జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Friday, April 17, 2015

నేను వేధిస్తుంటా.. అతను సహిస్తుంటాడు..! - (దర్శకుడు మణిరత్నం... సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ల ‘డబుల్ ధమాకా’ ఇంటర్వ్యూ)

నేను వేధిస్తుంటా.. అతను సహిస్తుంటాడు..!
దర్శకుడు మణిరత్నం... సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్... ఇద్దరూ ఒకేసారి మీడియా ముందుకు వస్తే! రెండు మేరునగాలనూ కూర్చోబెట్టి, 5 నిమిషాల్లోనే అంతా అడిగేయమంటే? బుధవారం ‘ఓ.కె. బంగారం’  పాటల విజయోత్సవం కోసం హైదరాబాద్ సుడిగాలి పర్యటన జరిపారు ఆ ఇద్దరు. ప్లైట్ దిగుతూనే రెహమాన్ నాంపల్లి దర్గా సందర్శన, సానియా మిర్జాతో భేటీ, వెంటనే ఆడియో ఫంక్షన్, ప్రత్యేక టీవీ ఇంటర్వ్యూ, ‘బాహుబలి’ రాజమౌళితో రెహమాన్ మంతనాలు - మణిరత్నం ముచ్చట్లు... ఉన్న కాసేపూ ఊపిరి సలపని హడావిడి. 4 గంటలు నిరీక్షించి, అలసిన మీడియా... కాలానికి అతీతమైన ఆ క్రియేటర్‌‌సని పరిమిత కాలవ్యవధిలోనే ఆవిష్కరించాలని ప్రయత్నించింది. నటుడు ప్రకాశ్‌రాజ్ కలగ జేసు కుంటూ ఉండగా, సాగిన  ‘డబుల్ ధమాకా’ నుంచి...

  మరికొద్ది నెలల్లో అరవయ్యో ఏట అడుగుపెడుతున్నారు. అయినా, ‘ఓ.కె. బంగారం’ లాంటి ఇంత అందమైన ప్రేమకథా చిత్రాన్ని తీయడం ఆశ్చర్యం!
 మణిరత్నం: (ఆశ్చర్యం నటిస్తూ...) ఎవరు అరవయ్యో ఏట అడుగుపెడుతున్నది! నాకు ఇప్పటికీ ఇరవై ఒక్క ఏళ్ళ చిల్లరే! (నవ్వులు...)

  మీరు తరచూ బొంబాయి నగర నేపథ్యంలో చిత్రాలు తీస్తుంటారు. ఈ సినిమా కూడా ఆ నేపథ్యంలో సినిమానే! ఆ నగరం పట్ల మీ ఆకర్షణకు ప్రత్యేక కారణం?
 మణి: నేను తీసిన చిత్రాల్లో ఒకటైన ‘బొంబాయి’ అయితే, పూర్తిగా ఆ నగరం చుట్టూ తిరిగిన కథ. అయితే, ఆ కథ, ఆ నేపథ్యం వేరు. నిజం చెప్పాలంటే, నాకు బొంబాయి (ఇప్పటి ముంబై) నగరమంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ, ఇష్టం. రెండు మూడేళ్ళు నేను అక్కడే చదువుకున్నాను. పెపైచ్చు, భారతదేశంలో బాగా పురోగమిస్తున్న అనేక మహానగరాలకు ప్రతీక బొంబాయి నగరం. అందుకే, ఈ కథకు ఆ నేపథ్యమైతే బాగుంటుందని ఎంచుకున్నా.

  బొంబాయిలో ఉండే ఉల్లాసం, ఉత్సాహం కథకు ఉపకరిస్తుందనా?
 మణి: ప్రతి నగరానికీ తనదైన ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఈ చిత్ర కథ ఒక నిర్ణీత వాతావరణంలో, ప్రపంచంలో జరుగుతుంది. అది బొంబాయిలో ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. అందుకనే ఆ నగర నేపథ్యం తీసుకున్నాం.

  మీ సినిమాలు సమాజం నుంచి ప్రేరణ పొందుతుంటాయి. మరి, ఈ సినిమా?
 మణి: ఈ సినిమా కథ కూడా సమాజంలో నుంచి తీసుకున్నదే! ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ సినిమా ఇవాళ్టిని, ఇవాళ్టి ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇవాళ్టి యువతీ యువకులు, వయసు మీద పడ్డవాళ్ళు, వాళ్ళ మనోభిప్రాయాలను ఈ సినిమా చూపెడుతుంది. వారి మానసిక వైఖరినీ, వారు తీసుకొనే నిర్ణయాలనూ, వారి మధ్య ఉన్న ఘర్షణనూ ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది.

  ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మీరు ఏ రకమైన రీసెర్చ్ చేస్తుంటారు?
 మణి: ఏదైనా ఒక ప్రత్యేకమైన కథ, ఒక ప్రత్యేకమైన పాత్ర అనుకున్నప్పుడు స్వరూప స్వభావాలకు కొంత రీసెర్చ్ అవసరం. కానీ, జీవితం నుంచే కథలనూ, పాత్రలనూ ఎంచుకున్నప్పుడు మనం చూసిన విషయాలు, మనకు ఎదురైన అనుభవాలు, అనుభూతులు కీలకమవుతాయి. కళ్ళూ, చెవులూ విప్పార్చి, అన్నీ గమనిస్తూ ఉంటే... చాలు. అదే మనకు రీసెర్చ్.

 ‘సహజీవనం’ అనే అంశంపై ఈ చిత్రకథ సాగుతుందని విన్నాం. ఇవాళ్టికీ సమాజం ఒక నేరంగా చూస్తున్న ఇలాంటి క్లిష్టమైన అంశాన్ని ఎంచుకున్నారేం?
 మణి: ఈ చిత్ర కథ కేవలం ‘సహజీవనం’ అనే అంశంపై సాగేది కాదు. ‘ఓ.కె. బంగారం’ సినిమా వివాహం గురించి, వివాహవ్యవస్థ పట్ల కథలోని ప్రధాన పాత్రలకు ఉన్న వైఖరి గురించి, వారి అభిప్రాయాల గురించి! కాబట్టి, ఈ సినిమా అనేక విషయాలనూ, పలువురు వ్యక్తులనూ స్పృశిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఇవాళ ప్రపంచీకరణ ప్రభావంతో పెరుగుతున్న ఈ తరం యువతీ యువకులు ఏ రకమైన పాశ్చాత్య ప్రభావానికి లోనవుతున్నారు, అదే సమయంలో మన భారతీయ విలువల్లో వేటికి కట్టుబడి ఉన్నారనేది ఈ చిత్రం చూపిస్తుంది.

  తెలుగు నేటివిటీ కోసం ఏమైనా మార్పులు చేశారా?

 మణి: ఈ చిత్రకథను దేశంలోని ఒక మహానగర నేపథ్యంలో చూపెట్టాం కాబట్టి, ఇది మనందరికీ తెలిసిన కథ, మన మధ్యే జరుగుతున్న కథ అనిపిస్తుంది. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా ఇది తమ కథ అనే భావిస్తారు.  

 ఈ చిత్రం తమిళ వెర్షన్ ‘ఓ కాదల్ కన్మణి’ని షూటింగ్ జరుగుతున్నప్పుడే డైలాగులు, శబ్దం కూడా రికార్డు చేసేలా ‘సింక్ సౌండ్’తో చిత్రీకరించారేం?
 మణి: నన్నడిగితే, ఏ సినిమానైనా అలా ‘సింక్ సౌండ్’లోనే తీయాలంటాను! ‘సింక్ సౌండ్’తో తీయగలిగితే, అలా తీయడమే చాలా మంచిదని నా అభిప్రాయం. ఈ సినిమాను అలా తీయడం నాకెంతో సంతోషం అనిపించింది. అలా చేయడం వల్ల ఆర్టిస్టుల హావభావాలు, దానికి ప్రతిస్పందన, సెట్స్ మీదే రికార్డయిన ఆ సౌండ్‌లోని సూక్ష్మ వివరాలు, విశేషాలు తోడై అద్భుతంగా ఉంటుంది. డైలాగుల్లోనే కాక, మొత్తం సినిమాకే కొత్త జవజీవాలొస్తాయి.

 అలా ‘సింక్ సౌండ్’లో తీయడం కష్టం కాదా?  
 మణి: కష్టమే! ఆ మాటకొస్తే, షూటింగ్‌తో సహా అనేక విషయాలు కష్టమే. అయినా, మనం చేయాలి. కష్టంగా ఉంటుంది కదా అని, భయపడి వదిలేయకూడదు కదా! వీలుంటే, నా రాబోయే చిత్రాలకు కూడా ఇదే పద్ధతి పాటిస్తా.
 ప్రకాశ్‌రాజ్: (పక్క నుంచి అందుకుంటూ...) నటీనటుల దృష్టిలో నుంచి చెప్పాలంటే, ‘సింక్ సౌండ్’ చాలా కీలకం. నటిస్తున్న నటీనటులకు ఆ భాష తెలియాలి. ఆ డైలాగ్ చెబుతూ భావప్రకటన చేయడం తెలియాలి. దీనివల్ల తరువాతెవరో డబ్బింగ్ చేస్తారనే సౌకర్యం ఉండదు. ఆ క్షణాన్ని కెమేరా ముందు జీవించగలగాలి. నటీనటులు జాగ్రత్తగా, చైతన్యంతో ఉండాలి. ఆ సినిమా పట్ల ఎంతో నిజాయతీతో, నిబద్ధతతో ఉండాలి. ఒక నటుడిగా నాకు అది అనుభవమైంది.
 మణి: ప్రకాశ్‌రాజ్ మనసుకు హత్తుకొనేలా చెప్పారు. థ్యాంక్స్ ప్రకాశ్.

 గతంలో చక్కటి ప్రేమకథ ‘సఖి’ తీశారు. ఇప్పుడు ఈ సినిమా...
 ప్రకాశ్‌రాజ్: రెండూ భిన్నమైన సినిమాలు. శుక్రవారం మీరే చూస్తారు.

  చాలాకాలం తర్వాత మీరు, కెమేరామన్ పి.సి. శ్రీరామ్ మళ్ళీ కలసి పనిచేశారు...
 మణి: మళ్ళీ కలసి పనిచేయడమని నేను అనను. ఎందుకంటే, శ్రీరామ్ మా టీమ్‌లో ఎప్పుడూ సభ్యుడే! నా సినిమాకు కెమేరామన్‌గా పనిచేయని సందర్భాల్లో కూడా ఆయన మా జట్టులో వాడే! నేను తీసే ప్రతి సినిమా స్క్రిప్టూ ఆయనకు తెలుసు. ఆయన నాకు ‘బౌన్స్ బోర్డ్’ లాంటివాడు. నాకు ఆయన ఎంత మిత్రుడంటే, నా ప్రతి సినిమా ఆయనతో చర్చిస్తూ ఉంటా.

  మీకు వేటూరిగారితో అలవాటు. ఇప్పుడు సీతారామశాస్త్రిగారితో పనిచేయడం?
 మణి:  వేటూరి గారితో అనేక సంవత్సరాలు కలసి ప్రయాణించాను. ఇప్పుడు శాస్త్రి గారితో పనిచేయడం కూడా అచ్చం ఆ అనుభూతి లాగానే, ఎంతో బాగుంది. ఆయన రాసిన సాహిత్యం ఎంతో ఆనందాన్నిచ్చింది.

  రెహమాన్ గారూ! ఈ చిత్రంలో మీ అబ్బాయి స్వరంగేట్రం చేస్తున్నట్లున్నాడు!
 ఎ.ఆర్. రెహమాన్: నిజానికి, మా కుటుంబం వినడం కోసం ఒక పాట చేశా. అనుకోకుండా, మణి సార్ ఆ పాట విన్నారు. వెంటనే, ‘ఆ పాట నాకు కావాలి. ఈ సినిమాలో వాడతాను’ అన్నారు. అసలైతే, ఆ పాటను మ్యూజిక్ వీడియో చేయాలని, నా వ్యక్తిగత మిత్రులు వినేలా వాళ్ళకు ఇవ్వాలనీ ముందు అనుకున్నాను. కానీ, మణి సార్ అడిగేసరికి, సినిమాలో పెట్టేశా.
 మణి: నువ్విప్పటికీ ఆ పాటతో మ్యూజిక్ వీడియో చేయచ్చు.(నవ్వులు...)
 రెహమాన్: (నవ్వేస్తూ...) మణిరత్నం సినిమాలో రావడం గొప్ప విషయం కదా! ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. ఒక సంగీత కళాకారుడైతే, ఆ పాట విన్నప్పుడల్లా ఎందుకనో కళ్ళవెంట నీళ్ళొచ్చేస్తున్నాయంటూ భావోద్వేగంగా మెసేజ్ పెట్టారు. రోజూ దాని గురించి అలాంటి మెసేజ్‌లొస్తూనే ఉన్నాయి.

  రెండు దశాబ్దాల పైచిలుకుగా మణిరత్నంతో మీ అనుబంధం గురించి..?
 మణి: (మధ్యలోనే అందుకుంటూ...) నేను వేధిస్తుంటా... అతను దాన్ని సహించి, నాకు కావాల్సింది ఇస్తుంటాడు. (నవ్వులు)
 రెహమాన్: నేను చాలా కాలంగా చెప్పాలనుకుంటున్న విషయం చెప్పాలి. మణి సార్‌లో ఒక ప్రత్యేక లక్షణం ఉంది. సాధారణంగా అందరూ అవతలివాళ్ళను పాపులారిటీని బట్టి, వాళ్ళ జయాపజయాలను బట్టి జడ్జ్ చేస్తుంటారు. ఈ హీరో పాపులర్, ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు ఊపు మీద ఉన్నాడు... ఇలా చూసి, వాళ్ళను పెట్టుకోవాలని చూస్తుంటారు. ఫ్లాపులు వచ్చినవాళ్ళను దూరం పెట్టేస్తుంటారు. కానీ, మణి అలా జడ్జ్ చేయరు. అవతలి వాళ్ళు ఎంత ప్రేమతో, ఇష్టంతో నాణ్యమైన పని అందిస్తారన్నదే చూస్తారు. సదరు యాక్టర్ సక్సెస్‌లో ఉన్నాడా, ఫెయిల్యూర్‌లో ఉన్నాడా అని కాకుండా, ఆ వ్యక్తి ఎంత చక్కటి నటన అందిస్తారు, ఆ పాత్రను ఎంత అద్భుతంగా పండిస్తారన్నదే చూస్తారు. చేసే పని మీద శ్రద్ధ, ప్రేమ ఉంటే చాలు... మిగతావాళ్ళంతా పక్కనపెట్టినవాళ్ళను సైతం ఆయన ఆనందంగా స్వాగతిస్తారు. దగ్గరకు తీసుకొని, తన ప్రాజెక్ట్‌లో భాగం చేసుకొని, ప్రేమిస్తారు. అది ఆయనలోని గొప్ప లక్షణం. ఫ్లాపుల్లో ఉన్న ఫలానా వ్యక్తిని తీసుకుంటే, నా సినిమా కూడా ఫ్లాపవుతుందేమో లాంటి మూఢనమ్మకాలు ఆయనకు లేనే లేవు.

  మణి సార్! మీరు గతంలో మమ్ముట్టితో, ఇప్పుడీ సినిమాలో ఆయన కుమారుడు దుల్కర్‌తో పనిచేశారు. ఎవరిని ఇష్టపడ్డారు?
 మణి: వారిద్దరూ ఒకరికొకరు పూర్తి భిన్నం. మమ్ముట్టి లాంటి దిగ్గజం ఛాయలో పెరుగుతూ, ఆయన ప్రభావం లేకుండా నటించడం చాలా కష్టం. కానీ, విచిత్రంగా దుల్కర్ అదే చేశాడు. తండ్రిని అనుకరించకుండా, ఆత్మవిశ్వాసంతో అభినయించాడు. అది గొప్ప విషయం. నన్నడిగితే, ఏ ఇద్దరినీ ఒకరినొకరు పోల్చి, ఎవరు ఇష్టమని జడ్‌‌జ చేయాల్సిన పని లేదు.

 దుల్కర్, నిత్యామీనన్‌ల ఎంపికకు ప్రత్యేక కారణమేదైనా ఉందా?
 మణి: కేవలం నా మనుగడ కోసమే. (నవ్వులు...). తీస్తున్న సినిమాకు సులభంగా అందుబాటులో ఉంటూ, కథలోని పాత్ర లకు తమదైన అదనపు విలువను జోడిస్తూ, ఈ కథ నిజంగా జరిగిందని తెరపై అనిపించగలిగే వాళ్ళనెంచుకుంటూ ఉంటా.

  రెహమాన్‌జీ.. ఈ చిత్రానికి చేసి, పక్కన పెట్టేసిన పాటలేమైనా?
 రెహమాన్: మేము మరో పాట కూడా చేశాం. తీరా సినిమా చూశాక, ఆ పాట సరిగ్గా అతికినట్లు అనిపించలేదు. షూట్ చేసిన ఆ పాట తీసేశాం. నేను ఎంత కష్టపడి చేసిన పాటైనా సరే, బాగా లేదనుకుంటే పక్కనపెట్టాల్సిందే!
 మణి: రెహమాన్‌లోని గొప్ప విషయం అదే. ఇతరులు అలా ఉండరు. అతను ఎంతో శ్రమపడి, చేసిన పాటను సైతం వద్దని అంటే పక్కనపడేస్తాడు.  నేను మాత్రం తీసిన ఏ సీన్ కైనా ఎవరైనా అలా అంటే, తగాదా పడతా (నవ్వులు...)

  రెహమాన్‌జీ.. మీరు కానడ రాగం తరచూ వాడతారు. మణి గారు అడుగుతుంటారా?
 మణి: నాకే రాగమూ తెలీదు.

 ‘మౌనరాగం’ తెలుసేమో?
మణి: హ్హ...హ్హ... హ్హ...
రెహమాన్: పాట వినిపించ గానే, ఎవరీ సింగర్ అని మణి అడిగారంటే, ఆ పాట బాగుందని. ఈ సినిమాలో విలాస్‌ఖాన్, తోడి లాంటి అనేక రాగాలు వాడాలని చూశా. అయితే, మనకు ఎన్ని రాగాలు వచ్చని కాక, అవి ఎలాంటి భావాన్ని ఇస్తున్నాయనేది ముఖ్యం. అందుకే, చాలా సింపుల్‌గా వెళ్ళిపోయాను.

 మణీజీ! మీ సినిమాలు యువతరం, పెద్దవాళ్ళు అందరూ చూస్తుంటారు. ఇన్ని వర్గాలకు నచ్చేలా ఎలా తీస్తారు?
 మణి: ఫలానా వయస్సు వాళ్ళకు నచ్చాలంటూ తీయను. ఎవరూ అలా తీయ కూడదు. ఎంచుకున్న కథను దానికి తగ్గట్లు తీయాలి. దాన్ని నిజాయతీగా తీయాలి. మన మనసుకు ముందుగా నచ్చేలా తీయాలి. అది ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని ఆశించాలి. అంతే.

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' daily, 16th April 2015, Thursday)
...................................

0 వ్యాఖ్యలు: