సమాజం మీద, సమాజంలోని పరిస్థితుల మీద ఆవేదన ఉన్న ఒక దర్శకుడిగా పి.సునీల్ కుమార్ రెడ్డిని చెప్పుకోవచ్చు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళు (సెజ్‌లు), కర్మాగారాల ఏర్పాటు పేరుతో అల్లకల్లోలమవుతున్న మత్స్యకారుల జీవితాలు లాంటి కథాంశాలతో గతంలో 'సొంత ఊరు', 'గంగపుత్రులు' లాంటి చిత్రాలు తీయడమే అందుకు కారణం. కానీ, అవన్నీ దృష్టిలో పెట్టుకొని వెళ్ళిన వాళ్ళను తీవ్రంగా నిరాశకు గురి చేస్తుంది - ఆయన తాజా చిత్రం - వెయిటింగ్ ఫర్ యు!
....................................
చిత్రం: వెయిటింగ్ ఫర్ యు, తారాగణం: గాయత్రి, రఘుబాబు, ఎల్బీ శ్రీరామ్, షఫీ, జీవా, కెమేరా: సాబూ జేమ్స్, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, నిర్మాత: యక్కల రవీంద్రబాబు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. సునీల్‌కుమార్ రెడ్డి
...............................................
''ఒక పెళ్ళి కాని అమ్మాయి ప్రేమ కథ'' అన్నది ఈ సినిమాకు పెట్టిన ఉపశీర్షిక. దాంతో, ఓ వర్గం ప్రేక్షకులకు ఆసక్తి కలుగుతుంది. దానికి తోడు, గర్భవతిగా ఉన్న ఓ అమ్మాయి ఫోటో, ముఖం కనిపించకుండా పోస్టర్‌లో ముద్రించి, తెగ పబ్లిసిటీ చేశారు. సినిమాకు సంబంధించిన ఇతర ఫోటోలు, వివరాలు వెల్లడించకుండా సస్పెన్స్ కొనసాగించారు. తీరా, సినిమా చూశాక మాత్రం ఇదో రకం పచ్చి పబ్లిసిటీ జిమ్మిక్ అని ప్రేక్షకులు అభిప్రాయపడితే, అందులో తప్పు లేదు.
పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా పనిచేసిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి సినిమా రంగానికి వచ్చినా, ఆ జిజ్ఞాసను వదులుకోలేదు. అందుకే, ఆయన పత్రికల్లో వచ్చే వార్తల నుంచి, సమకాలీన విషయాల నుంచి ఇతివృత్తాలను ఎంచుకుంటారు. కథలను అల్లుకుంటారు. ఈ 'వెయిటింగ్ ఫర్ యు' చిత్రానికి కూడా విశాఖపట్నంలోని ఓ అమ్మాయి నిజజీవిత గాథ ఆధారమని దర్శకుడు చెప్పారు. తీరా చూస్తే, ఈ సినిమాను నాటకానికి ఎక్కువ, టీవీ సీరియల్‌కు తక్కువ అన్న పద్ధతిలో తీశారు. మధ్య మధ్యలో నెలకు ఎంతమంది వికలాంగులు అవుతున్నారు, ఎంత మంది యాక్సిడెంట్లలో మరణిస్తున్నారు లాంటి గణాంకాల వివరాలతో కూడిన ఉపన్యాసాలు, ఉపదేశాలతో సినిమాను ఓ న్యూస్ బులెటిన్‌గానూ మార్చేశారు.
ఎక్కువ శాతం మంది కొత్త నటీనటులే ప్రధాన పాత్రలు పోషించగా, ''ఒక పెళ్ళి కాని అమ్మాయి ప్రేమ కథ'' అని వర్ణించుకున్న ఈ సినిమాలో ప్రేమకథ కనిపించేది చాలా తక్కువ. రేడియో జాకీగా పని చేసే స్వప్న ('ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' ఫేమ్ గాయత్రి) అంబులెన్స్ సర్వీస్‌లో పనిచేసే దేవాతో అనుకోకుండా పరిచయమవుతుంది. గతంలో తల్లినీ, తాజాగా ఓ పేలుడు ఘటనలో తండ్రినీ పోగొట్టుకున్న ఆమె, అతనికి శారీరకంగా కూడా దగ్గరవుతుంది. గర్భవతి అవుతుంది. ప్రాణాలకు తెగించి, 108 అంబులెన్స్‌లో అందరినీ కాపాడే హీరోను ఆ ఉద్యోగం వదిలేయమంటుంది. ఆ పని చేయని హీరోకు దూరంగా వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏమి జరిగిందన్నది సినిమా కై ్లమాక్స్‌లో చూడవచ్చు. ఇక, మధ్యలో అంతా ఓ ఫ్యాక్షనిస్టు, అతని తమ్ముడి హత్యా రాజకీయం, జనాన్ని ఆకట్టుకొనే ఓ రాజకీయ నేత (కామరత్నంగా రఘుబాబు) ప్రయత్నం, ఆసుపత్రిలో అంబులెన్స్ సర్వీస్ వారితో కలసి పని చేసే ఓ నర్సు కథ... ఇలా నడుస్తుంది.
సినిమాకు ఓ సామాజిక ప్రయోజనం ఉండాలని భావించిన దర్శకుడు, ఆ మధ్య తక్కువ ఖర్చుతో తీయగా, కెరీర్‌లో తొలిసారిగా లాభాలు తెచ్చిపెట్టిన టీనేజ్ వ్యామోహాల 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'తో ఎటు వెళ్ళాలనే సందిగ్ధంలో పడ్డట్లున్నారు. దాంతో, అటు పూర్తిగా ఆలోచింపజేసే బాటలో వెళ్ళలేక, ఇటు యువతరం లైంగిక ఆసక్తుల దోవలో పోలేక తడబాటుకు గురయ్యారు. వెరసి, సినిమా పేరుకూ, క్యాప్షన్‌కూ, తెరపై చూపెట్టిన విధానానికీ ఎక్కడా పొంతన లేదు. పైగా, ఏదో ఒక అంశానికి పరిమితం కాకుండా, హైదరాబాద్‌లో కొన్నేళ్ళ క్రితం జరిగిన గోకుల్ ఛాట్ పేలుళ్ళ మొదలు ధర్నాలు, రోడ్డు రోకోల దాకా అనేక అంశాలను ఉపరితల స్పర్శ చేయబోయే సరికి, కథ ఉడికీ ఉడకని కిచిడీగా తయారైంది.
సినిమాకు ఓ సామాజిక ప్రయోజనం ఉండాలని భావించిన దర్శకుడు, ఆ మధ్య తక్కువ ఖర్చుతో తీయగా, కెరీర్‌లో తొలిసారిగా లాభాలు తెచ్చిపెట్టిన టీనేజ్ వ్యామోహాల 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'తో ఎటు వెళ్ళాలనే సందిగ్ధంలో పడ్డట్లున్నారు. దాంతో, అటు పూర్తిగా ఆలోచింపజేసే బాటలో వెళ్ళలేక, ఇటు యువతరం లైంగిక ఆసక్తుల దోవలో పోలేక తడబాటుకు గురయ్యారు. వెరసి, సినిమా పేరుకూ, క్యాప్షన్‌కూ, తెరపై చూపెట్టిన విధానానికీ ఎక్కడా పొంతన లేదు. పైగా, ఏదో ఒక అంశానికి పరిమితం కాకుండా, హైదరాబాద్‌లో కొన్నేళ్ళ క్రితం జరిగిన గోకుల్ ఛాట్ పేలుళ్ళ మొదలు ధర్నాలు, రోడ్డు రోకోల దాకా అనేక అంశాలను ఉపరితల స్పర్శ చేయబోయే సరికి, కథ ఉడికీ ఉడకని కిచిడీగా తయారైంది.
అనుభవజ్ఞులైన నటులు ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు లాంటి ఒకరిద్దరిని పక్కన పెడితే, మిగిలిన పాత్రధారుల నటన టీవీ సీరియల్ ఫక్కీలో, నాటకాల ధోరణిలో నడుస్తుంది. ప్రతిదీ 'ఫ్రెష్‌దే' కావాలని కోరుకొనే జానీఫ్రెష్ పాత్రను వినోదం కోసం పెట్టినా, అది కలిగించేది మాత్రం విసుగే! అలాగే, పాటలన్నీ ఫీచర్‌ఫిల్మ్‌కు కావాల్సిన నిడివి కోసం పనికొచ్చేవే తప్ప, వినో, చూసే ఆనందించగలిగేవి అనిపించవు. మాట పూర్తి కాక ముందే కట్ అయిపోయే సీన్లు, తెరపై స్పష్టత కొరవడిన కొన్ని డిజిటల్ కెమేరా దృశ్యాలు, డి.ఐ.లోనైనా వాటిని సరిదిద్దుకోలేకపోవడం లాంటివన్నీ చూశాక, ఈ చిత్ర సాంకేతిక విభాగాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి ఏముంటుంది!
లోబడ్జెట్ చిత్రాలకుండే ఇబ్బందుల రీత్యా కొంత సర్దుకుపోవాలనుకున్నా, పేరు, పబ్లిసిటీతో దర్శకుడు మాయ చేయాలనుకోవడం జీర్ణించుకోలేం. కనీసం చేసిన పబ్లిసిటీకి తగ్గట్లే టీనేజ్ తొందరపాటు, వ్యామోహాల మీదే సిన్సియర్‌గా, సీరియస్ కథ తీసినా బాగుండేది. పైగా, డైలాగుల బాధ్యత కూడా తానే నెత్తిన వేసుకొని, దర్శకుడు పుస్తకాల భాషను తెరపై సంభాషణల్లో పలికించాడు. అవార్డు చిత్రాలు, ఆలోచింపజేసే చిత్రాలు తీసిన ఈ దర్శకుడు ప్రస్తుతం తాను తీస్తున్న సినిమాలు ఎలాంటివో ఆగి, ఆలోచించుకోవడం మంచిది. వెరసి, ఓ పాత్రతో దర్శకుడే తెరపై చెప్పించినట్లు, ''పబ్లిసిటీ ఫుల్లు! డిపాజిట్టు నిల్లు!'' అన్నది అక్షరాలా ఈ చిత్రానికీ వర్తిస్తుంది. వచ్చే ప్రేక్షకుల కోసమే ఇక ఈ సినిమా వెయిటింగ్!!
- రెంటాల జయదేవ
...........................................................
0 వ్యాఖ్యలు:
Post a Comment