జగమంత కుటుంబం నాది..ఏకాకి జీవితం నాది .. సంసార సాగరం నాదే .. సన్యాసం శూన్యం నాదే..

Thursday, September 26, 2013

మనసు పలికే మౌనగీతం - 'లంచ్‌ బాక్స్‌' (సమీక్ష)



ఇద్దరు మనుషులు ఒకరినొకరు చూసుకోకుం డానే ప్రేమలో పడవచ్చా? ఇలాంటి ఇతివృత్తాలు గతంలో తమిళంలో నుంచి తెలుగులోకి అనువాదమైన 'ప్రేమలేఖ' దగ్గర నుంచి తెలుగులో వచ్చిన 'ఔను! వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' దాకా, ఆ తరువాత అనేక చిత్రాల్లో చూసేశామని అంటున్నారు కదూ! కానీ, అదే ఇతివృత్తాన్ని సుప్రసిద్ధమైన ముంబరు 'డబ్బావాలాల' నేపథ్యంలో చూపెడితే! కొత్త దర్శకుడు రితేశ్‌ బాత్రా తన తొలి సినీ ప్రయత్నంగా తీసిన 'లంచ్‌ బాక్స్‌' అదే! ప్రాథమికమైన ఇతివృత్తం వరకు తెలిసినది లెమ్మని అనిపించినా, ఆ అంశాన్ని ఎంత అందంగా, మానవీయ సంబంధాల గురించి ఆలోచించేలా చూపవచ్చో ఈ 'లంచ్‌ బాక్స్‌' చెబుతుంది.

పెరిగిపోతున్న జీవన వేగంలో, ఆతురతగా సాగుతున్న ఆర్థిక లాభాల అన్వేషణలో భార్యాభర్తల సంబంధాలు కూడా ఆశించినంత ఆహ్లాదంగా సాగని రోజులివి. పైగా, పురుషాధిక్య భావజాలం నరనరాన నిండిన మన సమాజంలో భార్యను వ్యక్తిత్వమున్న మనిషిగా చూసేవాళ్ళు తక్కువ. ఆమెను వంటింటి కుందేలుగా భావించడమే ఎక్కువ. ఆమె అభిప్రాయాలను గౌరవించడం మాట దేవుడెరుగు! అసలు ఆమె చెప్పే మామూలు కబుర్లు కూడా వినే తీరిక, ఓపిక లేని భర్తలు తరచూ కనిపిస్తుంటారు.
అలాంటి నేపథ్యమున్న ఓ గృహిణి ముక్కూ మొహం చూడని ఓ పరాయి వ్యక్తితో అనుకోకుండా తన మనసులోని మాటలు పంచుకొనే పరిస్థితి ఏర్పడితే ఏమవుతుం దన్నది ఆసక్తికరమైన సందర్భం. ఆమె అలా మాటలు పంచుకోవడానికి ప్రతిరోజూ 'డబ్బావాలా'ల ద్వారా పంపే లంచ్‌ బాక్స్‌ ఉపకరిస్తే? (ముంబరులో ఇళ్ళ నుంచి భోజనం క్యారేజీలను ఉద్యోగులకు చేర్చి, ఆ తరువాత వాటిని మళ్ళీ ఇళ్ళకు అప్పగించే ప్రపంచ ప్రసిద్ధమైన వ్యవస్థ - 'డబ్బావాలా'లది). అదే తాజా హిందీ చిత్రం 'లంచ్‌ బాక్స్‌'. రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న పెద్ద వయస్సు కథానాయకుడికీ, స్కూలుకు వెళ్ళే చిన్న అమ్మాయికి తల్లి అయిన పిన్న వయస్కురాలైన కథానాయికకూ మధ్య మనస్సులు కలిసిన ప్రేమకథ ఇది.
సాజన్‌ ఫెర్నాండెజ్‌ (ఇర్ఫాన్‌ ఖాన్‌) ఓ ప్రభుత్వ ఉద్యోగి. భార్య చనిపోగా, పిల్లలు కూడా లేని అతను ఒంటరి జీవితం గడుపుతుంటాడు. అతని పదవీ విరమణకు మరో నెల రోజులే ఉంటుంది. ఫెర్నాండెజ్‌కు కూడా డబ్బావాలాల లంచ్‌ బాక్స్‌ వస్తుంటుంది. మరోపక్క ఈలా (నిమ్రత్‌ కౌర్‌) ఓ సామాన్య గృహిణి. ఇరవై నాలుగు గంటలూ టీవీకి కళ్ళప్పగించి, షేర్ల గురించి తెలుసుకోవడమే తప్ప, భార్య మనోభావాలను గుర్తించని వ్యక్తి ఆమెకు భర్త. కనీసం 'డబ్బావాలా' ద్వారా ఆమె పంపిన భోజనం గురించి కూడా మంచీ చెడూ మాట్లాడని మనిషి.
ఆమె పంపే లంచ్‌ బాక్స్‌ పొరపాటున ఫెర్నాండెజ్‌కు చేరుతుంది. భర్తకు కాకుండా వేరే వ్యక్తికి ఆ లంచ్‌ బాక్స్‌ చేరుతోందన్నది ఆమెకూ అర్థమవుతుంది. ఆ తరువాత ఒకరినొకరు చూసుకోకుండానే లంచ్‌బాక్స్‌లో ఉత్తరాల ద్వారా వారి మధ్య పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం బలమైన స్నేహంగా పరిణమిస్తుంది. ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకొనేదాకే వెళుతుంది. అప్పుడు ఏమైంది? వారిద్దరూ కలుసుకున్నారా? ఆ స్నేహం ఏ తీరాలకు చేరింది? లాంటి ప్రశ్నలన్నిటినీ వెండితెర మీద చూడవచ్చు.
ఈ చిత్రంలో నటీనటుల పాత్రపోషణ ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. మాటలు తక్కువ, ముఖంలో పలికే భావాలు ఎక్కువైన హీరో పాత్రను ఇర్ఫాన్‌ ఖాన్‌ అద్భుతంగా పోషించారు. అలాగే, కొత్త అమ్మాయి నిమ్రత్‌ అనుభవమున్న నటిలా కథానాయిక పాత్రలోని భావోద్వేగాలను పలికించింది. పరస్పరం చూసుకోకపోయినా, వారి మధ్య రేగే భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయి. భార్యాబిడ్డలు లేక ఓ ఒంటరితనం అనుభవిస్తున్న ఓ పురుషుడు, చుట్టూ భర్త - బిడ్డ ఉన్నా జీవితాన్ని ఒంటరితనం కాల్చేస్తుంటే అసంతృప్తితో బతుకుతున్న ఓ మామూలు గృహిణి - వీళ్ళ మానసిక సంఘర్షణ ప్రేక్షకులను కూడా ఆత్మపరిశీలనలోకి నెడుతుంది.
ఈ మొత్తం కథలో మరికొన్ని ఆసక్తికరమైన పాత్రలు లేకపోలేదు. సినిమాలో ఎక్కడా దృశ్యరూపంలో కనబడకుండా, కేవలం మాటలు వినిపించడం ద్వారానే ప్రేక్షకులను కట్టిపడేసే పాత్ర - 'ఆంటీ' మిసెస్‌ దేశ్‌పాండేది. (చాలా ఏళ్ళ క్రితం దర్శకుడు కె. బాలచందర్‌ తన తమిళ చిత్రం 'ఎదిర్‌ నీచ్చల్‌' చిత్రంలో ఇలా మనిషి కనిపించకుండా, మాటలతో ప్రేక్షకుల ఊహల్లో విరిసే ఓ పాత్రను సృజించడం గమనించదగ్గ విషయం).
అలాగే, హీరో ఆఫీసులో అతని వద్ద కొత్తగా చేరిన శిక్షణార్థి షేక్‌ పాత్ర (నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ) కూడా ఎంతో సహజంగా కనిపిస్తూ, ఆకట్టుకుంటుంది. బొంబాయి లాంటి మహానగరంలో అన్నిటికీ సునాయాసంగా సర్దుకుంటూ జీవితం గడిపే వ్యక్తిగా అతను కనపడితే, సర్దుకోవడానికి కింద మీదలయ్యే పాత్రలుగా హీరో, హీరోయిన్లు కనిపిస్తారు.
ఈ 'ఫీల్‌ గుడ్‌ మూవీ'లో లోపాలు లేవా అంటే ఉన్నాయి. ఎన్నో ఏళ్ళుగా ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా లంచ్‌ బాక్సులను అందిస్తూ, అందుకు ప్రపంచ స్థాయి గుర్తింపు, రికార్డు సొంతం చేసుకున్న ఘనత డబ్బావాలాలది. అలాంటి వారు హీరోయిన్‌ పెట్టిన లంచ్‌ బాక్స్‌ను ఆమె భర్తకు కాకుండా, హీరోకు అందించడం ఎలా జరిగిందని కొందరు అనుమానం వ్యక్తం చేయవచ్చు.
అలాగే, హీరోయిన్‌ భర్త, హీరోల లంచ్‌ బాక్స్‌లు మారాయని కానీ, ఒకే ప్రాంతంలోనో, ఆఫీసులోనో వారిద్దరూ పని చేస్తుండడం వల్ల ఆ పొరపాటు జరిగిందని కానీ సినిమాలో ఒక్క దృశ్యంలోనైనా చూపితే బాగుండేదని కూడా కొందరు అభిప్రాయపడవచ్చు. అలాగే, చివరకు వచ్చేసరికి అంతా సుఖాంతమన్నట్లు కాకుండా, ప్రేక్షకులు తమకు తోచినట్లు తాము ఊహించుకొనేలా సినిమాను 'ఓపెన్‌ ఎండెడ్‌'గా ముగించడం మరికొందరికి రుచించకపోవచ్చు. అయితే, ఇవేవీ ఈ సినిమా బాగా లేదనిపించేటంతవి కావు. చక్కటి కెమేరా, ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌ల పనితనం తెర మీది బొమ్మల భావోద్వేగాన్ని పెంచింది.
గతంలో డబ్బావాలాల మీద డాక్యుమెంటరీ తీసిన అనుభవమున్న దర్శకుడు రితేశ్‌ బాత్రా, న్యూయార్క్‌ నుంచి తెచ్చుకున్న కెమేరామన్‌తో బొంబాయి నగర జీవితాన్ని మనసుకు పట్టేలా చూపారు. అన్నీ సానుకూల వైఖరితో వ్యవహరించే పాత్రలే తప్ప, నెగటివ్‌ పాత్రలు కానీ, విలన్లు కానీ లేకపోవడం ఈ సినిమాలోని మరో ప్రత్యేకత. ఇలాంటి కథ, స్క్రీన్‌ప్లే ఎంచుకొన్న దర్శక, రచయితలనూ, ధైర్యం చేసిన నిర్మాతలనూ, ఆర్థికంగా అండగా నిలిచిన జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌.ఎఫ్‌.డి.సి)నూ అభినందించాలి.
వెరసి, ఇప్పటికే కాన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంతో సహా వివిధ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందిన 'లంచ్‌ బాక్స్‌' మన రొడ్డకొట్టుడు సినిమాల మధ్య ఓ పెద్ద రిలీఫ్‌. ఈ 'ఫీల్‌ గుడ్‌' అనుభవం ఫార్ములా సినిమాలు చూసీ చూసీ విసిగి వేసారినవారికి ఎర్రటి ఎండలో చల్లటి కుండ నీళ్ళు తాగిన అనుభవం.
ఉత్తమ విదేశీ చిత్ర విభాగం కింద ఈ సారి మన దేశం పక్షాన ఆస్కార్‌ ఎంట్రీగా వెళ్ళే అవకాశం ఈ చిత్రానికి ఎక్కువ. ఒకవేళ అదే జరిగి, ఆపైన ఇతర దేశాల నుంచి కూడా ఎంపికయ్యే వాటితో కలిపి ఆఖరు అయిదు ఫైనల్‌ ఎంట్రీల్లో ఒకటిగా ఆస్కార్‌ బరిలో నిలిచినా ఆశ్చర్యం లేదు. అదే జరిగి తుది దశ దాకా వెళితే? ఆ పైన అవార్డు కూడా దక్కించుకుంటే? భారతీయ సినిమా శతజయంతి వేళ అంతకన్నా పెద్ద బహుమతి ఇంకా ఏముంటుంది!
- ఆర్‌.జె
...............................................

0 వ్యాఖ్యలు: