జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, April 10, 2014

''సమాజానికి నమస్కరిస్తున్నా!'' - జ్ఞానపీఠ పురస్కార విజేత రావూరి భరద్వాజతో రెంటాల జయదేవ ప్రత్యేక ఇంటర్వ్యూ

2013 అక్టోబరులో జ్ఞానపీఠ పురస్కారం అందుకుంటూ రావూరి భరద్వాజ


 ('జ్ఞానపీఠ' అవార్డు వచ్చిన సందర్భంగా, ఆ ప్రకటన వెలువడిన 2013 ఏప్రిల్ 17న  రెంటాల జయదేవకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది)

హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌ ప్రాంతంలోని విజయనగర్‌ కాలనీలోని మధ్యతరగతి నివాసమైన భరద్వాజ ఇల్లంతా పత్రికలు, చానళ్ళ ప్రతినిధులు, కెమేరామన్లు, ఫోటోగ్రాఫర్లతో నిండిపోయింది. ప్రత్యక్ష ప్రసారం కోసం వచ్చిన వాహనాలతో ఆ ఇంటి సందంతా సందడిలో మునిగిపోయింది. వృద్ధాప్యం తెచ్చిన బలహీనత బాధిస్తున్నా, ఇంట్లో వాళ్ళ సాయంతో రావూరి భరద్వాజ మీడియా ముందుకు వచ్చారు. తెల్లటి పంచె, లాల్చీ, నెరిసిన గడ్డంతో అతి సామాన్యుడిలా, అత్యంత నిరాడంబరంగా అందరికీ నమస్కరించారు.
1944 ప్రాంతంలో మొదలుపెట్టి గడచిన ఏడు దశాబ్దాలుగా సాగుతున్న తన రచనల్లోని వాక్యాలలాగే అంతే సాఫీగా, సహజంగా తన మనోభావాలు పంచుకున్నారు. ఒకపక్క ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మీడియా హడావిడి… మరోపక్క అభినందనలందిస్తూ వరుసగా ఇంట్లో మోగుతున్న ఫోన్లు… ఇంకోపక్క ఇంటికి వస్తున్న సాహితీ మిత్రులు, సన్నిహితుల తాకిడి… వీటన్నిటి మధ్యనే రావూరి భరద్వాజ తీరిక చేసుకుంటూ  ఇంటర్వ్యూ ఇచ్చారు. మనసులోని మాటలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు:
    భారతీయ సాహిత్యంలోని అత్యున్నత పురస్కారం 'జ్ఞానపీఠ్‌' మీకు దక్కినందుకు ముందుగా 'ప్రజాశక్తి' పక్షాన అభినందనలు. ఈ పురస్కారం దక్కడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు?
ఈ అరుదైన గౌరవం దక్కడానికి నేను మాత్రమే కారణం అనుకోవడం లేదు. నా జీవితానుభవాలు, ఆ అనుభవాలను ప్రసాదించిన సామాజిక వాతావరణం, ఆ వాతావరణంలోని మనుషులు, దాన్ని మలిచిన పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కారణం. ఈ సమాజం ప్రసాదించిన గొప్ప అనుభవాలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. 

ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది?
ఇవాళ మధ్యాహ్నం 12.30 - ఒంటి గంట సమయంలో విశాఖపట్నం నుంచి ఒకరు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఇంతలో ఢిల్లీ నుంచి 'భారతీయ జ్ఞానపీఠ్‌' వారు కూడా తెలిపారు. 

'జ్ఞానపీఠ్‌' లభిస్తుందని మీరు ఎన్నడైనా ఊహించారా?
(నవ్వేస్తూ...) లేనే లేదు. ఎన్నడూ కల కూడా కనలేదు. జ్ఞానపీఠం కోసం ప్రయత్నించనూ లేదు. అన్నం తిన్నట్టు కల వచ్చింది కానీ, పంచభక్ష్య పరమాన్నాలతో, బంగారు పళ్ళెంలో, రత్నాలు పొదిగిన చెమ్చాతో తింటానని కలగన లేదు. సాహిత్యపరంగా అటువంటి ఉన్నతోన్నతమైనది ఈ అవార్డు. ఇది వస్తే బాగుండునని అనుకోవడం వేరు. రావడం వేరు. మూడు, నాలుగు పర్యాయాలుగా దరఖాస్తయితే చేశాను. పంపించి, ఓ ప్రయత్నం చేశాను కానీ వస్తుందని అనుకోలేదు.

ఊహించని అవార్డు వచ్చిన ఈ క్షణంలో మీ అంతరంగ భావన ?
నేను ఎంతో ఆనందంతో ఉన్నాను. సంతోషాన్ని మించిన స్థాయి ఆనందం. కలలో కూడా ఊహించని సుందరాంగులు, విద్యా సంపన్నులు, సంస్కార సంపన్నులు ముందుకు వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఈ అవార్డు నేను కలలు కన్నది కాదు. నిజానికి, నా జీవితంలో నేను పిడికెడు మెతుకుల కోసం పాకులాడానే తప్ప, అవార్డుల కోసం ఎన్నడూ పాకులాడ లేదు. వాటి కోసం ఎవరినీ యాచించ లేదు, అర్థించ లేదు, అభ్యర్థించలేదు. 

మీరు చాలా ఏళ్ళ క్రితం రాసిన 'పాకుడు రాళ్ళు' నవల ద్వారా మీకు ఈ అవార్డు వచ్చింది కదా! ఆ నవలా రచనా నేపథ్యం పాఠకులకు వివరిస్తారా? 
(నోట్ - అవార్డు ప్రకటన రోజున మొదట మీడియాలో ప్రచారం జరిగినట్లుగా, చాలామందిమి పొరపాటు పడినట్లుగా ఆ నవలకు గాను ఆయనకు జ్ఞానపీఠ్ ఇవ్వలేదు. తెలుగు సాహిత్యానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆ అవార్డును ఇస్తున్నట్లు ఎంపిక కమిటీ వెలువరించిన అధికారిక ప్రకటన స్పష్టం చేస్తోంది. కానీ, ఇప్పటికీ చాలామంది అది గుర్తించక, మొదటి తప్పునే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. - రచయిత) 

నేను దాదాపు మూడున్నరేళ్ళు మద్రాసులో ఉన్నాను. ఆ రోజుల్లో రచయిత ధనికొండ హనుమంతరావు సన్నిహితుడైన కొలను బ్రహ్మానందరావు నడిపిన 'చిత్రసీమ' అనే సినీ పత్రికలో పనిచేశాను. నేను తెనాలి నుంచి మద్రాసు వెళ్ళి పోతున్నప్పుడు నా మిత్రుడు ఒకరు నాకు ఓ డైరీ ఇచ్చాడు. ఆ డైరీలో నా దిన చర్య, రోజువారీ అనుభవాలు రాసుకొనేవాణ్ణి. సినిమా పత్రికలో పనిచేస్తూ, సినిమా ప్రపంచాన్నీ, మను షులనూ దగ్గర నుంచి చూస్తూ, డైరీలో రాసుకున్న అనుభవాలు, జ్ఞాపకాలతో కథ ఎందుకు రాయకూడదని నాకు అనిపించింది. అలా నేను ఓ కథ రాశాను. 

మరి, అది నవలగా ఎలా మారింది?
ఆ కథను సాహితీ దిగ్గజం మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి చూపించాను. ఆయన అంతా చదివాక, 'బాగుంది. కానీ, పది మందిని కూర్చోబెట్టాల్సిన చోట వంద మందిని కూర్చోబెట్టావేమిటి?' అన్నారు. నా మట్టిబుర్రకు మొదట వెలగ లేదు. వివరం అడిగితే, 'ఇది మూడు, నాలుగు వందల పేజీల నవలగా సరిపడే అంశాన్ని ఒక కథగా రాశావు' అన్నారు. ఆ మాట నా మనస్సులో ఉండిపోయింది. ఆ తరువాత హైదరాబాద్‌ వచ్చాక, అప్పటి 'కృష్ణాపత్రిక' అధిపతి ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మగారు నన్ను ఏదైనా రాయమని అడిగారు. నేను ఈ కథాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, సినిమా వాళ్ళ మీద సీరియల్‌ రాస్తాను అన్నాను. వాళ్ళ మీద రాయడానికి ఏముంటుందన్నారాయన. చాలా ఉందని చెప్పి, ముందుగా 12 వారాలకు సరిపడా భాగాలు భాగాలుగా సీరియల్‌ రాసి, తీసుకువెళ్ళాను. అది నచ్చి, 'కృష్ణాపత్రిక'లో ధారావాహికగా ప్రచురించారు. ముందుగా 30 - 40 పేజీల కథగా అనుకున్నది, చివరకు మూడు నాలుగేళ్ళు పెద్ద సీరియల్‌గా వచ్చింది.ఆ నవలకు విశేష ఆదరణ లభించింది. 

ఆ నవల వల్ల ఇప్పటికే మీకు రెండోసారి 'ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు', తొలిసారిగా 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' వచ్చాయి. ఇప్పుడిలా 'జ్ఞానపీఠం'! అది ఇంతటి పేరు తెస్తుందని మీరనుకున్నారా?
లేదు. అసలు ఆ నవలకు ముందు నేను అనుకున్న పేరు 'మాయ జలతారు' అని. కానీ, అప్పట్లో 'కృష్ణా పత్రిక'లో పని చేస్తున్న సాహితీమిత్రుడు, చిత్రకారుడు శీలా వీర్రాజు దానికి 'పాకుడు రాళ్ళు' అని నామకరణం చేశారు. పాచిపట్టి, జారిపడతామని తెలిసినా అందరూ సినీ రంగం వైపు ఆకర్షితులవుతుంటారు... జారి పడుతుంటారు... దెబ్బలు తగిలించుకుంటారు... మళ్ళీ మళ్ళీ దాని మీదే వెళుతుంటారు... అనే విశాలమైన అర్థంతో ఆయన పెట్టిన పేరు అది. ఆ నవల తమిళ, కన్నడ భాషల్లోకి కూడా అనువాదమైంది. అక్కడా అందరి ఆదరణ పొందింది. ఆ నవలను ఆకాశవాణి వారు ఓ గంట వ్యవధితో నడిచే శ్రవ్య నాటకంగా మలిచారు. ఆ నవలపై సిద్ధాంత వ్యాసాలూ వచ్చాయి.

పాకుడు రాళ్ళుతో సహా మీరు చేసిన రచనల్లో వాస్తవమెంత? కల్పన ఎంత
రచన అంటేనే అందులో కల్పన, వాస్తవం కలగలిసి ఉంటాయి. వాస్తవానికి, కొంత కల్పన జోడిస్తాం. అలాగే, కల్పన ప్రాతిపదికగా వాస్తవం ఉంటుంది. దాన్ని ఒకే ఒక్క దృక్కోణంతో చూడడం సాధ్యం కాదు. 

ఆ నవలను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది?
ఇవాళ్టికీ ఆ నవలలోని ఏ పేజీ చూసినా, అందులోని పాత్రకు నాకు ప్రేరణగా నిలిచిన నిజజీవిత నటీనటులు, వారి స్వభావాలు, ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే, ఆ వ్యక్తుల పేర్లు నేను చెప్పడం బాగుండదు. 

ఆ నవల అంతటి ఆదరణ పొందడానికి కారణం ఏమిటంటారు?
మనం చెబుతున్నది నిజమైనప్పుడు... నిజాన్ని నిజంగా చెబుతున్నప్పుడు... అవతలి వాళ్ళను నొప్పించ కుండానే నిజాయతీగా చెబుతున్నప్పుడు... ఏ రచనకైనా ఎంతో పేరు వస్తుంది. అది అందరి ఆదరణా పొందుతుంది. 'పాకుడు రాళ్ళు'లో ఉన్నవన్నీ నిజాలు... నిజాయతీగా చెప్పిన నిజాలు. ఇప్పటికే ఆ నవల మూడు, నాలుగు సార్లకు పైగా ముద్రణకు నోచుకోవడమే అందుకు నిదర్శనం.

'పాకుడురాళ్ళు' నవలలోని మంజరి పాత్రకూ, మహానటి సావిత్రి జీవితానికీ చాలా పోలికలు ఉన్నాయనీ, అందులోని కొన్ని ఘట్టాలు ఆమె జీవితంలో జరిగినవేననీ సాహితీలోకంలో ఓ మాట ప్రచారంలో ఉంది. దానికి మీరేమంటారు?
ఆ మాట చాలా వరకు నిజమే! నటి సావిత్రి తరచుగా మా ఇంటికి వస్తుండేది. నన్ను 'బావ' అనీ, మా ఆవిడను 'పిన్ని' అనీ పిలిచేది. 'అవేమి వరసలే! నన్ను బావ అని పిలిస్తే, మా ఆవిడను అక్కా అని పిలువు! ఆమెను పిన్ని అని పిలిస్తే, నన్ను బాబాయ్ అని పిలువు' అన్నాను. అందుకు, సావిత్రి సరదాగా 'సినిమా వాళ్ళకు వరసలేమిటి బావా!' అని నవ్వేసింది. 

సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రతిభా వంతంగా బొమ్మ కట్టించారు. ఆ వ్యక్తుల పేర్లు బయటకు వస్తే...
సినీ జగత్తు ఓ చిత్రమైన ప్రపంచం. అక్కడ తండ్రీ కొడుకులిద్దరితో దోస్తీ కట్టిన నటీమణులతో సహా చాలా మంది, చాలా వ్యవహారాలు నాకు తెలుసు. నా డైరీల్లో నా అనుభవాలన్నీ రాసుకున్నాను. అవన్నీ పేర్లతో సహా బయటకు రావాలంటే, నేను చనిపోయాక, నా డైరీలు బయటపెట్టాలి. 'పాకుడు రాళ్ళ' లాంటి సినీ రంగంతో సన్నిహితంగా ఉంటూ కూడా జారకుండా జాగ్రత్త పడినవాళ్ళలో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, నేను - ఇలా కొంతమంది ఉన్నాం. 
మీ రచనల ఆధారంగా సినిమాలు రాలేదా...?
నేనూ ఒకటీ అరా సినిమాలకు పనిచేశాను. వాటి పేర్లు ఇప్పుడు వద్దులెండి. ప్రముఖ నిర్మాత, సహజకవి ఎం.ఎస్. రెడ్డి గారు 'కరి మింగిన వెలగపండు' అనే నా కథ ఆధారంగా 'ఓ ప్రేమ కథ' అనే సినిమా తీశారు.

మీరు వందల సంఖ్యలో కథలు, పదుల సంఖ్యలో నవలలు, నాటకాలు, వ్యాసాలు, పిల్లల కథలు రాశారు. మీ రచనల్లో మీకు బాగా నచ్చినదంటే ఏం చెబుతారు?
మీ కన్నబిడ్డల్లో ఏ బిడ్డ ఇష్టమంటే ఏం చెబుతాం? అయితే, నా రచనల్లో నాకు బాగా నచ్చింది - 'జీవన సమరం'. సమాజంలోని వివిధ జీవన రంగాల్లోని సామాన్య వ్యక్తులను స్వయంగా కలసి, ఇంటర్వ్యూలు రికార్డు చేసి, వారి మాటలో, వారి యాసలో రాసిన వాక్చిత్రాలు అవి. అందులో కత్తులు సానబట్టేవాడు, చెవిలో గుబిలి తీసేవాడు, సోది చెప్పే అమ్మి, చిలక జోస్యగాడు... ఇలా సమస్త శ్రామిక జీవుల జీవితాలు, వారి జీవన గమనాలు వారి మాటల్లోనే అక్షరబద్ధం చేశాను. 'ఈనాడు' దినపత్రిక అధినేత రామోజీరావు ప్రోద్బలంతో, దాదాపు 50 - 60 వారాలు ఆ సిరీస్‌ రాశాను. సామాన్య వ్యక్తులు బతకడం కోసం చేసిన సమరమైన 'జీవన సమరం'లో బడుగు జీవులు, మధ్యతరగతి వారు... ప్రతి ఒక్కరూ కనపడతారు. 

అయితే, మీరు జీవితంలో చేసిన పనులు, రాసిన రచనలు అన్నీ ఇలా చిత్తశుద్ధితో నమ్మి, నిజాయతీగా చేసినవేనంటారు! ఇవాళ్టి రచయితలు చిత్తశుద్ధితో రాయాలంటారు!
(సాలోచనగా...) అలా చెప్పలేను. చిత్తశుద్ధిగా నమ్మని పనులు కూడా బతకడం కోసం నేను ఎన్నో చేశాను. ఉద్యోగ రీత్యా నా యజమానులు, నా పై అధికారులు కోరినవి, చెప్పినవి కూడా రాశాను. వృత్తి రీత్యా కానివ్వండి... డబ్బు కోసం కానివ్వండి... బతకడం కోసం అనుకోండి.. నేనూ కొన్ని రాయాల్సి వచ్చింది. రచన ప్రింటులో అనుకున్నంత రాలేదని ప్రచురణకర్త చెప్పినప్పుడు, రూపాయికి పేజీ వంతున రాసిన ఘట్టాలూ ఉన్నాయి. నాకు ఇష్టం లేని పనులు కూడా ఇష్టమున్నట్లు నటిస్తూ చేయడం కూడా అప్పుడప్పుడు తప్పలేదు. కాబట్టి, కాబట్టి, ఆ మాట చెప్పే హక్కు నాకు లేదు. 

వాస్తవ జీవితంలోని ఘటనలతోనే కాక, సైన్స్‌ ఫిక్షన్‌ లాంటివీ చేసినట్లున్నారు!
అంతరిక్ష ప్రయాణం ఇంకా తెలియని రోజుల్లో 1950 - '52 ప్రాంతంలో 'చిత్ర గ్రహం' అంటూ స్పేస్‌ ట్రావెల్‌ మీద 'ఆంధ్రప్రభ'లో సీరియల్‌గా రాశాను. అలాగే, 'జయప్రళయం' అంటూ మరో పాపులర్‌ సైన్స్‌ రచన కూడా చేశాను. 

కథ, నవల, నాటకం, వ్యాసం, బాలసాహిత్యం, శ్రవ్య రూపకం... ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియల్లో మీకు అభినివేశం ఉంది. వీటిలో ఏ ప్రక్రియ కష్టమైనదంటారు?
నా అభిమానులు చాలా మందికి నేను రాసిన చిన్న కథలంటే చాలా ఇష్టం. అలా రాయడం చాలా కష్టమని కూడా అంటారు. కానీ, నా దృష్టిలో రేడియోకు రూపకం రాయడం ఎంతో కష్టం. చాలా క్లిష్టమైన రచనా ప్రక్రియ అది. అందులోనూ ఆకాశవాణి వారి నిబంధనలకు తగ్గట్లుగా, వారికి నచ్చేలా రాయడం మరీ కష్టం. 

ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?
(ఉద్వేగానికి గురవుతూ...) కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ - ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగర రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా...) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ... నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక! 

- ఇంటర్వ్యూ : రెంటాల జయదేవ

(రావూరికి జ్ఞానపీఠ్ ప్రకటించిన వెంటనే  ప్రజాశక్తి దినపత్రిక, 18 ఏప్రిల్ 2013, శుక్రవారం సంచికలో ప్రచురితం.... 
............................................................................................

0 వ్యాఖ్యలు: