మే 1వ తేదీ... శుక్రవారం. ఉదయం 8.30 గంటలు... హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐ-మ్యాక్స్ ప్రాంగణం... గుంపులుగా జనం...
హీరో కమల్‌హాసన్ ‘ఉత్తమ విలన్’ను చూడడానికి ఉదయాన్నే సిద్ధమై వచ్చిన జనం... తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తూ... తెలుగులోకి లేట్ రిలీజైన లారెన్స్ ‘గంగ’ చూడాలని ఆసక్తిగా వచ్చిన ఆడియన్స్! తెలుగువాళ్ళు... తమిళులు... మలయాళీలు... భాషాభేదాలు లేకుండా సినిమా ఏకం చేసిన దాదాపు వెయ్యిమంది! ఎవరికి వారు పక్కవాళ్ళను విషయం అడుగుతూ, ఫోనుల్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. ‘సినిమా రాలేదట!’... ‘పడం వరలా’... ‘ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్!’... లాంగ్వేజ్ ఏదైనా డిస్కషన్ ఒకటే! ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని వచ్చినా, రీళ్ళ బాక్సులు (ఇప్పుడన్నీ డిజిటల్ ప్రింట్లే కాబట్టి, డిజిటల్ కోడ్‌లు) రాలేదని నిరుత్సాహం!
ఒక్క హైదరాబాద్‌లోనే కాదు... తెలుగునేల అంతటా ఆ రోజు మధ్యాహ్నానికి కానీ, తెరపై ‘గంగ’ బొమ్మ పడలేదు. తెలుగుతో పాటు తమిళనేల మీదా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొన్న ‘ఉత్తమ విలన్’ అయితే శనివారం మధ్యాహ్నం తరువాత కానీ, ప్రేక్షకుల్ని పలకరించలేదు. ఇన్ని కోట్లు పెట్టి తీసిన ఈ సినిమాలు... అదీ పేరున్న పెద్దవాళ్ళ సినిమాలు కూడా ఆఖరు క్షణంలో రిలీజ్ ఎందుకు ఆగినట్లు?
సినిమాలు బాగున్నా - ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అంటే...?
సినిమా కష్టాలు... సినిమా రిలీజ్‌కు ముందు సవాలక్ష కష్టాలు... పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్‌కు తగ్గట్లు బిజినెస్ జరగడం లేదు! ఫలానా ఏరియాను ఫలానా మొత్తానికి కొంటామన్న బయ్యర్లు ఆఖరు క్షణంలో... అనుకున్న మొత్తం కన్నా తక్కువ డబ్బే తెస్తున్నారు! తమకు చెల్లించాల్సిన పాత ఫ్లాప్ సినిమాల అప్పుల సంగతేంటో తేల్చమంటూ నిర్మాతల మీద పడే ఫైనాన్షియర్లు! వెరసి ఒక సినిమా ఎంత ఖర్చుతో తీస్తున్నామనే దాని కన్నా, ఎంత సులువుగా రిలీజ్ చేసుకుంటామనేది సమస్యగా మారింది.
ఈ కష్టాల కథేమిటో తెలుసుకోవాలంటే... ముందుగా సినీ వ్యాపారం ఏమిటో తెలుసుకోవాలి. అది ఏమిటంటే... గతంలో సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన - ఈ మూడు సెక్టార్ల కలెక్టివ్ రెస్పాన్స్‌బిలిటీ. సినిమా అంటే నిర్మాత, దర్శకుడు ఒక కథ అనుకొని, ప్రయత్నాలు మొదలుపెట్టేవారు. నిర్మాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాడు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లే కింగ్ మేకర్లు. చిత్ర నిర్మాణానికి డబ్బు వాళ్ళ నుంచి అందేది. ఆ మనీతో సినిమా తయారయ్యేది. పంపి ణీకి డిస్ట్రిబ్యూటర్లు... అద్దె లేదా నెట్ కలెక్షన్లలో పర్సంటేజ్ మీద తమ హాలులో సినిమా వేయడానికి ఎగ్జిబిటర్లు రెడీ. కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాతల మధ్య పంపిణీ అయ్యేది. సినిమా ఆడక తేడా వస్తే, అప్పటికి ఆ నష్టం డిస్ట్రిబ్యూటర్ భరించేవాడు. సదరు దర్శక, నిర్మాతల తరువాతి సినిమాలో ఎడ్జస్ట్ చేసేవాడు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు.
రిలీజ్ ముందు నిద్ర లేని రాత్రులు!
డిస్ట్రిబ్యూటర్ల సిస్టమ్ పోయి, బయ్యర్లు వచ్చాక రిస్క్ ఫ్యాక్టరూ పెరిగింది. నిర్మాతలు క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ చేసుకొంటారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో సినిమా స్టార్ట్ చేస్తారు. పదుల కోట్లు ఫైనాన్షియర్స్ నుంచి వడ్డీకి తెస్తారు. సినిమా సిద్ధమయ్యేవేళలో బయ్యర్లు క్రేజీ ఆఫర్లతో వస్తారు. కానీ, సినిమా కాస్త తేడాగా ఉందని ఏ మాత్రం ఉప్పందినా... వెంటనే ప్లేటు ఫిరాయిస్తారు. అనుకున్న దాని కన్నా తక్కువ రేటే ఇస్తారు. ఫలితం - నిర్మాతకు ఆశించిన బిజినెస్ కావడం లేదు. ఇప్పటికి ఈ సినిమా వరకు ప్రాఫిట్‌కే అమ్మినా, గత సినిమాలపై పేరుకున్న అప్పులు నిర్మాతను భూతంలా వెంటాడి వేధిస్త్తుంటాయి. ఉదాహరణకు, ఒక నవ యువ సామ్రాట్ మూడక్షరాల సినిమా ఏప్రిల్ చివరి వారంలో రూ. 10 కోట్ల దాకా బిజినెస్ కావాల్సింది. లాస్ట్‌మినిట్‌లో బయ్యర్లు 25 శాతం తగ్గించి, కట్టారు. వ్యాపారం తగ్గినా, నిర్మాత విధి లేక సినిమా రిలీజ్ చేశారు.
ఇక, గత చిత్రాల లాస్‌లు తడిసి మోపెడై, నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ను ‘గంగ’ రిలీజ్‌లో ఇబ్బంది పెట్టాయి. ‘ఉత్తమ విలన్’ను సమర్పిస్తున్న తిరుపతి బ్రదర్స్‌కు పాత ఫ్లాప్ ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) తాలూకు అప్పులు ఇప్పుడడ్డుపడ్డాయి. ‘‘అక్కడెవరో తీసిన సినిమాను ఇక్కడ నుంచి వెళ్ళి ఎగబడి కొంటున్నప్పుడు, వాళ్ళకున్న పాత అప్పులేంటో మనకు తెలీదుగా! చివరకు మూడు రోజుల పాటు నిద్రాహారాలు మాని, తమిళ, తెలుగు వెర్షన్‌ల నిర్మాతలు, సినీ సంఘాలు శ్రమిస్తే కానీ ‘ఉత్తమ విలన్’ ఒకటిన్నర రోజులు ఆలస్యంగా మన దేశంలో విడుదల కాలేకపోయింది’’ అని ‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. నిజానికి, ఇలా ఒక పెద్ద సినిమా రిలీజ్ ఒక్క రోజు ఆలస్యమైనా ఆ సినిమాకొచ్చే మొత్తం రెవెన్యూలో 20 నుంచి 25 శాతం మేర నష్టపోవాల్సి వస్తుంది. ఇక, ఆ రోజున సినిమా థియేటర్‌లో సైకిల్ స్టాండ్ మొదలు ఇతర అనుబంధ వ్యాపారాలకు కలిగే లాస్ దీనికి అదనం.
నిజానికి, ఇది ఒక రోజుకో... ఒక సినిమాకో... పరిమితమైన సమస్య కాదు. కలెక్షన్స్‌లో ఇండస్ట్రీ హిట్ పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లాంటి బడా సినిమాల మొదలు ఛోటా నటుల చిన్న సినిమాల దాకా ఇదే పరిస్థితి. సినిమాల రిలీజ్ ముందు రోజు రాత్రి ల్యాబుల్లో, స్టార్ హోటళ్లలో ప్రైవేట్ ‘పంచాయతీ’లు మామూలే. కాకపోతే, కొన్ని బయటకొస్తాయి. చాలా మటుకు సినీ వ్యాపార వర్గాల ‘రహస్యాలు’గా మిగిలిపోతాయి.
‘‘ఇవాళ రెమ్యూనరేషన్స్‌తో సహా నిర్మాణవ్యయం 40 శాతం పెరిగింది. అదే సమయంలో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్ల పర్చేజింగ్ పవర్ 30 నుంచి 40 శాతం తగ్గింది. వెరసి సినిమా వ్యాపారానికి 70 - 80 శాతం బొక్క పడింది’’ అని గుంటూరు డిస్ట్రిబ్యూటర్, చిత్ర నిర్మాణంలో అనుభవమున్న కొమ్మినేని వెంకటేశ్వరరావు వివరించారు. ఇలా కాస్ట్ పెరిగి, బిజినెస్ తగ్గి, పాత అప్పుల భారం తీరే మార్గంలేక, నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. సినిమాల రిలీజ్‌లు లాస్ట్‌మినిట్‌లో లేట్ అవుతున్నాయి.
ఇండస్ట్రీకి ఇప్పుడో హిట్ కావాలి!
కోట్ల ఖర్చుతో సినిమా తీసిన నిర్మాత... కోట్లు పారితోషికం తీసుకొనే హీరో... తెర ముందు కనిపించే షో ఇది. ఈ షోకు తెర వెనుక ఆర్థిక సూత్రధారులుగా ఫైనాన్షియర్లు, బయ్యర్లు, వీళ్ళకు డబ్బులు సమీకరించే ఎగ్జిబిటర్లు... సినిమా బిజినెస్ గ్లామర్ దీపం చుట్టూ శలభాలు. గత అయిదు నెలలుగా అన్నీ నష్టాలవడంతో బయ్యర్ల మొదలు ఫైనాన్షియర్స్ దాకా ఎవరికీ ఇప్పుడు చేతిలో డబ్బు ఆడని పరిస్థితి. ‘‘తక్షణమే కనీసం ఒక్క పెద్ద హిట్ రావాలి. అప్పుడు కానీ, డబ్బులు పెట్టే ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఈ ఫైనాన్షియల్ స్లంప్ నుంచి తేరుకోలేరు’’ అని ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘లయన్’ చిత్ర నిర్మాత రుద్రపాటి రమణారావు అన్నారు. ‘‘మన దగ్గర రిలీజ్ ప్లానింగ్ లేదు. బయ్యర్ల నుంచి వస్తున్నదెంత, ఫైనాన్షియర్లకు తీర్చాల్సిన అప్పుల రూపంలో పోయేదెంత అనే లెక్క చూసుకోవడం లేదు. ఇవన్నీ సరిదిద్దుకోవాలి. నిర్మాతలంతా కూర్చొని, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి’’ అని సునీల్ నారంగ్ సూచించారు.
అవును... అది నిజం. ఒకప్పుడు సినిమా... కేవలం కళ! ఆ తరువాత.... కళాత్మక వ్యాపారం! మరి ఇప్పుడు కాసుల చుట్టూ తిరిగే వ్యాపార కళ!! ఈ పరిస్థితుల్లో సినిమా బిజినెస్ ప్రతి వారం టేబుల్స్ టర్న్ చేసే చిత్రమైన ‘ధందా’! ఈ వ్యాపారంలో ఆర్థిక కష్టాలను తట్టుకొని, హాలులోని జనం దాకా సినిమా రావడం... ప్రతి శుక్రవారం ఒక సెల్యులాయిడ్ సిజేరియన్ డెలివరీ!
- రెంటాల జయదేవ
........................................................................
నష్టాల్లో... అయిదు నెలలు
‘డిసెంబర్ నుంచి ఈ 5 నెలల్లో తెలుగులో వచ్చిన సినిమాల్లో నికరంగా డబ్బులు చేసుకున్నది ఒక్కటీ లేదు. కల్యాణ్‌రామ్ ‘పటాస్’ ఒక్కటే రీజనబుల్‌గా పే చేసింది. పెద్ద స్టార్ల ‘లింగ’, ‘గోపాల గోపాల’ నుంచి లేటెస్ట్ సమ్మర్ రిలీజ్‌ల దాకా అన్నీ లాసే. బయ్యర్లను పోటు పొడిచినవే.’’
- సుధాకర్ నాయుడు, ఎస్.వి.ఎస్. ఫిల్మ్స్ అధినేత - బయ్యర్, కర్నూలు
......................................................
‘‘తమిళనాట ఎవరో తీస్తున్న సినిమాను మనం ఎగబడి వెళ్ళి కొనుక్కోవడంలో ఎంత ఇబ్బంది ఉందో అర్థమైంది. అక్కడ వాళ్ళకున్న అప్పులేమిటో తెలియదుగా! 53 సినిమాలు నిర్మించినా రిలీజ్ డేట్ నాడు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఇప్పుడు 54వ సినిమా ‘ఉత్తమ విలన్’కు తొలిసారి అది నాకు అనుభవమైంది.’’
- సి. కల్యాణ్
‘ఉత్తమ విలన్’ తెలుగు వెర్షన్ నిర్మాత .........................................................
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్
లేటెస్టయినా లేట్‌గా వచ్చిన కొన్ని!
శంకర్ - విక్రమ్‌ల ‘ఐ’
నాని నటించిన ‘జెండా పై కపిరాజు’
వై.వి.ఎస్. - సాయిధరమ్ తేజ్‌ల ‘రేయ్’
కమలహాసన్ ‘ఉత్తమ విలన్’
లారెన్స్ ‘గంగ’
..........................................
షూటింగ్ ఫినిష్! రిలీజ్‌కే వెయిటింగ్!!
నితిన్ ‘కొరియర్ బాయ్ కల్యాణ్’
కమల్ దర్శకత్వంలోని ‘విశ్వరూపమ్ 2’
రాజశేఖర్ నటించిన ‘వందకు వంద’
వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ‘పట్టపగలు’
.......................................................................
సెన్సారైంది..! రిలీజ్ ఆగింది!
విజయశాంతి నటించిన ‘శివాని’
రాఘవేంద్రరావు ‘ఇంటింటా అన్నమయ్య’
.........................................
(Published in 'Sakshi' daily, Family page, 5th May 2015, Tuesday)
.............................................
0 వ్యాఖ్యలు:
Post a Comment