బుల్లితెరపై యాంకర్‌గా చాలా కాలంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వ్యక్తి - ఉదయభాను. ఎప్పుడో ఆర్. నారాయణమూర్తి 'ఎర్రసైన్యం' రోజుల్లో 1990లలోనే వెండితెరపై మెరిసిన ఆమె చాలా కాలం తరువాత ఓ పూర్తి నిడివి పాత్రలో తెరపై కనిపించిన చిత్రం - 'మధుమతి'. పైపెచ్చు, ఆమెది ఓ వేశ్య పాత్ర. ఇటీవలి కాలంలో అనుష్క ('వేదం'), శ్రియ ('పవిత్ర') లాంటి తారల లాగానే ఉదయభాను కూడా ఏదో విషయమున్న కథనే ఎంచుకొని, ఈ చిత్రం చేసి ఉంటారని అందరం భావిస్తాం. కానీ, సినిమా చూస్తే తీవ్ర నిరాశకు గురవుతాం.
అమ్మాయిలంటే పెద్దగా పడని ఓ అబ్బాయి కార్తీక్ (విష్ణు ప్రియన్). ఉద్యోగం చేస్తున్నా, ఇంట్లోవాళ్ళు సొంత మరదలిని ఇచ్చి పెళ్ళి చేస్తామంటున్నా 'నో' చెప్పేస్తుంటాడు. మరదలితో పెళ్ళిని తప్పించుకోవడం కోసం ఏకంగా తనకు పెళ్ళే అయిపోయిందని అబద్ధం చెబుతాడు. భార్యను చూపించమన్న ఇంట్లోవాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక, తన భార్యగా నటించమంటూ మధుమతి (ఉదయభాను) అనే ఓ వేశ్యతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇంట్లోవాళ్ళను నమ్మించడానికి ఆమెను తీసుకొని, సొంత ఊరికి వస్తాడు. అక్కడ మధుమతితో అతనికి ఎదురైన ఇబ్బందులు, ఇంట్లోవాళ్ళ మమతానురాగాలు చూసి మధుమతి వ్యాపారాత్మక వైఖరిలో వచ్చిన మార్పు లాంటి వాటితో మిగతా కథ నడుస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ మధుమతిని అక్కున చేర్చుకున్నా, హీరో బామ్మ ('తెలంగాణ' శకుంతల) మాత్రం ఆమెను శత్రువులా చూస్తుంది. ఆ పరిస్థితుల్లో మధుమతి ఏం చేసింది, మధుమతిని వెతుక్కుంటూ వచ్చిన ఆమె బ్రోకర్ ఏం చేశాడు, వగైరా ప్రశ్నలకు సమాధానం ఓపికుంటే వెండితెరపై చూడవచ్చు.
పెళ్ళయిందంటూ అబద్ధ మాడి, భార్య స్థానంలో ఓ వేశ్యను తెచ్చి, నాటకమాడే కథానాయకుల కథలు ఇప్పటికి తెలుగు తెరపై ఎన్ని చూశామో లెక్కే లేదు. మళ్ళీ అదే కథతో మరో సినిమా అని హాలులోకి వెళ్ళాక అర్థమైన సగటు ప్రేక్షకుడు ఆ తరువాత నుంచి హాలులో నుంచి ఎప్పుడు బయటపడదామా అని అసహనంగా నిరీక్షిస్తూ, కూర్చోవాల్సి వస్తుంది. పైపెచ్చు, దర్శకుడు రాజ్ శ్రీధర్ సినిమా తీసిన విధానం నాటకం కన్నా అన్యాయం.
మొదటి ముప్పావు గంట సినిమా కథ, కాకరకాయ ఏమీ లేకుండా దర్శకుడు కామెడీ (అనుకొంటూ తీసిన) దృశ్యాలతో గడిపేశాడు. ముప్పావు గంట గడిచాక తెరపైకి తొలిసారిగా వచ్చిన ఉదయభాను వేశ్య పాత్రను సహజంగా పోషించారు. కానీ, ఆ పాత్ర చిత్రణలో కానీ, కథలో కానీ ఆమె అద్భుతంగా అభియించదగ్గ సన్నివేశాలంటూ ఏమీ లేవు. తమిళంలో డబ్ చేసుకొనేందుకు వీలుగా ఉండాలనో ఏమో, సినిమాలో పాత్రధారుల గెటప్‌లు, సినీ నేపథ్యం వగైరా అంతా అడ్డ బొట్ల వ్యవహారంతో అరవ వాసన కొడతాయి. అందుకోసమే కావచ్చు, హీరోది తమిళనాడులోని గ్రామం అన్నట్లుగా కథలో చెప్పిస్తారు. పిచ్చి కామెడీ సన్నివేశాల్లో శీనుగా వేణు, లింగమ్‌గా 'డార్లింగ్' శ్రీను లాంటి వాళ్ళు నవ్వించకపోగా, ఇబ్బంది పెడతారు.
ఇక, కథతో బొత్తిగా సంబంధం లేని ఓ సెకండ్ హీరోయిన్ పాత్రధారిణి ఉన్నట్టుండి సినిమాలోకి వస్తూ, పోతూ, రెండు 'మసాలా' తరహా పాటలకు పరిమితమైంది. హీరోతో సహా ఈ సినిమాలో అందరి నటనా శూన్యం. ఆ డబ్బింగ్‌లూ అంతంత మాత్రమే. చిత్ర నిర్మాణ విలువలు పూజ్యమైన ఈ సినిమాలో కెమేరా, సంగీతం, ఎడిటింగ్ లాంటి సాంకేతిక విభాగాలు ఉన్నాయా, లేవా అని అనుమానం వస్తుంది.
ఇక, ఈ సినిమా తనకు ప్రివ్యూ వేసి చూపలేదనీ, ఆఖరుకు పోలీసు జోక్యంతో చూపారనీ, సినిమా ప్రచారం కోసం వాడిన ఫోటోలు, ప్రచార చిత్రాల్లో వేరే వారి శరీరానికి తన తలను అతికించి మార్ఫింగ్ చేసి అసభ్య చిత్రాలు రూపొందించారనీ సినిమా ముందు రోజు, రిలీజు రోజు దర్శక - నిర్మాతలపై ఉదయభాను ధ్వజమెత్తింది. కథ పోలీసు కంప్లయింట్ దాకా వెళ్ళింది. కానీ, సినిమాలో మాత్రం ఇందులో ఆమె పాత్రతో చేయించిన అశ్లీల దృశ్యాలంటూ ఏమీ లేవనే చెప్పాలి.
ఆ మధ్య 'లీడర్' సినిమాలో ఓ ప్రత్యేక నృత్య గీతంలో కనిపించిన ఉదయభాను అసలు ఉన్నట్టుండి ప్రధాన పాత్రధారిణిగా నటించాలని ఎందుకు అనుకున్నారో, అందులోనూ ఈ కథకు ఎలా ఓకె చెప్పారో, ఎందుకు ఈ సినిమాలో నటించారో ఎవరికీ అర్థం కాదు. చిత్రం ఆడియో ఆవిష్కరణకూ, ప్రచారానికీ కూడా రాని ఉదయభాను ఇప్పుడు తనకు పారితోషికం కూడా చాలా పరిమితంగా ఇచ్చారంటూ మీడియా ముందుకు వచ్చింది.
ఏమైనా, టీవీ సీరియళ్ళ కన్నా అన్యాయమైన ఈ 'మధుమతి' ఓ 'మతి' లేని 'అతి' సినిమాగా మిగిలిపోతుంది. 'మిమ్మల్ని నవ్వించి చివరకు ఏడిపించకపోతే ఒట్టు' అని సినిమా ప్రచారంలో దర్శక, నిర్మాతలు ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ, ఈ సినిమా ఆసాంతం చూస్తే వచ్చేది కచ్చితంగా ఏడుపే! టికెట్ డబ్బు, అంతకన్నా జీవితంలో రెండు గంటల పది నిమిషాల కాలం అత్యంత విలువైనవి కాబట్టి, 'మధుమతి' జోలికి పోకపోవడం ఒంటికి క్షేమం.
- రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 15 డిసెంబర్ 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
............................................................................
డియర్ మేరీ
3 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment