- అలరించిన కమల హాసన్, రజనీకాంత్‌ల ప్రసంగాలు
తమిళ సినిమా వేడుకల సందర్భంగా చెన్నై వేదికపై శనివారం సాయంత్రం కమలహాసన్, రజనీకాంత్‌లు చేసిన ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. అయిదో ఏటనే సినీ రంగంలోకి వచ్చి, ఇప్పటికి దాదాపుగా 55 ఏళ్ళుగా సినీ కళామతల్లికి సేవ చేస్తున్న కమలహాసన్‌ను దర్శకుడు కె.ఎస్. రవి కుమార్ ప్రత్యేకంగా పరిచయం చేశారు. కమల్ సినీ జీవిత ప్రస్థానాన్ని చూపెడుతూ, దాదాపు 6 నిమిషాలు సాగిన ఆడియో-విజువల్ ప్రదర్శన సభికులను పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళింది. అప్పటి దాకా వేదిక ముందు పక్కపక్క కుర్చీల్లో కూర్చొని, కబుర్లాడుకుంటున్న రజనీకాంత్, కమల్‌హాసన్ వేదికపైకి వచ్చి, తమదైన శైలిలో ప్రసంగించారు.
రజనీకాంత్ సినీ జీవిత ప్రస్థానాన్ని దర్శకుడు పి. వాసు పరిచయం చేస్తూ, ఆయన నుంచి తాను నేర్చుకున్న జీవిత పాఠాలను తెలిపారు. తెరపై ఆడియో-విజువల్ ప్రదర్శన అనంతరం రజనీకాంత్‌ను వేదికపైకి ఆహ్వానించినప్పుడు సభాంగణమంతా లేచి నిల్చొని, హర్షధ్వానాలతో స్వాగతించింది. కేవలం 38 ఏళ్ళుగానే సినీ రంగంలో ఉన్న రజనీ, సినీ రంగంలో కమల్ తనకు అన్నయ్య లాంటివాడని చెబుతూ, ''నేను ఇంత అయ్యానంటే అది నాకు సినిమా పెట్టిన భిక్ష'' అని పేర్కొన్నారు. ''కమల్ తన కెరీర్‌లో చేసిన పాత్రలన్నీ ఇష్టపడి చేసినవి. నేను చేసినవన్నీ కష్టపడి చేసినవి'' అని రజనీకాంత్ చమత్కరించారు.
రజనీకాంత్ తన ప్రసంగంలో తాత్త్విక ధోరణిలోకి వెళ్ళి, సినిమా రంగంలోని విచిత్ర పరిస్థితులపై వ్యాఖ్యానం చేశారు. ''నన్ను ఇంత పైకి తీసుకు వచ్చినవాళ్ళంతా దర్శకులు, రచయితలే. వాళ్ళంతా నన్ను పైన కూర్చోబెట్టి, వెళ్ళిపోయారు. ఎప్పుడైన అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ ఒంటరే! సభలో పది మంది మధ్యలో ఉన్నా, వారికి అది ఒంటరితనమే! ఒక్కోసారి, దీనికా నువ్వు ఆశపడింది శివాజీరావ్! అని నాకే అనిపిస్తూ ఉంటుంది'' అని అన్నారు. 'మాయాబజార్', 'గుండమ్మ కథ' చిత్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన రజనీకాంత్ ఇంత సాంకేతికత పెరిగినా, అలాంటి కళాఖండాలు ఇప్పుడు తీయలేకపోతున్నామన్నారు. 'చంద్రలేఖ', 'అవ్వయ్యార్' లాంటి తమిళ కళాఖండాలు తీసిన జెమినీ ఎస్.ఎస్. వాసన్, ఇవాళ్టి కమలహాసన్ లాంటి కొందరు చూపిన బాటలో సినిమా రంగం నడవాలని అన్నారు.
''సినిమా ప్రపంచం విచిత్రమైనది. ఇది ఓ మాయా బజార్! సినిమాల్లో జయించిన చాలామంది జీవితంలో ఓడిపోయారు. జీవితంలో ఓడిపోయిన చాలా మంది సినిమాల్లో గెలిచారు. ఏమైనా, దీన్ని జీవనోపాధిగా తీసుకున్నవారు పక్కదోవ పట్టకుండా ముందు తమ కెరీర్‌ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తరువాత మిగతా వాటి మీద దృష్టి పెట్టాలి!'' అని రజనీకాంత్ తాత్త్విక ధోరణిలో సూచన చేశారు.
కమల్ మాట్లాడుతూ, ''వేదిక ముందు కూర్చొని, మేము కలసి పనిచేసిన ఆ పాత చిత్రాల కబుర్లు గుర్తు చేసుకుంటున్నాం. నేను ఈ స్థాయికి రావడానికి నన్ను తీర్చిదిద్దిన గురువులు శివాజీ గణేశన్, దర్శకుడు కె. బాలచందర్‌లకు నమస్కారాలు. ఇంత పేరు ప్రతిష్ఠలు వస్తాయని కెరీర్ తొలి రోజుల్లో ఊహించనైనా ఊహించలేదు. కెరీర్‌లో నేను ఓడిపోతే ఆశ్చర్య పోవాలి కానీ, గెలిస్తే ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే, నాకు విద్య నేర్పిన గురువుల గొప్పతనం అది'' అని కమల హాసన్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ వేడుకలో రజనీకాంత్, కమలహాసన్‌ల ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
- చెన్నై నుంచి 'ప్రజాశక్తి' ప్రత్యేక ప్రతినిధి రెంటాల జయదేవ
(ప్రజాశక్తి దినపత్రిక, 23 సెప్టెంబర్ 2013, సోమవారం, పేజీ నం.8లో ప్రచురితం)
.........................................
.........................................
1 వ్యాఖ్యలు:
ఎన్నాళ్ళ ..... కలో ....
- బ్యాంకాక్ లో మాత్రమే ఉండే డాన్ లు ..
- ఒక్కటే మ్యాగజైన్ తో ఇరవై - ముప్పై రౌండ్లు కాల్చడాలు
- పట్టుమని పాతిక కిలోలైనా లేపలేని హీరోలు పదుల సంఖ్యలో గూండాలని గాల్లోకి ఎగిరేలా తన్నడాలు ..
- హీరో మాత్రమే ఎందరిని నరికినా పోలీసులు పట్టుకోకపోవడాలు ..
- హీరోయిన్ అవమానించినప్పుడు మాత్రమే చదువుకోవాలని సంపాదించాలి అని హీరోలు రియలైజ్ అవ్వడాలు ..
- జుట్టు చ్వ్దరకుండా , ఇస్త్రీ నలక్కుండా , చెమటపట్టకుండా విలన్ గ్యాంగుతో హీరో పోరాటాలు చేయడాలు ..
- ఇంట్లో ఎవరూ లేనప్పుడు హీరో తన మీద చెయ్యేస్తే , వద్దు వద్దు అంటూనే హీరోయిన్లు పైన అంతస్తులోని బెడ్రూములోకి పరిగెత్తడాలు..
- చాలా సినిమాల్లో హీరోయిన్లు మాత్రమే అనర్గళంగా ఆంగ్లము మాట్లాడటాలు ..
- టైటిల్స్ అయిపోగానే పది మందిని చితక్కొట్టేసి హీరో పాటేసుకోవడాలు ..
- కండలు తిరిగిన వీరులని మేపే విలన్లు , దద్దమ్మల్లాంటి బావమరుదులని అసిస్టెంట్లుగా పెట్టుకోవడాలు ..
- తనతో వైరం పెట్టుకున్న ప్రతి ఒక్కడినీ క్షణం ఆలస్యం చేయకుండా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసే విలన్లు, ఆయిధం లేకుండా తమ చేతికి చిక్కిన హీరోతో , కాల్చకుండా .. కత్తులతో నరక్కుండా ముచ్చట్లు పెట్టడాలు ..
- హీరో హీరోయిన్లు మొదటిసారి కలిసినప్పుడు ఎక్కువశాతం గొడవ్పడటాలు ..
- ఏడాదికోసారైనా రైలు మొహం చూడని హీరో లేదా హీరోయిన్ విదేశాల్లో పాటలు పాడుకోవడాలు ..
- హీరో ఫ్రెండ్స్ గ్యాంగులో ఎవరో ఒకరు తప్ప మిగతా అందరూ దద్దమ్మలే ఉండటాలు ... బై డిఫాల్ట్ అందరూ పేదవారే కావడాలు ..
-ఫ్రెండ్స్ తో కూర్చుని హీరో టీ తాగుతున్న హోటల్ పక్కనే హీరోయిన్ హ్యాండు బ్యాగు దొంగలెత్తుకెళ్ళిపోవడాలు ...
- అర్ధరాత్రి హీరోయిన్ ఒంటరిగా వస్తున్నప్పుడు బైకు పంక్చరై ఒక్కతే దిక్కుతోచక నిలుచున్నప్పుడు , విలన్లు తనని రేప్ చేయడానికి ప్రయత్నించడం...సరిగ్గ ఏదో పని ఉన్నట్టు యాధ్రుచ్చికంగా హీరో అటువైపే రావడాలు ..
- ఏ అర్హతలు ఉన్నా... ఏమీ లేకపోయినా .. హీరోయిన్ ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోకపోవడాలు ..
-ఇద్దరే ఉన్నప్పుడు ఇంట్లో కరెంటుపోతే ఇద్దరూ ఒకేసారి లేచి ఒకరినొకరు తగులుకోవడాలు ... సరిగ్గా అప్పుడే బయట మెరుపులు - ఉరుములు రావడాలు ... హీరో హీరోయిన్లు వాటేసుకోవడాలు .. ఆ తరువాత యధావిధిగా ఒక పాటేసుకోవడాలు ..
ఇక ఓపిక లేక ఇక్కడితో ఆపేస్తున్నా ..
ఇలాంటివి ఏవీ లేకుండా ఒక తెలుగు సినిమా చూడాలని...
నా కల ఎప్పుడు నెరవేరుతుందో మరి ....
- శతఘ్ని ...!!
Post a Comment