- దక్షిణ భారత సినీ నటీనటుల సంఘంగా 1950ల నాటికే మద్రాసులో ‘నడిగర సంగం’ మొదలైంది. ఏ భాషా సినీపరిశ్రమ ఆ భాషా ప్రాంతానికి తరలివెళ్ళడంతో, ఎక్కడికక్కడ కొత్తగా ప్రాంతీయ భాషా నటీనటుల సంఘాలు వచ్చాయి. అలా తెలుగు నటులకు ‘మా’ ఏర్పాటైంది. కళాకారులకు ‘అమ్మ’ లాంటిదనే ఉద్దేశంతో, అమ్మ ఒడిని లోగోగా పెట్టుకున్న ఈ సంఘాన్ని 21 ఏళ్ళ క్రితం 1993 అక్టోబర్ 4న స్థాపించారు.
- చిరంజీవి సంస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సంస్థ కార్యవర్గ కాలపరిమితి రెండేళ్ళు. ప్రతి రెండేళ్ళకూ ఎన్నికలు జరగాలి. గతంలో కృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, నాగబాబు తదితరులు ‘మా’ అధ్యక్షులుగా పనిచేశారు. మురళీమోహన్ అత్యధికంగా 6 సార్లు (12 ఏళ్లు) అధ్యక్షపదవి నిర్వహించారు.
- తెలుగు సినిమాల్లో నటించే తారలంతా ‘మా’లో కానీ, దీని గుర్తింపున్న ఇతర ఆర్టిస్టు సంఘాల్లో కానీ తప్పనిసరిగా సభ్యులై ఉండాలి. సభ్యుల సంక్షేమం, పారితోషిక సమస్యల పరిష్కారం ‘మా’ చూస్తుంది. కనీసం 8 చిత్రాల్లో నటిస్తే కానీ, ‘మా’లో సభ్యత్వమివ్వరు. జీవిత కాల సభ్యులు (709), గౌరవ సభ్యులు (2), సీనియర్ సిటిజన్లు (28) కలిపి ‘మా’లో సభ్యుల సంఖ్య 739. వీరిలో ఓటు హక్కున్నది 702 మందికే.
‘- మా’లో సభ్యత్వానికి రుసుము ఒకప్పుడు స్వల్పమే కాగా, ఇప్పుడది అక్షరాలా లక్ష రూపాయలు. ఇంత భారీ రుసుముతో పేద కళాకారులకు దూరమై, పెద్దవాళ్ళకు గొడుగుగా ‘మా’ మారిందనేది ఒక విమర్శ. కళాకారుల సంక్షేమానికీ, ప్రకృతి వైపరీత్యాల బాధితుల సహాయానికీ పలు కార్యక్రమాలు చేసిన నిధులు సేకరించిన ఘన చరిత్ర ‘మా’ది. ప్రస్తుతం 3 కోట్ల 22 లక్షల దాకా నిధీ ఉంది.
- అయితే, నిరుపేదలూ, వృద్ధులూ అయిన అర్హులైన అనేకమంది కళాకారులకూ ఆర్థిక సహాయం, మెడీక్లెయిమ్ లాంటి వసతులు ఇవాళ్టికీ మృగ్యమే. ‘మా’కు ఇప్పటికీ సొంత భవనం లేదు. కొనుగోలు చేసిన ఒక అంతస్తు వేరే చోట ఉన్నా, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాంగణంలో చిన్న కార్యాలయంలోనే నడుస్తోంది.
- రెంటాల
(Published in 'Sakshi' daily, 29th March 2015, Sunday)
..................................................
డియర్ మేరీ
3 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment