('విల్లా' - 'పిజ్జా 2' సినిమాపై '10 టివి' ప్రసారం చేసిన సమీక్ష ఇది...)
తమిళ డబ్బింగ్ మూవీ 'పిజ్జా' సినిమా టాలీవుడ్ లో మంచి హిట్ నే అందుకుంది. ఈ చిత్రానికి ముందు వచ్చినవన్నీ యూత్, లవ్ అంటూ క్యూ కడుతుంటే "మంత్ర" సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి 'పిజ్జా' తెలుగు ప్రేక్షకులకు రొమాంటిక్ థ్రిల్లర్ ను అందించింది. ఇక ఈ పిజ్జాకు సీక్వెల్ గా వచ్చిన చిత్రమే "విల్లా". మారుతి "గుడ్ సినిమా గ్రూప్" ఈ మూవీని తెలుగులో నిర్మాణ బాధ్యతలు తీసుకోవడంతో సినిమాకు క్రేజ్ మరింత పెరిగింది. 'విల్లా'తో థ్రిల్లర్స్ ను ఇష్ట పడే ప్రేక్షకులకు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కొత్త రుచి చూపించాలనుకుంటున్నాడు. మరి 'విల్లా' ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్లింగ్ ను కలిగించిందో తెలుసుకుందాం..
కథ విషయానికి వస్తే:.. రచయిత అవ్వాలన్న ఆశయంతో ఉన్న యువకుడు జేబిన్ (అశోక్ సెల్వన్). తనకి ఇష్టం లేకపోయినా తండ్రి కోసం వ్యాపారం చేసి అందులో నష్టపోతాడు. అదే సమయంలో జేబిన్ తండ్రి(నాజర్) మరణిస్తాడు . అయన చనిపోయాక అతని లాయర్ ద్వారా జేబీ కి భీమునిపట్నంలో ఒక విల్లా ఉందన్న విషయం తెలుస్తుంది. ఆ విల్లాను అమ్మి తన కష్టాల నుండి బయటపడాలని జేబిన్ అక్కడికి చేరుకుంటాడు. ప్రేయసి ఆర్తి (సంచిత శెట్టి) తో పాటు అక్కడే ఉంటున్న జేబిన్ తన రెండవ రచనను అదే విల్లాలో చెయ్యాలని నిర్ణయించుకుంటాడు అదే సమయంలో వీరిద్దరికి కొన్ని అనుకోని కొన్ని సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలు ఏంటి? జేబిన్ రెండవ నవల పూర్తి చేశాడా..? విల్లా లో ఏమయ్యింది..? అనేది మిగతా కథ.
విశ్లేషణ:.. 'పిజ్జా'కు సీక్వెల్ అంటూ వచ్చిన 'విల్లా' కథకు ఆ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. కథా, కథనం పూర్తి భిన్నంగా ఉంటుంది. పిజ్జా తో థ్రిల్లింగ్ సక్సెస్ ను అందుకున్న సి.వి. కుమార్ ప్రొడక్షన్ 'విల్లా'లో మాత్రం పిజ్జా రుచి ని అందించలేకపోయింది. థ్రిల్లర్స్ ఇష్ట పడే ప్రేక్షకులు తరవాత సన్నివేశం తమ అంచనాలకు అందకుండా ఉండాలనుకుంటారు. ఆ విషయంలో దర్శకుడు దీపన్ చాలా పేలవమైన పనితనం చూపించాడు. ప్రతి సన్నివేశం సగటు ప్రేక్షకుడు ఊహించగలిగేలా ఉన్నాయి. దీంతో పాటు పేయింటింగ్స్ రూపంలో తర్వాత ఏం జరుగుతుందో హీరో ముందే చెబుతుండడం సినిమాపై ఆసక్తిని తగ్గించింది.
అన్ని విషయాలు ముందే తెలిసిన హీరో ఆ విల్లా చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడనేది ప్రేక్షకుల మదిని తోలుస్తున్న ప్రశ్న. సినిమా మొదలైన అరగంట పాటు ఓ డాక్యుమెంటరీ లా అనిపిస్తుంది. మొదటి భాగం చాలా బోర్ గా ఉంటుంది. అయితే విల్లాకు వచ్చాక సినిమాపై కాస్త ఆసక్తి పెరుగుతుంది. అక్కడ ఏదో రహస్యం ఉందని ఊరించిన దర్శకుడు అక్కడి సన్నివేశాలను రోటీన్ గానే చూపించాడు. అదే కాక సమస్యకు పరిష్కారం అందించకుండా. సస్పెన్స్ గా పెట్టి మరో సీక్వెల్ కి రెడీ అయినట్లు కథ ను ముగించాడు. దీంతో ప్రేక్షకులు అసంతృప్తితో థియేటర్ నుంచి బయటకు వస్తారు.
అశోక్ సెల్వన్ తన నటనతో ఆకట్టుకున్నాడు. కొన్ని సన్నివేశాలలో అతను పండించిన ఎమోషన్ సరిపోకపోయినా సన్నివేశానికి సరిపడా అయితే ఇవ్వగలిగాడు. సంచిత శెట్టి నటనాపరంగా ఉన్నంతలో పర్వాలేదనిపించింది. కాని హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. నాజర్, వీర సంతానం నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతర ఆర్టిస్టులు వారి పాత్రలకు తగ్గట్టు నటించారు.
ప్లస్ లు:.. సినిమాటోగ్రఫీ, అశోక్ సెల్వన్, పాటలు.
మైనస్ లు:.. రోటీన్ కథ. బ్యాక్ గ్రౌండ్ స్కోరు. దర్శకత్వం.
పిజ్జా కోసం వచ్చిన ప్రేక్షకులకు పాత చింతకాయ పచ్చిడిని పిజ్జా ప్యాకింగ్ లో అందించిన గుడ్ సినిమా గ్రూప్ ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలే 'రొమాన్స్' తో దెబ్బతిన్న ఈ గ్రూప్ కి 'విల్లా' రూపంలో మరో షాక్ తగిలింది. మారుతి బ్రాండ్ మరో సారి మసకబారింది.
ఇక 'పిజ్జా' లో ఉండే టేస్ట్ 'విల్లా'లో లేదు.
ఈ చిత్రానికి '10టివి'ఇచ్చే రేటింగ్.. 1/5
.............................................
0 వ్యాఖ్యలు:
Post a Comment