జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Tuesday, May 20, 2014

ఎలాగూ చనిపోతాం... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది!


రామ్‌గోపాల్ వర్మ...

 ఈ పేరు చెప్పగానే ఎవరికైనా చటుక్కున స్ఫురించేది ఓ విలక్షణ వ్యక్తిత్వం.
 ఆయన మాటలైనా, చేతలైనా ఎప్పుడూ ఏదో ఒక సంచలనమే. 

సినిమా హిట్టు, ఫ్లాపులతో ఆయనకు సంబంధం లేదు. 
వాటికి అతీతంగా అనునిత్యం వార్తల్లో ఉండడం వర్మలోని విశేషం.

 మరి, అలాంటి విలక్షణ వ్యక్తి
 ఎవరిని చూసి ప్రభావితమయ్యారు?

 దేన్ని చూసి, ఏం చదివి ప్రేరణ పొందారు?

 ఎవరి మీదైనా సరే మాటల తూటాలు పేల్చే
 ఈ మనిషికి బతుకు మీద భయం లేదా?

 రండి... రామూను అడిగేద్దాం...
 ఆయన మాటల్లోనే వివరణ వినేద్దాం.
నన్ను ప్రధానంగా ప్రభావితం చేసిన వ్యక్తి - ఇంజినీరింగ్ కాలేజ్‌లో నాకు జూనియర్ అయిన నా స్నేహితుడు సత్యేంద్ర. అతను చాలా తెలివైనవాడు. ఇంటర్నెట్ లాంటివేవీ లేని ఆ రోజుల్లో విశాఖపట్నం నుంచి విజయవాడకు చదువుకోవడానికి వచ్చిన పద్ధెనిమిదేళ్ళ అతను ఆ తరం విద్యార్థులు ఎవరూ ఊహించని రీతిలో ఎన్నెన్నో పుస్తకాలు చదివాడు. ఆరు నెలల పాటు నేను, అతను రూమ్మేట్లం. అతనితో మాట్లాడుతుంటే, అదో చెప్పలేని అనుభూతి. ఒకసారి పరీక్షల ముందు నేను, సత్యేంద్ర విజయవాడలోని లీలామహల్‌లో ఓ ఇంగ్లిషు సినిమాకు వెళ్ళాం. సత్యేంద్ర ఆ సినిమా చూడడం అప్పటికి ఏడోసారి. ఇంతలో మా కాలేజ్ ప్రిన్సిపాల్ తుమ్మల వేణుగోపాలరావు కూడా అదే సినిమాకు వచ్చారు.

‘ఏమిటి ఇలా వచ్చార’ని ఆయన అడిగితే, ‘మీరు కాలేజ్‌లో నేర్పే దాని కన్నా, ఈ సినిమాల ద్వారా నేర్చుకునేది ఎక్కువ. అందుకే, ఈ సినిమాకు ఏడోసారి వచ్చా’ అన్నాడు సత్యేంద్ర. ‘ఈ సినిమా నేను చూశాను. ఇందులో అంత ఏముంది?’ అన్నారు ప్రిన్సిపాల్. ‘మీకు కనిపించనిదేదో, నాకు కనిపించింది’ అన్నాడు సత్యేంద్ర. చూడడానికి అతని మాట తీరు అలా నిర్లక్ష్యంగా అనిపించినా, అంత తెలివైన విద్యార్థిని నేను చూడలేదంటే నమ్మండి. చివరకు, మా ప్రిన్సిపాల్ గారు కూడా ఓ సందర్భంలో ‘నేను మరువలేని విద్యార్థి’ అంటూ సత్యేంద్ర మీద చాలా గొప్పగా ఓ వ్యాసం రాశారు. దాన్నిబట్టి అతను ఎలాంటివాడో అర్థం చేసుకోండి.

అవడానికి కాలేజీలో నాకు జూనియర్ అయినా, సత్యేంద్ర మాటలు, అతను ప్రస్తావించిన పుస్తకాల పఠనం నన్నెంతగానో మార్చేశాయి. అతనితో మాట్లాడితే, మనకు తెలియని ఓ అభద్రత కలుగుతుంది. ఆయన తెలివితేటల ముందు మనమంతా పురుగులలాగా అనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు సత్యేంద్ర. ఈ మధ్యే మూడు నెలల క్రితం కూడా అతనితో ఫోన్‌లో మాట్లాడాను. అతని మాటల్లోని తార్కికత మనల్ని ఆలోచనల్లో పడేస్తుంది. మనలోని అజ్ఞానపు తెరలు ఒక్కొక్కటిగా విడిపోతూ, ఉంటాయి.

 ‘భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను’ లాంటి ప్రకటనల వెనుక ఉన్న మన అంతరంగాన్ని ఆయన ప్రశ్నిస్తారు. కేవలం దేశాన్ని ప్రేమిస్తున్నావా, ఇక్కడి వ్యక్తులను ప్రేమిస్తున్నావా, కులాలు - మతాలు - ప్రాంతాల లాంటి విభేదాలు ఏమీ లేకుండా వ్యక్తులను ప్రేమించగలవా అని ఆయన చెప్పే తర్కం ఆలోచనలో పడేసేది. మనలో గూడు కట్టుకున్న స్థిరమైన అభిప్రాయాలనూ, భావాలనూ అతని మాటలు ఛిన్నాభిన్నం చేసేస్తాయి.
 
 నా జీవిత తాత్త్వికత అంతా ఆ పుస్తకాల ప్రభావమే!

 సత్యేంద్ర తరువాత నన్ను అమితంగా ప్రభావితం చేసినవి పుస్తకాలే. ఇంటర్మీడియట్ చదువుతుండగానే నేను కాల్పనిక సాహిత్యమంతా చదివేశాను. కాల్పనికేతర సాహిత్యం, ఫిలాసఫీ పుస్తకాలు మాత్రం ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాకే చదవడం మొదలుపెట్టాను.  ఇప్పుడు నేను ఎక్కువగా ఫిలాసఫీ పుస్తకాలు, అందులోనూ పొలిటికల్ ఫిలాసఫీ పుస్తకాలు తెగ చదువుతుంటాను. వాటిని నాకు పరిచయం చేసింది సత్యేంద్రే. ఆయన స్నేహం వల్లే నేను జర్మన్ తత్త్వవేత్త నీషే, అయన్ ర్యాండ్ లాంటి ప్రసిద్ధులు రాసిన పుస్తకాలు చదివాను. అయన్ ర్యాండ్ రచనలన్నీ దాదాపు చదివేశాను. ముఖ్యంగా ఆమె రచనలు, నీషే రాసిన ‘దజ్ స్పేక్ జరాథుస్త్రా’ -  నన్ను బాగా ప్రభావితం చేశాయి.  అన్నట్లు నేను ఇందాక చెప్పిన సత్యేంద్ర కూడా ఇప్పుడు ఓ పుస్తకం రాస్తున్నాడు. అతని ఆలోచనలతో నిండిన ఆ పుస్తకం జనం ఆలోచించే తీరును మార్చి వేస్తుందని ఆయన నమ్మకం. కచ్చితంగా అది ఓ సంచలనమవుతుంది.

తెలుగు పుస్తకాల విషయానికి వస్తే, నేను ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి అభిమానిని. ఆమె రాసిన ‘రామాయణ విషవృక్షం’ చదివాను. అలాగే, శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’, చలం రచనలు చదివాను. చలం మంచి రచయితే కానీ, ఆ భావాలు అప్పటికి కూడా కొత్త ఏమీ కాదు. అవన్నీ ప్రపంచ ప్రసిద్ధులైన నీషే తదితరుల తాత్త్వికతలో ఉన్నవే.
 
 ఆ సినిమాల జాబితా చాలా పెద్దది!

 ప్రపంచ సినీ చరిత్రలో ఆణిముత్యాలని చెప్పదగ్గ చిత్రాలు కొన్ని నా మీద ప్రభావం చూపాయి. వాటి జాబితా పెద్దదే. అయితే, చటుక్కున నాకు గుర్తొచ్చే సినిమాలు - ‘గాడ్ ఫాదర్’, ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ఎగ్జార్సిస్ట్’. భారతీయ సినిమాల్లోకి వస్తే ‘షోలే’, ‘అర్ధ్ సత్య’ లాంటివి నన్ను ప్రభావితం చేశాయి. అలాగే, నా మీద ప్రభావం చూపాయని అనలేను కానీ, నేను బాగా ఇష్టపడిన తెలుగు సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాసరి నారాయణరావు గారి ‘శివరంజని’, బాలచందర్ గారి సినిమాల లాంటివి నాకెంతో ఇష్టం. అలాగే, షార్ట్‌ఫిలిమ్‌లు, నేషనల్ జాగ్రఫీ చానల్‌లో వచ్చే డాక్యుమెంటరీలు కూడా తరచూ చూస్తూ ఉంటాను. వాటి ప్రభావం నా మీద కొంత ఉంది.
 

 నాకెప్పుడూ, దేనికీ భయం లేదు!

 అవతలివాళ్ళను భయపెట్టడం నాకు ఇష్టం. కానీ, చిత్రమైన విషయం ఏమిటంటే, నాకు ఎప్పుడూ భయం అనిపించదు. చాలా ఏళ్ళ క్రితం మహారాష్ట్రలోని లాతూరులో భయంకరమైన భూకంపం వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు నేను బొంబాయిలో ఎనిమిదో అంతస్థులోని ఇంట్లో ఉన్నా. భవనమంతా ఒక్కసారిగా భయంకరంగా ఊగుతోంది. భూకంపం వచ్చిన విషయం నాకు అర్థమైంది. కిందకు వెళదామని అనుకున్నా. కానీ, వెంటనే ఈ లోపలే భవంతి కూలిపోయి చనిపోతామేమోలే... ఇంకెందుకు వెళ్ళడం అనిపించింది. అంతే! అక్కడే ఉండిపోయి, భూకంపం వచ్చినప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నా. భవంతి గోడలు విరిగినప్పుడు ఎలాంటి శబ్దం వస్తుందా అని ఆలోచిస్తూ కూర్చున్నా!     


- రెంటాల జయదేవ


(Published in 'Sakshi' daily, 18th May 2014, Sunday)
.....................................

0 వ్యాఖ్యలు: