జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 21, 2013

బుర్రలు మారిపోయే 'బన్నీ అండ్‌ చెర్రీ' (సినిమా సమీక్ష)



   
పెద్ద హీరోల చిత్రాలేవీ విడుదలకు లేకపోవడంతో చిన్న సినిమాల పంట పండింది. అందుకే, ఈ మధ్య వారం వారం నాలుగైదు చిన్న సినిమాలు హాలు ముఖం చూస్తున్నాయి. ఆ క్రమంలో మరో కొత్త దర్శకుడు రాజేశ్‌ పులి అందించిన చిత్రం - 'బన్నీ అండ్‌ చెర్రీ'. 
తీసుకున్న కథాంశం వినూత్నంగా అనిపించినా, దాన్ని తెరపై చూపడానికి సరైన స్క్రిప్టు సిద్ధం చేసుకోలేక తడబడిన వైనం ఈ సినిమాతో తెర నిండా చూడవచ్చు. 
తండ్రి లేని పిల్లాడు కార్తీక్‌ అలియాస్‌ బన్నీ (ప్రిన్స్‌). ఇంజనీరింగ్‌ చదువుకొని, ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇక, అదే ఊళ్ళో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ (పోసాని) కుమారుడు ఇంజనీరింగ్‌ చదువుతున్న చరణ్‌ అలియాస్‌ చెర్రీ (మహత్‌ రాఘవేంద్ర). అనుకోని ఓ ఘటనలో బన్ని నడుపుతున్న నాలుగు చక్రాల వాహనం, చెర్రీ శరవేగంతో నడుపుతున్న మోటార్‌ బైక్‌ గుద్దుకుంటాయి. ఆ యాక్సిడెంట్‌లో కుర్రాళ్ళిద్దరికీ మెదడుకు బాగా దెబ్బతగులుతుంది. ఒకరి మెదడులోని న్యూరాన్‌ మరొకరి మెదడులోకి యాండీబాడీగా ఎక్కిస్తే వాళ్ళు బతకవచ్చని డాక్టర్‌ సక్సేనా (సుమన్‌), డాక్టర్‌ వీరేంద్రనాథ్‌ (యండమూరి) అనుకుంటారు. అదే చేసి, వాళ్ళను బతికిస్తారు. కానీ దాని వల్ల వాళ్ళకు శరీరం ఒకరిదైతే, మెదడు మరొకరిదిగా తయారవుతుంది. మరోరకంగా చెప్పాలంటే, పరకాయ ప్రవేశం లాంటిదనుకోవచ్చు. అలా ఒకరి దేహంలో మరొకరుగా మారిన బన్నీ, చెర్రీలు ఏం చేశారు, తమ చుట్టూ ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించారు, చివరకు ఎలా మామూలు మనుషలయ్యారు అన్నది స్థూలంగా ఈ చిత్ర కథాంశం.
మొబైల్‌లో చిప్‌ మార్చేసినంత ఈజీగా మెదడు అనే మెమరీ కార్డును మార్చవచ్చా లాంటి సైన్సు సందేహాలు ఎవరికైనా కలగవచ్చు. సినిమా కాబట్టి, అలాంటివన్నీ సాధ్యమే లెమ్మని సరిపెట్టుకున్నా ఈ సినిమా అల్లుకున్న తీరులో, చిత్రీకరణ విధానంలో సర్దుకుపోలేని లోపాలు సవాలక్ష ఉన్నాయి. సినిమా మొదలైన ఓ ముప్పావు గంట దాకా పాత్రల పరిచయం, అర్థం పర్థం లేని అపహాస్యపు సీన్లే తప్ప, కథ ఏమీ ఉండదు. యాక్సిడెంట్‌ అయినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. 
ఒకరి దేహంలో మరొకరి మెదడు (లేదా మనస్సు) అనే కాన్సెప్ట్‌ వరకు బాగున్నా, ఇక ఆ రెండు పాత్రలూ ఎలా ప్రవర్తించాయి, ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి లాంటివన్నీ ఆసక్తి రేపేలా బిగువుగా చూపాల్సింది. కానీ, అలాంటి బలమైన సీన్లు దర్శక, రచయితలు రాసుకోలేకపోయారు. దాంతో, అక్కడ కూడా మళ్ళీ రొటీన్‌ కామెడీ బిట్లే మిగిలాయి. స్క్రిప్టు సరిగ్గా లేకపోవడంతో సినిమాను ఆస్వాదించడం మాట దేవుడెరుగు - ఎవరు బన్నీ, ఎవరు చెర్రీ, ఎవరెందుకు, ఎలా ప్రవర్తిస్తున్నారన్నది గ్రహించడానికే సామాన్య ప్రేక్షకుడు బుర్ర వేడెక్కిపోతుంది. 
సినిమా చివరకు వచ్చేసరికి, ఇద్దరు హీరోలూ మంచి పనులు చేయడం, వేరొకరికి సాయపడడం లాంటి ఉపకథలు పెట్టారు. కానీ, అప్పటికే పట్టు జారిపోయిన సినిమాను ఆ ఆఖరు పావుగంట, ఇరవై నిమిషాల కథతో పైకి లేపడం అసాధ్యమైపోయింది. పాత్ర చిత్రణలో సత్తా లేకపోవడం, దానికి తోడు అభినయ ప్రతిభ పరిమితం కావడంతో ప్రిన్స్‌, మహత్‌ రాఘవేంద్రల నటన ఏ మాత్రం ఆకట్టుకోదు. 
పేరుకు ఈ సినిమాలో కృతి, సబా అనే ఇద్దరు హీరోయిన్లున్నారు. వారిద్దరూ పాటల్లో నర్తించినా, సినిమాలో కనిపించినా - రెంటికీ ఉపయోగపడింది తక్కువే. చంద్రమోహన్‌, సీత, పోసాని లాంటి సీజన్డ్‌ ఆర్టిస్టులు సినిమాకు కొంత వెన్నుదన్నుగా ఉన్నా, కథలో లేనిది కనబడితే వస్తుందా! కొత్త దర్శకుడు రాజేశ్‌ పులి మరింత హౌమ్‌ వర్క్‌ చేసి, బలమైన స్క్రిప్టుతో మరోసారి జనం ముందుకు వస్తే మంచిది. అలాగే కెమేరా వర్క్‌, ఎడిటింగ్‌ల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సింది. అలాంటివన్నీ కొరవడడంతో ఈ 'బన్నీ అండ్‌ చెర్రీ' చూసిన ప్రేక్షకులకు కూడా బుర్ర తిరిగిపోయే అనుభవంగా మిగిలిపోయింది. 

కొసమెరుపు: చాలాకాలం క్రితం వచ్చిన 'రావూ గోపాల్రావు' కథాంశం ప్రేరణతో అల్లుకున్న సినిమా కథ ఇదని దర్శకుడు, 'ప్రజాశక్తి'తో మాట్లాడుతూ చెప్పారు. అయితే, సినిమా చూస్తుంటే ఇది హాలీవుడ్‌ చిత్రం 'ఫేస్‌ ఆఫ్‌' నుంచి తీసుకున్న కథ అని అర్థమైపోతుంది. అన్నట్లు, ఇప్పటికి ఆరేడు నెలలుగా అదిగో, ఇదిగో అంటూ విడుదల కాకుండా ఊరిస్తున్న రామ్‌చరణ్‌ తేజ్‌ 'ఎవడు' కూడా ఆ హాలీవుడ్‌ సినిమాకు 'ఫ్రీ'మేకే! ఈ సినిమా వచ్చేసింది... సంక్రాంతికి రానున్న 'ఎవడు' మాత్రమే ఇక బాకీ!

- రెంటాల జయదేవ

(ప్రజాశక్తి దినపత్రిక, 15 డిసెంబర్ 2013, ఆదివారం, పేజీ నం. 8లో ప్రచురితం)
.................................................

0 వ్యాఖ్యలు: