త్రిష ఎవరితోనూ మాట్లాడదు... మాట్లాడితే... తన గురించి ఎక్కువగా మాట్లాడతారని భయం కావచ్చు! ఆల్‌మోస్ట్ పదమూడేళ్ల పాటు డబ్బింగ్ చెప్పకుండానే మాట్లాడింది మరి! చిరంజీవి నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా అందరితో మాట్లాడించేసింది. థర్టీన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ!! షూటింగ్‌లో... ఎవరైనా అనవసరంగా మాట్లాడిస్తారేమోనని, తప్పించుకోవడానికి అనుకుంటా...సెల్‌ఫోన్‌లో తలదూర్చి, తన ప్రపంచాన్ని తాను ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. మరి, అంతటి ‘మూకీ’ దేవత ‘సాక్షి’తో ఎందుకు మాట్లాడిందో! మరి అదే... మీ ‘సాక్షి’!
రామ్,ఎడిటర్, ఫీచర్స్
May
పదమూడేళ్ళుగా చూస్తున్నాం. చిరు నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా అందరితో నటించిన హీరోయిన్లలో మీరే ఆఖరేమో!
(నవ్వేస్తూ...) నేను సినీరంగానికి వచ్చినప్పుడు సిమ్రాన్, జ్యోతిక, నేను - ఇలా ముగ్గురు, నలుగురమే ఉండేవాళ్ళం. ఇప్పుడు అందం, అభినయమున్న 10 - 15 మంది హీరోయిన్లున్నారు. దీనివల్ల పోటీ పెరిగి, హీరోయిన్ల యావరేజ్ కెరీర్ లైఫ్ శ్పాన్ చాలా తగ్గింది. అయినా ఇన్నేళ్ళు హీరోయిన్‌గా నిలవడం విశేషమే. అయామ్ బ్లెస్డ్. షార్ట్ శ్పాన్ ఆఫ్ టైమ్‌లో ఇంత స్టార్‌సతో నటించడం, పేరు తెచ్చుకోవడం హ్యాపీ.
ఈ స్థాయికి రావడంలో మీ కష్టమెంత? అదృష్టమెంత?
నన్నడిగితే సరైన స్క్రిప్ట్‌నూ, సరైన దర్శకుణ్ణీ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. భారీ, మాస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు - ఇలా అన్నీ ప్యాకేజ్‌గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ చూసుకోవాలి. దానికి లక్ తోడవ్వాలి. లేదంటే, (చేతులతో పై నుంచి కిందకు చూపిస్తూ... చటుక్కున తమిళంలోకి మారి..) ‘అంగ వెచ్చిట్ట రసికర్‌గళ్ ఇంగ తూక్కి పోడువాంగ’ (ఆకాశానికి ఎత్తిన ప్రేక్షకులే, పాతాళానికీ పడదోస్తారు).
ఈ బ్యాలెన్సింగ్‌లో మీ అమ్మగారి పాత్ర ఉందట!
‘నా చుమ్మా సెట్స్‌కు వందు వేల పణ్ణిట్టి పోవేన్. బిహైండ్ ది సెట్స్ నరయ వేల ఇరుక్కు’ (నేరుగా సెట్స్‌కు వచ్చి, నటించి వెళ్ళిపోతుంటా. కానీ, తెర వెనుక చాలా శ్రమ ఉంటుంది). ఆ శ్రమ అంతా మా అమ్మదే! ఇప్పటికీ నాకు మోటివేషన్ - మా అమ్మే! అన్నీ నిశ్శబ్దంగా హ్యాండిల్ చేసే మా అమ్మ ‘సెలైంట్ మేనేజర్’. మేనేజరున్నా స్క్రిప్టు ఏమిటి, ఏ సినిమా చేయాలి - అన్నీ నేను, అమ్మే కలసి చర్చించుకుంటాం. సినిమా చేయాలా, వద్దా అనే ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే!
అమ్మగారి సపోర్ట్ తెలిసిందే... మరి నాన్న?
అమ్మ దగ్గర కన్నా చనిపోయిన నాన్న దగ్గరే నాకు గారాబం ఎక్కువ. ఆయావ్‌ు అప్పాస్ గర్‌ల! న్యూయార్క్‌లో చత్వాల్ గ్రూపులో 13 ఏళ్ళ పాటు ఆయన పనిచేశారు. ఆ తరువాత ‘తాజ్’ గ్రూపులో చెన్నై, హైదరాబాద్‌లలో పనిచేశారు. (కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా...) ఆయన్ని మిస్సవుతున్నా.
బాధపెట్టినట్లున్నా! మళ్ళీ సినిమాల కొద్దాం. ‘లయన్’లో బాలకృష్ణతో తొలిసారి నటిస్తున్నట్లున్నారు!
రెండేళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న నా తెలుగు సినిమా - ‘లయన్’. థ్రిల్లర్, యాక్షన్ ఫిల్మ్ ఇది. కానీ, సన్నివేశాలు చాలా ఆహ్లాదంగా ఉంటాయి. నిజానికి, ‘అతడు’ తర్వాత ‘బాలా’ (బాలకృష్ణ)తో ఒక సినిమాకు అడిగారు. అలాగే, లాస్ట్ ఇయర్ ‘లెజెండ్’లో కూడా చేయాల్సింది. ఇన్నాళ్ళకు ఆయనతో యాక్ట్ చేయడం కుదిరింది. ఆయన చాలా కూల్. నాలెడ్జబుల్ మ్యాన్. వంద సినిమాలకు దగ్గరవుతున్నా, అంత హుషారుగా పనిచేసే వ్యక్తిని మరొకరిని చూడలేదు.
పెద్ద స్టార్స్‌తో చేశారు. వాళ్ళతో మీ నటనానుభవం?
ఆ స్థాయికెళ్ళాక, మనకూ కొంత అహం ఉంటుంది. కానీ, కమల్, చిరంజీవి, నాగ్, వెంకీ, బాలా లాంటి వారంతా అహం లేకుండా పనిచేస్తారు. అది నేర్చుకోవాలి.
కెరీర్‌లో చాలా అప్స్ అండ్ డౌన్‌స చూసినట్లున్నారు?
ఈ 13 ఏళ్ళ కెరీర్‌లో ప్రతి మూడేళ్ళకూ కెరీర్‌లో నాకు ‘లల్’ వచ్చింది. అప్పుడు ఏదో ఒకటి ఒప్పుకోవడం కాకుండా, ఇంట్లోనే ఖాళీగా కూర్చొనేదాన్ని. మొదటిసారి ‘మంగాత్తా’, రెండోసారి ‘విన్నైతాండి వరువాయా’ వచ్చి హిట్టయ్యాయి. ఇలా కెరీర్ డల్లయినప్పుడల్లా ఏదో ఒక సినిమాతో పైకి లేచా.
మరి, చటుక్కున కన్నడ ‘పవర్’ (‘దూకుడు’ రీమేక్) చేశారేం!
బాలీవుడ్‌లో ఒక సినిమా చేసినట్లే, కన్నడంలో ఉత్తినే... ఛేంజ్ కోసం అలా చేశా. అదేదో అన్ని ఇండస్ట్రీల్లో ైపైకి ఎదిగిపోవాలని కాదు. ఆ సినిమా అక్కడ బాగా ఆడింది. ఫర్ మి - కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం - ఎవ్రీథింగ్ ఈజ్ ఫన్!
మీ గురు ప్రియదర్శన్ మలయాళంలో చేయమనడగలేదా?
ఆయన హిందీకి వెళ్ళి, అక్కడే ఎక్కువ చేస్తున్నారుగా! నా ఏకైక హిందీ ఫిల్మ్ ‘ఖట్టా మీఠా’ ఆయన తీసినదే! మలయాళంలో మొదట్లో కొన్ని ఛాన్స్‌లొచ్చాయి. చేయలేకపోయా. అయినా నా ప్లాన్ టూ వీక్స్ వరకే! అంతకు మించి కెరీర్‌లోనే కాదు... జీవితంలో కూడా ఏదీ ముందుగా ప్లాన్ చేయను.
హిందీలో ఒక సినిమా చేసినా, నిలబడాలని చూడలేదేం?
హిందీలో పనిచేయాలంటే, ముంబయ్‌లో ఉండాలి. కానీ, పుట్టి పెరిగిన చెన్నైలో ఉండడమే నాకు ఇష్టం. పైగా, నార్త్‌తో పోలిస్తే, సౌత్‌లో పనిచేయడమే నాకు కంఫర్ట్ కూడా! నార్‌తలో పనిచేయాలంటే, పబ్లిక్ రిలేషన్స్ కావాలి. పర్సనల్ లైఫ్ వదిలి, అక్కడకు మారాలి. దాని కన్నా ఇక్కడుంటే సుఖం.
ఇంకా మీకు తెలుగుపై పట్టు దొరికినట్లులేదు!
తెలుగు బాగా అర్థమవుతుంది కానీ, చదవలేను. రాయలేను. డైలాగులు చెప్పగలను కానీ, ఫ్లూయెంట్‌గా మాట్లాడలేను. కానీ, ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ తెలుగు మాట్లాడేస్తుంటే, అయామ్ జెలస్! నాకు భాషలంత తొందరగా పట్టుబడవు.
అడపా దడపా తమిళంలో డబ్బింగ్ చెబుతున్నట్లున్నారు!
ఇన్నేళ్ళ తర్వాత ఈ మధ్యే కొన్ని సినిమాలకు! మణిరత్నం దర్శకత్వంలోని ‘ఆయుధ ఎళుత్తు’ (తెలుగులో ‘యువ’), కమలహాసన్ నటించిన ‘మన్మదన్ అంబు’ (తెలుగులో ‘మన్మథ బాణం’) - రెండూ లైవ్ సౌండ్‌లో తీసినవే. దాంతో, సెట్స్‌పై తమిళంలో నా డైలాగులు నేనే చెప్పా. ఆ తరువాత డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. కమల్ డైలాగులు ఎలా పలకాలో పక్క నుండి ఆరు రోజుల పాటు నేర్పారు.
మీరెప్పుడూ మొబైల్‌ఫోన్‌తోనే కనిపిస్తుంటారు!
(నవ్వేస్తూ...) బాగా గమనించారే! ప్రకాశ్‌రాజ్, వెంకటేశ్ లాంటి కో ఆర్టిస్టులు కూడా నా మొబైల్ వాడకం చూసి ఆటపట్టిస్తుంటారు. నిజం చెప్పాలంటే, మొబైల్ ఫోన్ నాకొక ఎడిక్షన్. అయితే, ఫోన్‌లో నేనెక్కువ మాట్లాడను. మెసేజ్ చేయడానికీ, ఆటలాడడానికీ, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవడానికీ ఫోన్ వాడతా. కొత్త యాప్స్, గ్యాడ్జెట్లపై నాకు ఇంట్రస్టెక్కువ.
మీరు బాగా ఫుడీ అట! మరి, నాజూగ్గా ఉన్నారు?
ఆ విషయంలో అయామ్ రియల్లీ లక్కీ! కనపడిందల్లా తినేస్తాను. నేను తినే తిండి చూసి, ‘బకాసురుడిలా తింటావు. తిన్నదంతా ఎటు పోతోంది’ అంటూ దర్శకుడు ప్రభుదేవా ఆటపట్టిస్తుంటారు. సర్‌ప్రైజింగ్లీ... నేను జిమ్‌లకు వెళ్ళను. పెద్ద వ్యాయామాలు చేయను. సూర్య నమస్కారాలు, పవర్ యోగా చేస్తా. నేనెంత బద్ధకస్థురాలినంటే, చీకాకనిపిస్తే కొన్నాళ్ళు వర్కౌట్స్ కూడా చేయను.
మీ నిశ్చితార్థంపై చాలా వార్తలొస్తున్నాయి. పెళ్ళెప్పుడు?
లెటజ్ నాట్ టాక్ ఎబౌట్ మై పర్సనల్ మేటర్‌స. పర్స నల్ లైఫ్ ఈజ్ మై సీక్రెట్. దాని గురించి ఇతరులు మాట్లాడుకోవడం ఇష్టముండదు. అందుకే మాట్లాడను.
మరో అయిదేళ్ళ తరువాత త్రిష ఏం చేస్తుంటారు?
(నవ్వుతూ) అయిదు రోజుల తర్వాతేం చేస్తానో తెలీదు. ఇందాకే చెప్పినట్లు ఏదీ ప్లాన్ చేయను. నా నేచర్ అది.
- రెంటాల జయదేవ
.................................................
Box Matters
ఇటీవల ఆకట్టుకున్న తోటి నటి?
శ్రీయ నుంచి అనూష్క దాకా చాలా మందితో కలసి పనిచేశా. అనూష్క లాంటి మంచి అమ్మాయిని చూడలేదు. ఆమె ఎంత ఫ్రెండ్లీయో చెప్పలేను. ‘అరుంధతి’, రానున్న ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో ఆమె గెటప్‌లు, ఆ రాజసం అద్భుతం. అనూష్కలాగా ఇంకెవరూ చేయలేరు!
ఒత్తిడిగా ఉంటే... బ్రేక్ కోసం?
ఓ నెలరోజుల పాటు ఊళ్ళు తిరిగొస్తా!
పరిశ్రమలో మీ స్నేహితులు?
ఇక్కడ అంత ఆప్త మిత్రులు లేరు. నా ఫ్రెండ్సంతా స్కూల్, కాలేజ్‌మేట్లే.
జీవన సిద్ధాంతం?
‘హాయిగా బతుకు... ఇతరులను బతకనివ్వు’!
.......................................................
ప్రభుదేవా: సెట్‌లో కొంత ఛాలెంజ్ ఇస్తారు.
సెల్వరాఘవన్: పర్‌ఫెక్షన్ కోసం తపించే దర్శకుడు. అంతా సరిగ్గా ఉన్నా... పెదాలు మూసుకోవడంలో చిన్న తేడా ఉందనకున్నా మళ్ళీ కొత్తగా షూట్ చేస్తారు.
గౌతమ్ మీనన్: మన స్టైల్‌లోనే మన నుంచి ది బెస్ట్ తీసుకుంటారు. మనలోని ప్రతిభను ఆయన బయటకు తీస్తారు.
మణిరత్నం: ఆయనతో పని చేయడం నా కల. అది నిజమైంది. అనుకున్నది మన నుంచి రాబట్టే వరకు రాజీపడని తత్త్వం ఆయనది. ఆయనతో పని చేయాలంటే, అంతకు ముందు దాకా నేర్చుకున్నదంతా వదులుకోవాలి.
ప్రియదర్శన్: సినిమాల్లోకి వచ్చేందుకు నాకు తొలి అవకాశమిచ్చిన గురువు. ప్రతి ఒక్కరినీ ఒకేలా చూస్తారు. ఎంతో సాధించినా, కించిత్తు కూడా గర్వం చూపరు.
త్రివిక్రమ్: ఆయన చాలా కూల్. ఆయనతో పనిచేయడంలో ఫన్ ఉంది. కబుర్లాడుతూ, నవ్వుతూ పనిచేయించుకోవడం ఆయనకు అలవాటు. ‘అతడు’ నా బెస్ట్ ఎంటర్‌టైనర్‌సలో ఒకటి.
శ్రీను వైట్ల: వినోదం బాగా పండిస్తారు.
వి.వి. వినాయక్: ఆయన, రవితేజ, నేను గనక ఒక చోట ఉంటే, ఇక వినోదానికి కొదవ ఉండదు. బ్యాంకాక్‌లో షూటింగ్ సైతం, పిక్నిక్‌లా గడిచిపోయేది.
కె. రాఘవేంద్రరావు: ఆయనను ఒక మంచి మిత్రుడిలా చూస్తాను. శరీరానికే తప్ప మనసుకు వయసు రాదని నిరూపించిన మనిషి.
.........................................................................
స్టార్ కామెంట్
త్రిష అద్భుతమైన నటి. తమిళంలో తన రెండో చిత్రం ‘మౌనమ్ పేసియదే’లో, ఆ తర్వాతా ఇద్దరం కలిసి యాక్ట్ చేశాం. త్రిష హావభావాలు సహజంగా ఉంటాయి. నటనకు అవకాశం ఉన్న పాత్ర అంటే దర్శక, నిర్మాతలకు త్రిష గుర్తొస్తుంది.
- హీరో సూర్య
....................................................
(Published in 'Sakshi' daily, Family Page, 3rd May 2015, Sunday)
................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment