జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Saturday, December 10, 2011

నిజం చెబితే నేరమా?




‘శ్రీరామరాజ్యం’పై ఇష్టపదిలో రాసిన మూడు భాగాల సమీక్షపై వచ్చిన ప్రశంసలకు కానీ, విమర్శలకు కానీ వెంటనే స్పందించలేకపోయాను. సమీక్ష రాస్తున్న నాటికే ఉన్న పని ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు మరికొంత పెరగడంతో, తీరిక చేసుకొని తాపీగా స్పందించాలన్న ఆలోచన సఫలం కాలేదు. ఏమైనా, అందుకు ముందుగా మన్నించాలి. ఆ హడావిళ్ళ మధ్యనే ఈ నాలుగు మాటలు...


విషయానికి వస్తే, సినిమా చూశాక అందులో కనిపించిన, అనిపించిన తప్పొప్పుల గురించి మాట్లాడుకోవడం మామూలుగా ఎవరమైనా చేసే పనే. సినిమా గురించి సమీక్షిస్తున్నప్పుడు ఎవరైనా సరే తప్పనిసరిగా చేయాల్సిన పని. ఆ మధ్య తాజా ‘శ్రీరామరాజ్యం’ సినిమా గురించి ఈ ‘ఇష్టపది’ బ్లాగులో అదే చేశాను. కానీ, చిత్రంగా ఈ విషయానికి చాలా మందికి కోపాలు వచ్చాయి. కొందరేమో నన్ను, నా సమీక్షనూ దుమ్మెత్తి పోశారు. ఆవేశంతో ఊగిపోయిన వీరవరులేమో ఏకంగా వ్యక్తిగత జీవితాలపై విమర్శలకూ దిగారు. శ్రీరామరాజ్యం దర్శక, రచయితలకూ, హీరోకూ అపారంగా ఉన్న భక్త జనగణం ఎనానిమస్ గా ప్రచురణార్హం కాని వ్యాఖ్యలూ చేశారు.

సినిమా బాగోగుల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పచ్చు. అందులో అందరి అభిప్రాయాలూ, అన్ని అభిప్రాయాలూ ఒకటేలా ఉండాలన్న రూలూ ఏమీ లేదు. ఏకీభవించడానికి ఎంత అవకాశం ఉందో, అవతలివారి అభిప్రాయంతో గౌరవపూర్వకంగానే విభేదించడానికీ అంతే స్వేచ్ఛ ఉంది. కానీ, విభేదించినంత మాత్రాన దూషణలు, దోషారోపణలు చేయడమన్నది వారి వారి సంస్కారానికి సంబంధించిన విషయం.

ఎప్పుడైనా సరే వ్యక్తిగతంగా ఆ చిత్రం మీద కానీ, ఆ చిత్రానికి పని చేసిన వారి మీద కానీ రాగద్వేషాలు లేకుండా సినిమాను సమీక్షించడం శాస్త్రీయమైన, సమర్థనీయమైన పద్దతి. అది ఎంత చక్కగా చేస్తే, అంత నిష్పాక్షికంగా సమీక్ష ఉంటుందనేది విజ్ఞులకు చెప్పనక్కరలేదు. శ్రీరామరాజ్యంపై ఈ సమీక్షకుడు ఇష్టపదిలో చేసిందీ అదే. పైగా, మన తెలుగు జాతికి కల్ట్ ఫిగర్లయిన బాపు - రమణలంటే గౌరవం, వారి సృజనాత్మక కృషి పట్ల అభిమానం, వారి స్నేహ సౌశీల్యాలతో సన్నిహిత పరిచయం ఉన్నా, వీలైనంత వరకు అవేవీ అవరోధం కాకుండా, శ్రీరామరాజ్యం సినిమాను సమీక్షించాలని ప్రయత్నించడం జరిగింది.

కానీ, ఫలానా వారి సినిమా కాబట్టి, ఫలానా తరహా (పౌరాణికం, జానపదం, వగైరా వగైరా) సినిమా కాబట్టి, ఫలానా కథాంశం మీద కాబట్టి ఎలా ఉన్నా సరే బాగుందనే అనాలంటే, ఇక దానిలో చర్చ లేదు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలోని లోటుపాట్ల గురించి చేదు నిజాలు చెబితే, ఆ లోటుపాట్ల మీద మాట్లాడకుండా, నాకు నచ్చింది కాబట్టి, నచ్చలేదనడానికి నువ్వెవడివి అంటూ ఒళ్ళంతా కారం పూసుకొంటే చెప్పగలిగిందేమీ లేదు. తేటతెలుగులో తిట్టినా, తిట్టుకున్నా లాభం లేదు.


పాత్ర చిత్రణలోనైనా, చిత్రీకరణలోనైనా, సాంకేతికంగానైనా లోటుపాట్ల గురించి చర్చించుకొంటే, సినిమా మీద అవగాహన పెంచుకోవడానికి తోడ్పడుతుంది. అలా కాకుండా రాజుగారి దేవతా వస్త్రాల కథలో లాగా డూడూ బసవన్నలా ఉందామంటే.... ఏ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అందామంటే.... పుంజాలు తెంపుకొని ఏ దర్శకుడికి, ఆ దర్శకుడికి, ఏ హీరోకు ఆ హీరోకు భట్రాజుల్లా వ్యవహరిద్దామంటే.... దానికి మళ్ళీ బ్లాగులెందుకు? ఇప్పటికే ఉన్న కొన్ని భజన పత్రికలు, చానళ్ళు చాలవా?


ఉన్నది ఉన్నట్లు చెప్పాలనే తప్ప, ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించాలన్నది నా ఉద్దేశం కాదు --- అది సమీక్షలు రాయడంలోనైనా..! పోస్టు వేయడంలోనైనా..! వ్యాఖ్యలు, ప్రశంసలు, విమర్శలు రాసినవాళ్ళకీ, రాళ్ళు విసిరిన వారికీ - అందరికీ కృతజ్ఞతలు.

12 వ్యాఖ్యలు:

Anonymous said...

భలే. అసలు ఇంతకీ చేజారిన మహదవకాశం అంటే ఎవరికి చేజారింది? మీకా? (అంటే మీరు నేనే గనక తీస్తే అన్నంతగా విమర్శ చేస్తుంటే ఆ అనుమానం వచ్చింది). కాదూ దర్శక, నిర్మాతల చేజారిన మహదవకాశం అంటారా, అది వాళ్ళకి ఎలాంటి అవకాశమో మీరా చెప్పేది? 30 కోట్లు సొమ్ము పెట్టినాయన, 80 ఏళ్ళ వయస్సులో డబ్బుని మించి ఇష్టంతో తీసేవాళ్ళు మీకు ఆషామాషీగా తీస్తున్నట్లనిపించటం దారుణం. విమర్శకులు ఎదుటివాళ్ళ అవకాశాల గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే, అది మీరు ఊహించి రాసే విషయం కాదు. ఇక మీ విమర్శ క్వాలిటీ గురించి ఆయనెవరో నాగమురళి చక్కగా ఇడ్లీ,ఉప్మా ఉపమానంతో తేల్చేసాడు. దానికి కాస్త వివరణిచ్చుంటే బాగుండేది.

xyz said...

ఇది బాగోలేదు .. అది బాగోలేదు .. ఇది నచ్చలేదు .. అది నచ్చలేదు .. ఇది అలా వుంటే బాగుండేది .. అది ఇలా వుంటే బాగుండేది .. అని పేరాలు పేరాలు వ్రాయడం వలన ఉపయోగం ఏమిటి sir?

rangaraju said...

శ్రీ రామరాజ్యానికి వేసిన సెట్లు గుడ్డ మీద బొమ్మల్లా నాసి రకంగా ఉన్నాయా? మీరు లవకుశలో సెట్టింగ్స్ చూశారా? అందులో రాముడికి పులిమిన గ్రీన్ కలర్‌చూశారా?

సూర్యభగవానుడి విగ్రహంలో మెల్లకన్ను ఉందా? దాన్ని చూసి జనం హాహాకారాలు చేశారా?

సీతను తీసుకెళ్తున్న లక్ష్మణుడు కురుసభకు ద్రౌపదిని తీసుకెళ్తున్న దుశ్శాసనుడిలా ఉన్నాడా? దుశ్శాస్శనుడు రోదిస్తూ ద్రౌపదిని కురుసభకు తీసుకెళ్తాడా మీ ప్రకారం ? అసలు మీకు పురాణాల పట్ల కనీస అవగాహన ఉందా?

భూదేవి లోకమాత. ఆమె కొంచెం వోళ్ళు చేసినట్లుంటే తప్పేమిటి? ఆమె అలా ఉండకుండా కాలేజ్‌కెళ్ళే టీనేజ్ అమ్మాయిలా మల్లేతీగలా ఉండాలా? పాత్రలో రోజాని కాకుండా స్లింగా ఉన్న ఏ సుందరాంగినో పెట్టమంటారా? అయీనా పాత్రధారుల పృష్టబాగాలను,ఉదర భాగాలను గమనించకుండా సినిమాను సమీక్షే అలవాటు మీకు లేదా?

శ్రీరాముడంటే రామారావులా సీతాదేవి అడవులకు వెళ్ళిపోతున్నా గంభీరంగా ఉండాలా? శ్రీరాముడి కళ్ళు ఎర్రగా ఉంటే అది క్రోధావేశమేనా? సీత వెళ్ళిపోతున్నదన్న దుఃఖంతో నిద్ర కరువై కళ్ళు ఎర్రబడే అవకాశం లేదా? అలా చూపితే మీకొచ్చిన నష్టం ఏమిటి?

సినిమా కలెక్షన్ల గురుంచి మీరేం బెంగపెట్టుకోకండి. డల్ సీజన్‌లో వచ్చినా ఖచ్చితంగా అన్నమయ్య శ్రీరామదాసు చిత్రాల కంటే ఎక్కువగానే చేస్తుంది.అన్నమయ్య శ్రీరామదాసులకు ఇలా వంకలు పెట్టడం మొదలు పెడితే పేజీలకు పేజీలు రాయొచ్చు.


ఇవన్నీ కాదు కానీ ఒక మాట చెప్పండి..మీ తదుపరి సమీక్ష బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్న అధినాయకుడు చిత్రానికేనా? ఆ సినిమా సమీక్ష కోసం ఇప్పటి నుంచే వ్యాసాలు సిద్ధం చేసారా?

Anonymous said...

నేనప్పుడే చెప్పాను - వీర బాపు భక్తులు నాలుగు రాళ్లేయడానికి వస్తారు కాచుకోమని . చెబితే విన్నారా ?! ఈకాలం లో ఎవడికి వాడే 'రాజు '. వాళ్లకి నచ్చింది కాబట్టి మనకూ నచ్చితీరాల్సిందే . అయినా ,మీరు రాసిన బ్లాగు నచ్చని వాళ్లు మిమ్మల్ని ఇప్పుడు నానా మాటలంటూన్నట్టే , మీకు నచ్చని సినిమా గురించి మీరు కూడా నాలుగు మాటలు మీ బ్లాగు లో రాసుకున్నారు. వాళ్లెవరో బాపు , బాలకృష్ణల వందిమాగధ గణమేమో వాళ్లకి నచ్చని విమర్శ చేసినందుకు , మిమ్మల్ని వ్యంగ్యంగా ఏమైనా అనవచ్చును . మీరేమో మీకు నచ్చని సినిమా గురించి ఏమీ రాయకూడదు - రాస్తే నడివీధిలో కొరత వేసినా వేయగలరు వీళ్లకే కనక అంతటి స్వేచ్చ ఉండి ఉంటే . భేష్ ! భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యమా నూరేళ్లు వర్థిల్లు !!!అవునయ్యా మాకు నచ్చనిది మేము చెప్పాము - మధ్యలో మీకేంటి ? మీకు నచ్చితే వెళ్లి చూడండి , ఇంకో పది మందికి చెప్పి చూపించండి , మేమేం కాదనలేదే? అలా అనము కూడా . అంతే కానీ ఎక్కడెక్కడ నచ్చలేదో సవివరంగా చెప్పినందుకు ఇలా విమరిస్తారా?!
ఒక ఉదాహరణ ఇస్తాను . ఈ ఇష్టపది సమీక్ష నాకు బాగా నచ్చింది . ఆ పైనున్న రంగరాజు గారికి నచ్చక విమర్శించారు . నచ్చిన నేను , నా మానాన నేను ఈ పోస్టు చదువుకుంటాను , లేదంటే ఇంకో పదిమందికి చెప్పి వారూ చదివేలా చేస్తాను . అంతేకానీ , ఈ సమీక్ష నచ్చలేదు అని చెప్పిన పాపానికి ఆ పైనున్న రంగరాజు గారి మీద ఒంటికాలుతో లేచి , ఆయన మీద వ్యక్తిగతంగా దాడి చేస్తే ఆయనకెలా ఉంటుంది ? ఇదీ అంతే కదా - అక్కడ శ్రీరామరాజ్యం , నచ్చిన రంగరాజు గారు , నచ్చని సమీక్షకుడు . ఇక్కడ ఇష్టపది రివ్యూ , నచ్చిన నేను , నచ్చని రంగరాజు గారు . పాత్రలే తేడా . ఈ మాత్రం ఎందుకు అర్థం చేసుకోరు ?
ఇప్పుడు నేను మిమ్మల్ని సమర్థించినందుకు గానూ , నా మీదా నాలుగు రాళ్లు పడుతాయి చూడండి . సరే నేను సిద్ధమే !!!

గీతిక బి said...

మీ సమీక్షని నేను సమర్థిస్తాను. శ్రీరామరాజ్యంలో ఎన్నో లోపాలు, పొరపాట్లు ఉన్నాయి. కథలో చేసిన మార్పులూ వేలెత్తి చూపాల్సినవే.

కానీ... ఈ రోజుల్లో...
ఇప్పుడు వస్తున్న సినిమా పరిజ్ఞానం తప్ప పురాణాలు పూర్తిగా తెలీని పిల్లలకి (ఇప్పటి పిల్లలకి సినిమాలమీద ఉన్న నాలెడ్జ్.. పౌరాణిక కథలమీద లేదన్నది నా నమ్మకం, అనుభవం కూడా) పురాణాల్ని పరిచయం చెయ్యాలంటే వాళ్ళవైపు నుంచీ ఆలోచించాలి. వాళ్ళని మెప్పించగలిగేలా తియ్యాలి. అప్పుడే మన విలువైన పురాణ సంపదని వాళ్ళద్వారా తరతరాలకి అందించిన వాళ్ళమవుతాం.

ఆ ప్రయత్నంలో బాపు, రమణలు విజయం సాధించారనడంలో సందేహం లేదు.

ప్రయత్నమే చెయ్యకపోవడం కంటే "తడబడినా.. ప్రయత్నపు అడుగు" గొప్పదే కదా.

ఒకదానితో రెండోదాన్ని పోల్చి చూడ్డంవల్ల రెండోదానిలోని అందాన్ని సంపూర్ణంగా చూడలేం. గులాబి బావుంటుందా.. మల్లె బావుంటుందా.. అంటే ఏం చెప్పగలం...? దేని అందం దానిదే. పిసరంతే ఉందని మల్లెని చిన్నబుచ్చితే.. మరి దాని పరిమళాన్ని లెక్కలోకి తీసుకోనట్టేగా.

పోలిక పెట్టలేకుండా ఉండాల్సొచ్చినప్పుడు పోల్చాల్సింది అప్పటి, ఇప్పటి సినిమాలనే కాదు... అప్పటి, ఇప్పటి మనిషిలోని ఆలోచన, అవగాహనాస్థితుల్ని కూడా. అప్పటి తరానికి లవకుశ ఆణిముత్యమే. ఆనాటి మనుషుల సంస్కృతి, అలవాట్లు, భాష... అవేవీ ఇప్పుడు లేవు కదా. మరి ఇప్పటి శ్రీరామరాజ్యాన్ని ఆనాటి కళ్ళతోనే చూస్తామనడం ఏం న్యాయం...?

మనం_ మన గొప్పసంపదైన "ప్రాచీనగాథలు" తరతరాలకీ నిలబడాలి అనుకుంటాం. నిలపాలని చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం విమర్శిస్తాం...!!!

ఇది_ నేను బాపూనో, బాలకృష్ణనో సమర్థించడం కాదు. [వాళ్ళ 'టాలెంటది' అనే తప్ప నాకు వాళ్ళ గీతలమీదో, చేతలమీదో (బొమ్మలమీదో ,నటనమీదో) అభిమానమూ లేదు] మంచి పౌరాణికపు చినుకూ కరువైన సినీఎడారిలో కురిసిన తొలకరి అనేమో శ్రీరామరాజ్యమంటే అభిమానం, అనురాగం నాకు.

Anonymous said...

డి ఆర్, మీరు ఎవరు? మీరు ఈయనకు రాయ్యొద్దని ఎప్పుడు చెప్పారో మాకు తెలియదు. మీకొక తెలియని విషయమేమిటంటే నేను బాపు గారి భక్తుడిని కాను, నా అభిమాన దర్శకుడు మహేష్ భట్ట్, నటుడు ఇమ్రాన్ హష్మి,నచ్చిన సినేమాలు మడ్డర్1-2, జిస్మ్, జన్నత్, వన్స్ అపాన్ ఏ టైం ముంబై,దోభి ఘాట్,డర్టి పిక్చర్ ,షైతాన్ మొద||. ఆయన నటించిన సినేమాలలో దిల్ తో బచ్చాహై జి లో తల్లితో సంసారం చేస్తూ, కూతురిని పెళ్ళి చేసుకోవటానికి సాగించిన ప్రేమ వ్యవహారం బాగా నచ్చింది. కాకపోతే ఈ సినేమా ఇప్పుడు చూసే సినేమాల కథలకి రోటీన్ కి భిన్నంగా,వేరైటిగా అనిపించింది కనుక దానిని గురించి పాసిటివ్ గా వాదించాను. బాలకృష్ణకి, వారి తండ్రి కి కూడా అభిమానిని కాను.అలాగే రాముడి మీద ప్రత్యేకమైన అభిమానం లేదు.

Anonymous said...

అయ్యా RAMA గారూ ,

నేనేమీ మీగురించి చెప్పకపోయినా , పల్లెత్తి మీ ప్రస్తావన తేకపోయినా ఎందుకో గానీ , మీకు మీరే వివరాలన్నీ చెప్పుకుంటున్నారు . మిమ్మల్ని నేనేమీ అనలేదే . అసలు నాకు మీ గురించి ఎలా తెలుస్తుంది - మీకు తెలియని విషయమంటూ మొదలు పెట్టి , మీ అభిమాన తారాగణం , దర్శకుడూ , చిత్రాలు ఇత్యాది వివరాలన్నీ మీ సన్నిహిత మిత్రులకైతే తెలుస్తుందేమో , నాకు నిజంగానే కాదు.

ఇంకోటి. నేను చెప్పని మరో విషయాన్ని నాకు ఆపాదిస్తూన్నారు // మీరు ఈయనకు రాయ్యొద్దని ఎప్పుడు చెప్పారో మాకు తెలియదు. // అంటూ . అసలు నేను యీయనకు రాయొద్దు అని చెప్పడమేంటీ ? నా వ్యాఖ్య సరిగానే ఉందే . గిట్టని వాళ్లు వచ్చి నాలుగు రాళ్లు వేస్తారు , కాచుకోండి అన్నాను ( చేజారిన మహదవకాశం లో 6 వ వ్యాఖ్య.) ఈరోజు దాన్నే గుర్తు చేస్తే కొత్తగా రాయొద్దు అన్నానంటూ ఏమేమో చెబుతారేంటీ ?!!

నేనూ అదే చెబుతూన్నాను - ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చి తీరాలని రూలేం లేదు కదా , ఇక్కడేం ఆటవిక రాజ్యం నడవడం లేదు కదా , తనకంటూ ఒక బ్లాగు ఉంది కనుక , అందులో తనకి నచ్చిన అభిప్రాయాల్ని రాసుకునే స్వేచ్ఛ ఉంది కనుక , నాలుగు మాటలు రాశారు . ఆ రివ్యూ నచ్చిన వాళ్లు చదువుతారు , లైక్ మైండెడ్ ఫెలోస్ తో ఆ వ్యాసాన్ని పంచుకుంటారు . లేనివాళ్లు చదవరు. అంతమాత్రానికి పర్సనల్ గా ఒక రచయితని దూషించే కుసంస్కారం ఈరోజుల్లో ఎక్కువయ్యింది.
ఆపై ఉదాహరణలో నేను చెప్పింది అదే . మీరు అవునన్నా కాదన్నా , శ్రీరామరాజ్యం ను నచ్చని / ,మెచ్చని ఒక ప్రేక్షక వర్గం ఉంది . వాళ్లకి బాపు / రమణ లంటే గౌరవమూ , ఇష్టమూ కూడా ఉన్నాయి . బాలయ్య మీద వ్యక్తిగత ద్వేషాలేమీ వాళ్లకి లేవు . అయితే ఈ సినిమా వరకూ వాళ్లకి నచ్చలేదు . ఎక్కడెక్కడ ఎందుకు నచ్చలేదో వివరాలిచ్చారు .
సంస్కృతి , సంప్రదాయాల మీద భక్తి ప్రపత్తులున్నంత మాత్రాన శ్రీరామ రాజ్యాన్ని మెచ్చుకుని తీరాలనేం లేదు కదా , ఇంకోటి , శ్రీరామ రాజ్యం బాలేదంటే వెంటనే అన్నమయ్య రామదాసు ల పోలిక తెచ్చి అవైతే మీకు నచ్చుతాయిలే అని ఎగతాళి చేయడం. శ్రీరామరాజ్యం బాలేదంటే , ఆ రెండు సినిమాలు ఇంకెలా నచ్చుతాయో అర్థం కాని లాజిక్ . అర్థం లేని లాజిక్ కూడా .
ఇంత విమర్శించినా , ఒక్కరిని మాత్రం ఏమనలేము. ఎంతో కమిట్మెంట్ తో కోట్లు ఖర్చు పెట్టి సినిమా ని విలువలకు కట్టుబడి నిర్మించిన నిర్మాత ధన్యుడు .

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

అయ్యా dr గారు

బ్లాగులో అభిప్రాయాలు రాసుకొనే స్వాతంత్ర్యం లేదా అంటూ వ్రాశారు.వాక్‌ స్వాతంత్ర్యం దేశ స్వాతంత్ర్యం లాంటి పెద్ద మాటలు దేనికి లేండి
సింపుల్‌గా చెబుతాను. నిక్షేపంగా వ్రాసుకోవచ్చు.మీరు చెప్పినట్లుగానే ఆయన వ్రాసింది అందరికీ నచ్చాలనే రూలు లేదు.అటువంటప్పుడు మీరనే రాళ్ళదెబ్బలు కూడా తప్పవు.తోచిందంతా వ్రాసేసి ఏమీ అనొద్దంటే ఎలా? ఆయన రాతలని ఎవరూ విమర్శించకూడదంటే వ్యాఖ్యలు వ్రాసే సదుపాయం తీసేయాల్సింది.అప్పుడు ఏ గొడవా ఉండేది కాదు. శ్రీ రామరాజ్యం సినిమాలో లోపాలున్నాయని ఆయన విశ్వసించినట్లే ఈ సమీక్షలో కూడా చాలా వరకు అర్థంపర్థం విమర్శలున్నాయనే నా అభిమతం.


లక్ష్మణుడు సీతను తీసుకువెళ్తూంటే కురుసభకు ద్రౌపదిని తీసుకెళ్తున్న దుశ్శాసనుడిలా ఉన్నాడని ఆయన వ్రాశారు. దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టు పట్టి సభా మధ్యంలోకి తీసుకెళ్ళాడు. ఇందులో శ్రీకాంత్ నటన అలాగే ఉందంటే అంతకంటే ఘోరం మరొకటుండదు. ఇది అర్థవంతమైన విమర్శ అంటే విమర్శనే పదానికి కొత్త పదాలు వెతుక్కోవాలి. సూర్యభగవానుడి కన్ను సక్రమంగా ఉందా, సినిమాలో నెమలి రియలా గ్రాఫిక్సా, నాగేశ్వరరావు మెల్లకన్నుతో నటించాడా అని సినిమాని చూడ్డానికి వెళ్తే రసభంగం కాక రసస్పందన కలుగుతుందా? ఇలా వెతికితే లవకుశలో నేను బొచ్చెడు చెప్పగలను.ఇక కథలో మార్పుల గురుంచైతే మొదట వాల్మీకి వ్రాసిన ఉత్తర రామాయణం చదివి తర్వాత లవకుశ చూడండి.ఇంతెందుకు జనమంతా మెచ్చిన మాయాబాజార్ పెద్ద కల్పిత గాథ కాదా ?

ఇక శ్రీరామరాజ్యం అన్నమయ్య,శ్రీ రామదాసుల మధ్య పోలిక ఖచ్చితంగా అర్థవంతమైనదే. బుడబుక్కలోళ్ళు వేసుకొనే వేషాలు వేసి, చీపు గ్రాఫిక్స్ చవకబారు హాస్యంతో నాభికేంద్రుడు తీసిన ఆణిముత్యాలు నచ్చి ఈ చిత్రం నచ్చలేదంటే ఖచ్చితంగా ప్రేక్షకుడి ఆభిరుచిని శంకించాల్సిందే.మొదట నేను వేసిన ప్రశ్నలకు ఆయన్ని సమాధనమివ్వమండి. ఆ తర్వాత నా మీద పది కాళ్ళతో పైకి లేచినా నేను కాచుకోగలను.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

బ్లాగరులో సాంకేతిక సమస్యల కారణంగా నేను సంధించించాలనుకున్న ప్రశ్నలు పోస్టు చెయ్యలేపోయాను.కాపీ పేస్టు చేస్తున్నప్పుడు వెనుక రావల్సిన కామెంటు ముందుపడిపోయింది.ముందు రావల్సిన కామెంటు ఇదీ.


సమీక్షకుడి గారికి నా ప్రశ్నలు ఇవీ.

మీకు అన్నమయ్య,శ్రీరామదాసు చిత్రాలు నచ్చయా ?

ఈ మధ్యకాలంలో తెలుగులో రిలీజై మీకు పరిపూర్ణంగా నచ్చిన సినిమా ఏమిటి? (ఏ సినిమా అయినా మీకు నచ్చదనే నా విశ్వాసం.మెల్లకన్ను,వాల్మీకిలో కండల పటుత్వం,సెటింగ్‌లో లోపాలు వెతుక్కుంటుంటే సినిమా ఏం చూస్తారు? ఏం అర్థమవుతుంది ?)

Unknown said...

ఆయ్యా జయదెవ్ గారు

ఈ విమర్సలు సర్వ సాధారణం. మీరు రాసినా రాయకపొయినా శ్రీ రామరాజ్యం చాలా పెలవంగా తీసిన సినిమా అని అందరికి తెలిసిన విషయమె. కాకపొతె పౌరాణిక సినిమా యెలా ఉండాలి, పాత్రధారులు యెలా ఉండలి అన్న విషయంలొ నెటి ప్రెక్షకులకు యె మాత్రం అవగాహన లెదు అనటానికి మీ బ్లాగ్ లొ వచ్చిన విమర్సల వల్ల అర్థం అవుతొంది.

ఒక్కసారి వీళ్లు శ్రీ వెంకటెశ్వర మాహత్మ్యం కాని భక్త ప్రహ్లద కాని చూస్తె అప్పుడు మీరు యెందుకు ఈ సమీక్ష ఎల రాసారు అనెది అర్థం అవుతుంది. సినిమా తీయడం నటులని మెప్పించడానికి కాదు, ప్రెక్షకులని మెప్పించడానికి. ఆ ప్రెక్షకుల్లొ హీరొ అనుంగు అనుచరులు కూడ ఉంటారు. వారికి మీ నిజం చాలా చెదుగా, మింగుడు పడకుండా ఉండచ్చ్హు.

యెది యెమైన మీ సమీక్ష సూపర్. శ్రీ రామరాజ్యం ఒక బ్లూపర్. ఫాన్స్ డొంట్ మాటెర్.

రవి said...

నేను శ్రీరామరాజ్యం చూడలేదు కానీ ఈ సినిమా మీద వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. బాపు తీశాడని, రామాయణ కథ అని కితాబులు పక్కనబెడితే ఈ సినిమాకన్నా గమ్యం, గ్రహణం, వేదం సినిమాలు - సినిమాకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ (కథతో సహా) మెఱుగేమో అని నా అంచనా. ఆ సినిమాల్లో చూపిన కథ కూడా మానవీయమైనది, మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రతిబింబించేవీ, కరుణరసాత్మకమైనవీనూ. ఆ సినిమాలకు రాని గుర్తింపు, లేని సమర్థన ఈ సినిమాకు రావడం గమనార్హం. తెలుగు సినిమాలు మంచివి లేనే లేవనే వారు ఈ సినిమాలు చూశారో లేదో మరి!

జయదేవ గారు ఈ సినిమాను ఒక సినిమాలా చూసి సమీక్షించారు. అందులో తప్పేముందో తెలియట్లేదు.

rentala ramachandra said...

The following matter given in your review is more than sufficient and there is no necessity of giving any further explanation to any one--""ఈ సినిమాకు సంబంధించి మారు మాట్లాడకుండా మెచ్చుకోవాల్సింది మాత్రం - నిర్మాతనే. లాభనష్టాల ధ్యాస లేకుండా, ఈ కథను ఈ తరం వారికి అందించాలన్న ఆయన కృత నిశ్చయానికి జోహార్లు. అందుకోసం ఆయన సర్వశక్తులూ కేంద్రీకరించి చేసిన వ్యయం సినిమాలో అడుగడుగునా కనిపిస్తుంది. ఈ పౌరాణిక చిత్రం ఈ రోజుల్లో ప్రతి ఫ్రేములో ఇంత రిచ్ గా కనబడడానికి ఆయనే కారణం. యూనిట్ ను నమ్మి ఆయన పెట్టిన ప్రతి పైసానూ తెర మీద కళకళలాడే దృశ్యాల్లో చూడవచ్చు. కరెన్సీ కట్టల కోసమే సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఇప్పటి తరం కోసం, ఇలాంటి చిత్రం తీయాలనే ఈ రకం నిర్మాత ఉండడమే పెద్ద విచిత్రం, విశేషం. తమ ఊళ్ళోని ఆలయంలో వెలసిన శ్రీరామచంద్రుణ్ణి నమ్ముకొని ఆయన ఇంత సాహసం చేశారు. ఆ భక్తి శ్రద్ధలూ, నిజాయితీలే ఆయనకూ, ఈ సినిమాకూ శ్రీరామరక్ష. ఆయన కోసమైతే ఈ సినిమా అందరం తప్పనిసరిగా చూడాల్సిందే. ఉత్తర రామాయణ గాథను బాపు - రమణల బాణీలో ఈ తరం పిల్లలకూ చూపాల్సిందే.
""