సినీ హీరోలు పొలిటికల్ స్టేట్మెంట్లిస్తున్నారు. ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారో చెప్తేస్తున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి కండువాలు కప్పేసుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో నటుల ఎంట్రీ కొత్త విషయమేం కాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరం. కొందరు డైరెక్ట్ గా ఏదో ఒక పార్టీలో చేరుతున్నారు. మరికొందరు మేం రావటం లేదంటూనే పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతల్ని కలిసొస్తున్నారు. అసలు ఏ నటుడు ఏ ఎజెండాతో వస్తున్నారు? ప్రజలకు ఏం చెప్తున్నారు? ఏం దాస్తున్నారు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది?
పవనిజం..
జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కల్యాణ్ మోడీ జపం మొదలుపెట్టారు. ఏకంగా అహ్మదాబాద్ వెళ్లి మరీ మోడీని కలిసి వచ్చారు. ఇక మోడీని కలిసిన నాగార్జున అయితే గుజరాత్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందంటూ మూర్ఛపోయినంత పనిచేశారు. మోహన్ బాబు అదే బాటలో ఉంటే, మంచు లక్ష్మి మోడికే నా మద్దతు అని స్టేట్మెంటిచ్చేశారు. నటుడు శివాజీ మోడీయే దేశానికి ఊపిరి అంటున్నారు. ఇక కమెడియన్లు ఆలీ, వేణుమాధవ్ బాబుగారి పక్కన చేరారు. ఏంటి వీరి ఎజెండా? ప్రజా సేవకోసమేనా? వేరే లక్ష్యాలేమన్నా ఉన్నాయా? బుద్ధిగా రంగేసుకుని నాలుగురాళ్లు వెనకేసుకోకుండా పొలిటికల్ ఎంట్రీ కొట్టడం వెనుక ఏ ప్రయోజనాలున్నాయి? ఇప్పుడు ఫిల్మ్ నగర్ లోనే కాదు.. ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇది.
తెలుగు ఇండస్ట్రీ ఇన్ సెక్యూరిటీలో ఉందా..?
ఎన్టీఆర్, ఎమ్జీఆర్. రాజకీయాల్లో సక్సెస్ పుల్ పర్సనాలిటీస్. వాళ్లు సినిమాలనుండి ప్రజల్లోకెళ్లి, వారితో మమేకమైన బలాన్ని కూడగట్టుకుని రాజకీయంగా తమ ముద్ర వేశారు. నేటి నటులు కూడా అలాగే ఉన్నారా? నాగార్జున... క్రమశిక్షణ గల నటుడిగా, మనీ మేనేజ్ మెంట్ బాగా తెలిసిన నటుడిగా పేరు. ప్రజలకు అగ్రనటుడిగా తెలిస్తే, కాస్త దగ్గరిగా తెలిసిన వారికి మంచి బిజినెస్ మెన్ అని కూడా అర్థమవుతుంది. ఇలాంటి నాగార్జునకు అహ్మదాబాద్ లో ఏం పని? పరిగెత్తి మోడీగారిని కలవటం వెనుక కారణాలేంటి? మరో నటుడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో, భారీ సినిమా లాంటి హైప్ తో జనాల ముందుకొచ్చారు. కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. తెలుగు జాతి గౌరవం అంటూ చాలా చాలా మాటలు చెప్పారు. కానీ, ఎజెండా గురించి ఏం చెప్పలేదే అని ప్రజల్లో సందేహం అలాగే ఉంది. కానీ పవన్ ఎప్పుడైతే అహ్మదాబాద్ బాట పట్టారో అప్పటి నుంచి ప్రజల్ని మరింత అయోమయంలోకి నెట్టారు.
పవన్, నాగార్జున, మోహన్ బాబు, ఇదే వరుసలో మరికొందరు నటులున్నారు. విభజన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ అంతా హైదరబాద్ లోనే కాన్ సన్ ట్రేట్ అయి ఉంది. పైగా పెద్ద పెద్ద తారలు నిర్మాతల ఆస్తులు, వ్యాపారాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే పార్టీ ఇండస్ట్రీతో ఎలా వ్యవహరిస్తుందో ఊహించలేని విషయం. అందుకే, తమ ప్రయోజనాల కాపాడుకోటానికి తమ స్థానం నిలబెట్టుకోటానికి జాగ్రత్తపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
పాలిటిక్స్ లోకి వస్తున్న నటుల లక్ష్యం ఏంటి..?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పాలిటిక్స్ లోకి వచ్చిన వారి చిట్టా రాస్తే చాంతాడంత అవుతుంది. వీరిలో ఇకరిద్దరిని మినహాయిస్తే నిజంగా ప్రజలకోసం పాటుపడ్డవారు లేరని వాదనలున్నాయి. ధియేటర్ లో చప్పట్లను ఓట్లుగా మార్చుకుని, ఆ తర్వాత సినిమాలకే పరిమితమై పబ్లిక్ కి అంజాన్ గొట్టే నటులే ఎక్కువని ప్రజలంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవారు మాత్రం చేసేదేముందని ప్రశ్నిస్తున్నారు? ప్రజాసేవకు నటులు కట్టుబడి ఉండలేదని అందుకే చాలామంది ఒక్కసారి గెలుపుకు మాత్రమే పరిమితమయ్యారని విశ్లేషకుల వాదన. ఇప్పుడు కొత్తగా వచ్చే నటుల్లో కూడా ప్రజా సేవకు కట్టుబడి ఉండేవారు తక్కువే అంటున్నారు సినీ,రాజకీయ విశ్లేషకులు.
ఇంతకీ నాగార్జున మోడీకి ఎందుకు జై కొడుతున్నట్టు?
వాస్తవానికి నాగార్జున అధికారంలో ఉన్నవారికి ఎప్పుడూ దగ్గరగానే ఉంటూ వచ్చారు. అది వైఎస్ అయినా, చంద్రబాబు అయినా.. ఇప్పుడు మోడీని కలవడం ద్వారా యువ సామ్రాట్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అనే విషయం మాత్రం ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోందని విశ్లేషకుల వాదన.
మోడీని కలవడం వెనుక రాజకీయాల కారణాలు లేవని నాగార్జున చెబుతున్నప్పటికీ ఆయన బిజెపి తరఫున ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదు. 2009 ఎన్నికల్లోనూ నాగార్జున వైయస్ రాజశేఖర్‌రెడ్డితోనూ బాగా సఖ్యతను ప్రదర్శించారు. పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసిడర్ గా సంక్షేమ పథకాలపై ప్రచారం చేశారు. నాగార్జున ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోకి చెందిన భూమి వినియోగంపై రాయతీలు పొందారనే వాదనలున్నాయి. వైఎస్సార్ మరణించాక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతోనూ నాగార్జున సఖ్యత కొనసాగించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతోనూ సన్నిహిత సంబంధాలు మెయింటెయిన్ చేశారు.
అయితే, నాగార్జున మాత్రం మోడీని కలవటం వెనుక ఎలాంటి రాజకీయ ఎజెండా ఏదీ లేదన్నారు. తమ కుటుంబానికి పదవులు, రాజకీయాలు అక్కర్లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రగతికి తగిన విధంగా సహకరించాలని తాను మోడీని కోరినట్లు చెబుతున్నారు.
ఆస్తుల భద్రత కోసమేనా..?
నాగార్జున మన్మధుడే కాదు.. బిజినెస్ మెన్ కూడా. సినీ నటుల్లో ఈ రేంజ్ లో సంపాదించిన మరొకరు లేరని టాక్. కానీ, వందల కోట్లలో ఉన్న ఆస్తుల్లో మేజర్ గా ఉన్న ఆస్తులు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. పైగా, అన్నపూర్ణ స్టూడియో లోని ఏడెకరాలని వ్యాపారావసరాలకు వాడుకుంటున్నట్టు టాక్ . ఇవి కాకుండా రియల్ ఎస్టేట్ లో బాగా ముందున్నట్టు సమాచారం. పైగా మా టివిలోను షేర్ ఉంది. ఇప్పుడు విభజన తర్వాత వాటి పరిస్థితి ఏంటా అనే బెంగ నాగ్ కు పట్టుకుందనే వాదనలున్నాయి. తన వందల కోట్ల ఆస్తులకు ఏ ప్రమాదం రాకుండా ఉండేందుకే, మోడీని కలిశారని పరిశీలకుల వాదన.
నాగ్ పై పలు ఆరోపణలు..
అక్కినేని నాగార్జునపై హైటెక్ సిటీ సమీపంలోని గురుకుల ట్రస్టు, తమ్మడి చెరువు భూములను ఆక్రమించినట్టు ఆరోపణలున్నాయి. మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కోసం 150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఆక్రమించారంటూ లోకాయుక్తకు జనంకోసం అనే ఓ స్వచ్ఛంధ సంస్థ ఫిర్యాదు కూడా చేసింది. ఆ భూములను ప్రభుత్వానికి సమర్పించాలని కూడా డిమాండ్ చేసింది.
ఇక సినిమా నిర్మాణం కోసం అన్నపూర్ణ స్టూడియోను తీసుకుని అందులో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పెట్టడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నట్టు గతంలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇవన్నీ చూస్తుంటే, నాగార్జున చెప్తున్నట్టు రెండు రాష్ట్రాల అభివృద్ధి మాటేమో కానీ, తాను మాత్రం పవర్ ఎవరి చేతిలో ఉన్నా నష్టం రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది.
అసలు పవన్ లక్ష్యం ఏంటి?
అది ఎవరు వదిలిన బుల్లెట్టో నిన్నటిదాకా ఎవరికీ అర్థం కాలేదు. సినిమాల్లో ఇమేజ్, ఒంటి చేత్తో పదిమందిని ఇరగదీసిన దమ్ము చూసి కోట్లాది మంది ప్యాన్స్ అయ్యారు. చేగువేరా బొమ్మ, విప్లవం ఛాయలు ధ్వనించే డైలాగ్స్ పవన్ కల్యాణ్ కి నటుల్లో ఓ డిఫరెంట్ ఫ్లేవర్ నిచ్చాయి. కానీ, పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినట్టే పెట్టాడు. అజ్ఞాతంలోకి జారి పోయాడు. అసలు తన ఎజెండా ఏంటో, ఏం చేయదలుచుకున్నాడో అయోమయపు మాటలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడనే వాదనలున్నాయి. పవన్ చేగువేరా పేరు చెప్పుకుంటూనే నరహంతకుడిని హత్తుకున్నాడు. విప్లవం మాటలు వల్లిస్తూనే, సామ్రాజ్యవాద ప్రతినిధితో కలిసిపోయాడు.
మార్పు రావాలంటూనే ఛాందసత్వాన్ని ఆహ్వానిస్తున్నాడు.
శాంతి మంత్రాన్ని ఆలపిస్తూనే, వేలాది ప్రాణాలు తీసిన రక్తపు చేతులను పట్టుకున్నాడు గద్దర్ పాటకు గంతులేశానంటూనే, మతతత్వాన్ని కావలించుకున్నాడు. పవన్ ఇచ్చిన షాక్ నుండి ఫ్యాన్స్ ఇంకా తేరుకోలేదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.
పవన్ పార్టీ పెడుతున్నాడంటే సంతోషించిన వాళ్లు కూడా ఇప్పుడు పెదవివిరుస్తున్నారు. మోడీని కలిసినప్పుడే అసలు విషయం స్పష్టమైందంటున్నారు విశ్లేషకులు. ఇది ఎవరు వదిలిన బుల్లెట్టో, ఏ దారి వెతుక్కుంటూ పోతుందో, ప్రజలకు అర్థమయిందని చెప్తున్నారు.
చరిత్ర పరిశీలిస్తే..\
వీళ్లే మొదలు ఆఖరు కాదు. అసలు ఇప్పటిది కాదీ చరిత్ర. వెతుక్కుంటూ పోతే మూలాలు నలుపు తెలుపు కాలంలోనే కనిపిస్తాయి. సిల్వర్ స్క్రీన్ నుండి స్ట్రైట్ గా జనాల మధ్యకు దూకిన నటులు కుప్పలు తెప్పలుగా కనిపిస్తారు. వెండితెర వెలుగులతో జనాల మధ్య కొచ్చి రాజకీయాల అంతు చూద్దామనే కోరిక చాలామందికి కలిగింది. అంచనాలు కొండంత ఉంటే, చేసింది మాత్రం రవ్వంతే.
నటులు పాలిటిక్స్ లోకి రావటం కొత్త విషయమేం కాదు. అయితే, కొందరు చరిత్ర సృష్టిస్తే, మరికొందరు మాత్రం నాలుగురోజులకే చాపచుట్టేశారు.. సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే వచ్చే ఇమేజ్ అలాంటిలాంటిది కాదు. సినిమాల్లో చేసే అద్భుతాలు నిజజీవితంలో అసాధ్యంగానో, కష్టసాధ్యంగానో కనిపించే సాహసాలు వాళ్లను ఎక్కడకో తీసుకెళతాయి. ఒక నిజంలాంటి భ్రమలో, భ్రమలాంటి కొత్త ప్రపంచంలో మొత్తంగా రియాల్టీకి దూరమయ్యే పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది. ఇక్కడ అభిమానాన్ని కురిపించే కోట్లాది మందిని చూసి, వారే బలమనుకొని, రాజకీయాల్లోకి ఎంట్రీ కొట్టేస్తారు. ఇక్కడ హిట్టయ్యేవారి కంటే ఫట్టయ్యే వాళ్లే ఎక్కువ..
సరిగ్గా ఇప్పుడు కూడా అదే జరుగుతోందనే వాదనలున్నాయి. సేవ చేయాలన్న ధృక్పథం కంటే స్వప్రయోజనాల్ని కాపాడుకోవటమో లేక పదవులతో సరదా తీర్చుకోవటం తప్ప పాలిటిక్స్ ని నటులు సీరియస్ గా తీసుకున్న సందర్భాలు తక్కువే అని పరిశీలకుల వాదన.
సినిమా వేరు రాజకీయాలు వేరు..
నటనకు జీవితానికి చాలా తేడా ఉంది. అలరించటం, అభిమానుల గుండెల్లో చిరకాలం నిలిచిపోవటం నటులకున్న వరం. కానీ, ఇంకో అడుగు ముందుకేసి ప్రజల మధ్యే ఉండి సేవ చేస్తానంటే తప్పు లేదు. కానీ, అక్కడ నటన కుదరదు, వాస్తవంలోకి రావాల్సిందే. ఈ లాజిక్ తెలియక ఎక్కడ నటించాలో, ఎక్కడ జీవించాలో తెలియని కన్ఫ్యూజన్ లో కొందరు నటులు ప్రయాస పడుతుంటారు. అభిమానుల్నీ గందరగోళపెడతారు. చాలా కొద్దిమంది నటులు మాత్రమే జనబాహుళ్యానికి దగ్గరై, వారిలో మమేకమై సమాజం కోసం నిజాయితీగా నిలబడతారు.. అలాంటి వ్యక్తులకు ప్రజలెప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటారు..
(This story was telecasted in 10tv - 20 March 2014, Thursday)
......................................
డియర్ మేరీ
3 months ago
0 వ్యాఖ్యలు:
Post a Comment