జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, March 6, 2015

లక్ష్మమ్మలో ఆ పాట నాకు బాగా ఇష్టం! - సి. కృష్ణవేణి, సీనియర్ నటి, గాయని, నిర్మాత

- సి. కృష్ణవేణి, సీనియర్ నటి, గాయని, నిర్మాత

లక్ష్మమ్మలో ఆ పాట నాకు బాగా ఇష్టం!

  బాలాంత్రపు రజనీకాంతరావు గారు అటు సంగీతంలోనూ, ఇటు సాహిత్యంలోనూ పరిజ్ఞానం ఉన్న అరుదైన ప్రతిభావంతులు. చక్కటి స్వరకర్తే కాక, మంచి కవి, గాయకుడు కూడా! నేను సినిమాల్లో నటిస్తూ, మీర్జాపురం రాజా వారు శోభనాచల పతాకంపై సినిమాలు తీస్తూ ఉన్న సమయంలోనే ఆయన సినిమాల్లో గీత రచన, సంగీతం ప్రారంభించారు. అప్పటికే ఆయన ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నారనుకుంటా. అందుకే, టైటిల్స్‌లో వేరే పేరు వేసేవారు. రజని రాసి, వరుస కట్టగా ‘స్వర్గసీమ’లో భానుమతి పాడిన ‘ఓహోహో పావురమా...’ పాట అందరికీ తెలిసిందే. ఇక ఎల్వీ ప్రసాద్, భానుమతి నటించిన ‘గృహప్రవేశం’ చిత్రానికైతే పాటలు, సంగీతం పూర్తిగా ఆయనవే. నా చిత్రాల్లో రజనీ గారి సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే ప్రధానంగా చెప్పుకోవలసిన చిత్రాలు ‘లక్ష్మమ్మ’, ‘పేరంటాలు’.

 లక్ష్మమ్మ’ చిత్ర నిర్మాణం ఒక పెద్ద కథ. రజనీకాంతరావు, రచయిత-దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ చాలా సన్నిహితులు. గోపీచంద్ గారు ‘లక్ష్మమ్మ’ స్క్రిప్టు మాత్రమే కాకుండా, పాటలు-వాటి వరుసలు కూడా అన్నీ సిద్ధం చేసుకొని, మద్రాసులో మా బంగళాకు వచ్చారు. స్క్రిప్టు, పాటలు వినిపించారు. పాటలు, వరుసలు - రజనీకాంతరావు గారివి. ఆ లక్ష్మమ్మ పాత్రకు నేను బాగుంటాననీ, నన్ను చేయమనీ గోపీచంద్ అడిగారు. అలాగే అనుకున్నాం. తరువాత చాలా కథ జరిగి, పలువురి చేతులు మారినా, చివరకు ప్రాజెక్ట్ నా దగ్గరకే వచ్చింది. చిత్ర నిర్మాణమూ మేమే చేపట్టాం. తీరా అదే సమయంలో జనబాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉన్న నిజజీవిత కథ అయిన లక్ష్మమ్మ కథతోనే, అక్కినేని, అంజలీదేవి హీరో హీరోయిన్లుగా నిర్మించ తలపెట్టారు. మా ‘లక్ష్మమ్మ’, వాళ్ళ ‘లక్ష్మమ్మ కథ’ ఒకే రోజు షూటింగ్ మొదలై, అనేక సంచలనాల మధ్య ఒకే రోజు విడుదలయ్యాయి. మాది హిట్టయ్యింది.

 ‘లక్ష్మమ్మ’ పాటలు రజనీ రాసి, వరసలు కట్టినా, వాటిని సినిమాకు తగ్గట్లుగా రికార్డింగ్ చేసింది ఘంటసాల. అందుకే, టైటిల్స్‌లో సంగీత దర్శకుడిగా ఘంటసాల పేరే ఉంటుంది. రజనీ గారి సాహిత్యం ఎంత సులభంగా, సహజంగా ఉంటుందంటే... ‘లక్ష్మమ్మ’లో పాటలన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా, లక్ష్మమ్మ పాత్ర అత్తవారింటికి పల్లకీలో వెళ్ళే సందర్భంలో వచ్చే ‘చిన్ననాటి స్వప్నసీమ... కన్న ఊరు విడువలేము...’ పాట నాకు మరీ మరీ ఇష్టం. ఆయన వరుసల్లో నా పాటలన్నీ నేనే పాడుకున్నా. అలాగే, ఆ తరువాత విజయలక్ష్మీ బ్యానర్‌పై మేమే నిర్మించిన ‘పేరంటాలు’కు కూడా గోపీచంద్ దర్శకుడు. రజనీ పాటలు రాశారు. అందులోనూ పాటలు పాడాను. ఇప్పుడు ఆ సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే, కాలం వెనక్కి వెళ్ళినట్లుంది.

-Interview by Rentala Jayadeva

(Published in 'Sakshi' daily, 29th Jan 2015, Thursday)
............................

0 వ్యాఖ్యలు: