జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, July 27, 2010

తండ్రి పై తనయుడి పిహెచ్.డి. - వార్తలో వార్త


రెంటాల సాహితీ సౌరభం

తండ్రిపై తనయుడి పిహెచ్.డి.

చెన్నై, జూలై 19, ప్రభాతవార్త

ప్రముఖ కవి, పాత్రికేయుడు, సమాజాభ్యుదయ రచయిత స్వర్గీయ రెంటాల గోపాలకృష్ణపై ఆయన తనయుడు, సినిమా పాత్రికేయుడు రెంటాల జయదేవ సిద్ధాంత వ్యాసాన్ని (పిహెచ్.డి) రాసి, మద్రాసు యూనివర్సిటీకి సమర్పించారు. ఈ సందర్భంగా చెన్నై, మెరీనా క్యాంపస్ లోని మద్రాసు యూనివర్సిటీ జూబిలీ హాల్లో సోమవారం మధ్యాహ్నం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ విచ్చేశారు. సిద్ధాంత వ్యాసానికి మౌఖిక పరీక్షకర్తగా ప్రెసిడెన్సీ కళాశాల తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ అనిందిత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రెంటాల జయదేవ తను వ్రాసిన సిద్ధాంత వ్యాసంలోని అధ్యాయాలను సదస్యులకు వివరించారు.

ఈ సందర్భంగా రెంటాల గోపాలకృష్ణ రాసిన సంఘర్షణ, సర్పయాగం, శివధనువు రచనల్లోని విశేషాంశాలను తెలిపారు. గేయం, గీతం, కథ, నవల, నాటకం - ఇలా అన్ని సాహితీ ప్రక్రియల్లోను ఆయన దాదాపు 200 పుస్తకాలు రాశారనీ, ఏది రాసినా ఆయన బాణీ, శైలి ప్రస్ఫుటంగా ఉంటాయనీ తెలిపారు. ఆయన ఆకాశవాణిలో ఎన్నో ప్రసంగాలు చేశారనీ, అనేక చర్చలలో పాల్గొనడమే కాకుండా సమీక్షలు చేశారనీ, శ్రోతలకు శ్రవ్య నాటికలు అందించారనీ తెలిపారు.

జీవితంలో రాజీ పడవచ్చు గానీ, కళ, సాహిత్యంలో రాజీ పడకూడదని ఆయన తరచూ చెబుతుండేవారనీ, భౌతికంగా ఆయన మరణించి 15 సంవత్సరాలు అయినా, ఆయన వర్ధంతి సమయంలో సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించడం ఆనందదాయకంగా ఉందనీ తెలిపారు. ఈ సిద్ధాంత వ్యాసంలో ఆయన రాసిన అన్ని అంశాల మీద పరిశోధన చేయడం జరిగిందని తెలిపారు.

రెంటాల పాత్రికేయ జీవితం 1950ల ప్రాంతంలో దేశాభిమాని పత్రికలో ప్రారంభమైందనీ, ఆంధ్రప్రభలోని చిత్రప్రభ సినిమా శీర్షికను ఆయన నిర్వహించారనీ, జ్యోతిషం మీద కూడా ఆయన వ్యాసాలు రాయడం జరిగిందనీ, దాదాపు అందరు ఎడిటర్లూ ఆయన చేత సంపాదకీయాలు రాయించుకున్నారనీ తెలిపారు. ఆయన రాసిన కవితలు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదం చేయబడ్డాయని తెలిపారు. కవి పాత్రికేయుడైతే విషయాన్ని అందంగా చెప్పగలడనీ, ప్రాథమికంగా ఆయన కవి అనీ, సంప్రదాయ సాహిత్యాన్ని చదువుకున్నారనీ, అభ్యుదయ కవిత్వాన్ని రాశారనీ తెలిపారు. వాత్స్యాయన కామసూత్రాలను సరళమైన తెలుగు వచనంలో అనువదించిన ఘనత ఆయనదేనని తెలిపారు.

ఎంతో కష్టపడి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, ఎంతో మంది దగ్గర విషయ సేకరణ చేసి, రాసి, సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి మద్రాసు యూనివర్సిటీ డాక్టరేట్ అందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రధానంగా మా తండ్రి గారైన రెంటాల గోపాలకృష్ణ గారికి వచ్చిన డాక్టరేట్ గా భావిస్తున్నాననీ, మద్రాసు యూనివర్సిటీ ప్రదానం చేయబోయే డాక్టరేట్ ను మా తల్లి గారైన రెంటాల పర్వతవర్ధనికి అంకితం ఇస్తున్నట్లుగా ఆహూతుల చప్పట్ల మధ్య అభిమానంతో తెలిపారు.

సిద్ధాంత వ్యాసం రాయడానికి ఎల్లవేళలా సహకారం అందించిన డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ కీ, తదితర పెద్దలకూ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. మౌఖిక పరీక్ష కర్తగా వ్యవహరించిన ప్రెసిడెన్సీ కళాశాల తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ అనిందిత, ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి, సదస్యులు సిద్ధాంత వ్యాసంపై అడిగిన సందేహాలకూ, ప్రశ్నలకూ సవివరంగా, సవినయంగా జయదేవ సమాధానాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, మదరాసు తెలుగు అభ్యుదయ సమాజం ప్రధాన కార్యదర్శి లయన్ డి. నాగరాజు, తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ నాగేశ్వరరావు, కందనూరు మధు, భమిడిపాటి సుబ్రమణ్యం, కార్టూనిస్టు నర్సిమ్, నిర్మాత మురారి, సీనియర్ పాత్రికేయుడు జొన్నలగడ్డ సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.

(వార్త దినపత్రిక, చెన్నైలో 2010 జూలై 20, మంగళవారం నాడు ప్రచురితం)

13 వ్యాఖ్యలు:

Afsar said...

congrats, jayadeva! It's a great achievement personally and professionally! You're a now a successful son and writer too!

Chowdary Jampala said...

Jayadev gaaru:

Congratulations!

Unknown said...

@ జంపాల చౌదరి గారూ, నమస్కారం. మీ అభినందనలకు కృతజ్ఞతలు. బ్లాగు ద్వారా ఆశ్చర్యకరంగా కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. బ్లాగు చూస్తూ మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు చెబుతూ ఉండండి.

@ అఫ్సర్ గారూ, కృతజ్ఞతలు. మీ అభినందనలకు ఆనందిస్తున్నా. అయితే, వైవా పరీక్షలోనే చెప్పినట్లు ఇవన్నీ రెంటాల గారికే చెందాల్సినవి. ఆయనలో శతాంశమైనా రచనా వ్యాసంగం చేయగలిగితే, తనయుడిగా జన్మ ధన్యం. మీ అందరి అభినందనలు అందుకు ప్రధాన ప్రోద్బలం.

Kathi Mahesh Kumar said...

అభినందనలు.

Unknown said...

@ mahesh kumar gaaru, Thank u.

rama said...

CONGRATULATIONS DR. JAYADEV.
KEEP THIS UPDATED WITHOUT DELAY.

rama said...

is this blog meant for discussions on poetry or useful for the society in any manner ?

కొత్త పాళీ said...

చాలా సంతోషం. అభినందనలు.

Unknown said...

@ rama
Thank u andi.

@ Kottapali
Thank u andi

Anonymous said...

Hello Sir,

ఒక స్నేహితుని దగ్గర పుస్తకాలుంటే మీ నాన్నగారి రాసిన రామాయణ,మహాభారతాలు నేను చదివాను. ఎంతో బాగా రాసారు. ఎంత ప్రయత్నించినా నాకు ఆ పుస్తకాలు దొరకలేదు. బెజవాడ లో జయంతి పబ్లిషర్స్ కూడా మూసి వేయబడింది. మీకు ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో తెలిసినా, మీ దగ్గర ఎక్కువ కాపీలు ఉన్నా దయుంచి ఈ కింద మెయిల్ ఐడికి మెయిల్ పెట్టగలరు.
nlassai@gmail.com

దయ చేసి ఈ వ్యాఖ్యను ప్రచురించకండి.

ఆ.సౌమ్య said...

Congratulations!

Unknown said...

@ Sowmya garu,
Thank u andi!!

vasantham said...

Congratulations on your acievement..

vasantham.