జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, April 9, 2015

వేసవి కలిసొచ్చే 'జిల్'

వేసవిలో కలిసొచ్చే 'జిల్'

చిత్రం - జిల్..., తారాగణం - గోపీచంద్, రాశీఖన్నా, కబీర్ (నూతన పరిచయం), బ్రహ్మాజీ, చలపతిరావు, ఐశ్వర్య, కెమేరా - శక్తి శరవణన్, సంగీతం - జిబ్రాన్, ఫైట్స్ - అనల్ అరసు, కళ - ఏ.ఎస్. ప్రకాశ్, కూర్పు - కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు - వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం - రాధాకృష్ణ కుమార్
 .............................................
 కొన్ని సినిమాలకు కొన్ని బాక్సాఫీస్ సానుకూలతలు కలిసొస్తాయి. మాస్ మెచ్చే ఫార్ములా కథ... తక్కువ నిడివి సినిమా... చకచకా నడిచే కథనం... అక్కడక్కడా కథ పక్కదోవ పట్టినట్లు అనిపించినా చటుక్కున బండిని పట్టాల మీదకెక్కించే సంఘటనలున్న స్క్రిప్ట్... వీటన్నిటికీ తోడు కొత్తగా మొదలవుతున్న వేసవి సెలవుల సీజన్ కూడా కలిసొస్తే? గోపీచంద్ నటించిన తాజా చిత్రం 'జిల్'కి కూడా అవన్నీ సమకూరాయి. గత ఏడాది వచ్చిన వాణిజ్య విజయం 'లౌక్యం'తో ఊపు మీదున్న గోపీచంద్, గతంలో ప్రభాస్‌తో 'మిర్చి' తీసిన నిర్మాతలు కలసి కొత్త దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌తో చేసిన తాజా ప్రయత్నం ఇది. అన్ని సానుకూలతులున్నా... కథను బిగువుగా తెరపై నడిపించారా అన్నది చూద్దాం...

కథ ఏమిటంటే...
ముంబయ్‌లో ఒక మాఫియా డాన్ ఛోటా నాయక్ (నూతన పరిచయం - మోడల్ కబీర్). పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కిన అతను తప్పించుకుంటాడు. ఈ మాఫియా డాన్ తనను మోసం చేసి, వెయ్యి కోట్లు కొట్టేసిన మాజీ సహచరుడు రంగనాథం (బ్రహ్మాజీ) కోసం వెతుకుతుంటాడు. రంగనాథం హైదరాబాద్‌లో తలదాచుకొంటాడు.

మరోపక్క హైదరాబాద్‌లోనే జై (గోపీచంద్) ఒక అగ్నిప్రమాద నివారక దళ అధికారి. స్వయానా ఫైర్ ఆఫీసరైన బాబాయ్ (చలపతిరావు), పిన్ని (ఐశ్వర్య) కుటుంబంతో అతనిది అందమైన అనుబంధం. అనుకోని పరిస్థితుల్లో ఒక టీనేజ్ అమ్మాయి సావిత్రి (రాశీఖన్నా)ని కాపాడిన హీరో, ఆమెతో ప్రేమలో పడతాడు. ఒక సందర్భంలో రంగనాథాన్ని విలన్ అనుచరుల నుంచి హీరో కాపాడతాడు. దాంతో, విలన్‌కూ, హీరోకూ మధ్య యుద్ధం మొదలవుతుంది. ఆ తరువాత ఒక అగ్ని ప్రమాదంలో రంగనాథ్ మరణిస్తాడు. ఆ మరణించే క్రమంలో హీరోతో ఏదో చెబుతాడు. దాంతో విలన్ ఆ వెయ్యికోట్ల రహస్యం హీరోకే చెప్పాడని వెంటపడతాడు. అక్కడ నుంచి రెండు వర్గాల మధ్య జరిగే పిల్లీ ఎలక పోరాటం మిగతా సినిమా.

 ఎలా చేశారంటే...
కథానాయకుడిగా గోపీచంద్ మునుపటి కన్నా మరింత స్లిమ్‌గా, కొత్త లుక్‌తో, ఉత్సాహంగా కనిపించారు. సన్నివేశాల్లోనే కాక, పాటలు, ఫైట్లలోనూ అది కొట్టొచ్చినట్లు కనిపించింది. కథానాయిక రాశీ ఖన్నా కాస్తంత బొద్దుగా, ముద్దుగా ఉన్నారు. పాత్ర తాలూకు చిలిపితనం దానికి తోడైంది. దాంతో, తెర మీద అందంగా మెరిశారు. విలన్‌గా పరిచయమైన కబీర్ మంచి ఒడ్డూ పొడుగు, గడ్డంతో బాగున్నారు. చలపతిరావు, ఐశ్వర్య, చిన్న పాత్రలో కనిపించే అవసరాల శ్రీనివాస్ లాంటి వారు సరేసరి.

ఈ సినిమాకు ప్రధాన బలం - కెమేరా పనితనం. కొంత డిజిటల్ కెమేరాతో, మరికొంత ఫిల్మ్‌తో చిత్రీకరించిన ఈ సినిమాలో శక్తి శరవణన్ ఛాయాగ్రహణ పనితనం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఫారిన్ లొకేషన్లలో పాటల నుంచి చిన్న అపార్ట్‌మెంట్ల మధ్యలో, శ్మశానంలో ఫైట్ల దాకా తెరపై కనువిందైన విజువల్స్ అలరిస్తాయి.పాటల విషయంలో జిబ్రాన్ నవతరం శైలిలోని అనుసరించినా, సినిమాలో వచ్చే రెండో పాట ఒక్కటే పాడుకోవడానికి వీలుగా అనిపిస్తుంది. అనల్ అరసు ఫైట్లు,

 ఎలా ఉందంటే...
 ఈ చిత్ర కథలో లోపాలూ చాలానే కనిపిస్తాయి. విలన్ అయిన మాఫియా డాన్‌కూ, అతను వెతుకుతున్న మాజీ అనుచరుడు రంగనాథం (బ్రహ్మాజీ)కూ మధ్య ఏం జరిగిందన్నది, అతనెలా వెయ్యికోట్లతో తిరుగుతున్నాడన్నది కథలో వివరంగా చూపరు. అలాగే, హైదరాబాద్‌లో రంగనాథంకు అందించే పాస్‌పోర్ట్, వగైరాల కథ గురించీ పెద్దగా వివరం లేదు. అవన్నీ ఒక్క సీన్‌లో, మూడు ముక్కల్లో డైలాగుల్లో తేల్చేశారు. ఆ రకంగా స్క్రిప్టులో మరింత చిక్కదనానికి ఉన్న అవకాశాన్ని తామే చేజేతులా వదులుకున్నారు. అలాగే, ఉన్నట్టుండి సినిమాలో కామెడీ తగ్గిందనే భావన కలగడం వల్లనో ఏమో పోసాని, అతని అనుచరుడు హీరో ఇంటికి వెళ్ళి వెతికే ఘట్టాన్ని బలవంతాన జొప్పించారు. దాని వల్ల సినిమా నిడివి పెరగడం, చకచకా వెళుతున్న కథ కాళ్ళకు అడ్డం పడడం తప్ప, ఆ సీన్ వల్ల వినోదం కానీ, సినిమాకొచ్చిన విశేష ప్రయోజనం కానీ లేదనే చెప్పాలి.

హీరో కుటుంబంపై విలన్ దాడి, అతని మీద ప్రతీకారానికి హీరో చెలరేగడం దగ్గరే ప్రేక్షకులకు కూడా కొంత విలన్ మీద కోపం పెరుగుతుంది. లేదంటే, విలన్ తన వెయ్యి కోట్ల కోసం తానే కొట్లాడుతున్నాడు కదా, అందులో తప్పేముంది అనిపించే ప్రమాదం హెచ్చు. సినిమా కోసమని లాజిక్‌లతో పని లేకుండా కొంత స్వేచ్ఛ తీసుకొని, ఎక్కడికక్కడ కథ ముందుకు నడవడానికి తగ్గట్లు కన్వీనియంట్ స్క్రీన్‌ప్లే రాసుకున్న సినిమా ఇది. కాసేపు ప్రేమ, ఇంకాసేపు విలనిజం, మరికాసేపు పగ - ప్రతీకరం లాంటి వాటిని తీసుకొని, దేని మీదా పూర్తి దృష్టి పెట్టలేదేమో అనిపిస్తుంది.

అలాంటి లోటుపాట్లు పక్కనపెడితే, తొలి చిత్ర దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ మంచి మార్కులే పడతాయి, కొన్నిచోట్ల ఆయన రాసుకున్న డైలాగులూ, 'హీరోతో ఫోన్‌లో మాట్లాడినవారినల్లా చంపేస్తా'నంటూ విలన్ వేసిన పీటముడి లాంటివి ప్రేక్షకులకు బాగుంటాయి. అయితే, అవన్నీ ఈ రెండు గంటల 20 నిమిషాల సినిమాను దీర్ఘకాలం బాక్సాఫీస్ వద్ద నిలబడతాయా అన్నది చూడాలి. మీదకొచ్చి పడే కొత్త సినిమాల సత్తా ఏమిటన్న దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. అప్పటి దాకా 'జిల్' అనే పేరు ఎందుకు పెట్టారా అని ఆలోచించకుండా, సామాన్య యాక్షన్ చిత్ర ప్రేమికులు కాలక్షేపానికి నిరభ్యంతరంగా ఈ సినిమా చూసేయవచ్చు. మొదటే చెప్పుకున్న అది 'జిల్'కు ఉన్న బలం, సానుకూలత కూడా!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Web Edition, 28th March 2015, Saturday)
.........................................

0 వ్యాఖ్యలు: