నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సందర్భాన్ని బట్టి కొత్త వాటిని కలపడం.. అనసరమైన కొన్నింటిని తొలగించడం చేయాలి. కానీ అవేమీ లేకుండా మక్కికి మక్కి దించేశాడు దర్శకుడు విజయ్ భాస్కర్. ఈ 'మసాలా' చిత్రంలో ప్రధానంగా అదే లోపంగా కనిపిస్తుంది. కథకు, పాత్రలకు, మాట్లాడే భాషకు సంబంధం ఉండదు. ఒక అబద్ధం అనేక అబద్ధాలను సృష్టిస్తుంది. వాటిని నిజం చేసేందుకు అనేక పాత్రలను ప్రవేశ పెడుతుంది. ఇలాంటి కామెడీ తెలుగు ప్రేక్షకులు రోటీన్ గా చూస్తున్నదే. 


సెకండాఫ్ బోర్ గా ఉంటుంది. రీమేక్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. పాత్రల, సన్నివేశాల లక్ష్యం ఎంటో అర్థం కాదు. క్లారిటీ లేదు. సినిమాలో కన్సెప్ట్ కనిపించదు. బలరాం, మీనాక్షి మధ్య అన్నచెల్లెలి అనుబంధాలు ఎక్కడా కనిపించవు. జమిందారు అయిన బలరాం.. తన పనులు కాక.. రామ్.. అండ్ 'మసాలా డ్రామా కంపెనీ' చుట్టూ తిరగడం ఆయన పాత్రకు సూట్ కాలేదు.

   'క్యాట్ అండర్ ది హ్యాండ్ సెర్చింగ్ మదర్ ల్యాండ్'. 'ఐ టాక్ ఇంగ్లీష్ బెటర్ దెన్ బ్రిటిష్'. 'మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మై మథర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మై టోటల్ బాడీ లాంగ్వేజ్ ఇంగ్లీష్'. అంటూ వెంకీ చేసిన కామెడీ ప్రేక్షకులను నవ్వించినా.. అది శృతి తప్పిందనే చెప్పవచ్చు. ఇలాంటి క్యారెక్టర్ లో వెంకీ మొదటి సారి డిఫరెంట్ గా నటించాడు. బట్లర్ ఇంగ్లీష్ కొన్ని చోట్ల పేలితే కొన్ని చోట్ల అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక.. పక్క క్యారెక్టర్ తో చెప్పించాల్సి వచ్చింది. ఇక వెంకటేష్ కి విలన్ గా పోసానిని ఎంచుకొని దర్శకుడు సాహసమే చేశాడు. విలన్ కామెడీ చెయొచ్చుకానీ, కమెడియన్ తో విలనిజం పండించడం సాధ్యం కాదు. ఈ చిన్న లాజిక్ ను దర్శకుడు మిస్ అయ్యాడు. 


చెల్లెలు సంరక్షణ కోసం అన్న పడే తపన ఎదురుగా నిలబడిన పోసాని తో పిచ్చ కామెడీ అయ్యింది. జయప్రకాష్ రెడ్డి నటనలో, వెంకీ కి సపోర్ట్ గా బాగానే మెప్పించాడు. 'రామ్', 'రెహమాన్' పాత్రల్లో రామ్ బాగా నటించాడు. రెహమాన్ గా ఎంట్రీతోనే కేక పెట్టించాడు. అయితే సెంకడాఫ్ లో ఆ క్యారెక్టర్ తేలిపోయింది. షాజన్ పదాంసీ అందంలో గానీ.. నటనలోగానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ కి అక్కగా, వెంకటేష్ కి ప్రియురాలిగా చేసిన అంజలి, అక్కగానే బెటర్ గా కనిపించింది.

 ఇక కొవై సరళతో చేసిన క్లబ్ డ్యాన్స్ లు కొద్దిగా నవ్వించినా.. చాలా దారుణంగా అనిపించింది. అలీ, ఎమ్మెస్ నారాయణ ఉన్నంతలో పర్వాలేదనిపించారు. ఇక 'గబ్బర్ సింగ్' అంత్యాక్షరి లాగా క్లైమాక్స్ ని పాటలతో నింపడంతో.. ఒక రోటీన్ క్లైమాక్స్ తో ముగిసింది.

   ప్లస్ లు:..రామ్ నటన, కామెడీ, పాటలు, ఫొటోగ్రఫీ, వెంకటేష్.


   మైనస్ లు: సెకండాఫ్, రోటీన్ డ్రామా, కామెడీ, క్లైమాక్స్, హీరోయిన్, శృతి తప్పిన బట్టర్ ఇంగ్లీష్.


   ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే అక్కడక్కడా నవ్వుకోవచ్చు.. మొత్తానికి మసాలా కి ఉండాల్సిన ఘాటు తక్కువయ్యింది. దీంతో టెస్ట్ తగ్గింది. 


ఇక ఈ చిత్రానికి '10టివి' ఇచ్చే రేటింగ్..2/5.

0 వ్యాఖ్యలు: