మీరెప్పుడైనా రాజమండ్రి వెళ్ళారా? అక్కడి దేవిచౌక్ సెంటర్‌కు వెళ్ళండి. ఒక భవనంలో మేడ మీద చిన్న గదిని బయట నుంచి చూస్తే, సవాలక్ష వ్యాపార దుకాణాల్లో అదీ ఒకటనే అనిపిస్తుంది. కానీ, ‘జనరంజని ఆడియో లైబ్రరీ’ అనే ఆ గదిలోని ర్యాకుల్లో ఎనభై మూడేళ్ళ తెలుగు సినీ చరిత్రకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాధారాలున్నాయని ఎవరూ ఊహించరు. ఆ షాపు కాని షాపులోకి వెళితే కొద్ది గంటల వ్యాపార పనులు మినహాయిస్తే, రాత్రీ పగలూ అక్కడే నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ గడిపే నలభై ఎనిమిదేళ్ళ గోలి సాయిబాబు కనిపిస్తారు. గడచిన పదిహేడేళ్ళుగా తాను సాగిస్తున్న సినీ గీత సమాచార సేకరణతో సినీ ప్రియులకూ, పరిశోధకులకూ సాదరంగా స్వాగతం పలుకుతారు.
1932 ఫిబ్రవరి 6న విడుదలైన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ మొదలు రానున్న బాలకృష్ణ ‘లయన్’ దాకా ఈ ఎనభై మూడేళ్ళలోని దాదాపు 6 వేల నేరు తెలుగు సినిమాల్లోని 90 శాతం పాటల సమాచారాన్ని ఆనందంగా పంచుకుంటారు. తెలుగు సినీ చిత్రగీతాల వివరాలతో 1200 పేజీల్లో నాలుగు భాగాలుగా నాలుగు పుస్తకాలను అందించే ప్రయత్నంలో ఉన్నారాయన. ఇప్పటికే అందులో రెండు సంపుటాలు ‘జన రంజని... రాగం తానం పల్లవి’ పేరిట వెలువరించారు. ఇళయరాజా స్వరపరచిన తెలుగు పాటలన్నిటి సమాచారంతో ‘రాగబంధం’ అనే సినీగీత మాలికను తాజాగా ప్రచురించారు. ఇలాంటి మరిన్ని ప్రచు రణలతో సినీగీత సమాచారఖనిగా అవతరిస్తున్న పరిశోధకుడు కాని పరిశోధకుడు గోలి సాయిబాబు ప్రస్థానం చాలా చిత్రంగా అనిపిస్తుంది.
సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన సాయిబాబుది స్వస్థలం - తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి 3 కిలోమీటర్ల దూరంలోని వడ్లమూరు గ్రామం. పదేళ్ళ క్రితం రాజ మండ్రి వచ్చి, స్థిరపడ్డారు. ‘‘మా నాన్న గారు రైతు. అయితే, ఆయనకు సినిమా పాటలంటే మహా ఇష్టం. రేడియోలో, ఆయన ఇంటికి తెచ్చిన ఆడియో క్యాసెట్లలో పాటలు వినడం ద్వారా చిన్నప్పటి నుంచి వాటి మీద ఆసక్తి పెరిగింది’’ అని సాయిబాబు వివరిస్తారు.
నిజం చెప్పాలంటే, న్యాయశాస్త్రంలో డిగ్రీ వరకు చదువుకొన్న ఆయన చివరకు ఈ సినిమా పాటల సమాచార సేకరణ, ముద్రణే తన జీవితమవుతుందని ఎన్నడూ ఊహించ లేదు. ఆయన భార్య కూడా ‘లా’ గ్రాడ్యుయేటే. కానీ, ‘లా’ ప్రాక్టీస్ చేసే బదులు, ఓడరేవుల్లో సరుకుల ఎగుమతి, దిగుమతికి సంబంధించిన క్లియరెన్సులు చూసే ‘క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్’ అవ్వాలని మొదట్లో ఆయన భావించారు. అందుకోసం విశాఖ పట్నంలో మూడేళ్ళు అంతా నేర్చుకొని, పరీక్ష పాసై, లెసైన్‌స కూడా సంపాదించారు. తీరా అప్పటి కాకినాడ పోర్టును ప్రైవేట్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అశనిపాతమైంది. ‘‘ఊహించని ఆ ఎదురుదెబ్బ నా జీవితాన్ని మలుపు తిప్పింది’’ అంటారాయన. విశాఖలోని ‘సర్వారాయుడు ప్రెస్’ చూసి, ముద్రణ రంగం వైపు మొగ్గారు. అయితే, సొంతంగా ప్రెస్ నడపడం కష్టమన్న మిత్రుల సలహా మేరకు, ప్రచురణ రంగానికి పరిమితమయ్యారు.
అప్పుతో మొదలైన ఆసక్తికర సేకరణ
మరి, ఈ సినిమా పాటల సమాచార ప్రచురణ ఆసక్తి ఎలా కలిగింది? ‘‘1997లో నాకు ఇష్టమైన కొన్ని పాటలు రికార్‌డ చేయించుకోవాలనుకున్నా. తీరా చూస్తే వాటి సమాచారం దొరకలేదు. ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారు. నా లాంటి పాత పాటల ప్రియులకు సమాచారం దొరకడం ఎంత కష్టంగా ఉందో అప్పుడు తెలిసింది. హిందీలో సినీ గీతాల సమాచారంతో ‘గీత కోశాలు’న్నట్లే, తెలుగులోనూ ఉంటే ఎంత బాగుండనిపించింది’’ సరిగ్గా అదే సమయంలో ఊళ్ళో ఒకాయన పాటల రికార్డింగ్ షాపు తీసేస్తుంటే, పాటల మీద ప్రేమతో ఏకంగా ఆ షాపులోని గ్రావ్‌ుఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్లు ‘‘ఇంట్లో తెలియకుండా రూ. 30 వేలు అప్పు చేసి, కొనేశా. అవన్నీ ఇంట్లో పెడితే తెలుస్తుందని, నా మిత్రుడి షాపులో అప్పజెప్పాను. అప్పట్లో వాటితో వ్యాపారం చేయాలని కూడా నాకు తెలీదు. ఆసక్తితో చేశాను’’ అంటారాయన. అలా మొదలైన ఆయన పాటల సేకరణ ఇవాళ తెలుగు సినిమా చరిత్రలోని 90 శాతం పాటల స్థాయికి చేరింది. ఈ సమాచారం సినిమా పత్రికలు, పుస్తకాల దాకా పాకింది.
ప్రామాణికంగా సినీగీత సమాచారం
అయితే, ఆ సమాచారం, పాటల వివరాలు కేవలం తన ఒక్కడికే పరిమితం కాకుండా, అందరికీ పంచాలనుకున్నారు. ఆడియో క్యాసెట్ల ముఖచిత్రాలు, గ్రావ్‌ుఫోన్ కవర్లు, 5 వేల పైచిలుకు నేరు - డబ్బింగ్ తెలుగు సినిమాల వీడియోలు ఆయనకు ప్రాథమిక ఆధారాలయ్యాయి. 1932 నుంచి 2010 దాకా విడుదలైన ప్రతి తెలుగు సినిమా పేరు, నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు, తారాగణం, ఆ చిత్ర గీతాల మొదటి లైన్లు - సంవత్సరాల వారీగా ఆయన సిద్ధం చేశారు.
‘జన రంజని... రాగం... తానం... పల్లవి’ అనే నాలుగు భాగాల పుస్తకంలో 3వ భాగం (1989-2005), 4వ భాగం (2006-2010) ఇప్పటికే వెలువడ్డాయి. ఇక, 1932 నుంచి 1975 వరకు పాటల సమాచారంతో మొదటి భాగం, 1976 నుంచి 1988 దాకా సమా చారంతో రెండో భాగం రానున్నాయి. అలాగే, తెలుగు సినిమాల్లో యాక్టర్, రచయిత, సింగర్, సంగీత దర్శకుల వారీగా 1980ల చివరి దాకా వచ్చిన 3650 ప్రసిద్ధమైన గీతాల వివరాలను ‘జనరంజని’ అనే చిరు పుస్తకంలో ఇప్పటికే అందించారు. గాయకులు రామ కృష్ణ, ఏసుదాస్, రచయితలు దేవులపల్లి, సినారె, కొసరాజు తదితరుల సమస్త సినీగీత వివరాల పుస్తకాలకూ డేటా సిద్ధం చేస్తున్నారు. ఆ సమాచారాన్నంతా ‘జనరంజని ఆడియో లైబ్రరీ’ (ఫోన్: 93901 58999)లో అందరికీ అందుబాటులో ఉంచారు. ఎవరైనా వచ్చి, వాటిని రిఫర్ చేసుకోవచ్చు.
పాటకు కేరాఫ్ అడ్రస్
బరువు తక్కువ కాగితంలో, అందుబాటు వెలలో సినీగీత సమాచార పుస్తకాలు తేవడం సాయిబాబు ప్రత్యేకత. తాజాగా ఇళయరాజా తెలుగులో చేసిన 347 సినిమాల్లోని 1800 పాటల వివరాలూ ‘రాగబంధం’ అనే పుస్తకంగా తెచ్చారు. పుస్తక విక్రేతలు అమ్మకం ధరలో 40 శాతం తీసేసుకుంటుండడంతో, తానే స్వయంగా తన బుక్స్ విక్రయిస్తున్నారు
పరిశ్రమ పట్టించుకోని బృహత్తర ప్రయత్నం
‘‘సినిమా చరిత్రకు సంబంధించి ఎవరూ ఎవరికీ సమాచారం అందించని దాపరికం ఉంది. అందుకే, నా దగ్గర ఉన్న సమాచారం మొత్తాన్ని అందరికీ అందించాలని పుస్తకాలుగా తెస్తున్నా’’ అని ఈ ఔత్సాహిక సినీగీత సేకర్త, అపర పరిశోధకుడు చెప్పారు. ఈస్టిండియా ‘లవకుశ’ (1934) పాటల నుంచి ఆడియో, 1935 నుంచి తెలుగు సినిమాల వీడియోలు సాయిబాబు దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఏ ఊరెళ్ళినా, తన దగ్గర లేని పాటలు, సినిమాల లిస్టు పెట్టుకొని, వాటి సేకరణలో నిమగ్నమవుతారు. ఇందుకోసం ఇప్పటికి కొన్ని లక్షలు ఖర్చుచేశారు. అందుకు ఆయన భార్య కానీ, పదో తరగతికి వచ్చిన ఏకైక కుమారుడి బాధ్యత కానీ అడ్డు రాలేదు. ‘‘భావితరాలకు ఉపకరించే ఈ సమాచారానికి వెల కట్టలేం. ఇందులోని మానసిక తృప్తి నేను ఖర్చు చేసిన లక్షల కన్నా విలువైనది’’ అని నవ్వేస్తారాయన. ‘‘నెట్‌లో ఇప్పుడు డేటా లభిస్తున్నా, చాలా తప్పులుంటున్నాయి. పైగా నా దగ్గరున్న పాట, సినిమాలన్నీ ఒరిజినల్ క్వాలిటీవే. ఇవి చరిత్ర పునర్నిర్మాణానికి తోడ్పడ తాయి’’ అంటారాయన. సినీ పరిశ్రమ పెద్దలు, పరిశోధకులు చేయాల్సిన బృహత్తరమైన పనిని ఔత్సాహికుడైన ఒక సామాన్యుడు తన వ్యక్తిగత ఆసక్తితో లక్షల ఖర్చుతో నెత్తికెత్తుకోవడం విశేషం. నిదురిస్తున్న పరిశోధక, పండితమ్మన్యుల్ని మేల్కొల్పుతూ, తెలుగు సినిమా తోటలోకి వచ్చిన ఒక తీయటి పాట- సాయిబాబు ప్రయత్నం. ఆయన కృషి మరికొందరికి ఆదర్శమైతే, భవిష్యత్తులో సమగ్ర సినీగీత సమాచారాన్ని అందిస్తే, అంతకన్నా కావాల్సింది ఏముంది!
- రెంటాల జయదేవ
(Published in 'Sakshi' daily, 26th Apr 2015, Sunday, Family Page)
.......................................................
డియర్ మేరీ
3 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment