జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Monday, April 20, 2015

యువ ప్రేక్షకులకే ఓ.కె. బంగారం!

...............................................
చిత్రం - ‘ఓ.కె. బంగారం’, తారాగణం - దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్, లీలా సామ్సన్, ప్రకాశ్‌రాజ్, ప్రభూ లక్ష్మణన్, రమ్యా సుబ్రమణియమ్, కణిక, బి.వి. దోషీ, మాటలు - కిరణ్, పాటలు - సీతారామశాస్త్రి, సంగీతం - ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం - పి.సి. శ్రీరామ్, కొరియోగ్రఫీ - బృంద, కూర్పు - ఏ. శ్రీకర్‌ప్రసాద్, నిర్మాత - ‘దిల్’ రాజు, రచన, దర్శకత్వం - మణిరత్నం
..................................................
 దాదాపు పాతికేళ్ళ క్రితం దేశంలో మొదలైన ఆర్థిక సరళీకరణ, ఆ వెంటనే వచ్చిన ప్రపంచీకరణ ప్రభావంలో పుట్టి పెరిగిన కొత్త తరం ఇప్పుడు పరవళ్ళు తొక్కుతోంది. దేశాన్నీ, ప్రపంచాన్నీ ముందుండి నడుపుతున్న ఈ తరానికి పెళ్ళి, కెరీర్ లాంటి అంశాలపై ఉన్న అభిప్రాయాలు, కుటుంబ సంబంధాలపై ఉన్న ఆలోచనలు ఎలాంటివి? వివాహ వ్యవస్థ కన్నా సహజీవనమైతే బరువు బాధ్యతలు ఉండవని వారు అనుకోవడంలో ఎంత నిజాయతీ ఉంది? వాటిని తెరపై చూపితే ఎలా ఉంటుంది? దర్శక - రచయిత మణిరత్నం చేసిన తాజా వెండితెర ప్రయత్నం - ‘ఓ.కె. బంగారం’ అదే! ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత - పంపిణీదారు ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో అందించారు.

 కథ ఏమిటంటే...

  హైదరాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లి కుర్రాడు ఆదిత్య కంటమనేని అలియాస్ ఆది (దుల్కర్ సల్మాన్) ఉద్యోగ నిమిత్తం ముంబయ్ వెళతాడు. అక్కడ తన అన్నయ్య స్నేహితుడైన గణపతి (ప్రకాశ్‌రాజ్), భవాని (లీలా శామ్సన్) దంపతుల ఇంటికి వెళతాడు. అప్పటికి 23 ఏళ్ళుగా ముంబయ్‌లో స్థిరపడిన ఆ దంపతుల ఇంట్లోనే ఒక గదిలో పేయింగ్ గెస్ట్‌లా ఆశ్రయం పొందుతాడు. అంతకు ముందు రైల్వేస్టేషన్‌లో చూసిన తారా కళింగ అలియాస్ తార (నిత్యా మీనన్) అనే ఔత్సాహిక ఆర్కిటెక్ట్‌తో అతనికి స్నేహం ఏర్పడుతుంది. తారకు ఏడేళ్ళ వయసప్పుడే ఆమె తల్లి, తండ్రి విడిపోతారు. కోయంబత్తూరులో పెద్ద ఫ్యాక్టరీ, వ్యాపారాలు నడిపే ధనికురాలైన తల్లికి కూడా దూరంగా తార స్వతంత్రంగా బతుకుతుంటుంది. మిత్రురాలు, సహోద్యోగిని అయిన అనన్య పెళ్ళిలో కలిసిన ఆది, తారలిద్దరికీ ‘పెళ్ళి ఈజ్ ఓన్లీ ఫర్ ఫూల్స్’ అనీ, దానికన్నా బాదరబందీ లేని ‘లివ్ - ఇన్ రిలేషన్‌షిప్’ మెరుగనీ బలమైన అభిప్రాయం ఉంటుంది. ప్రేమ పెరిగిన వారిద్దరూ, వివాహబంధానికి వెలుపలే ఆది గదిలోనే కలసి ఉండాలని నిర్ణయించుకుంటారు.

ఈ వివాహేతర జీవన సంబంధంతో కలిసిన యువ జంటకు సమాంతరంగా వివాహ బంధంలోని గొప్పదనాన్ని చూపే భవాని - గణపతి దంపతుల కథ నడుస్తుంటుంది. ఒకప్పటి ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు భవాని ప్రస్తుతం అల్జీమర్స్ వ్యాధితో, తద్వారా వచ్చే మతిమరుపుతో బాధపడుతూ ఉంటుంది. అయినా ఆమెను ప్రేమతో చూస్తూ, సమస్త సపర్యలూ చేస్తుంటాడు గణపతి. గేమింగ్ యానిమేషన్‌లో ఉన్న హీరో అమెరికా వెళ్ళాలని కలలు కంటూ ఉంటే, సంప్రదాయ సంగీతంలో దిట్ట అయిన హీరోయిన్ ఆర్కిటెక్చర్‌లో పై చదువులకు ప్యారిస్ పోదామనుకుంటుంది. ఈ కెరీర్ స్వప్నాల మధ్య ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’లో ఉన్న ఆ యువ జంట ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు? వారి జీవితాలు ఎటు మళ్ళాయి? లాంటివన్నీ మిగతా చిత్ర కథ.

 ఎలా నటించారంటే...

ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి కుమారుడైన దుల్కర్ సల్మాన్ ఇప్పటికే కొన్ని మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల లాంటివీ అందుకున్నారు. తెలుగు తెరపై తొలిసారిగా కనిపించిన ఈ యువ నటుడు తెరపై బాగున్నారు. ఇక, ఇటీవలి కాలంలో తన అభినయం ద్వారా అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తున్న నిత్యా మీనన్ సంగతి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కళ్ళతోనూ అభినయించగల సామర్థ్యం, సన్నివేశానికీ - సందర్భానికీ తగ్గట్లు ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల నైపుణ్యం, శారీరక సౌందర్యాన్ని మించిన ఆత్మిక ఆకర్షణ నిత్యా మీనన్‌ను అందరికీ ఆత్మీయురాలిని చేస్తుంది. గతంలో కొన్ని మలయాళ చిత్రాల్లో కలసి నటించిన దుల్కర్, నిత్యల మధ్య కెమిస్ట్రీ మరోసారి వెండితెరను అద్భుతంగా వెలిగించింది. గతంలో కేంద్ర సెన్సార్‌బోర్డు చైర్మన్‌గా పనిచేసి, మోడీ నేతృత్వంలోని బి.జె.పి. ప్రభుత్వం వచ్చాక వివాదాల మధ్య రాజీనామా చేసిన ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి లీలా శామ్సన్ ఈ చిత్రంలో భవానిగా ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. ఆమెను అమితంగా ప్రేమిస్తూ, వంటతో సహా అన్నీ చూసుకొనే భర్త పాత్రలో ప్రకాశ్‌రాజ్ బాగున్నారు. ముఖ్యంగా, వానలో వారిద్దరూ కలిసే సన్నివేశం అప్రయత్నంగా కళ్ళు చెమర్చేలా చేస్తుంది.

 సాంకేతిక విభాగాల పనితీరెలా ఉందంటే...

ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయి. వాటికి మణిరత్నం శైలి చిత్రీకరణ, పి.సి. శ్రీరామ్ ఛాయాగ్రహణ ఇంద్రజాలం, శ్రీకర్‌ప్రసాద్ ఆ దృశ్యాలను ఏర్చికూర్చిన విధానం నవతరాన్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ‘రారా ఆటగాడా...’, ‘మన మన మన మెంటల్ మదిలో...’, ‘ఏదో అడగనా...’ లాంటి పాటలు పదే పదే కూనిరాగం తీయాలనిపిస్తాయి. అది ఈ సినిమాకు ఉన్న పెద్ద సానుకూల అంశం. సీతారామశాస్త్రి కలం మరొక్కసారి తన పదును చూపిన సినిమా ఇది. ముఖ్యంగా, ఈ సినిమాకు రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం రొటీన్ సినిమాలు, వాటిలోని రీరికార్డింగ్‌కు భిన్నంగా ఉంది. సంప్రదాయ సంగీత నేపథ్యం కథలో ఉండడంతో, అందుకు తగ్గట్లు రెహమాన్ అక్కడక్కడ వాడిన సంగీత శకలాలూ, బిట్లూ బాగున్నాయి. తమిళంలో ‘లైవ్ సౌండ్’తో తీసిన ఈ చిత్రానికి తెలుగు అనువాదంలో కథానాయకుడికి మన తెలుగు హీరో నాని డబ్బింగ్ చెప్పారు. నిత్యా మీనన్, ప్రకాశ్‌రాజ్‌లు తమకు తామే డబ్బింగ్ చెప్పుకోవడం పాత్రలకు నిండుదనం తెచ్చింది. తెలుగులో కిరణ్ డైలాగులు రాసిన ఈ చిత్రంలో ‘దిడీలని’ (గబుక్కున అని అర్థం), ‘ముట్టాళ్’ (తెలివిలేనివాడు అని అర్థం) లాంటి తమిళ పదాలను తెలుగు వెర్షన్‌లో యథేచ్ఛగా ఎందుకు వాడారో అర్థం కాదు.

 ఎలా ఉందంటే...

దేశం గర్వించే దిగ్దర్శకుడు మణిరత్నం అందించిన మరో ప్రేమకథా చిత్రమిది. నిజానికి, అందమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో మణిరత్నం దిట్ట. ‘మౌనరాగం’ రోజుల నుంచి... ‘గీతాంజలి’ మీదుగా... మొన్నటి ‘సఖి’ దాకా అది బాక్సాఫీస్ సాక్షిగా పదే పదే ఋజువవుతూ వస్తున్న సత్యం. ఇటీవల ‘రావణ్’, ‘కడలి’ లాంటి పెద్ద ఎదురుదెబ్బలే తగిలిన ఆయన ఈ సారి ‘సహజీవన’మనే సమకాలీన అంశాన్నీ, తనకు పట్టున్న ప్రేమకథనూ కలిపి వెండితెరపై పసందైన వంటకాన్ని వండి వడ్డించారు. తమిళంలో ‘ఓ కాదల్ (ఓ.కె) కన్మణి’గా తయారైన ఈ చిత్రం తెలుగులో ‘ఓ.కె. బంగారం’గా అనువాదమైంది. పదిహేనేళ్ళ క్రితం మాధవన్, షాలిని జంటగా మణిరత్నమే తీసి, తమిళ ఉగాది కానుకగా (2000 ఏప్రిల్ 14న) విడుదలైన తమిళ ‘అలై పాయుదే’ (తెలుగులో ‘సఖి’గా విడుదలై, హిట్టయింది) ఛాయలు ఈ కొత్త చిత్రం నిండా పరుచుకున్నాయి. అందుకే, ఒక రకంగా ఇది సమకాలీన వాతావరణానికి తగ్గట్లుగా తీసిన ‘సఖి - 2015’ అని కూడా చెప్పవచ్చు.

 ఒకరకంగా సహజీవనానికి చాలావరకు సానుకూలంగా అనిపించే ప్రమాదమున్న సినిమా ఇది. అయితే, ‘ఒక్క మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే చాలా? అప్పుడిక అంతా ఓ.కేనా?’ అని హీరోయిన్ పాత్ర వేసే ప్రశ్న మాత్రం నిజంగానే ఆలోచింపజేస్తుంది. ఫస్టాఫ్ కొంత నిదానంగా అనిపించినా, పాత్రల పరిచయం, వాటి గమ్మత్తై ప్రవర్తన, చిన్ని చిన్ని అందమైన అంశాలతో నడుస్తుంది. చాలామంది ప్రేక్షకులను మళ్ళీ తమ యౌవనదశలోకి ప్రయాణింపజేస్తుంది. ఇక, ఈ తరం యువ ప్రేక్షకుల మాటైతే ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అయితే, ఈ కథకు సెకండాఫ్‌కు కీలకం. హీరో హీరోయిన్ల ప్రవర్తన, వైఖరిలోని మార్పునూ, ఘర్షణనూ తెలియజెప్పే ఈ భాగం ఎంత కన్విన్సింగ్‌గా ఉంటే, సినిమా అంత బాగుంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ, ఆ క్రమంలో కథ, కథనం అస్తుబిస్తు అయినట్లు కనిపిస్తుంది. దాంతో, సెకండాఫ్‌లో చాలాసేపు ప్రేక్షకులు తెరపై జరుగుతున్న కథ నుంచి కొంత దూరమవుతారు.

నిజానికి, అప్పటికే 15 మంది గర్ల్ ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేసిన హీరో తనను 16వ గర్ల్ ఫ్రెండ్‌గా ఎంచుకున్నా, హీరోయిన్ అతనికి దగ్గరవడానికి తగిన కారణం కనిపించదు. అలాగే, వారిని తమ ఇంట్లోని గదిలో ఉండడానికి ప్రకాశ్‌రాజ్ కుటుంబం అంగీకరించడానికీ బలమైన కారణం చూపలేదు. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్నది తెలియని ఆకర్షణా, ప్రేమా, ‘లివ్ ఇన్ రిలేషన్‌షిప్’ ముసుగులో ఉన్న కామమా అన్న అనుమానమూ వస్తుంది. డైలాగుల గందరగోళం మధ్య హీరోయిన్‌కు హీరో కనిపించని రెండు రోజులు అసలేమైందన్న విషయమూ స్పష్టంగా అర్థం కాదు. హీరో, హీరోయిన్ల వైపు బంధువులంతా ఒప్పుకున్నాక కూడా పెళ్ళికి వారు సిద్ధం కాకపోవడానికి  మొత్తానికి, పెళ్ళి వద్దనుకొనే దశ నుంచి పెళ్ళి చేసుకుందామనుకొనే దశకు మారిన ఒక జంట జీవితంగా ఇది ‘న్యూ ఏజ్ లవ్‌స్టోరీ’. సంప్రదాయ సంగీత నేపథ్యమున్నా, సంప్రదాయ జీవన విధానానికి విరుద్ధంగా సాగే ఈ చిత్రం కొత్తతరంలో ఉండే సరదాలు, అనుభూతులు, అనుమానాలను ప్రతిఫలిస్తుంది. స్వేచ్ఛ, స్వతంత్ర లైంగిక జీవనాన్ని ప్రతిపాదిస్తూ, కొన్ని వర్గాలనే ఆకట్టుకుంటుంది. కాకపోతే, మణిరత్నం ఇమేజ్, ఆయన మార్కు విజువల్స్, పాటల మీద ప్రేక్షకులకుండే అభిమానమే ఈ ‘ఫీల్ గుడ్ సినిమా’కు శ్రీరామరక్ష. వెరసి, ఫుల్‌మీల్స్ కాలేకపోయిన ఈ సినిమా ఒక్కముక్కలో -  కొందరికే ఓ.కె. బంగారం!

 - రెంటాల జయదేవ

(Published in 'Sakshi' Internet Edition, 17th April 2015, Friday)
......................................................

0 వ్యాఖ్యలు: